సోమవారం, జూన్ 13, 2016

నల్లమిరియం చెట్టు

డాక్టర్ వి. చంద్రశేఖర రావు రాసిన 'నల్లమిరియం చెట్టు' నవలని గురించి చెప్పాలంటే, ముందుగా 'మాదిగ దండోరా' ఉద్యమాన్ని గురించి రేఖామాత్రపు పరిచయం అవసరం. భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డు కులాల జాబితాలో సుమారు అరవై ఉపకులాలు ఉన్నాయి. అయితే, విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు మొదలైన నాటినుంచీ (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ లో మాల కులస్తులు మాత్రమే రిజర్వేషన్ల ప్రయోజనాలని పొందుతుండగా, మిగిలిన ఉపకులాలకి - మరీ ముఖ్యంగా మాదిగలకి - వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగడం లేదన్న ఆందోళన ఇప్పటికి దాదాపు నలభయ్యేళ్ళ క్రితం తొలిసారిగా మొదలయ్యింది. ఇరవై రెండేళ్ళ క్రితం మొదలైన 'మాదిగ దండోరా' ఉద్యమంతో ఉధృతమయ్యింది. సూక్ష్మ స్థాయిలో రిజర్వేషన్లకోసం (కోటాలో ఉపకోటా) మాదిగల ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

రాష్ట్రంలో మాదిగ దండోరా ఉద్యమ ప్రారంభ కాలంలో (1994) ఓ మాదిగ కుటుంబంలో జరిగిన కథని అదే కుటుంబంలోని ఓ టీనేజ్ అమ్మాయి గొంతు నుంచి వినిపించారు డాక్టర్ చంద్రశేఖర రావు తను 2012 లో రాసిన 'నల్లమిరియం చెట్టు' నవలలో. ఇది రాజ సుందరంగా మారిన రావెల రాజయ్య కథ. ప్రకాశం జిల్లాలో ఓ మాదిగ పల్లెలో తిరపతయ్య-ఆదెమ్మల తొలి సంతానం రాజయ్య. అతనికి ఒక తమ్ముడు కరుణ కుమార్. మిషనరీ స్కూల్లో చదువుకున్న రాజయ్య ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించుకుంటాడు. క్రిష్టియన్ అయిన విజయని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత పల్లెతో అతని సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సంఘం చేత గౌరవింపబడాలంటే బాగా డబ్బు సంపాదించడం తప్ప మరో మార్గం లేదని గ్రహిస్తాడు రాజయ్య.

పాఠ్య పుస్తకాల వ్యాపారంతో ఆరంభించి, అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, రాజకీయాల్లో చేరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు 'రాజ సుందరం' అవుతాడు రాజయ్య. పార్టీ అతనికి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు పంపుతుంది. సరిగ్గా అదే సమయంలో మొదలైన దండోరా ఉద్యమం రాజయ్య రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్ధకం చేస్తుంది. అతను అధికార పార్టీ సభ్యుడు. ఆ పార్టీకి దండోరా ఉద్యమం మీద సానుభూతి లేదు. ఉద్యమం ఉనికిని కూడా ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. పార్టీ సభ్యుడిగా, కాబోయే ఎమ్మెల్యేగా రాజ సుందరం ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించాలి. తను రాజయ్యని అని మర్చిపోడానికి ప్రయత్నిస్తున్న రాజ సుందరం ఎలాంటి రెండో ఆలోచనా లేకుండా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అతని తమ్ముడు కరుణ అనూహ్యంగా దండోరా ఉద్యమం పగ్గాలు చేపడతాడు.


అన్నకి పూర్తిగా భిన్నమైనవాడు కరుణ. తల్లి కష్టం చూడలేక చదువు మానేశాడు. రోజు కూలీగా పని చేశాడు. మొదట కమ్యూనిస్టు ఉద్యమం లోనూ, తర్వాత నక్సల్బరీలోనూ పని చేశాడు. కాంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాజయ్య జీవితం పద్దతిగా, ఒకలాంటి స్థిరత్వంతో సాగితే, కరుణ ఏటికి ఎదురీదాడు. అన్న మార్గం పూర్తిగా భిన్నమని తెలుసు. కానీ, అన్నన్నా, అతని పిల్లలన్నా కరుణకి ప్రాణం. దండోరా ఉద్యమానికి ఎంతో మంది యువత ఆకర్షితులవుతారు. దానినో ఆత్మగౌరవ పోరాటంగా స్వీకరిస్తారు. రోజురోజుకీ బలపడే పోరాటంలో టీనేజికి వచ్చిన తన పిల్లలు పాల్గొనడం తీవ్ర అశాంతికి గురిచేస్తుంది రాజ సుందరాన్ని. తమ్ముడి నాయకత్వం కన్నా, తన పిల్లల వ్యవహార శైలి  చికాకు పెడుతుంది అతన్ని. కులాన్ని నిచ్చెనగా మాత్రమే వాడుకోవాలనే రాజ సుందరానికీ, కులం కోసం మొండిగా నిలబడే కరుణకీ మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది.

దండోరా ఉద్యమం రోజురోజుకీ బలపడడంతో అందుకు అనుగుణంగా రాజకీయ సమీకరణాలూ మారతాయి. రాజయ్య పార్టీ ఉద్యమానికి మద్దతు పలుకుతుంది. అంతే కాదు, ఎమ్మెల్యే టికెట్ రాజయ్యకి కాక, కరుణకి ఇవ్వడం వల్ల రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న లెక్కలు మొదలవుతాయి. పైకి ఎదగడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న రాజయ్యకి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఇది. అయితే, అతడు అనుభవ శూన్యుడు కాదు. అప్పటికే రాజకీయాలని బాగా అర్ధం చేసుకున్నాడు. తన మనుగడ కోసం ప్రణాళికలు వేసుకున్నాడు. వాటిని అమలు పరిచే క్రమంలో రాజ సుందరం పొందింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటన్నది 'నల్లమిరియం చెట్టు' నవల ముగింపు. కథ మొత్తాన్ని రాజసుందరం టీనేజ్ కూతురు కమలి గొంతుతో వినిపిస్తారు రచయిత. ఇందువల్ల, కొన్ని సన్నివేశాల్లో కమలి, ఆమె తమ్ముడు రూమీ పాత్రలు వయసుకి మించిన పరిణతితో కనిపిస్తాయి.

ఒక్కో పాత్ర దృష్టి కోణం నుంచీ ఒక్కోలా కనిపించే కథ ఇది. నిజానికి రాజ సుందరం పాత్రని అర్ధం చేసుకోడం అంత సులువు కాదు. 'ఆకుపచ్చని దేశం' నవలలో అలలసుందరానికీ, ఈ రాజ సుందరానికీ చాలా పోలికలు కనిపిస్తాయి. సొంత ప్రయోజనాల కోసం కులం ప్రయోజనాలని పణంగా పెట్టే పాత్రలే రెండూ. రాజ సుందరం పాత్రలో సంఘర్షణని చిత్రించిన తీరు ఈ నవలకి ప్రాణం. తర్వాత చెప్పుకోవాల్సినవి స్త్రీ పాత్రలు. ఆదెమ్మ గతం, కళ్యాణరావు రాసిన 'అంటరాని వసంతం' నవలని గుర్తు చేస్తుంది. కాంతం, విజయలతో పాటు కథ చెప్పే కమలి కూడా బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రే. తక్కువ సన్నివేశాల్లోనే అయినా రాజయ్య-విజయ, కరుణ-కాంతం దంపతుల మధ్య బంధంలో కాలంతో పాటు వచ్చిన మార్పులని పాత్రోచితంగా చిత్రించారు రచయిత. రూమీ ఓ ప్రత్యేకమైన పాత్ర. కథ, కథనం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయనే చెప్పాలి.

నవలా రచన బాగా తగ్గిపోతున్న కాలంలో  సమకాలీన సాంఘిక, రాజకీయ అంశాలని ఇతివృత్తంగా తీసుకుని, గుర్తుండిపోయే నవలలు రాస్తున్న డాక్టర్ చంద్రశేఖర రావు తన కృషిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు 'ఆకుపచ్చని దేశం' ఇటు 'నల్లమిరియం చెట్టు' రెండూ కూడా వెంటాడే నవలలే. కె. శివారెడ్డి రాసిన సుదీర్ఘమైన ముందుమాటని నవలని మొదటిసారి చదవడం పూర్తి చేశాక, అప్పుడు చదవడం బాగుంటుంది. ('నల్లమిరియం చెట్టు,' చరిత ఇంప్రెషన్స్ ప్రచురణ, పేజీలు  244, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 వ్యాఖ్యలు:

  1. నాకైతే అలనాటి 'రంగులరాట్నం' (తెలుపు-నలుపు)సినిమా కథతో పోలికలు బాగానే కనిపిస్తున్నాయి!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @శ్యామలీయం: ఇక్కడ ప్రస్తావించని మలుపులు చాలా ఉన్నాయండీ నవలలో.. పోలిక రేఖామాత్రమే.. ధన్యవాదాలు..

    ప్రత్యుత్తరంతొలగించు