మంగళవారం, జులై 26, 2016

నరసింహుడు

భారతదేశంలోకి నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించి పాతికేళ్ళు పూర్తయ్యాయి. కొత్తతరానికి ఏమాత్రం తెలియని మార్పులెన్నో సాంఘిక, ఆర్ధిక పరిస్థితుల్లోకి చొచ్చుకు వచ్చాయి. మధ్యతరగతి జీవితాలని విశేషంగా ప్రభావితం చేసిన సాఫ్ట్వేర్ రంగం ఊపందుకోవడం మొదలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజా జీవితంలో ఓ భాగమవ్వడం వరకూ జరిగిన అనేక పరిణామాలకి మూల కారణం ఆర్ధిక సంస్కరణలే. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ సారధ్యంలోని మైనారిటీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన తెలుగు నాయకుడు పీవీ నరసింహారావు తీసుకున్న కీలక నిర్ణయాల ఫలితమే ఈ ఆర్ధిక సంస్కరణలు.

కేవలం సోనియా గాంధీ పట్ల తగినంత విశ్వాసం ప్రదర్శించలేదు అనే కారణానికి కాంగ్రెస్ పార్టీ పీవీ ని పార్టీ చరిత్రనుంచి తొలగించేసి సంస్కరణల సారధిగా నాటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ని కీర్తిస్తుండగా, ఆర్ధిక సంస్కరణల పర్వానికి నాడు అడుగడుగునా మోకాలడ్డిన వామపక్ష పార్టీల నాయకులు నేడు ఆవేళ ఆ పదవిలో ఎవరున్నా తీసుకునే నిర్ణయాన్నే పీవీ తీసుకున్నారు కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదని తేల్చేస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో నాయకులైతే సంస్కరణల తాలూకు ఫలితాలన్నీ తమ ఘనతే అని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. మరి, పీవీ ఆనాడు చేసిన కృషి, ఎదుర్కొన్న ఒత్తిళ్లు, ప్రదర్శించిన రాజనీతి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోవలసినవేనా? ఈ ప్రశ్నకి 'కాదు' అని సమాధానం ఇస్తోంది 'నరసింహుడు.'

పాత్రికేయుడు, న్యాయవాది, రాజకీయ శాస్త్రవేత్త వినయ్ సీతాపతి ఆంగ్లంలో రాసిన 'ది హాఫ్ లయన్' పుస్తకానికి సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్, టంకశాల అశోక్, కేబీ గోపాలం కలిసి చేసిన తెలుగు అనువాదమే 'నరసింహుడు.' 'ఇప్పటి భారతదేశ నిర్మాత కథ' అన్నది ఉపశీర్షిక. పీవీ ప్రధానిగా పదవీ కాలం ముగించుకున్న రెండు దశాబ్దాల తర్వాత, భౌతికంగా దూరమైన పుష్కర కాలం తర్వాత వెలువడిన ఈ పుస్తకం ఒక నిస్పక్షపాతమైన రచన. రచయితకి పీవీ కృషి మీద అభిమానం ఉంది. కాబట్టే,  రెండేళ్ల పాటు విశేష పరిశోధన చేసి, కీలకమైన వాటితో సహా వేలాది డాక్యుమెంట్లు చదివి, పీవీ వ్యక్తిగత వంటమనిషి సహా వందలాది మందిని ఇంటర్యూ చేసి రాసిన పుస్తకం ఇది. అయితే, రచయితకి పీవీ మీద దురభిమానం లేదు..కాబట్టే పాలనలో జరిగిన తప్పులని తప్పులుగా ఎత్తి చూపించారు.

2004, డిసెంబరు 23న ఢిల్లీ లో పీవీ అంతిమ శ్వాస విడిచిన మరుక్షణం, అంత్యక్రియలు ఢిల్లీలో జరపడానికి వీలు లేదని సోనియా గాంధీ పట్టుపట్టి సాధించుకోడంతో మొదలయ్యే కథనం, పీవీ బాల్యం, తొలినాళ్ళ రాజకీయ జీవితం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ, పదవీ చ్యుతి మీదుగా సాగుతూ, ప్రధాని అవుతూనే ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు, అవలంబించిన విదేశీ విధానాలు వివరిస్తూ, బాబరీ మసీదు విధ్వంసం లాంటి వైఫల్యాలని పరామర్శిస్తూ, పీవీ-సోనియాల మధ్య పొడసూపిన విభేదాల దగ్గరకి వఛ్చి, పీవీ వ్యక్తిత్వంలో భిన్న కోణాలని పరిచయం చేస్తూ ముగుస్తుంది.  పాతికేళ్ల నాటి రాజకీయాలతో పాటుగా, నేటి రాజకీయాలమీదా ఒక స్పష్టత వస్తుంది.


నిజానికి పీవీ రచనలు 'లోపలి మనిషి,' 'అయోధ్య' చదివిన వారికి 'నరసింహుడు' లో రాసిన కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. అలాగే, జైరాం రమేష్ తాజా రచన 'సంస్కరణల రథసారథి' పీవీ చదివిన వారికి సంస్కరణల పర్వం పరిచయం అవుతుంది. ఈ మూడూ చదివిన తర్వాత 'నరసింహుడు' చదివితే పీవీ తాలూకు పూర్తి చిత్రం కళ్ళకి కడుతుంది. అంతమాత్రాన, 'నరసింహుడు' చదవడానికి పైమూడూ చదివి ఉండడం తప్పనిసరి కాదు. ప్రధానిగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పీవీ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి, గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పొందిన 'వైఫల్యం' ఉపయోగ పడిందని ప్రతిపాదిస్తారు వినయ్ సీతాపతి. ఈ పరిశీలనని తోసిపుచ్చలేం. అలాగే, స్వాములు, బాబాలతో సన్నిహితంగా మెలగడం వెనుక రాజకీయ కారణాలని విశ్లేషించారు.

మన్మోహన్ సింగ్ ని ఏరికోరి ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, ప్రతిభావంతులైన అధికారులు ఎక్కడ ఉన్నా వెతికి వారికి తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం వరకూ ఎక్కడా కూడా పీవీ 'అభద్రత' కి లోనుకాలేదని చెబుతూ, తాను స్వయంగా ప్రతిభావంతుడు కాబట్టి, ప్రతిభావంతుల కారణంగా తనకి ప్రమాదం ఎదురవుతుందేమోనన్న (మెజారిటీ నాయకులకి కలిగే) సందేహాన్ని పీవీ జయించగలిగారన్నది మరో ప్రతిపాదన. పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 'పవర్ సెంటర్' గా అధికారం చెలాయించిన నాటి కాంగ్రెస్ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ, ముఖ్యమంత్రి పదవి కోల్పోగానే ఆయన్ని నిష్కర్షగా దూరంపెట్టిన విధం పీవీకే కాదు, నాయకులందరికీ ఒక పాఠమే.

కీలక నిర్ణయం తీసుకోవాల్సి వఛ్చిన ప్రతిసారీ దాన్ని వాయిదా వేసి కాలం గడిపేశారన్నది నాడు పీవీ మీద వినిపించిన ఫిర్యాదు. ఆ ధోరణికి కారణాలతో పాటు, తాను చేయాలనుకున్న పనులని అత్యంత వేగంగా చేసిన వివరాలనీ ఉదాహరణలతో సహా అందించారు సీతాపతి. తనదైన ఒక సమాచార వ్యవస్థని నిర్మించుకోడం మొదలు, పార్టీ నాయకుల మీద నిఘా పెట్టడం వరకూ పీవీ చేసిన ప్రతిచర్యనీ విశ్లేషిస్తుందీ పుస్తకం. బయటి శత్రువులతోనూ, (పార్టీ) లోపలి శత్రువులతోనూ పోరాడుతూ, దినదిన గండమైన మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ దేశ గతిని మలుపు తిప్పే నిర్ణయాలని సమర్ధవంతంగా అమలు చేయడం అన్నది ఎంతటి కత్తిమీద సామో వివరిస్తుంది కూడా.

శాశ్వతంగా గౌరవించాల్సిన ఒక నాయకుణ్ణి చరిత్ర హీనుణ్ణి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలతో పాటు, పీవీ చేసిన చారిత్రిక తప్పిదాలనీ నిర్మొహమాటంగా రికార్డు చేశారు. పుస్తకం పూర్తి చేసిన తర్వాత మొదటగా తల్చుకునేది పీవీని అయితే, ఆవెంటనే గుర్తు చేసుకునేది వినయ్ సీతాపతి కృషిని. తెలుగు వాళ్ళెవరూ చేయలేకపోయిన బృహత్ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రచయితని అభినందించకుండా ఉండలేం. అనువాదంలో ముగ్గురు రచయితలు పాలుపంచుకోడం వల్ల కావొచ్చు, రచనలో ఏకరూపత కనిపించదు. అయితే, మొత్తం పుస్తకం వేటికవే అయిన పదిహేను అధ్యాయాలుగా ఉండడం వల్ల ఈలోపం పాఠకులని పెద్దగా బాధించదు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన పుస్తకం ఈ 'నరసింహుడు.' (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 440, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

7 వ్యాఖ్యలు:

 1. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ వైఫల్యం చెందారన్న అపప్రథ ఉంది. నిజమే.
  కాని నిజానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ కాంగ్రెసు ముఖ్యమంత్రి తనంతతానుగా వ్యవహరించగల పరిస్థులన్నవి ఎప్పుడైనా ఉండినవా? లేవుకదా. ఎవరు ముఖ్యమంత్రి కావాలీ అన్న నిర్ణయం ఢిల్లీలో జరగాలి. అది సీల్డ్ కవర్లో రావాలి. తూతూమంత్రంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా తమ బుఱ్ఱల్నేదో ఉపయోగించినట్లే నటించి ఏకగ్రీవంగా ఆ చీటీలో మనిషినే ఎన్నుకోవాలి. ఆపైన ఆచీటీముఖ్యమంత్రి ఢిల్లీపెద్దలు ఎప్పటికప్పూడు పంపించే ఆదేశాలకు అనుగుణంగా అవేవో ముఖ్యమంత్రిహోదాలో తన స్వంత నిర్ణయాలే అన్నట్లుగా నటించి ప్రకటించాలి. ఈ డ్రామాలు రక్తికట్టినంతకాలమూ అది ఢిల్లీ అధిష్టానం దక్షత. ఏవి ఎప్పుడు ఎందుకు ఎలా బెడిసి కొట్టి పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా అది ముఖ్యమంత్రి చేతకాని తనం. పైగా సదరు చీటీముఖ్యమంత్రి ఆడమన్నంత బాగా ఆడలేకపోయినా చెప్పినమోతాదుకన్నా మరింతబాగా ఆడినా ఆయన పనికిమాలిన వాడే. అవసరం ఐనప్పుడల్లా అధిష్టానమే అసమ్మతిని తయారుచేసి ఢిల్లీకి రప్పింఛుకొని మరీ ముఖ్యమంత్రిని మార్చేందుకు మరొక స్టేజీప్రోగ్రామును ఏర్పాటు చేస్తుంది. అదేగా కాంగ్రెసువారు చేసిన పధ్ధతి. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి నిజంగా తన సమర్థతను వెలిబుచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అప్పటి పరిస్థితుల్లో పీవీని కుర్చీ ఎక్కించిన అసమర్థుడని ముద్రవేసి కుర్చీలోంచి దించేసినా దానిలో ఆయన పాత్ర మహాపరిమితం. ఆమాత్రానికి ఆయన సమర్థతమీద బురదను చల్లవలసిన పనిలేదు. కాంగ్రెసు వాళ్ళకు పీవీ అంటే కిట్టదు - ఆయన గాంధీనెహ్రూ డైనాస్టీకి చెందిన సోకాల్డ్ త్యాగధనుడు కాడుకదా! అందుచేత పీవీని ఎవరన్నా కించిత్తు మెచ్చుకున్నా గోలపెట్టే కాంగ్రెసు భక్తులకు ఈ మాటలు రుచించకపోవచ్చును. కాని పీవీ సమర్థుడనే నా వ్యక్తిగత అభిప్రాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సరిగ్గా ఈ రోజే నేను ఈ బుక్ చదవటం పూర్తిచేసాను మురళి గారు. మధ్యలో ఎక్కడా ఆపాలనిపించలేదు. కాని తప్పదు, ఒక్క రోజులో పూర్తి చేయలేము కదా:)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ పుస్తకం వీకెండ్ చదివాను. చాలా బాగుంది. రచయితల ట్రాన్స్లేషన్ కూడా చాలా బాగుంది. వినయ్ సీతాపతి చాలా చక్కగా రాశాడు. భారతదేశం పాలించిన ప్రధానులలో పి.వి. నంబర్ 1 అని నా అభిప్రాయం. ఆయన ఒక ప్రపంచ నాయకుడు. సింగపూర్ ను సుదీర్ఘంగా పాలించిన మాజి ప్రధాని lee kuan yew కూడా పి.వి. అంటే చాలా గౌరవం

  పుస్తకం లో నచ్చింది. రచయిత పి.వి. తీసుకొన్న నిర్ణయాలు అవి ఎందుకు తీసుకొన్నాడు? విజయవంతమైనవాటికి,విఫలమైనవాటికి కారణాలు స్పష్టంగా చెప్పాడు. బహుశ ఆయన ఆ నిర్యానికి రావటానికి కారణం పి.వి. గారిని అతి దగ్గరగా పరిశీలించిన సంజయ్ బారు సహాయం చేసి ఉండవచ్చు.

  రచయిత పి.వి. గూరించి సేకరించిన మెటిరియల్ అంతా ఎదైనా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే భవిషత్ లో పి.వి. పై రిసర్చ్ చేయాలనుకొనేవారికి ఉపయోగంగా ఉంట్టుంది.

  ________________

  పి.వి.గారి పై కమ్యునిస్ట్ లు చేసే విమర్శలకు పైస విలువ ఉండదు. వాళ్ళు పేపర్లలో సలహాలు ఇవ్వటం తప్పించి ప్రజలకు చేసింది ఎమి లేదు. పివి ప్రధానిగా ఉన్న కాలంలో తెలుగు లో దాదాపు ప్రముఖ జర్నలిస్ట్ లు అందరు విమర్శించిన వారే. ఒకరో ఇద్దరో పతాంజలి వంటి వారుతప్పించి.

  ఎంతో పెద్ద భారతదేశాన్ని పి.వి. సింగిల్ హాండ్ తో హాండిల్ చేస్తే,చిన్న దేశాలు,తక్కువ జన సంఖ్య గల యురోప్ దేశాలవారు ఇప్పుడు వాళ్లదేశాల ఆర్ధిక వ్యవస్థను,సామాజిక వ్యవస్థను చక్కదిద్దుకోవటంలో విఫలంచేదారు. చేతులెత్తేశారు. గ్రీస్ సంక్షోభ సమయంలో అక్కడ ఆర్ధిక మంత్ర గా పనిచేసిన కమ్యునిస్ట్ నాయకుడు, ఆర్ధిక శాస్త్త్రవేత్త ఇంటర్వ్యులు నెట్ లో చాలా ఉన్నాయి. అవి వింటే యురోప్ అనైక్యత,ప్రజల స్వార్ధం, నాయకత్వ లేమి అన్ని తెలుస్తాయి.

  Yanis Varoufakis: »MONEY AND POWER«, Public Lecture 2015-11-04

  https://www.youtube.com/watch?v=cCA68U3P_Z8

  గ్రీస్, ఇటలి, స్వీడన్ ఒక దాని వెనుక ఒకటి పతనం చెందూ యురోప్ చరిత్ర లో కలసిపోతున్నాది

  ప్రత్యుత్తరంతొలగించు
 4. * ఆర్ధిక సంస్కరణలకు నాడు అడుగడుగునా మోకాలు అడ్డుపెట్టిన వామపక్ష నాయకులు నేడు ఆ వేళ ఆపదవి లో ఎవరు ఉన్నా ఆ నిర్ణయం తీసుకొనే వారని,పి.వి. కూడ అదే నిర్ణయం తీసుకొన్నారని అదేమి పెద్ద విషయం కాదని *

  లెఫ్త్ వారికి పుస్తకాల లో రాసిన థీయరిని వల్లించటం, విదేశాలలో అభివృద్ది విరగబడి జరిగిందని, మనం వెనుక పడిపోయామని ప్రచారం చేయటం, విదేశి భావజాల సాహిత్యాన్ని అనువదించి మేధావులుగా చెలామణి కావటం అవే వారికి తెలిసిన విద్యలు. మీడీయాలో వారి మిత్రులు వీరిని ఆహా ఓహో అని, నవయుగ వైతాళికులని పొగుడుతూ పరిచయం చేస్తే ఒకప్పుడు నమ్మేసేవారు. ఇప్పుడు ఎవ్వరు వీరిని నమ్మరు. ఉదా|| ఓల్గ అనే తెలుగు వామపక్ష భావజాల రచయిత్రి, అందరు అవార్డ్ వాపసి అని తిరిగి ఇస్తూంటే హిందూ మతత్వ వాద నమో ప్రభుత్వం ఇచ్చిన కేంద్రీయ సాహిత్య అకాడేమి అవార్డ్ తీసుకొంది. అంతటి తో ఆగలేదు అవార్డ్ తీసుకొన్న తరువాత ఆమె సారంగలో ఇచ్చిన ఇంటర్వ్యు లో భారతదేశం లో అసహనం పెరిగిపోతున్నాదని నమో ప్రభుత్వాన్ని విమర్శించింది. అట్లుంట్టుంది వామపక్ష మేధావుల వ్యవహార శైలి.

  ఇక వామపక్ష రాజకీయ నాయకులు కష్ట కాలంలో ఉన్న వారి పార్టిని, బెంగాలు లో తిరిగి అధికారంలో కి తీసుకు రావటంలో ఫైల్ అయ్యారు. సీతారం ఏచురి బెంగాల్ ఎన్నికలలో ప్రజల/పార్టి నాడిని పట్టుకోవటం లో ఎలా విఫలమై, ఘోరమైన పరాజయం మూట కట్టుకొన్నాడో యం.జె. అక్బర్ చక్కగా విశ్లేషించాడు.
  వీళ్ళు ఇతర పార్టిల పై విశ్లేషణలు చేసే కన్నా వారిపార్టిని ఉద్దరించుకొంటే ఎంతో మిన్న.

  Comrade Sitaram Yechury’s historic blunder

  CPI went into terminal decline when it compromised with the Congress in 1969-1970. In 2016, CPM is being destroyed because it abandoned principle in search of a cheap return ticket to power


  ప్రత్యుత్తరంతొలగించు
 5. పీవీ నర్సింహారావు గారికి దొరికిన పదవులన్నీ ఆయన కాంగ్రెస్ & గాంధీ కుటుంబం వీర విధేయత వల్లనే. తన గురువయిన చంద్రస్వామిని ఇందిరా గాంధీకి పరిచయం చేయడం కూడా ఆయనకు ఎంతో లాభించింది. సోనియాకు చంద్రస్వామికి ఎక్కడో బెడిసి కొట్టిందని పుకార్లు ఉన్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు

 6. @శ్యామలీయం: సమర్ధుడు కానట్టయితే ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని భూ సంస్కరణలు అమలు చేసి ఉండేవాడు కాదు కదండీ, ముఖ్యమంత్రిగా.. ఇక ప్రధానిగా అయితే, మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఆర్ధిక సంస్కరణలు అమలు జరపడం ఒక్కటి చాలు పీవీ ఏమిటో తెలియడానికి.. సోనియాకి విధేయత ప్రకటించి ఉంటే కాంగ్రెస్ చరిత్రలో పీవీకి చోటు దక్కేదేమో.. ధన్యవాదాలు..
  @జయ: అవునండీ.. ఏకబిగిన చదివించేస్తుంది.. ..ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @U.G. Sriram: అన్నిటికన్నా సులువైన పని విమర్శించడం కదండీ.. అవార్డులు తిరిగి ఇచ్చిన వాళ్ళెవరూ అవార్డు రూపంలో అందుకున్న సొమ్ముని తిరిగిచ్చింది దాఖలా కనిపించలేదు నాకైతే.. ఆ ప్రహసనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. పుస్తకం చాలా బాగుందండీ.. మెటీరియల్ లో పబ్లిక్ డాక్యుమెంట్స్ తక్కువే.. పీవీ ప్రయివేట్ లైబ్రరీని యాక్సెస్ చేయగలగడం వల్ల మంచి సమాచారం దొరికింది వినయ్ సీతాపతికి.. ఆ సమాచారం అంతా పబ్లిక్ కి అందుబాటులో ఉంచడంలో సాధ్యాసాధ్యాలు కొంచం అనుమానాస్పదమేనండీ.. ..ధన్యవాదాలు..
  @జై గొట్టిముక్కల: నిజమేనండీ.. 'లోపలి మనిషి' లో చెప్పారు కదా నెహ్రు, ఇందిరల మీద చూపించిన విధేయతని గురించి.. సోనియాతో టర్మ్స్ బాగుండి ఉంటే చరిత్ర మరోలా ఉండేదేమో.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు