సోమవారం, జూన్ 27, 2016

మరల సేద్యానికి

విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' మొదలు గొల్లపూడి మారుతి రావు 'సాయంకాలమైంది' వరకూ, తరాల అంతరాలని ఇతివృత్తంగా చేసుకుని తెలుగు సాహిత్యంలో అనేక నవలలు వచ్చాయి. ఇదే ధోరణి లో వచ్చిన కన్నడ నవల శివరాం కారంత్ రాసిన 'మరళి మణ్ణిగె.' డెబ్బై ఐదేళ్ల క్రితం కన్నడ పాఠకులని విశేషంగా ఆకర్షించిన ఈ నవలని 'మరల సేద్యానికి' పేరిట తెనిగించారు మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర. నదీ సాగర సంగమానికి సమీపంలో ఉండే ఓ పల్లెటూరిలో పౌరోహిత్యం, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఓ బ్ర్రాహ్మణ కుటుంబలో మూడు తరాల కాలంలో వచ్చిన మార్పుని రికార్డు చేసిన నవల ఇది.

'కోడి' గ్రామంలో నివసించే శ్రీరామ ఐతాళుల కుటుంబం కథ 'మరల సేద్యానికి.' ఆ చుట్టుపక్కల నాలుగైదు పల్లెటూళ్ళకి ఐతాళులే పురోహితులు. ఇది కాకుండా వ్యవసాయం ఉంది. స్వతహాగా కష్టజీవి, జాగ్రత్త పరుడు. భార్య పారోతి, చెల్లెలు సరసోతి కూడా క్షణం ఖాళీగా కూర్చుందాం అనుకునే మనుషులు కాదు. ఇంటి పనులు, వ్యవసాయం పనులు, వీటితో పాటు పశు పోషణ.. ఏ కాలంలోనూ ఊపిరి సలపని పనిలో కూరుకుపోయి ఉంటుంది ఆ కుటుంబం. తినేది  మామూలు భోజనం, కట్టేవి సాదా వస్త్రాలు. ఎంత ప్రయాణమైనా కాలినడకనే. విశేషించి చిల్లర ఖర్చులేవీ లేకపోవడంతో సొమ్ము జాగ్రత్త చేస్తూ ఉంటారు ఐతాళులు. ఖర్చు వెచ్చాల గురించే కాదు, ఇంటికి సంబంధిచిన ఏ విషయాన్నీ ఆడవాళ్ళతో చర్చించే అలవాటు లేదాయనకి.

ఐతాళుల కొడుకు లక్ష్మీ నారాయణ మాటలు నేర్చే నాటికి చుట్టూ మార్పులు రావడం ఆరంభం అవుతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ చదువుల ప్రాబల్యం బాగా పెరుగుతుంది. బ్రాహ్మణ కుర్రవాళ్ళంతా పట్నంలో గదులు తీసుకుని ఉంటూ చదువులు ఆరంభిస్తారు. కొన్ని కుటుంబాలు హోటళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఈ చదువుకునే కుర్రాళ్ళకి భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం మొదలుపెడతాయి. కొడుకంటే తగని ముద్దు ఐతాళులకి. అతన్ని ఏం చదివించాలో, అందుకు ఏమాత్రం ఖర్చవుతుందో పెద్దగా అంచనా లేదు కూడా. తాతగారింట ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన లక్ష్మీ నారాయణ, పెద్ద చదువు కోసం పట్నానికి బస మార్చడంతోనే వ్యసనాలకు బానిస అవుతాడు. అయితే, తన అలవాట్లేవీ ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడతాడు.


ఐతాళుల పెంపకం మీద నమ్మకం ఉన్న ఓ గొప్పింటి ప్లీడరు గారు తన కూతురు నాగవేణిని లక్ష్మీనారాయణకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అల్లుడి నిజస్వరూపం తెలియడానికి అట్టే కాలం పట్టదు. అప్పటికే భర్త కారణంగా అనారోగ్యం పాలవుతుంది నాగవేణి. ఐతాళులు ఎంతటి జాగ్రత్త పేరులో అంతటి దుబారా మనిషిగా తయారవుతాడు లక్ష్మీ నారాయణ. అతని బాధ్యత లేనితనం మామగారినే కాదు, తల్లిదండ్రులనీ బాధిస్తుంది. పుట్టింటి వారు తమతో ఉండమని బలవంతం చేస్తున్నా, అభిమానవతి అయిన నాగవేణి అత్తింటికి వచ్చేస్తుంది. ఖర్చు చేయడం తప్ప సంపాదించడం తెలియని లక్ష్మీనారాయణ నిర్వహణలో ఆ కుటుంబం దాదాపు రోడ్డున పడుతుంది. అంతలోనే నాగవేణికి కొడుకు పుడతాడు. 'రాముడు' అని మావగారి పేరు పెట్టుకుని, ఆ బిడ్డే ఆలంబనగా జీవితం సాగిస్తుంది.

లక్ష్మీ నారాయణ బాల్యం ఎంత కులాసాగా గడిచిందో అంతకు పది రెట్ల కష్టాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు రాముడు. వయసుకి మించిన పెద్దరికం, బాధ్యత ఉన్న రాముడు ఎన్నో ప్రయాసలు పడి చదువు పూర్తి చేసేనాటికి దేశంలో యుద్ధ వాతావరణం ముమ్మరమవుతుంది. ఆర్ధిక మాంద్యం ఏర్పడి నిరుద్యోగం ప్రబలుతుంది. పెరిగి ప్రయోజకుడై తల్లిని సంతోష పెట్టాలన్న లక్ష్యంతో చదువు పూర్తి చేసిన రాముడు భవిష్యత్తుని ఎలా తీర్చి దిద్దుకున్నాడు అన్నది ముగింపు. మూడు తరాల జీవితాన్ని 323 పేజీల్లో చిత్రించిన నవల ఇది. కాలమాన పరిస్థితులని, మానవ మనస్తత్వాలనీ చిత్రించిన తీరు ఈ నవలని ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పాలి. వ్యవసాయ సంబంధమైన నవల అవ్వడం వల్ల కావొచ్చు, వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి' గుర్తొచ్చింది అక్కడక్కడా.

ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది అనువాదాన్ని గురించి. తిరుమల రామచంద్ర అనువాదం మక్కీకి మక్కీగా సాగినట్టు ఎక్కడా అనిపించదు. అక్కడక్కడా రాయలసీమ నుడికారం వినిపించే భాష, కథ తాలూకు స్థల కాలాదులని కళ్ళముందు ఉంచుతుంది. కథ తాలూకు వాతావరణంలోకి ఒక్క సారి ప్రవేశించాక, నవల పూర్తి చేయకుండా పక్కన పెట్టడం అసాధ్యం. వకుళాభరణం రామకృష్ణ ముందుమాటలో చెప్పినట్టుగా 'కొత్త పాతల మేలుకలయికగా సమాజం పురోగమించాలన్నదే' ఈ నవల సందేశం. హోరు వినిపించే సముద్రతీర గ్రామంతో పాటు, పారోతి, సరసోతి, నాగవేణి అనే ముగ్గురు స్త్రీలూ చాలాకాలంపాటు వెంటాడతారు మనల్ని. (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, వెల: రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

7 వ్యాఖ్యలు:

 1. చాలా మంచి నవలను ఎన్నుకుని పరిచయం చేసారు, మురళి గారు..
  మీ సరళమైన వాక్యనిర్మాణం, పరిచయం చేసే పద్దతి ఏకబిగిన చదివింప చేస్తుంది. మీ కలం నుండి మరిన్ని ఇలాంటి పాతబంగారాలు జాలువారాలని ఆశిస్తూ, ఎదురుచూస్తూ..
  -భాస్కర్ కూరపాటి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పారోతి, సరసోతి... టైపాట్లు కావా... రామచంద్ర గారు అలా రాసారంటే నమ్మబుద్ధి కావడం లేదు... మూలంలోనూ అలానే ఉందా? (ఏమో!)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @భాస్కర్: ధన్యవాదాలండీ..
  @పురాణపండ ఫణి: అవునండీ.. నేటివిటీ చిత్రణకి పెద్ద పీట వేశారు రామచంద్ర గారు.. సరస్వతి, పార్వతి అని మొదట చెప్పారు. వాడుక అంతా సరసోతి, పారోతి అనే.. నాకైతే అనువాదం చేసిన విధానం చాలా నచ్చింది (కథ కన్నా కూడా) .. ..ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Very good novel.purchased from kinige and completed in 7 days.murali garu can you tell me where we can get most telugu books in vijayawada other than vishalandra

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @శశి: ఇదివరకంటే విశాలాంధ్ర పక్కన నవోదయ ఉండేదండీ :( ఏలూరు రోడ్డులో ఎమెస్కో, అరుణ బుక్ హౌస్ లలో దొరుకుతాయండీ.. అలాగే మేరీస్ స్టెల్లా దగ్గరున్న అశోక్ బుక్ సెంటర్ లో ఇంగ్లీష్, తెలుగు లేటెస్ట్ పుస్తకాలు దొరుకుతాయి.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఏకబిగిన చదివించిన నవలండీ. (పుస్తకం చదువుతూ పక్కనపెట్టేసే పాడలవాటున్న నాబోంట్ల చేతకూడా..) పారోతి, సరొసోతి.. నాగవేణి ముగ్గురూ ముగ్గురే. కోడి గ్రామం, వానలో ముద్దవుతున్న ఆ ఇల్లూ కళ్ళకి కట్టిందంతే!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @కొత్తావకాయ: నాకైతే చెవుల్లో వానహోరు, సముద్రపు హోరు కలగలిపి వినిపిస్తాయండీ పుస్తకం చూడగానే.. ..ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు