సోమవారం, జూన్ 06, 2016

ఘంటారావం

మధ్య యుగాల నాటి ఫ్రెంచి సమాజం ఎలా ఉండేది? విప్లవానికి పూర్వం, రాజు-చర్చి ద్వయం ఆధిపత్యంలో సామాన్య జనజీవితం ఎలా సాగేది? అధికారం అండతో ఒకవైపు రాజు, మరో వైపు చర్చి సరైన న్యాయ విచారణ లేకుండానే అనుమానితుల్ని కఠిన శిక్షలకి గురిచేసిన ఆ కాలంలో ధనవంతుల్ని మినహాయించుకుంటే మిగిలిన సమాజపు తీరుతెన్నులు ఎలా ఉండేవి? ఒక్కమాటలో చెప్పాలంటే, ఫ్రెంచి విప్లవానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఈ ప్రశ్నలకి జవాబు ఫ్రెంచి సాహిత్యంలో లభిస్తుంది. మరీ ముఖ్యంగా 1482 నాటి కథని 1830 లో 'The Hunchback of Notre Dame' పేరుతో విక్టర్ హ్యూగో రాసిన నవల నాటి సమాజాన్ని కళ్ళకి కడుతుంది. ఈ నవలకి సూరంపూడి సీతారాం చేసిన తెలుగు అనువాదమే 'ఘంటారావం.'

కథానాయకుడు క్వాసిమోడో శరీరం ఓ అవకరాల పుట్ట. దేహాన్ని మించిన తల, తలకంటే ఎత్తైన గూని, మూసుకుపోయిన కన్ను, తోసుకోచ్చిన పన్ను.. ఒక్క మాటలో చెప్పాలంటే మన పురాణ పాత్ర అష్టా వక్రుడి లాగా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ నాటి ఫ్రెంచి సమాజంలాగా. శిశువుగా ఉన్న క్వాసిమోడో ప్యారిస్ నగరంలోని నోత్రదామ్ చర్చి ఆవరణలో అనాధగా వదిలివేయబడతాడు. దయాళువైన క్రైస్తవ మతాధికారి క్రోద్ ఫ్రాలో ఆ శిశువుని పెంచుకోడానికి ముందుకి వస్తాడు. పెరిగి పెద్దవాడైన క్వాసిమోడో కి చర్చి గంటలు మోగించే పని అప్పగిస్తాడు పెంపుడు తండ్రి ఫ్రాలో. తీవ్రమైన శబ్దం చేసే ఆ గంటల్ని మోగించే పనిలో చేరాక క్వాసిమోడో కి చెవులు పనిచేయడం మానేస్తాయి.

ధనవంతుల ఇంటి బిడ్డైన ఫ్రాలో మొదటినుంచీ చురుకైన విద్యార్ధి. సైన్సు అంటే ఎంతో ఇష్టం. క్రమంగా మతం మీద ఇష్టం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా మతాధికారిగా మారతాడు. తల్లిదండ్రుల మరణంతో తమ్ముడు జెహాన్ పెంపకం బాధ్యత ఫ్రాలో స్వీకరించాల్సి వస్తుంది. అన్న గారాబం కారణంగా వ్యసనపరుడిగా మారతాడు జెహాన్. నగరంలో ఉన్న వేలాది మంది పేద వాళ్ళలో ఎస్మరాల్డా ఒకతె. ఆమె ఒక జిప్సీ యువతి, అధ్బుత సౌందర్యవతి. పెంపుడు మేక ఒక్కటే ఆమె ప్రపంచం. ఆ మేకతో కలిసి నగర వీధుల్లో వినోద ప్రదర్శనలిచ్చి పొట్ట పోసుకుంటూ ఉంటుంది. అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో సైనికాధికారి ఫీబస్ మీద మనసుపడుతుందామె. అయితే, ఫీబస్ రసికుడు. ఆమెపై అతనికి ప్రేమ లేదు, వ్యామోహం మాత్రమే ఉంది.


ఎస్మరాల్డా మీద ఇలాంటి వ్యామోహమే మతాధికారి ఫ్రాలో కి కలుగుతుంది. మధ్య వయస్కుడు, అప్పటివరకూ పుస్తకాలు, మతం తప్ప మరొకటి తెలియని ఫ్రాలో ఎస్మరాల్డాని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం, మంత్రగత్తె అనే నెపం మీద ఆమెని ఖైదు చేయిస్తాడు. తన కోరికని ఆమె ముందుంచుతాడు. అప్పటికే ఫీబస్ ని ప్రేమిస్తున్న ఎస్మరాల్డా, ఫ్రాలోని తిరస్కరిస్తుంది. అతడు ఆగ్రహిస్తాడు. ఫలితంగా, చర్చి అజమాయిషీలో నడిచే కోర్టు ఎస్మరాల్డాకి శిక్ష విధిస్తుంది. నాలుగు రోడ్ల కూడలిలో శిక్ష అమలు జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి అక్కడికి చేరుకొని ఆమెని రక్షిస్తాడు క్వాసిమోడో. ఆమెని నేరుగా తీసుకెళ్ళి నోత్రదామ్ చర్చిలో ఆశ్రయం ఇస్తాడు. నాటి నియమాల ప్రకారం, అధికారులు చర్చిలో తలదాచుకున్న వారిజోలికి వెళ్ళే వీలు లేదు.

తనని చూసి ఎస్మరాల్డా భయపడుతోందని అర్ధం చేసుకున్న క్వాసిమోడో దూరం నుంచే ఆమెకి కావలసినవి అన్నీ అమరుస్తూ ఉంటాడు. ఎస్మరాల్డా అంటే విపరీతమైన ఆరాధన క్వాసిమోడో. దానిని ప్రకటించే శక్తి అతనికీ, అర్ధం చేసుకునే మానసిక స్థితి ఆమెకీ లేవు. ఇంతలోనే, తన పెంపుడు తండ్రి ఫ్రాలో ఎస్మరాల్డా మీద మనసు పడ్డ విషయం గ్రహిస్తాడు క్వాసిమోడో. ఆమెని రక్షించాల్సిన అవసరం నానాటికీ పెరుగుతోందని గ్రహిస్తాడు. ఎస్మరాల్డా కోసం పిచ్చివాడైపోయిన ఫ్రాలో, ఆమెని చర్చి నుంచి బయటికి రప్పించే మార్గాలు వెతుకుతూ ఉంటాడు. క్వాసిమోడో ఆశ్రయంలో ఉన్న ఎస్మరల్డాకి ఫీబస్ నిజరూపం తెలుస్తుంది. ఇంతకీ క్వాసిమోడో రాజ్యం నుంచీ, చర్చి నుంచీ ఎస్మరాల్డాని రక్షించుకో గలిగాడా? తన ప్రేమని ఆమెకి చెప్పుకోగలిగాడా? ఆమెకథ, అతని ప్రేమకథ ఏమయ్యాయన్నది హృద్యమైన ముగింపు.

విక్టర్ హ్యూగో వ్యంగ్య ప్రధానంగా రాసిన ఈ నవలని అత్యంత సరళంగా అనువదించారు సీతారాం. రాజు, చర్చిల పనితీరు మీద నేరుగా ఎక్కడా విమర్శ కనిపించదు. కానీ, ఆ వ్యవస్థల వ్యవహార శైలిని వ్యంగ్య ప్రధానంగా చెప్పడం ద్వారా నాటి పరిస్థితులని గురించి పాఠకులు ఓ అవగాహనకి వచ్చేలా చేశారు. కథా స్థలం ప్యారిస్ అయినప్పటికీ, ఇది కేవలం ఫ్రెంచికి పరిమితమైన కథ కాదు. అపరిమితమైన అధికారం కింద నలిగిన అన్ని దేశాల ప్రజలకూ 'మనదే' అనిపించే కథ. సీతారాం 1954 లో చేసిన తెలుగు అనువాదం అనేక ముద్రణల తర్వాత తాజాగా ముద్రించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. ఏకబిగిన చదివించే కథనం. (పేజీలు  185, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి