బుధవారం, ఆగస్టు 10, 2016

మనమంతా

తెలుగు సమాజంలో బాగా పెరిగిన మధ్యతరగతి వర్గానికి తెలుగు తెరమీద మాత్రం సరైన ప్రాతినిధ్యం కనిపించడం లేదు గత కొన్నేళ్లుగా. అసలు సినిమా కథలే నేల విడిచి సాము చేస్తున్న పరిస్థితుల్లో, మధ్యతరగతి వాస్తవ పరిస్థితులని ప్రతిబింబిస్తూ ఓ సినిమా రావడం విశేషమైతే, ఎక్కడా అనవసరమైన మెలోడ్రామాకి చోటివ్వకుండా, అత్యంత సహజంగా సినిమాని తీర్చిదిద్దడం మరో విశేషం. మనకి తెలిసిన మనుషులే తెరమీద కనిపించే ఆ సినిమా పేరు 'మనమంతా.' చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి సంస్థ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో నిర్మించి తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం ఇంకో విశేషం.

ఇది నలుగురి కథ. నలుగురూ మధ్య తరగతి జీవితానికి ప్రతినిధులే. ఎవరి పరిధిలో వాళ్లకి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడులూ ఉంటాయి వీళ్లందరి కథలూ కంచికి చేరుతూనే ఓ మంచి సినిమాని చూసిన అనుభూతిని మిగులుస్తాయి ప్రేక్షకులకి. సాయిరాం (మోహన్ లాల్), గాయత్రి (గౌతమి), అభిరామ్ (విశ్వాంత్), మహిత (రైనా రావు) ల కథ ఇది. వీరిలో, ఓ సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే సాయిరాంకి మేనేజర్ అవ్వాలన్నది లక్ష్యం. చదివిన చదువు మర్చిపోయి గృహిణిగా మారిపోయిన గాయత్రికి చుట్టూ ఉన్నవారి నుంచి గౌరవం అందుకోవాలన్నది కోరిక.

తెలివైన విద్యార్థి అభిరామ్, ఉన్నట్టుండి ప్రేమలో పడి, ఆ ప్రేమని నిలబెట్టుకోడం కోసం శ్రమిస్తూ ఉంటాడు. ఇక, అందరిలోకీ చిన్న పిల్ల మహిత కి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచడం అంటే ఇష్టం. రోజురోజుకీ పెరిగే ఆర్ధిక అవసరాలు, సాయిరాం కోరికని 'లక్ష్యం' గా మారుస్తాయి. తప్పని పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి అడ్డదారి తొక్కి, అటుపై చిక్కుల్లో పడతాడు. మధ్యతరగతి నుంచి కాస్త పైకెదిగి, నలుగురి చేతా భేష్ అనిపించుకోవాలని కలలుకనే గాయత్రికి ఉన్నట్టుండి ఓ పెద్ద అవకాశం తలుపు తడుతుంది. కానీ, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఎన్నో సందేహాలు. తాను ప్రేమించిన అమ్మాయి తనని కూడా ప్రేమిస్తోందన్న అతి నమ్మకంతో ఉన్న అభిరామ్ కి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి.


ఇక, తన శక్తికి మించి స్నేహితుడికి సాయం చేయాలని ప్రయత్నించిన మహిత ఓ చిక్కుముడిని విప్పాల్సి వస్తుంది. నిజానికి ఈ నలుగురి కథల్లోనూ కొంత నాటకీయతకి చోటిచ్చిన కథ మహితదే. వయసుకి మించిన పరిణతి, బాధ్యత చూపించే ఈ అమ్మాయి ఎవరికైనా సాయం చేయడానికే కాదు, అవసరమైనప్పుడు సాయం పొందడానికీ వెనుకాడదు. సాయిరాం సమస్యని మహిత పరిష్కరిస్తే, మహిత సమస్య సాయిరాం ద్వారా పరిష్కరింపబడుతుంది. గాయత్రిని గురించి ఆమె కుటుంబం తీసుకున్న నిర్ణయం ఒక్కటే నన్ను కన్విన్స్ చేయలేకపోయింది. బహుశా అందువల్లనే కావొచ్చు, ముగింపుని నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ఆస్వాదించినంతగా నేను చేయలేకపోయానేమో.

మణిరత్నం 'యువ' నుంచి ప్రవీణ్ సత్తారు 'చందమామ కథలు' వరకూ ఈ తరహా కథనం తెలుగు తెరకి కొత్త కాదు. నాలుగు కథల్ని వేర్వేరుగా చూపిస్తూ, ఆ నాలుగింటి ముగింపుకీ ఓ అందమైన ముడి వేయడం ద్వారా తన సినిమా, ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేశాడు. సాయిరాం గా నటించిన మోహన్ లాల్ నటనకి వంక పెట్టలేం కానీ, సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ ప్రేక్షకుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. సినిమా మొదలైన కాసేపటికి కానీ ఆ డబ్బింగ్ కి అలవాటు పడలేం. గాయత్రి పాత్రకి గౌతమి సరైన ఎంపిక. తెరపై ఆమె కనిపించినంత సేపూ మనకి తెలిసిన మధ్యతరగతి మహిళలు గుర్తొస్తూనే ఉంటారు. ముఖ్యంగా నగల షాపు సన్నివేశాల్లో ఆమె నటన గుర్తుండిపోతుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మహితగా నటించిన రైనా రావు, దాసుగా కనిపించిన అయ్యప్ప పి. శర్మ గురించి.. (అయ్యప్పని ఇతని సోదరుడు 'బొమ్మాళి' రవిశంకర్ గా పొరబడి మొదట ఇలా రాశాను:  'అరుంధతి' డబ్బింగ్ ఎంత పేరు తెచ్చిందో, ఈ సినిమాలో నటనా అంతటి పేరు తెచ్చే అవకాశం ఉంది రవికి). గాయత్రి స్నేహితురాలిగా తెరమీద కనిపించినంత సేపూ ఊర్వశి నవ్విస్తుంది. గొల్లపూడి, ఎల్బీ శ్రీరామ్, పరుచూరి వెంకటేశ్వర రావు, నాజర్ ఇతర పాత్రల్లో కనిపించారు. మహేష్ శంకర్ సంగీతం సన్నివేశాల తాలూకు మూడ్ ని ఎలివేట్ చేసింది. మొదటి సగంతో పోల్చినప్పుడు రెండో సగంలో కథనం నెమ్మదించింది అనిపించింది. మొత్తంమీద,  మధ్యతరగతి తమని తాము ఐడెంటిఫై చేసుకునే సినిమాని అందించిన చంద్రశేఖర్ యేలేటిని అభినందించాల్సిందే..

10 వ్యాఖ్యలు:

 1. థియేటర్ మొత్తంలో పాతికమంది ఉండడం చూసి బాధేసింది,తెలుగు సినిమా పరిస్థితికి జాలేసింది,సినిమా చూసాక సంతోషం వేసింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగా చెప్పారు. బెంగుళూరులో మంగళవారం రాత్రి 9.30 గంటల ఆటకి కూడా జనం బాగానే వచ్చారు, అది చూసి సంతోషంగా అనిపించింది. చిన్న సవరణ అండీ, దాసు పాత్రధారి రవిశంకర్ కాదు అయ్యప్ప పి. శర్మట.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. దాసు పాత్రధారి రవిశంకర్ కాదు అయ్యప్ప పి. శర్మట.అందరూ సోదరులేలెండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కానీ గాయత్రి కోరుకున్నది కూడా అదే అని అనిపించిందండీ.. అలా అనిపించడానికి కూడా బాగానే పునాదులు వెశాడు డైరెక్టర్... ఆవిడకి ఒకసారి అవేర్నెస్ వచ్చాక తరచి చూస్తే అవకాశాలు అవే కనిపిస్తాయని కూడా సరిపుచ్చుకోవచ్చు. రివ్యూ చాలా బాగా రాశారు.

  పప్పుగారన్నట్లు మొన్న ఆదివారం మోర్నింగ్ షోకి నేవెళ్ళినపుడు దీనితో రిలీజైన మరో సినిమా హౌస్ ఫుల్ అయితే ఈ హాలు పావువంతు కూడా నిండకపోవడం చూసి బాధేసింది. మోహన్ లాల్ ని చూసి ఆటో అతను డబ్బింగ్ సినిమానా అని అడగడం కొసమెరుపు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Nenu mumbai lo untanu maku repu release avutundi. Kachitanga chustanu. trailer chusinappudu anipinchindi mohan lal kakunda inkevari chetanaina dubbing cheppinchalsindi ani. Thanks for the review.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ సినిమా చూసాక, 'చందమామ కథలు' చూశానండీ. నాలుగే కథలు తీసుకోవడం వలననుకుంటా.. 'మనమంతా' కొంచెం ఎక్కువ గ్రిప్పింగ్ గా అనిపించింది. గౌతమి విషయం నాక్కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించలేదండీ. 'ఆర్నెల్లలో వచ్చేస్తానుగా.. ' అని ఒక టైం ఎలాగూ ఇచ్చింది కనుక ఆ అవకాశమేదో సద్వినియోగం చేసుకుని ఉంటే బావుండేదేమో. (మరీ ప్రాక్టికల్ ఏమో నా ఆలోచనలు..) :)

  ప్రత్యుత్తరంతొలగించు


 7. @శ్రీనివాస్ పప్పు: నాకు మోహన్ లాల్ ని తెరమీద చూసినప్పుడల్లా మన తెలుగు హీరోలెవరన్నా ఆ పాత్ర చేసి ఉంటే బాగుండేది కదా అనిపించిందండీ.. అంతలోనే, ఫ్యాన్స్ ఒప్పుకోరన్న విషయం కూడా గుర్తొచ్చేసింది.. ..ధన్యవాదాలు..
  @సుభద్ర వేదుల: సరి చేశానండీ, ధన్యవాదాలు.. పెద్దగా ఖర్చు చేయలేదు కాబట్టి, పెట్టిన డబ్బు వచ్చేసే ఉంటుందండీ నిర్మాతలకి..
  @వేణూ శ్రీకాంత్: మోహన్ లాల్ ని చూడగానే నాకూ అదే ఫీలింగ్ అండీ (డబ్బింగ్ సినిమా). అతను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనుకోడం బానే ఉంది కానీ, మరికొంచం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేదనిపించిందండీ.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @అశోక్: అవునండీ.. మోహన్ లాల్ డబ్బింగ్ ఒక్కటే సమస్య.. ..ధన్యవాదాలు..
  @కొత్తావకాయ: 'చందమామ కథలు' లో ఒకట్రెండు కథలు తగ్గించుకుంటే బాగుండేదని అనిపించిందండీ అప్పట్లో.. ఇక ఈ సినిమా విషయంలో, గౌతమి పాత్ర ముగింపు తప్ప మిగిలినదంతా బావుంది నాకు.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. mee review chadivi movie ippude chusanandi.. inta andamyna cinema ni parichayam chesinanduku thanks. chala nachindi movie.

  ప్రత్యుత్తరంతొలగించు