శుక్రవారం, జూన్ 24, 2016

ఒక మనసు

దర్శకుడు రామరాజు ఓ ప్రేమకావ్యం రాయాలనుకున్నారు. అందుకోసం సెల్యులాయిడ్ ని ఎంచుకున్నారు. నెమ్మదిగా సాగే కథనం, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి, పోను పోను ఉత్కంఠ, గుర్తుండిపోయే ముగింపు.. వీటితో రాయాల్సింది పుస్తకమే.. కానీ, సినిమా తీశారు. అందమైన ఫ్రేములనీ, వీనుల విందైన సంగీతాన్నీ జతచేశారు. సినిమా గ్రామర్ గా చెప్పబడే విషయాలు వేటినీ పెద్దగా పట్టించుకోలేదు.. డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగులు, ఇంటర్వల్ బాంగ్ ఇలాంటివేవీ తన కథకి అవసరం లేదని నమ్మారు. ఫలితంగా, మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతిని ఇచ్చే సినిమాని అందించారు.

నిహారిక కొణిదెల, నాగశౌర్య మూల్పూరి ప్రధాన పాత్రలుగా రామరాజు తీసిన 'ఒక మనసు' మల్లెపువ్వంత సున్నితమైన సినిమా. డాక్టర్ గా పనిచేస్తున్న సంధ్య (నిహారిక), రాజకీయ నాయకుడు కావాలనుకునే సూర్య (నాగశౌర్య) ల మెచ్యూర్డ్ ప్రేమకథ ఇది. తనకి తెలియకుండానే సూర్యతో ప్రేమలో పడినప్పుడు, గతజన్మ వాసనలే అందుకు కారణమని నమ్ముతుంది సంధ్య. ఆ ప్రేమకి ఊహించని అడ్డంకి వచ్చినప్పుడు తన వాడికోసం వేచి చూస్తుంది. అతను వస్తాడన్న ఆమె నమ్మకం తాలూకు బలం వల్లే కావొచ్చు, సూర్య తిరిగి వస్తాడు. ఎడబాటు తర్వాత తిరిగి కలుసుకున్న ఆ జంటకి కొంత కాలానికే మరో అడ్డంకి. ఈసారి, పరిష్కారం సంధ్య చేతిలోనే ఉంది. ఆమె చూపిన పరిష్కారం - ఆమే చెప్పినట్టుగా - తప్పే కానీ, వెంటాడుతుంది చాన్నాళ్లపాటు.

రెండున్నర గంటల సినిమాలో రెండు గంటలకి పైగా తెరమీద కేవలం నాయికా నాయకులు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళతో పాటు, వాళ్ళ మూడ్స్ కి అనుగుణంగా చుట్టూ ఉండే ప్రకృతి, నేపథ్యంలో వినిపించే సంగీతం. డాక్టరుగా పనిచేసే సంధ్యలో ఎంతటి భావుకత్వం, సున్నితత్వం ఉంటాయో, ఎమ్మెల్యే మేనల్లుడిగా, ఓ చోటా నాయకుడి కొడుకుగా సెటిల్మెంట్లు చేస్తూ, అవసరమైతే జనాలని తన్ని తన దారికి తెచ్చుకునే సూర్యలోనూ ప్రేమ దగ్గరికి వచ్చేసరికి అంతే భావుకత్వం కనిపిస్తుంది. అందుకేనేమో, వాళ్ళిద్దరి సంభాషణల్లోనూ ఎక్కువగా కొటేషన్లే వినిపిస్తాయి. మంచుతెరల్లోనూ, వర్షపు వేళల్లోనూ, కోటగోడలు, కొండలు, అడవులు, సముద్ర తీరాల్లో కలిసి నడుస్తూ  కబుర్లు చెప్పుకుంటూ ఉంటుందా జంట.


ప్రేమలో పడిన కొత్తల్లో, "నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా? మీ నాన్నంటేనా?" అని సంధ్య అడిగినప్పుడు, తడుముకోకుండా "మా నాన్నంటే" అని చెబుతాడు సూర్య. కొన్నాళ్ల తర్వాత ఆమె అదే ప్రశ్న అడిగితే "ఇద్దరూ సమానం" అంటాడు. మరి కొన్నాళ్ల తర్వాత, సంధ్యకి మళ్లీ ఆ ప్రశ్న అడగాల్సిన పరిస్థితి రావడం, అతన్ని అడక్కుండా తనే జవాబుని నిర్ణయించడంతో కథ ముగుస్తుంది. నాయికా నాయకుల మధ్య అనుబంధం తర్వాత, దర్శకుడు అంతగా శ్రద్ధ తీసుకున్నది సూర్య, అతని తండ్రి (రావు రమేష్) ల మధ్య ఉన్న బంధాన్ని,  సంధ్య, ఆమె తల్లి (ప్రగతి) మధ్య అనుబంధాన్ని చూపేందుకే. తండ్రి కోసం ఎంతో చేయాలనుకుని, ఏమీ చేయలేనేమో అని సంఘర్షణ పడే సన్నివేశాల్లో నాగశౌర్య మంచి నటనని ప్రదర్శించాడు. రావు రమేష్, ప్రగతిలకి వాళ్ళ పాత్రలు కొట్టిన పిండి.

నీహారిక వయసుకి మించిన పాత్ర పోషించింది. ఆ అమ్మాయి నటనకి ఎక్కడా వంక పెట్టడానికి లేదు. అయితే, సినిమా విజయానికి నీహారిక ప్లస్ అవుతుందా లేక మైనస్సా అన్నది తెలియడానికి కొంచం ఆగాలి బహుశా. ('నీహాని ఇప్పటికి పదిహేడు సార్లు హగ్ చేసుకున్నాడు వాడు' అని ఇంటర్వల్లో ఓ మెగాభిమాని ఆవేదన చెందాడు. లెక్క పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో?!). హీరో ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, ఎమ్మెల్యేగా నాగినీడు కనిపించారు. ఇప్పటి రాజకీయాల మీద తన ఆవేదనని కొన్ని సన్నివేశాల రూపంలో ప్రకటించాడు దర్శకుడు. కెమెరా (రామ్ రెడ్డి), సంగీతం (సునీల్ కశ్యప్) కథకి తగ్గట్టుగా చక్కగా అమిరాయి. అయితే, దర్శకుడు ఏమాత్రం పట్టించుకోని విషయం ఎడిటింగ్.

కథలో ఏ మలుపు లేకుండా ఇంటర్వల్ వచ్చేయడంతో సినిమా అయిపోయిందేమో అని అనుమానించారు కొందరు ప్రేక్షకులు. (కార్డు విశ్రాంతికీ, ముగింపుకీ కూడా అన్వయించుకునేందుకు వీలుగా ఉంది). రెండో సగం చివరి వరకూ కూడా స్లో నేరేషన్ సాగి సాగి ఒక్కసారిగా కథలో కుదుపు వచ్చి చివరి పావుగంటా పరుగులు తీస్తుంది. రెండు సగాల్లోనూ కలిపి ఓ పదిహేను-ఇరవై నిమిషాలు ఎడిట్ చేస్తే "ఇంకా ఎంతసేపు" అన్న అసహనం కలగదు ప్రేక్షకులకి. పాత్రల మానసిక స్థితిని, సంఘర్షణని చిత్రించడానికి సింబాలిక్ షాట్స్ ఎంచుకుని, వాటినే పదేపదే చూపించడం వల్ల సీన్లు రిపీట్ అవుతున్నాయని ప్రేక్షకులకి సందేహం కలిగే తావిచ్చారు. ఎడిటింగ్ దగ్గర  కాస్త జాగ్రత్త పడితే బాగుండేది. సెన్సిబిలిటీస్ ని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చే సినిమా ఇది.

(రామరాజు మొదటి సినిమా 'మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' ఎక్కడన్నా దొరికితే బాగుండును, చూడాలనివుంది).

14 కామెంట్‌లు:

  1. Sir, meeru rojukoka cinema kani rojuko kotta book gani chaduvutaara😃

    రిప్లయితొలగించండి
  2. మురళిగారిలో మొదటిరోజు మొదటి ఆట చూసెయ్యాలన్న కుర్రచేష్టలు పోలేదు మరి...(ఈయనో Blog Natural star) :p

    పాపం మెగా అభిమానులు...నాగశౌర్యకి అనుష్కని హగ్ చేసుకునే చాన్స్ ఇచ్చిఉంటే (అనుష్క కి వీరాభిమాని అట)ఇంకా సంతోషించేవాడేమో కదా ?

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు,
    నేను రెగ్యులర్గా చూసే బ్లాగుల్లొ మీది ఒకటి. పోస్ట్ చూసిన ప్రతిసారి అనుకోవడమే, నాది కూడా ఇండియన్ గడియారమే కదా అని :-). మంచి రివ్యూ అందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. 'మల్లెపూవంత సున్నితమైన సినిమా..' ఈ మాటే అనిపించిందండీ చూస్తున్నంతసేపూ..

    రిప్లయితొలగించండి
  5. అదేంటి... ఒక గ్రేటు తెలుగు వెబ్‌సైటు వాడు 'ఫీల్' పెద్దగా లేని సినిమా అన్నట్టు రాశాడు?

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు, మీ రివ్యు చాలా బాగుంది.
    ముఖ్యంగా మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతి అని నాకు కూడా అనిపించింది.
    రామరాజు గారి రెండు సినిమాలు పోల్చి చూస్తే , కథ ఒక మనస్సులో ఉన్నపటికీ ,మల్లెలతీరం సినిమకే ఎక్కువ మార్కులు వెయ్యాలేమొ అనిపించింది.
    సున్నితమైన సంభాషణలు, స్పందించే మనస్సులు ఉన్నవారు మన చుట్టూ తక్కువమందే ఉంటారు కాబట్టి , ఈ సినిమా ఎక్కువమందిని ఆకట్టుకోవటం లేదు.
    మల్లెలెతీరం సినిమా ఒక మనస్సు విడుదలయిన రెండు వారాలకు డిజిటల్ ప్రింట్ రిలీస్ చేస్తానని రామరాజు గారు చెప్పారు.

    రిప్లయితొలగించండి
  7. @కిరణ్ బి. : అనుకోకుండా చూశానండీ, మిత్రులొకరు తీసుకెళ్లారు.. ..ధన్యవాదాలు
    @నీహారిక: కుర్ర చేష్టలు అంటారా అయితే?! మా ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం లేదండీ మరి :) ..ధన్యవాదాలు
    @ప్రియరాగాలు: ప్లానింగ్ కొంత, పరిస్థితులు అనుకూలించడం మరికొంత జరిగితే అప్పుడప్పుడన్నా గడియారం మన చేతిలో ఉంటుంది కదండీ :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  8. @కొత్తావకాయ: ఒహ్హ్..చూశారా.. ధన్యవాదాలండీ
    @పురాణపండ ఫణి: ఒక్కమాటలో చెప్పాలంటే ఫీల్ కొంచం ఎక్కువయిన సినిమా అండీ.. ధన్యవాదాలు
    @జలతారు వెన్నెల: 'మల్లెలతీరం' గురించి మంచి మాట చెప్పారండీ.. చూడాలని ప్రయత్నిస్తున్నా చాలా రోజులనుంచీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  9. నాకు సూర్య నచ్చలేదు మురళిగారు:(
    సంధ్యని మరిచిపోలేను.ఆ పేర్లు ఆ కారెక్టర్స్ కి బాగా సరిపోయినట్లున్నాయి.
    చీరలు మాత్రం....సూపర్బ్:)










































    రిప్లయితొలగించండి
  10. @జయ: సూర్య పాయింటాఫ్ వ్యూ కూడా చూడాలి కదండీ మరి.. కథకి చక్కని ముడి వేశారు సూర్య పాత్ర ద్వారా.. పేర్ల గురించి నేనూ అదే అనుకున్నానండీ.. "చీరలు కట్టుకోడం మానేశారు" అని హీరో అనడాన్ని ఫెమినిస్టు ఒకరు తప్పట్టేసుకున్నారు :) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  11. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండీ! మీ సమీక్ష మొదటిసారి చదివినప్పుడు అనుకున్నాను - తప్పకుండా సినిమా చూసిన తరవాత మళ్లీ వచ్చి కమెంట్ పెదదామని. ఈ సినిమాని ఒక ఇరవై నిముషాలు చూసి - హీరో, హీరోయిన్ల మధ్య సా...గుతూ వున్న ప్రే.....మ కథని చూడలేక ఆపేశాను. మేబీ - ఇంకొక్కసారి ప్రయత్నిస్తాను చూడడానికి :) - కొంచెం తీరిగ్గా వున్నప్పుడు. అప్పుడు తప్పకుండా మళ్లీ వచ్చి కమెంట్ పెడతాను.

    రిప్లయితొలగించండి
  12. @లలిత టి. ఎస్: సినిమా అన్నది ఇష్టంగా చూడాలి కానీ, కష్టపడి కాదు కదండీ.. కాబట్టి, నచ్చని సినిమా చూసి కష్టపడకండి.. వేరే ఏదన్నా మీకు బాగా నచ్చిన సినిమా మరోసారి చూస్తే మీ లీజర్ సద్వినియోగం అవుతుంది.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. Just watched movie.After a longtime I got tears in climax. Immediately i searched ur post on this movie n your view as you always mention such sensitive stories. Really a good movie.sorry late comment .

    రిప్లయితొలగించండి
  14. @స్వాతి: మీకూ నచ్చిందన్న మాట, అయితే.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి