శనివారం, సెప్టెంబర్ 03, 2011

ఓల్గా నుంచి గంగకు

కంటికి ఎదురుగా కనిపించే వాటిని అలక్ష్యం చేయడం, దొరకని వాటికోసం వెతుకులాడడం ఈరెండూ కూడా మానవ సహజ గుణాలే అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడూ ఎదురయ్యే అనుభవాలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో ఏళ్ళుగా రాహుల్ సాంకృత్యాయన్ రాసిన 'ఓల్గా నుంచి గంగకు' పుస్తకాల షాపుల్లో డిస్ప్లే లో చూస్తూనే ఉన్నాను. ఎందుకో తెలీదు కానీ, ఎప్పుడూ చదవాలని అనిపించలేదు. కనీసం పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, పేజీలు తిప్పిన పాపాన పోలేదు.

ఆమధ్యన ఆచార్య తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీనుంచి హరప్పాదాక' చదువుతుండగా, అందులో రాహుల్జీ ప్రస్తావనా, 'ఓల్గా నుంచి గంగకు' ప్రస్తావనా కొన్ని చోట్ల కనిపించింది. రాహుల్ గొప్ప పండితుడనీ, 'ఓల్గా నుంచి..' తప్పక చదవాల్సిన పుస్తకమనీ రామచంద్ర రాసింది చదివాక, మొదటిసారిగా ఈ పుస్తకం చదవాలని అనిపించింది. సరిగ్గా అప్పుడే పుస్తకం ప్రింట్ అయిపోయింది! మొన్న మొన్నే కొత్త ప్రింట్ రావడంతో నాకు ఈ రచనని చదివే అవకాశం దొరికింది.

క్రీస్తు పూర్వం ఆరువేల సంవత్సరాల కాలం నుంచి, క్రీస్తుశకం 1942 వరకూ జరిగిన కాలంలో ఇండో యూరోపియన్ జాతి మానవ సమాజ వికాసాన్ని ఇరవై విడి కథల ద్వారా నిశితంగా చిత్రించారు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషల్లో పండితుడూ, చరిత్రకారుడూ అయిన రాహుల్ సాంకృత్యాయన్. వోల్గా తీరపు మంచు ఎడారి నేపధ్యంగా తీసుకుని రాసిన తొలి కథ 'నిశ' తో మొదలు పెట్టి సోవియట్ ని కాపాడడం కోసం యుద్ధంలో చేరిన 'సుమేరుడు' కథ వరకూ కథలన్నీ ఊపిరి బిగపట్టి చదివించేవే.

తొలి కథల్లో ఆర్యుల సంస్కృతిని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు రాహుల్. స్త్రీ కుటుంబ పెద్దగా ఉండడం, ఆమె సారధ్యంలో కుటుంబం యావత్తూ వేటకి వెళ్ళడం, ఆమె తనకి ఇష్టమైన పురుషుడితో -సోదరుడు, కుమారుడు ఇలా చుట్టూ ఉన్న అందరూ - కూడి సంతానాన్ని వృద్ధి చేయడంతో మొదలుపెట్టి, కుటుంబంలో వచ్చిన చీలికలు, సమూహాలు, వాటి మధ్యన ఆధిపత్యపు పోరు, జీవికని వెతుక్కుంటూ సమూహాలు చేసే మజిలీలు, నెమ్మది నెమ్మదిగా సంస్కృతిలో మార్పులు వచ్చి పురుషుడు కుటుంబ పెద్ద అవ్వడం, వివాహ వ్యవస్థ, స్త్రీ స్థానం తగ్గుతూ పోవడం ఇవన్నీ మొదటి ఆరు కథల్లోనూ చిత్రించారు.

ఒకరి చేత పాలింపబడడం అనేది ఆర్యులకి ఏమాత్రమూ నచ్చని విషయం. కానీ, అనార్యులకి పాలనా వ్యవస్థ ఉంది. ఈ రెండు వర్గాల మధ్యనా యుద్ధాలు జరగడం, ఆర్యులు బలహీన పడడం కాలక్రమంలో జరిగింది. ఇంతలోనే రాజుని తమ చెప్పు చేతల్లో పెట్టుకునే పురోహిత వర్గం బలపడడం, వేదాలు అందుకు దోహదం చేయడం జరిగిందంటారు రాహుల్. సమాజంలో అసమానతలకి మతమే ప్రధాన కారణమనీ, రాజులూ, పురోహితులూ కలిసి ఈ మతాన్ని ప్రజలపై రుద్ది వారిని బానిసలుగా మార్చారని చాలా గట్టిగా చెప్పారు.

రాజు-పురోహితుడు-మతం ఈ మూడూ కలిసి సమాజ వికాసాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని చెబుతూ, రాజ్యాల మధ్య జరిగిన యుద్దాలనీ, వాటిమీద మతం ప్రభావాన్నీ ఉదాహరణలుగా చూపించారు. బౌద్ధం స్థాపన, విస్తరణ, క్షీణత, దేశం మీద జరిగిన దండయాత్రలు, ఇస్లాం స్థాపన, విస్తరణ, కంపెనీ పాలనలో భారత దేశం, ఆసమయంలో క్రైస్తవం ప్రభావం ఇవన్నీ కథల్లో అంతర్భాగాలుగా ఉంటూనే, మతం పరిణామ క్రమాన్ని సులువుగా అర్ధం చేసుకోడానికి సాయపడతాయి పాఠకులకి.

ఈస్టిండియా కంపెనీ కాలంలో జమీందారీలని ఏర్పరచడం వల్ల రైతులకి ఎదురైన ఇబ్బందులు, సామంత రాజుల బలహీనతల్ని ఆంగ్లేయులు సొమ్ము చేసుకోవడం, సిపాయిల తిరుగుబాటు, మంగళ్ పాండే తదితరుల పాత్ర, తిరుగుబాటు వైఫల్యం మొదలు, గాంధీజీ మొదలు పెట్టిన ఉద్యమం-దానిని వ్యతిరేకించే వర్గం అభిప్రాయాల వరకూ ఏకబిగిన సాగి, సామ్యవాదం మాత్రమే సమాజాన్ని బాగు పరచగలదనే బలమైన అభిప్రాయంతో ముగుస్తుందీ రచన. ఒక్క మాటలో చెప్పాలంటే, వేల ఏళ్ళ దేశ చరిత్రని కేవలం మూడొందల పైచిలుకు పేజీల్లోనే కళ్ళకి కట్టడం ద్వారా కొండని అద్దంలో చూపారు రచయిత.

పుస్తకాన్ని గురించి మొదట చెప్పుకోవాల్సింది చదివించే గుణం. ఒకసారి చదవడం మొదలు పెట్టాక ఎక్కడా కూడా పక్కన పెట్టాలనిపించదు. రచయిత అభిప్రాయాలతో ఏకాభిప్రాయం కుదిరినప్పుడూ, కుదరనప్పుడూ కూడా ఒకే వేగంతో చదివిస్తుందీ పుస్తకం. ఉత్తరాంధ్ర నుడికారం కనిపించినప్పుడు, అనువాదం ఎవరు చేశారా? అన్న సందేహం కలిగి పేరు చూశాను. విఖ్యాత కథకుడు చాసో కుమార్తె, రచయిత్రీ చాగంటి తులసి ఎంతో సరళంగా తెనిగించారీ పుస్తకాన్ని. ఎక్కడో తప్ప అనువాదమన్న భావన కలగదు. వేటాడి పచ్చి మాంసాన్ని భుజించడం మొదలు, తెల్లవాడిపై తుపాకీ ఎత్తడం వరకూ జరిగిన మన పూర్వుల వికాసాన్నీ, పరిణామ క్రమాన్నీ చూపించే పుస్తకమిది. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 160).

13 కామెంట్‌లు:

  1. పుస్తకం పేరు, అందులో విషయానికి అతికినట్టున్న ముఖచిత్రం, చాసో గారమ్మాయి అనువాదం, వాటికి మించి తిరుమల రామచంద్ర గారికి నచ్చిందంటే ఇంకా ఆసక్తి కలుగుతోంది ఈ పుస్తకంపై. మీరు రుచి చూసి పరిచయం చెయ్యడం ఎంత గొప్ప సౌలభ్యమో, పుస్తకం కొనే ముందు పది సార్లు ఆలోచించే నాబోటి వాళ్ళకు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. నిజమే మీరన్నట్లు నేనూ " ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో ఏళ్ళుగా రాహుల్ సాంకృత్యాయన్ రాసిన 'ఓల్గా నుంచి గంగకు' పుస్తకాల షాపుల్లో డిస్ప్లే లో చూస్తూనే ఉన్నాను. " కొనాలనుకుంటూ వాయిదా వెయ్యడం ఎందుకో తెలీదు. మొన్నెక్కడో ఫుట్ పాత్ పై వీరి పాత పుస్తకాలు కనిపిస్తే ఒకేసారి మూడు తెచ్చాను. మీ రివ్యు చదివాక తప్పకుండా చదవాలనిపిస్తుంది. ఎప్పటికయ్యేనో ఏమో? మీ రివ్యు బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. కంటికి ఎదురుగా కనిపించే వాటిని అలక్ష్యం చేయడం, దొరకని వాటికోసం వెతుకులాడడం ఈరెండూ కూడా మానవ సహజ గుణాలే అనిపిస్తుంది నాకు.

    - అక్షర సత్యాలు!

    నేనూ చదువుతా ఈ పుస్తకం అయితే..

    రిప్లయితొలగించండి
  4. పాశ్చాత్యులు, ముఖ్యంగా ఆంగ్లో జెర్మన్ జాతులవారు కొలోనియల్ కాలంలో ధ్రువపరిచిన ప్రపంచ చరిత్రకి ఒక ప్రత్యామ్నాయాన్ని సూచింస్తుంది ఈ పుస్తకంలోని కథల వరుస. నిజంగా చరిత్ర ఇలాగే జరిగిందా - చెప్పలేము. కానీ ఇలా కూడా జరిగి ఉండవచ్చు అనిపించక మానదు.
    తొలికథల్లో స్త్రీ కుటుంబ పెద్దగా ఉన్న జాతులవారు ఆర్యులా, ఆర్యుల పూర్వులా అన్నది చెప్పడం కూడా కష్టం. ఆ విషయంపై సాంకృత్యాయన్ ఏమీ వ్యాఖ్య చేసినట్టు గుర్తు లేదు. చదివి చాలా ఏళ్ళయింది.

    రిప్లయితొలగించండి
  5. నేను ఆర్యుల చరిత్రను కథలుగా మలిచే ప్రయత్నం చేశాను. ఇదే పని ద్రావిడ జాతి గూర్చి గానీ ప్రపంచంలో మరే ఇతర జాతిని గురించైనా చెయ్యొచ్చు, చెయ్యాలి అంటారు రాహుల్ సాంకృత్యాయన్. అలా ఎవరైనా పండితులు చేస్తే బావుణ్ణని చాలా కాలం అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  6. ఈ పుస్తకం చదివారు బావుంది కానీ ఇదే చరిత్ర అని నమ్మకండి. అక్కడక్కడా తన సొంత అభిప్రాయాలని చరిత్రగా చొప్పించే ప్రయత్నం చేశారు రచయిత.

    ఉదా: సారిపుత్తప్రకరణం వ్రాసిన అశ్వఘోషుడు మొదటి నాటకరచయిత అంటారు రచయిత. కాదు. మనకు తెలిసినంతలో భాసుడు అంతకన్నా పూర్వుడు. బాణభట్టును లేకిగా చూపి, అతడు హర్షుడికి గ్రంథాలను వ్రాసి ఇచ్చినట్టు చెప్పారు. ఇది పచ్చి అబద్ధం.

    రాహుల్ మీద విమర్శ ఎవరో వ్రాశారు. అది చదవండి. అవి అటుంచితే రచయిత శైలి, తదితర విషయాలకు పేరు పెట్టడానికి లేదు.

    రిప్లయితొలగించండి
  7. @కొత్తావకాయ: మిత్రుల వ్యాఖ్యలు కూడా దృష్టిలో పెట్టుకుని ఎంచుకోండి.. భిన్నాభిప్రాయాలు తెలుసుకునే వీలుకూడా ఉంది కదండీ ఇక్కడ.. ధన్యవాదాలు.
    @భాను: చదివించే గుణం పుష్కలంగా ఉన్న పుస్తకమండీ.. మనం మొదలు పెడితే చాలు.. ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ: తప్పక చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @కొత్తపాళీ: ఐదో కథకి 'ఇండో ఆర్యన్' జాతి అన్నారండీ.. తోలి కథ ఇండో యూరోపియన్, రెండో కథ హిందూస్తాన్, మూడు, నాలుగు కథల్లో ఇండో ఇరానియన్ జాతి అని చెప్పారు రాహుల్.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: ద్రవిడ జాతిని గురించి తమిళ సాహిత్యంలో కొన్ని పుస్తకాలున్నాయని విన్నానండీ.. అనువాదాల మీద దృష్టి పెడితే దొరకొచ్చు ఏవన్నా.. ధన్యవాదాలు.
    @రవి: ఈ పుస్తకం అనే కాదండీ, చరిత్రకి సంబంధించిన ప్రతి పుస్తకాన్నీ చదివేటప్పుడు రచయిత
    దృష్టి కోణాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ఈ పుస్తకం విషయంలో ఆ కోణం ఏమిటన్నది సులభంగానే అర్ధమయ్యింది... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. మురళి గారూ! మంచి సమీక్ష వ్రాశారు. 3 సంవత్సరాలయ్యింది ఈ పుస్తకం కొని. ఇప్పుడు మీ సమీక్ష చదివాక మొదలుపెడుతున్నాను. ధన్యవాదాలు.
    రాజా.

    రిప్లయితొలగించండి
  10. @జీకేఎస్ రాజా: పుస్తకం మాత్రం ఆపకుండా చదివిస్తుందండీ, రచయిత అభిప్రాయాలు మనకి నచ్చడంతో సంబంధం లేకుండా.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  11. సగం అయిందండి పుస్తకం. చరిత్ర పట్ల తక్కువ ఆసక్తి ఉండి, క్లిష్టమయిన, శాస్త్రీయమైన పదజాలంతో పరుగులెత్తలేని నాబోటి సాధారణ పాఠకులకు కధల రూపంలో మానవచరిత్రను ఆసక్తి కలిగించేలా, అవగాహన కలిగేలా క్రమంగా అప్పటినుండి -- ఇప్పటి కాలంవరకూ రచన సాగించడం, సాంకృత్యాయన్ పండితునికే సాధ్యమేమో. మీ వ్యాసం చదవకపోయి ఉంటే, ఎప్పటికి చదివేవాడినో, అసలు చదవలేక పోయేవాడినో! మరోసారి ధన్యవాదాలు మురళి గారూ!

    రిప్లయితొలగించండి
  12. @జీకేఎస్ రాజా: మీరిప్పటి వరకూ చదివి ఉండకపోతే తిరుమల రామచంద్ర గారి 'హంపీ నుంచి హరప్పాదాక' కూడా చదవండి.. మీకు బాగా నచ్చుతుంది..

    రిప్లయితొలగించండి
  13. పుస్తకం ఎక్కడా దొరకడం లేదండీ. అదే ప్రయత్నం లో ఉన్నాను. సూచనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి