ఆదివారం, నవంబర్ 27, 2016

ఓ కాపీ కథ

దినపత్రికల ఆదివారం అనుబంధాల్లో మంచి కథలకోసం వెతికే వాళ్ళని 'ఆంధ్రజ్యోతి,' 'సాక్షి' సాధారణంగా నిరాశపరచవు. తరచుగా మంచి కథలు, అప్పుడప్పుడూ గొప్ప కథలూ వస్తూ ఉంటాయి ఈ రెండు పత్రికల్లోనూ. కథల ఎంపికలో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని వాళ్ళ ఎంపిక తెలియజెపుతూ ఉంటుంది. అయితే, ఇవాళ్టి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫక్తు కాపీ కథ ప్రచురితమవ్వడం, అదికూడా ఆంధ్రజ్యోతిలో కావడం ఓ పట్టాన మింగుడు పడ్డం లేదు. ఆ కథను గురించి చెప్పేముందు మూలకథని ఓసారి తల్చుకోవాలి.

'మా పసలపూడి కథలు'కి ముందు వంశీ రాసిన కథలతో వచ్చిన సంకలనం పేరు 'ఆనాటి వానచినుకులు.' రంగుల బొమ్మల హడావిడి లాంటి హంగులేవీ లేకుండా ఎమెస్కో ప్రచురించిన ఆ పుస్తకానికి శీర్షికగా ఉంచిన కథ పేరు 'ఆనాటి వానచినుకులు.' ఈ కథలో ప్రధాన పాత్ర పతంజలి అహంభావిగా కనిపిస్తాడు. తాను నమ్మింది మాత్రమే జీవితమనీ, అందంగా జీవించాలంటే అందమైన పరిసరాల్లో, చక్కని సంగీతం వింటూ, ఇంచక్కని  కవిత్వం చదువుకోడమే మార్గమనీ, అలాంటి వాళ్లకి మాత్రమే భావుకత్వం అలవడుతుందనీ  బలంగా నమ్ముతాడు.

మద్రాసు మహానగరంలో నివాసముండే పతంజలి అనుకోకుండా ఓ మారుమూల పల్లెటూరికి అవస్థలతో కూడిన ప్రయాణం చేయాల్సి రావడం, ఆ యాత్రలో అతడి చివరి ప్రయాణ సాధనమైన రిక్షాని చూడగానే అతడు భావుకత్వాన్ని గురించి అన్నాళ్ళుగా నమ్ముతూ వచ్చిన విషయాలన్నీ తప్పేనన్న ఎరుక ఒక్కసారిగా కలగడంతో కథ ముగుస్తుంది. ఆ మారుమూల కుగ్రామంలో రిక్షా నడుపుకునే గోపాలం అత్యంత సామాన్యుడు. తన ఒంటినీ, రిక్షాన్నీ పరిశుభ్రంగా ఉంచుకున్న వాడు. అంతే కాదు, రిక్షా వెనుక తన స్వహస్తాలతో 'ఆనాటి వానచినుకులు' అని రాసుకున్న వాడూను.

చదువుకీ, సంస్కారానికే కాదు, చదువుకీ భావుకత్వానికీ కూడా పెద్దగా సంబంధం లేదని నిరూపించే ఈ కథలో ముగింపు ఒక మాస్టర్ స్ట్రోక్. 'ఆనాటి వానచినుకులు' అనే వాక్యం ఎందుకు రాసుకుని ఉంటాడో అనే ఊహని పాఠకులకే వదిలేయడం వల్ల ఈ కథకి సంపూర్ణత్వం వచ్చిందనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక, ఇవాళ్టి ఆదివారం ఆంధ్రజ్యోతి కథపేరు 'ఆనాటి చెలిమి ఒక కల.' అమెరికాలో మొదలయ్యి, అమెరికాలో ముగిసే ఈ కథలో ప్రధానమైన భాగం అంతా అమలాపురం, ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లలో జరుగుతుంది, అదికూడా ఓ నాలుగు దశాబ్దాల క్రితం.

కథకుడి స్నేహితుడి బంధువు రాజు రిక్షా నడుపుకుంటూ ఉంటాడు. కవిత్వం అంటే ఇష్టం కూడా. నెమ్మదిగా కథకుడికి తన స్నేహితుడి కన్నా, రాజు దగ్గరవాడు అయిపోతాడు. సర్వవేళలా ఇస్త్రీ బట్టలు ధరించే రిక్షా రాజు, తన రిక్షాని అరిగిపోయేలా తుడుస్తూ ఉండడమే కాదు, రిక్షా వెనుక ప్రతినెలా ఓ వాక్యం రాయిస్తూ ఉంటాడు ఓ పెయింటర్ చేత. సాధారణంగా సినిమా పాటల పల్లవులు, అప్పుడప్పుడూ కవితా పంక్తులు అతని రిక్షా వెనుక దర్శనమిస్తూ ఉంటాయి. వచ్చే నెల ఏ వాక్యం అనే విషయం మీద కథకుడు, అతని స్నేహితుడూ పందేలు వేసుకుంటూ ఉంటారు కూడా.

రిక్షా రాజు రాయించిన ఒకానొక వాక్యం 'ఆనాటి వానచినుకులు.' ఈ వాక్యం ఎందుకు రాయించాడో కథకుడికి తెలియక మునుపే, కథకుడు మొదట చదువు కోసం, ఆ తర్వాత ఉద్యోగం కోసం ఊరికి దూరంగా వెళ్లి, ఆ తర్వాత శాశ్వతంగా ఊరితో సంబంధాలు కోల్పోవడం జరుగుతుంది. కథకుడి కొడుకు 'ఆడి' కారు వెనుక అతికించిన బంపర్ స్టికర్ లో ఉన్న వాక్యం చూడగానే రాజు గుర్తొచ్చి ప్రత్యేకంగా ఇండియా ప్రయాణంలో రాజుని కలిసి 'ఆనాటి వానచినుకులు' వెనుక కథని తెలుసుకోవడంతో బోల్డంత నాటకీయతతో ముగుస్తుందీ కథ.

వంశీ రాసిన 'ఆనాటి వానచినుకులు' కథ లేకపోతే, ఈ కథ లేదన్న విషయం రెండు కథలూ చదివిన వాళ్లకి సులభంగా అర్ధమయ్యే విషయం. ఎటొచ్చీ వంశీ కథలో పాత్రలు నేలమీద నడిస్తే, తాజా కథలో పాత్రలు నేల విడిచి కనిపిస్తాయి. గోపాలాన్ని రిక్షా నడుపుకునే వ్యక్తిగా అంగీకరించగలం కానీ, రాజు వేషభాషలకీ అతని వృత్తికీ ఏమాత్రం పొసగదు. గోపాలం తనకి ఇష్టమైన వాక్యాన్ని తన వంకర టింకర అక్షరాలతోనే రిక్షా వెనుక రాసుకున్నాడు. రాజు మాత్రం, నెలకో వాక్యం - అది కూడా 'ఆనాటి వానచినుకులు' మినహా మిగిలినవన్నీ కవులవీ, సినీ కవులవీ - డబ్బిచ్చి రాయిస్తూ ఉంటాడు. రెండు కథల మధ్యా పోలిక కేవలం యాదృచ్చికం అని సరిపెట్టుకుందాం అని చాలా ప్రయత్నించాను కానీ, నావల్ల కాలేదు.

ఆదివారం ఆంధ్రజ్యోతి వాళ్ళు పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకునే విషయంలో మరింత శ్రద్ధ  తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

12 వ్యాఖ్యలు:


 1. మీ పోస్టు ఎవరో ఒక మిత్రుడు చూసి నాకు నిన్న పంపించాడు. నాకు ఇన్నాళ్ళూ ఈ విషయం తెలీదు. తెలుసుంటే అప్పుడే స్పందించేవాణ్ణి.
  సాధారణంగా ఇలాంటి అభిప్రాయాలకి జవాబులివ్వడం నాకు అలవాటు లేదు. కానీ మీరు "కాపీ కథ" అంటూ నింద వేసారు కాబట్టి ఈ జవాబు.

  మీరు చెప్పిన వంశీ గారి కథ "ఆనాటి వాన చినుకులు" నాకూ బాగా తెలుసు. ఆయన కథకి ప్రేరణా, ప్రోద్బలం వచ్చింది వేమూరి సత్యనారాయణ గారు.
  చాలా ఏళ్ళ క్రితం "జ్యోతి" అనే మాస పత్రిక వచ్చేది. దాని సంపాదకులు ఆయన. గోదారి జిల్లాల్లో గూడు రిక్షాలు ఉండేవి. ఇప్పటికీ ఉన్నా, వాటిని ఆటోలు ఆక్రమించుకున్నాయి.
  ఒక గూడు రిక్షా వెనుక "ఆనాటి వాన చినుకులు" అని ఒక శీర్షిక చూసి, వేమూరి గారు - "ఎంతో భావుకత ఉన్న రిక్షావాడుకదా?" అని మురిసి పోయి అది వంశీకి చెబితే ఆయన అదే మకుటంగా కథ రాసారు. ఇది జరిగి చాలా ఏళ్ళయ్యింది.
  అదే మకుటంతో ఓ పది మంది రచయితల చేత కథలు రాయించి ఒక పుస్తకంగా తీసుకురావాలన్నది వారి ఆలోచన. ఆయ్న క్రితం ఏడాది నన్ను సంప్రదించి కథ రాయమని అడిగారు. నేను పుట్టి పెరిగింది కోనసీమ కావడం వలనా, అలాంటివి చూడడం వలనా, సరే రాసిస్తానని అన్నాను. అది రాసాక ఆంధ్రజ్యోతికి పంపితే వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళకీ ఈ నేపథ్యం అంతా తెలుసు. నేనూ చెప్పాను కూడా. వాళ్ళకి అభ్యంతరం లేదనుకుంటేనే వాళ్ళూ ప్రచురిస్తారు. నాతోనే కాదు, కొంతమంది రచయిత్రుల చేత కూడా ఇదే మకుటం మీద కథ రాయించారు. ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలొ మరో కథ కూడా వచ్చింది.

  కథ నచ్చడం, నచ్చకపోవడం అన్నది పాఠకుల ఇష్టం. దానికి నాకేమీ అభ్యంతరాలు లేవు. అందరికీ అన్నీ నచ్చాలని కూడా లేదు.
  కథ అచ్చాయ్యాక అది పాఠకుల సొంతం కాబట్టి వాళ్ళు ఎలాగైనా స్పందిచే అవకాశం వుంది. అది నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే రచయితగా కంటే ముందు నేనూ ఒక పాఠకుణ్ణే. ఆ ఎరుక నాకు ఎప్పుడూ ఉంది.

  మీరు ఆరోపించినట్లు నేనెవరికథా కాపీ కొట్టి రాయలేదు. పక్కవాడి పళ్ళెంలో ఎంగిలి తినాలసినంత ఖర్మ నాకు లేదు.
  గూడు రిక్షాలు అంతమయిపోయాయి కాబట్టి పాతికేళ్ళ నాటి సంఘటనగా కథ చెప్పడంతప్పించి గత్యంతరం లేదు. అందుకే కథ గతంలో జరిగినదే చెప్పాను.


  కథ మీద మీ అభిప్రాయం మీ ఇష్టం. కానీ నింద మాత్రం ఆవేశం.

  -సాయి బ్రహ్మానందం గొర్తి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @సాయి బ్రహ్మానందం గొర్తి: రచయితల్లో అసహనాన్ని మాత్రమే చూస్తున్న కాలంలో, పాఠకుల అభిప్రాయాలకి విలువ ఇచ్చే కథా రచయిత తారస పడడం సంతోషంగా ఉందండీ..
  కథ ఎలా రాయాలి అన్నది పూర్తిగా రచయిత (త్రి) ఇష్టం.. ప్రచురించే విషయంలో విలువలు పాటించడం పత్రికల వాళ్ళ బాధ్యత.. మంచి కథలు, వైవిద్యభరితమైన కథలు తరచుగా ఇచ్చే ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఈ కథ రావడమే నాకు బాధ కలిగించింది.
  వేమూరి సత్యనారాయణ గారు 'ఆనాటి వానచినుకులు' అని టాపిక్ ఇచ్చి రాయమని ఉంటారు తప్ప, రిక్షా అతని కథనే అందరూ రాయాలని చెప్పి ఉండరని నాకనిపించింది, మీరు రాసింది చదివాక. కోనసీమ రిక్షాలు మీకు తెలుసు కాబట్టి మీరూ అదే ఆలోచన చేసినా, మీకన్నా చాలా ముందు వంశీ నుంచి కథ వచ్చేసింది కాబట్టి పాఠకులకి అది కాపీ అనే అనిపిస్తుంది. వంశీ కథతో చాలా దగ్గరి పోలికలున్న కథ రాసి కూడా (వంశీ సృష్టించిన గోపాలం పాత్ర చాలా ఉదాత్తంగా ఉంది) 'నింద' అనీ 'ఆవేశం' అనీ 'ఆరోపణ' అనీ మీరనడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.
  వీలయితే, మీ మిత్రులనెవరినన్నా రెండు కథలూ ప్లస్ నేను రాసిందీ చదివి నిజాయితీగా వాళ్ళ అభిప్రాయం చెప్పమని అడగండి.. మీర్రాసింది చదివిన తర్వాత కూడా ఈ కథ విషయంలో నా అభిప్రాయంలో ఎలాంటి మార్పూ లేదు.. మరీ ముఖ్యంగా నా ఫిర్యాదు ఆంధ్రజ్యోతి వాళ్ళ మీదే..
  ...ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @మురళి - మీకనిపించిందంతా నిజం కాదు. వేమూరి గారు ఏం రాయమన్నారో, ఏం చెప్పారో మీకెలా తెలుసు? మీ ఊహని నిజం చెయ్యాలన్న తాపత్రయం ఎందుకు?
  వంశీ కథనీ, నా కథనీ పోల్చడం, నచ్చడాలూ, నచ్చకపోవడాలతో, ముఖ్యంగా నాకు పని లేదు. కోనసీమ రిక్షాలు తెలిసి కాదు, ఆయన అదే సందర్భం రాయమంటేనే రాసాను. మిగతా కథలూ కొన్ని వస్తాయి. అందులోనూ ఇది ఉంటుంది. వంశీ కథకీ, నా కథకీ పోలిక లేదు, ఒక్క రిక్షా వెనుక రాసింది తప్ప.
  కథ రాసాకా వేమూరి గారికీ, ఆంధ్రజ్యోతి వారికీ అన్నీ తెలుసని చెప్పాక కూడా మీరు మీ వాదననే పట్టుకు వేలాడుతున్నారు.
  మీరు వేసింది నింద - ముఖ్యంగా కాపీ కథ అని. దానికి వత్తాసుగా మీరు రాసిన పోస్టే పెద్ద ఆరోపణ.
  కథ మీకు నచ్చకపోవడం, మీ అభిప్రాయమూ మీ సొంతం. దానికెప్పుడూ అభ్యంతరం లేదు నాకు.
  కథలు రాయడం వరకే నా పని. పాఠకుల అభిప్రాయాలకి నిజాయితీ అన్నది ఆపాదించండం నా పని కాదు. నచ్చిందీ, నచ్చలేదూ. ఇంతకుమించి మూడోది వుండదు.
  "కాపీ కథ" అన్నది నింద కాదని మీరు సమర్థించుకోవడం cop out.
  Thanks

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సృజనకీ (భావుకతకీ), విజ్ఞానానికీ సంబంధం లేదన్నది వంశీ కథా నేపథ్యం.

  సాహిత్యం పట్ల అవగాహన వుండీ, జీవితం పట్ల ఒక దృక్పథం వుండీ, ప్రేమించిన యువతి దూరమయ్యి సంస్కారంగా విడిపోయినా, బలహీన క్షణల్లో ఎంత వాళ్ళయినా తొట్రుపాటు పడతారు. ఆ కుదుపు నుండి కోలుకున్నాక వాళ్ళని అది అనుక్షణం బాధిస్తూనే ఉంటుంది; ఎంత కుసంస్కారంగా ప్రవర్తించానా అని. అదీ నా కథా నేపథ్యం.
  రెండూ ఒకటే ఎలా అవుతాయి? రిక్షా వెనుక శీర్షిక ఒకటే రెంటికీ ఉన్నా సారూప్యం.

  మీరు కథ కాపీ అని నిర్ణయించేసుకుని మీకనిపించింది రాసేసుకున్నారు. మీ పోస్టు హెడ్డింగే - కాపీ కథ. పైగా నేను రెండు కథలూ ఎవరికైనా ఇచ్చి వారి అభిప్రాయం తెలుసుకోవాలన్న సలహా ఒకటి.

  మీది ఆవేశంతో కూడిన నింద తప్ప ఏమీ లేదు. పైగా పత్రికల వాళ్ళమీద ఫిర్యాదు కూడా. వాళ్ళకి నా కథా నేపథ్యం చెప్పానన్నా కూడా మరలా అదే పాత పాట.

  ఇప్పటికే చాలా ఎక్కువ రాసాను. ఇహ ముందుకు సాగడం అనవసరం.

  -సాయి బ్రహ్మానందం గొర్తి

  ప్రత్యుత్తరంతొలగించు

 5. @సాయి బ్రహ్మానందం గొర్తి: "వేమూరి గారు ఏం రాయమన్నారో, ఏం చెప్పారో మీకెలా తెలుసు?" -నేను ఆంధ్రజ్యోతి చందాదారుడిని కనుక, ఆదివారం ఆంధ్రజ్యోతి క్రమంతప్పకుండా చదువుతాను కనుక, ఈమధ్య వచ్చిన కొన్ని నాస్టాల్జియా చదివాను కనుక, మీరు ఇచ్చిన వేమూరి సత్యనారాయణ రిఫరెన్స్ ను బట్టి ఆయన రాయమన్నవి నాస్టాల్జియా కథలు అయి ఉంటాయి అనుకున్నాను.. మిగిలిన వాళ్ళెవరూ రిక్షా అతని మీద కథలు రాయలేదు కనుక, సబ్జెక్టు 'రిక్షావాలా' అయిఉండదు అని అర్ధమయింది కాబట్టి.

  "వంశీ కథకీ, నా కథకీ పోలిక లేదు, ఒక్క రిక్షా వెనుక రాసింది తప్ప" - మీర్రాసింది వంశీ కథకి పేలవమైన కాపీ అనీ, వంశీ ఆ కథ రాసి ఉండకపోతే, మీ కథ నడక ఇలా ఎంతమాత్రమూ ఉండేది కాదని నేను నమ్ముతున్నాను.

  "...మీరు మీ వాదనని పట్టుకుని వేలాడుతున్నారు. మీరు వేసింది నింద - ముఖ్యంగా కాపీ కథ అని. దానికి వత్తాసుగా మీరు రాసిన పోస్ట్ పెద్ద ఆరోపణ" - నింద, ఆరోపణ కాదు, బలమైన నమ్మకం. ఆ నమ్మకానికి ఆధారం వంశీ రాసిన ఒరిజినల్ కథ 'ఆనాటి వానచినుకులు.'

  "సృజనకీ (భావుకతకీ) ....... రెండూ ఒకటే ఎలా అవుతాయి?" -చదువుకీ-సంస్కారానికీ-భావుకతకీ సంబంధం లేదని నిరూపించే గోపాలం పక్కన, 'పశు ప్రవృత్తి' అన్న మాట ఉపయోగిస్తే పశువులు కూడా సిగ్గు పడతాయేమో అనిపించే విధంగా ప్రవర్తించిన రాజుని - కాపీని నిరూపించడం కోసమైనా - నిలబెట్టాల్సి రావడం నిజంగా దురదృష్టం.. గోపాలం చాలా ఉదాత్తమైన పాత్ర.. రెండు పాత్రల స్వభావం కచ్చితంగా ఒకటి కాదు.

  "పైగా పత్రిక వాళ్ళ మీద ఫిర్యాదు కూడా" -నా ఫిర్యాదు కచ్చితంగా పత్రిక వాళ్ళమీదే. పత్రిక్కి చందా కట్టేది కేవలం ఆ పత్రికకి ఉన్న ఇమేజి చూసి. దాన్ని వాళ్ళు పాడుచేసుకుంటున్నారన్నదే నా ఫిర్యాదు. ఏదైనా రాసే హక్కు రచయితలకి ఉన్నట్టే, ఎంచి ప్రచురించాల్సిన బాధ్యత పత్రిక్కి ఉంది.

  "ఇహ ముందుకు సాగడం అనవసరం" - నిజమే.. ఇవే విషయాలు చర్విత చర్వణం అవ్వడం తప్ప ఉపయోగం ఏముంది? ఇందుకు వెచ్చించే కాలాన్ని మీరో నాలుగు కథలు రాయడానికి, నేనో రెండు కథలు చదువుకోడానికి ఉపయోగించుకుందాం.

  చివరగా, మీరన్న"cop-out" గురించి ఎవరన్నా పబ్లిగ్గా ఇక్కడ మాట్లాడతారేమో చూడాలి.. Thank you

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @మెయిల్స్ పంపుతున్న బ్లాగు మిత్రులకి: మీ మద్దతుకి చాలా సంతోషం.. హృదయపూర్వక కృతజ్ఞతలు.. వీలయితే ఇక్కడ కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇక్కడ వ్యాఖ్యానించడం నేను చేసిన పొరపాటు. "కాపీ" అన్న పదం చూసి ఈ వ్యాఖ్యలన్నీ రాయాల్సి వచ్చింది.
  వ్యక్తిగతంగా మిమ్మల్ని కించపరచలేదు. గౌరవంగానే రాసాను.
  ఇంతవరకూ రాసిన దాంట్లో నేనెక్కడా మీకు సలహాలు ఇవ్వలేదు.
  నేను నాలుగు కథలే రాస్తానో, నా సమయన్ని ఎలా వెచ్చించుకుంటానో మీకు అనవసరం.
  గౌరవం లేని చోట చర్చకి ఆస్కారం ఉండదు.
  కుందేటికి నాలుగు కాళ్ళూ ఉంటే ఉండచ్చు, కానీ నే పట్టిన దానికి మాత్రం మూడే అన్నట్లుగా సాగింది మీ సమర్థన.
  బ్లాగులో ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవచ్చు.
  శలవ్!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @సాయి బ్రహ్మానందం గొర్తి: ఒక రచయితని కథలు రాయమనడం అగౌరవము, కించపరచడము, సలహాలు ఇవ్వడమూనా?!!
  "ఇప్పటికే చాలా ఎక్కువ రాసాను. ఇహ ముందుకు సాగడం అనవసరం" అన్నది మీరే..
  చర్చని ముగించదల్చుకుంటే అది మీ ఇష్టం.. అందుకోసం ఇన్ని మాటలనాలా?!!
  ఇక, ఎటూ కుందేలు ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి, ఒక కాలు విరగ్గొట్టయినా సరే కుందేటికి ఉన్నవి మూడే కాళ్ళని నిరూపించాలని మీరు తాపత్రయ పడుతున్నట్టు నాకనిపిస్తోంది.
  శలవ్!!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. రెండు కథలూ చదివి ఉండడం వలన ఇక్కడ మాట్లాడుతున్నాను.

  ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడడానికి మునుపే, కథకుడి నోటే 'ఆ నాటి చెలిమి ఒక కల' కథ గురించి విని ఉన్నాను. రిక్షా వెనుక 'ఆనాటి వానచినుకులు' అన్న అక్షరాలు అనే స్టోరీలైన్ విన్న క్షణమే నాకు వంశీ కథ గుర్తురావడం, ఈ రెండూ ఒకటి కాదని బ్రహ్మానందం గారు నాతో అనడం జరిగింది.

  కథలో పాత్రలు, సంఘటనల్లో తేడా ఉన్నా.. రెండు కథలకీ కీలకమైన గూడు రిక్షా వెనక ఏవే అక్షరాలు ఉండడం వలన, వంశీ కథ ముందుగా వచ్చి ఉండడం వలన పోలిక తప్పదు. ప్రచురించబడిన వెంటనే చదివాక రెండు కథలకు ఉన్న పోలికలు, బేధాల గురించి మిత్రులతో చర్చ నడిచింది.

  ఇక్కడ కామెంట్లలో జరిగిన చర్చ చదివాక నా అభిప్రాయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

  వేమూరి గారు ఇచ్చిన టాపిక్ గురించి, తెలిసి కూడా ఆంధ్రజ్యోతి వారు దానిని ఏమాత్రం ప్రస్తావించకుండా కథ ప్రచురించడం మౌలికమైన తప్పిదం. చదివిన పాఠకుడికి ఎవరికైనా ఠక్కున వంశీ కథ గుర్తు వచ్చి తీరుతుంది. సదరు వేమూరి గారు గూడు రిక్షా వెనుక రాసిన అక్షరాలు అంశంగా ఇచ్చారో, కేవలం 'ఆనాటి వానచినుకులు' అన్న మాట ఇచ్చారో తెలియని పాఠకుడు కథ చదివి తనకు తోచిన మాట తాను అనుకోవడంలో, పత్రిక మీద ఆగ్రహం ప్రకటించడంలోనూ ఏమాత్రం తప్పులేదు.

  వేమూరి గారి మాట పట్టుకుని రాసిన మిగిలిన తొమ్మిది మంది రాసిన కథల్లోనూ కూడా గూడురిక్షా వెనుక అక్షరాలు ఉంటే తప్ప.. అంశం ఏదో తెలుసుకునే అవకాశం పాఠకులకెక్కడిది?

  కాబట్టి.. నా కంప్లైంటు కూడా ఆంధ్రజ్యోతివారి మీదే..

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @కొత్తావకాయ: ఎవరైనా రచనలపోటీ లాంటిది పెట్టేప్పుడు, ఏదన్నా ఇతివృత్తం ఇచ్చి రాయమంటారు తప్ప 'ఫలానా కథ లాంటి కథే రాసి పంపండి' అని అనరుకదా అన్నది నా సందేహం అండీ.. ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చేసినట్టుంది.. లేదూ, వాళ్ళ స్టాండర్డ్స్ కూడా ఏమన్నా మారుతున్నాయో.. ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు


 11. వామ్మొ వామ్మొ ఒక వారమ్ నిదురోతే యిన్ని మసాలా సమ్ "కతలు" జరిగాయా ! తెలియక పోయెనే నేనూ నారదా అని ఉంటా :) జెకె :)

  BTW, ఆ కథల చదవబుల్ లింకులు పెడితే చదివి మేము కూడా చెప్పొచ్చు గదండీ మా అభిప్రాయాలు ?

  లింకించండి కథలవి చదివి చెప్పేస్తాం అవునో కాదో


  జిలెబి

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @Zilebi: 'ఆకుపచ్చని జ్ఞాపకం' అనే కథా సంకలనంలో 'ఆనాటి వానచినుకులు' కథ చదవొచ్చండీ.. 'ఆనాటి చెలిమి ఒక కల' కథ ఆదివారం ఆంధ్రజ్యోతి నవంబర్ 27, 2016 సంచికలో ప్రచురితమైంది.. రెండూ చదివి మీ అభిప్రాయం పంచుకోండి.. ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు