గురువారం, జూన్ 30, 2016

రాజాధిరాజా

గత కృష్ణా పుష్కరాలప్పుడు దర్శకుడు చేరన్ తమిళంలో 'ఆటోగ్రాఫ్' అనే సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించి విజయం సాధించాడు. తెలుగు వాళ్ళు ఆ సినిమా హక్కులు కొని రవితేజ హీరోగా 'నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమరీస్' పేరిట పునర్నిర్మించారు. తమిళంతో పోలిస్తే తక్కువే కానీ, తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. హీరో పాత్రలో చాలా మంది మగవాళ్ళు తమని తాము ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు బాగా ఊపందుకున్నాయి కూడా. పుష్కర కాలం తర్వాత అదే చేరన్ తమిళ తెలుగు భాషల్లో తీసిన 'రాజాధిరాజా' సినిమాలో సరిగ్గా మిస్సైన పాయింట్ అదే. ఏ వర్గం ప్రేక్షకులూ కనెక్ట్ అవ్వలేని విధంగా ఉంది సినిమా.

ఇప్పటి తరంలో బాగా నటించగలిగే శర్వానంద్, నిత్యామీనన్ లని లీడ్ పెయిర్ గా ఎంచుకున్న దర్శకుడు కథ ట్రీట్మెంట్ లోనూ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలోనూ విపరీతంగా తడబడడం వల్ల ప్రేక్షకులు సినిమాలో ఎక్కడా లీనం కాలేక పోగా, సెంటిమెంట్ సన్నివేశాల్లో గట్టిగా నవ్వేలా తయారైంది థియేటర్లో పరిస్థితి. అభిరుచుల పరంగా తమిళ, తెలుగు ప్రేక్షకుల మధ్య చాలా భేదం ఉంది. సహజంగానే చేరన్ కి తమిళుల నాడి తెలిసినంతగా, తెలుగు ప్రేక్షకుల అభిరుచి తెలీదు. ఫలితంగా, ఓ తమిళ సినిమాని తెలుగు సినిమాగా నమ్మించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడా నేటివిటీ కనిపించలేదు. తెలుగు కోసం చేసిన ప్రయత్నాల వల్ల, బహుశా తమిళ ప్రేక్షకులకీ ఈ నేటివిటీ సమస్య వస్తుందేమో. అదే జరిగితే ఈ సినిమా రెంటికీ చెడ్డ రేవడి అయినట్టే.

ఆఫీసు వేళలలో ఉద్యోగం, మిగిలిన సమయమంతా సోషల్ నెటవర్కింగ్ సైట్లతో బిజీగా గడుపుతూ, కుటుంబ సభ్యులని పూర్తిగా నిర్లక్ష్యం చేసే జేకే అలియాస్ జయకుమార్ (శర్వానంద్) ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్ఛేసి స్నేహితులతో కలిసి వ్యాపారం ప్రారంభిస్తాడు. చిన్నప్పటి స్నేహితురాలు నిత్యా (నిత్యా మీనన్) ని కూడా ఒక భాగస్వామిగా చేసుకున్న జేకే సినిమా ప్రథమార్ధంలో ఒకటి తర్వాత ఒకటిగా మూడు వ్యాపారాల్లో అడుగుపెట్టి విజయ బావుటా ఎగరేస్తాడు. ఇంకా సంపాదించాలన్న కసి అతనిలో పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు తను నిర్లక్ష్యం చేసిన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకోడం ఆరంభిస్తాడు జేకే. ఏమాత్రం పొరపొచ్చచాలు లేకుండా ఒకే మాటగా కలిసుండే ఆ స్నేహితుల బృందానికి జేకే మాట వేదవాక్కు.


ప్రథమార్ధంలో నిత్య జేకేని ప్రేమించే ప్రయత్నాలు చేస్తుంది కానీ, దర్శకుడు అతనికి ఆమెకోసం వెచ్చించే సమయం ఇవ్వకపోవడంతో ఆమె కేవలం మూగగా ఆరాధిస్తూ గడిపేస్తుంది.అచ్చం తమిళ సినిమాల్లోలా ఆమెకున్న ప్రాణాంతకమైన జబ్బు బయట పడడం, జేకే ఆమెని రక్షించుకోడం జరిగాక, అప్పుడు వచ్ఛే ఫ్లాష్ బ్యాక్ లో తను ఉన్నట్టుండి ఎందుకు మారిపోయాడో నిత్యాకి వివరిస్తాడు జేకే. ఈ అచ్చ తమిళ ఫ్లాష్ బ్యాక్ తర్వాత జేకే తన భవిష్యత్ ప్రణాళిక వివరించడం, అందుకు నిత్య సహాయ సహకారాలు అందించడంతో సినిమా ముగుస్తుంది. సినిమా మొదలైన గంటా ఐదు నిమిషాలకి వచ్చే విశ్రాంతి కే ఒక పూర్తి సినిమా చూసేసిన భావన కలిగింది. రెండో సగం ఎంత విసిగించాలో అంతా విసిగించింది. ఫలితంగా, దర్శకుడు చెప్పాలనుకున్న మంచి పాయింట్ ఫోకస్ లో నుంచి పక్కకి తప్పుకుంది.

స్క్రీన్ ప్లే ఆర్డర్ పూర్తిగా మార్చుకుని, ప్రి-క్లైమాక్స్ పాయింట్ నుంచి సినిమాని మొదలు పెట్టి ఇంటర్ కట్స్ లేకుండా ఒకే ఫ్లాష్ బ్యాక్ లో కథ చెప్పుకుంటూ వస్తే సినిమా ఇలా క్లూ లెస్ గా కాకుండా, ఆసక్తికరంగా ఉండేదేమో అనిపించింది. మొదటి సగంలో హీరో వ్యాపార విస్తరణ అయితే అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్న అనుభూతి కలిగింది. ప్రథమార్ధంలో ఎక్కడా కామెడీ, రొమాన్స్ లాంటివి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ద్వితీయార్ధం ఆరంభంలోనే క్లైమాక్స్ కి సంబంధించిన క్లూస్ ఇవ్వడం వల్ల, నాయికా నాయకుల మధ్య కూసింత రొమాన్స్ ఉన్నా ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యలేరు. ప్రతి  సన్నివేశం అవసరానికి మించి సాగుతూ ఉంటుంది.. ఎడిటర్ లోపమో, దర్శకత్వ లోపమో  అర్ధం కాదు. తమిళ లొకేషన్లని తెలుగు ప్రాంతాలని నమ్మించే వ్యర్ధ ప్రయత్నం విసిగిస్తుంది.

ఈ  సినిమాకి మొదట పెట్టిన పేరు 'ఏమిటో ఈమాయ.' ఈ పేరుతోనే సెన్సార్ కూడా చేయించారు. రాజా పేరుతో శర్వానంద్  ఖాతాలో రెండు హిట్లు ఉన్నాయనో ఏమో 'రాజాధిరాజా' అని మార్చారు. విశేషం ఏమిటంటే రెండు పేర్లూ కూడా కథకి ఏమాత్రం సంబంధం లేనివే. తమిళ నాట ఈ సినిమాని థియేటర్లలో కాక డీవీడీల రూపంలో విడుదల చేశారట. స్పందన బాగుండడంతో ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. శర్వానంద్, నిత్యా మీనన్ ల నటనకి ఎప్పటిలాగే వంక పెట్టేందుకు వీల్లేదు. ప్రకాష్ రాజ్ పాత్ర ఎందుకో దర్శకుడికైనా తెలుసో లేదో. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలు, నేపధ్య సంగీతంకూడా ఏమాత్రం గుర్తుపెట్టుకునేలా లేవు. తక్కువ బడ్జెట్ లో తీసిన ద్విభాషా చిత్రం అవ్వడం వల్ల నిర్మాతకి నష్టం ఉండకపోవచ్చు. నష్టం అల్లా దర్శకుడి మీదా, నాయికా నాయకుల మీదా నమ్మకంతో సినిమా చూసిన ప్రేక్షకులకే..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి