బుధవారం, మార్చి 02, 2011

చదువు

తెలుగు పాఠకులు కొ.కు. గా పిలుచుకునే కొడవటిగంటి కుటుంబరావు రచనల్లో నాకు బాగా ఇష్టమైనది 'చదువు.' ఇది కేవలం చదువుపట్ల చిన్ననాటి నుంచే అమితమైన ఆసక్తి కనబరించిన సుందరం కథ మాత్రమే కాదు, రెండు మహా ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఆ యుద్ధాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ లేని ఆంధ్ర దేశంలోని ఓ చిన్న పట్టణంలో ప్రజా జీవితంలో చోటు చేసుకున్న మార్పులని, నాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులనీ నిశితంగా చిత్రించిన నవల.

సుందరం బాల్యం, అతడి అక్షరాభ్యాసంతో మొదలయ్యే కథ అతని కొడుకు అక్షరాలని గుర్తు పట్టడంతో ముగుస్తుంది. సుందరం తల్లి సీతమ్మగారిని వాళ్ళింట్లో వాళ్ళు చదివించలేదు. చదువుమీద ఇష్టంతో ఆవిడే కొంతవరకు చదువు నేర్చుకుంది. తండ్రి శ్రీమన్నారాయణ ఓ చిన్న ఉద్యోగి. కొడుకు చదువు గురించి అతనికి పెద్దగా పట్టింపులేవీ ఉండవు. సీతమ్మగారికి మాత్రం సుందరాన్నిబాగా చదివించాలని ఉంటుంది. ఇందుకోసం ఆవిడ అతనికి బడి అన్నా, చదువన్నా ఇష్టం ఏర్పడేలా చేస్తుంది.

సీతమ్మ గారి కృషి ఫలితంగా, సుందరానికి చదువుమీద ఆసక్తి నానాటికీ పెరిగి, ఎప్పుడెప్పుడు బళ్ళో చేరతానా అని ఎదురుచూడడం మొదలు పెడతాడు. ఘనంగా అక్షరాభ్యాసం చేసి వీధి బళ్ళో చేరుస్తారు అతణ్ణి. బళ్ళో చేరిన రెండో రోజునే చేదు అనుభవం ఎదురవుతుంది సుందరానికి. మేష్టారి కఠిన శిక్ష కారణంగా బడి అంటే భయం ఏర్పడుతుంది. సీతమ్మగారు తనకి వచ్చిన అక్షరాలు, అంకెలు సుందరానికి శ్రద్ధగా నేర్పించడమే కాదు, అతను వేగంగా నేర్చుకుంటుంటే ఎంతగానో సంతోష పడుతుంది కూడా.

తనకి వచ్చిన అక్షరాలు, గుణింతాలు, అంకెలు నేర్పడం పూర్తయ్యాక భర్తకి మళ్ళీ మళ్ళీ చెప్పి ఒప్పించి సుందరాన్ని ఓ మంచి వీధి బడిలో ప్రవేశ పెడుతుంది సీతమ్మ గారు. అక్కడ చదువు పూర్తవ్వగానే అతను నేరుగా హైస్కూలులో ప్రవేశించవచ్చు. వీధిబడిలో సుందరం చదువు పుస్తకాలకి మాత్రమే పరిమితం కాలేదు. నిజం చెప్పాలంటే అప్పటినుంచీ సుందరం కేవలం పుస్తకాలనుంచి మాత్రమే కాక, తన చుట్టూ ఉన్న సమాజం నుంచి తనకి అర్ధమైనన్ని విషయాలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు.

సీతమ్మగారికి ఆడపిల్ల కలగడం, శ్రీమన్నారాయణ 'బెరిబెరీ' వ్యాధితో చనిపోవడం, సుందరం హైస్కూలులో ప్రవేశించడం ఇంచుమించుగా ఒకేసారి జరుగుతాయి. భర్త మరణం సీతమ్మగారిని బాగా కుంగదీస్తే, దానితాలూకు ఫలితం ఏమిటన్నది నెమ్మదిగా అర్ధమవుతూ వస్తుంది సుందరానికి. ఇంటిలో ఓ భాగం అద్దెకి ఇచ్చి, పొలం మీద వచ్చే ఆదాయం జాగ్రత్త చేసీ గుట్టుగా సంసారాన్ని నడపడం మొదలుపెడుతుంది సీతమ్మ గారు. ఆమె సోదరుడు శేషగిరి కొంత సహాయంగా నిలబడతాడు.

సుందరం హైస్కూలు చదువు ముగింపుకి వచ్చేనాటికి యుద్ధం (మొదటి ప్రపంచ యుద్ధం) ముమ్మరమవుతుంది. ఆ ప్రభావం జన జీవితం మీద పడుతుంది. ఖర్చులు రెట్టింపవుతాయి. యుద్ధం ముగియడంతోనే మహాత్ముడి నాయకత్వంలో దేశ స్వతంత్రం కోసం ఉద్యమాలు మొదలవుతాయి. సుందరం స్కూల్ ఫైనల్ అవగానే ఏదన్నా ఉద్యోగం చూసుకుంటే బాగుండును అనుకుంటుంది సీతమ్మగారు. కానీ సుందరం ఆలోచనలు వేరు. అతని దృష్టిలో చదువు ఉద్యోగం కోసం కాదు. చదువు చదువు కోసమే. ఇంకా చదవాలన్నది అతని కోరిక.

స్వభావ సిద్ధంగా కొంత, పరిస్థితుల ప్రభావం వల్ల మరికొంత అంతర్ముఖుడిగా మారిన సుందరం తల్లితో మాట్లాడడం తగ్గించేస్తాడు. అంతే కాదు, తన భావాలని వేటినీ ప్రకటించడు. సుందరం వైఖరి బాధ కలిగిస్తుంది తల్లికి. అతణ్ణి చదువు మానేయమని గట్టిగా చెబుదామంటే, కొడుక్కి చదువుపై ఆసక్తి కలిగించడానికి తను చేసిన ప్రయత్నాలు గుర్తొస్తాయి సీతమ్మ గారికి. మధ్యేమార్గంగా, కొడుక్కి పెళ్ళిచేసి చదువు చెప్పించే బాధ్యతని మావగారికి అప్పగించాలని నిర్ణయించుకుంటుంది ఆవిడ.

కేవలం సుందరం చదువు ఎలా కొనసాగిందన్నది మాత్రమే కాదు, జాతీయోద్యమం ఎలా జగిరింది, అప్పటి గ్రామ రాజకీయాలు, ఆవేశంతో ఉద్యోగాలు వదిలి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఆ తర్వాత పశ్చాత్తాప పడడం, జాతీయ కళాశాలల ఏర్పాటు ఉద్యమం విఫలమైన కారణంగా చదువు మధ్యలోనే ఆగిపోయిన యువత వెతలు, దేశాన్ని పట్టి కుదిపిన ఆర్ధిక మాంద్యం లాంటి ఎన్నో విషయాలని కళ్ళ ముందు ఉంచే నవల 'చదువు.'

సుందరం మితభాషి కావడం వల్ల, సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఉండవు. అయితే అక్కడక్కడా జరిగే చర్చల కారణంగా ఒకే అంశంపై భిన్న కోణాలని, ధోరణులని అర్ధం చేసుకోగలుగుతారు పాఠకులు. సుందరం స్వభావం అతని కుటుంబ సభ్యులకే కాదు, కొన్ని కొన్ని సన్నివేశాల్లో పాఠకులకీ కొరుకుడు పడదు. చదువు మీద అతనికి యెంతో ఆసక్తి, అలా అని చదువు వినా ఇతర విషయాలని పట్టించుకోని వాడు కాదు. కానీ, తామరాకు మీద నీటిబొట్టు చందం.

సుందరం, సీతమ్మలతో పాటు, శేషగిరి, నరుసు, శకుంతల పాత్రలు కూడా చాలాకాలం వెంటాడతాయి. వయసుతో పాటుగా సుందరం ఆలోచనల్లో వచ్చే మార్పుని చాలా చక్కగా అక్షరబద్ధం చేశారు రచయిత. ఒక మధ్యతరగతి నేపధ్యం నుంచి కొన్ని దశాబ్దాల దేశ చరిత్రని పరిశీలించే ఈ నవల, నేను ఎక్కువసార్లు చదివిన పుస్తకాలలో ఒకటి. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 184)

10 కామెంట్‌లు:

 1. టపా చాలా బాగుందండీ. ఇంతకీ మీ బీరువాలో పుస్తకాల సంఖ్య ఏంటో చెప్పరూ..?

  రిప్లయితొలగించు
 2. టాపిక్ చాల ఆసక్తిదాయకంగా ఉందండీ..దొరికితే చదవాలి...

  రిప్లయితొలగించు
 3. నాకు కూడా కొ.కు రచనలలో ఇష్టమైనది 'చదువు'...కథలో అతర్భాగంగా ఉండే రకరకాల చర్చలు, సంభాషణలు బహు ఆసక్తికరంగా ఉంటాయి. కానీ కొరుకుడుపడని విషయం ఒక్కటే...అన్నీ తెలిసిన సుందరం చివరకు ఏమి చెయ్యకుండా మిగిలిపోతాడు...అదొక్కటే కాస్త నిరాశగా అనిపిస్తుంది.

  కొ.కు రచనాశైలి-చదువు గురించి మరొక మంచి టపా మనోజ్ఞ రాసారు...వీలైతే చదవండి

  http://manognaseema.blogspot.com/2010/08/blog-post_6626.html

  రిప్లయితొలగించు
 4. ఎలా నా చేతిలో పడిందో గుర్తులేదు గానీ, చదువు నా (నేను చదివిన) తొలి తెలుగు నవల ! ఎంత నచ్చిందో ! అప్పుడు ఎన్ని సారులు చదివే దాన్నో ! ఈ పుస్తకం ఇప్పటికీ కట్టలు కట్టలుగా కొత్త Stock ఎప్పటికప్పుడు పుసకాల షాపుల్లో కనపడుతూండటం ఆనంద దాయకం.

  రిప్లయితొలగించు
 5. @ప్రణీత స్వాతి: చెప్పుకోదగ్గ సంఖ్యకి ఇంకా చేరలేదండీ :-) ..ధన్యవాదాలు.
  @ఎన్నెల: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
  @ఆ.సౌమ్య: అప్పటి దేశ పరిస్థితి అలాంటిది కదండీ.. మాంద్యం ప్రభావం వల్ల ఉద్యోగాలు లేవు. కానీ ఆకారణంగా అతనికి చదువు మీద విరక్తి కలగదు. ఈ ఆశావహమైన ముగింపు నాకు బాగా నచ్చింది.. మనోజ్ఞా గారి టపా తప్పక చదువుతాను. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 6. @సుమలత: ధన్యవాదాలండీ..
  @సుజాత: నేను చాలా సార్లు చదివానండీ. ప్రతిసారీ అదే ఆసక్తి.. నిజమే.. ఇదొకటీ, 'చివరికి మిగిలేది' ఒకటీ, షాపుల్లోకి వెళ్ళగానే పలకరిస్తాయి మనల్ని.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 7. @వెంకట్ సరయు: ధన్యవాదాలండీ.. మీ వ్యాఖ్యలు పొరపాటున స్పాం లోకి వెళ్ళిపోయాయి.. ఇప్పుడే గమనించి ఇటు పట్టుకొచ్చాను..

  రిప్లయితొలగించు
 8. వర్ణమాల మాత్రమే నేర్చిన కొడుకు, పలక మీద తల్లి పేరు రాసేనన్నప్పుడు, ఇంకా గుణింతాలూ, సంయుక్తాక్షరాలు తెలియని బిడ్డ ఎలా రాసుంటాడనుకుంటుంది. కానీ, ఆ చిన్నారి "అంమ" అని రాసి, మనని సున్నితంగా స్పృశిస్తాడు.

  చాలా చక్కగా పరిచయం చేసేరు.

  రిప్లయితొలగించు