సోమవారం, అక్టోబర్ 18, 2010

రాజేశ్ కి అభినందనలు...

అనంతపురం జిల్లాకి చెందిన యువ గాయకుడు రాజేశ్ కుమార్ కి అభినందనలు. ఈటీవీ నిర్వహించిన 'పాడుతా తీయగా' కార్యక్రమం ఫైనల్స్ లో ప్రధమ విజేతగా నిలిచిన రాజేశ్, సిని నటుడు చిరంజీవి చేతుల మీదుగా పది లక్షల రూపాయల బహుమతిని అందుకున్నారు . గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాత మరియు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతమూ ఆసక్తికరంగానూ, మునుపటి సిరీస్ కన్నా కొంచం వైవిధ్యంగానూ సాగింది.

రాజేశ్ తనకి చిన్నప్పటి నుంచీ సంగీతం అంతే మక్కువ అనీ, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాననీ, ఘంటసాల, బాలూలు తన అభిమాన గాయకులనీ ఫైనల్స్ కి ఎంపికైన సందర్భంగా చెప్పారు. రాజేశ్ చేసిన నిరంతర సంగీత సాధన సత్ఫలితాన్నే ఇచ్చింది. 'పాడుతా తీయగా' ప్రారంభించిన నాటినుంచీ ప్రతి సిరీస్ లోనూ ఫైనల్స్ కి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని ఎంపిక చేసి వారిలో ఒక అబ్బాయినీ, అమ్మాయినీ విజేతలుగా ప్రకటించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సిరీస్ లో అందుకు భిన్నంగా ముగ్గురు అమ్మాయిలు - లిప్సిక, మల్లిక, సబీహ - ఒకే అబ్బాయి రాజేశ్ ఫైనల్స్ కి ఎంపికయ్యారు.

సెమి-ఫైనల్స్ వరకూ ఖమ్మం జిల్లాకి చెందిన లిప్సిక, కడపకి చెందిన సబీహాల మధ్య 'నువ్వా-నేనా' అన్నట్టుగా జరిగిన పోటీ సరళి, ఫైనల్స్ కి వచ్చేసరికి అనూహ్యంగా మలుపు తిరిగి, రాజేశ్-లిప్సిక ల మధ్య పోటీగా మారింది. బాలసుబ్రహ్మణ్యం అభిమాన గాయని అయిన లిప్సిక విజేతగా ఎంపికవుతుందన్న నా అంచనాని తారుమారు చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. లిప్సిక రెండో స్థానంలో నిలిచి ఐదు లక్షల రూపాయల బహుమతిని అందుకున్నారు. మల్లిక, సబీహ లు వరుసగా మూడు నాలుగో స్థానాల్లో నిలిచారు.

నిజానికి నేనీ కార్యక్రమం క్రమం తప్పకుండా చూడడానికి కారణం సబీహ. ఈమె గొంతుని "మధుర స్వరం" అనడానికి సందేహం అనవసరం. ఈ పోటీలో తను పాడిన పాటల్లో "ఈ ఎర్రగులాబీ.." పాట ఇష్టమని సబీహ చెప్పారు. నాకు మాత్రం బాపు-రమణ ఎపిసోడ్ లో పాడిన "నిదురించే తోటలోకి.." చాలా చాలా నచ్చింది. సాఫీగా సాగిపోయే పాటలని అలవోకగా పాడేసే సబీహాకి, హుషారైన పాటలు పాడడం కొంచం కష్టమైన విషయం అనిపించింది, ఈమె పాడిన కొన్ని పాటలు విన్నప్పుడు. ఫైనల్స్ లో రెండు రౌండ్స్ లో హుషారైన గీతాలు పాడాల్సి రావడం సబీహకి మైనస్ గా మారిందని అనిపించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఆలస్యంగా (ఈ మధ్యనే) మొదలు పెట్టడం మరో మైనస్ అయ్యింది.

లిప్సిక గొంతులో మాధుర్యం పాళ్ళు తక్కువే అయినా, హుషారైన పాటలు పాడడం లో లిప్సిక ప్రతిభని తక్కువ చెయ్యలేం. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీత నేర్చుకోవడం ఈమె ప్లస్ పాయింట్. గొంతులో ఉండే కొద్దిపాటి జీర, పాటని అనుభవిస్తూ పాడే విధానం లిప్సిక ప్రత్యేకతలు. ఒక ఎపిసోడ్ లో ఈమె 'మానసవీణ మధుగీతం...' పాట పాడినప్పుడు న్యాయనిర్ణేత బాలూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం, సెమి-ఫైనల్స్ లో ఒక రౌండ్ లో నూటికి నూరు మార్కులు ఇవ్వడం (పోటీల్లో, ముఖ్యంగా సెమి-ఫైనల్స్ దశలో ఇలా వందశాతం మార్కులు రావడం చాలా అరుదు) లిప్సిక ప్రతిభకి, ఈమె గళం పట్ల బాలూ అభిమానానికీ నిదర్శనం అని చెప్పాలి.

ప్రారంభపు ఎపిసోడ్లలో సాధారణంగానే పాడిన గుంటూరు జిల్లాకి చెందిన గాయని మల్లిక క్వార్టర్ ఫైనల్స్ నుంచి తన కృషిని రెట్టింపు చేశారు. ఎక్స్ ప్రెషన్ ని అలవోకగా పలికించడం ఈమె గళానికి ప్రత్యేకం. బహుమతి ప్రధానానికి చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం వల్ల అప్పటివరకూ సాఫీగా సాగిన కార్యక్రమంలో ఒక్కసారిగా హడావిడి చోటు చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో హంగామా సృష్టించారు. ఒక సంగీత కార్యక్రమంగా 'పాడుతా తీయగా' ని తీసుకున్నప్పుడు, ముగింపు అసమగ్రంగా, అసంతృప్తిగా అనిపించింది.

మిగిలిన చానళ్ళలో వచ్చే సిని సంగీత కార్యక్రమాలతో పోల్చినప్పుడు ఇప్పటికీ 'పాడుతా తీయగా' చాలా రెట్లు నయం అనిపిస్తుంది నాకు. ఎస్సెమ్మెస్ల బెడద, ఎలిమినేషన్ తాలూకు అనవసర నాటకీయ దృశ్యాలు వంటి వాటికి అతీతంగా సాఫీగా సాగడమే ఇందుకు కారణం. ఈసారి కార్యక్రమంలో గాయనీ గాయకుల విషయంలో ప్రాధమిక దశ నుంచే క్వాలిటీ తగ్గిందన్నది చాలా చోట్ల వినిపించిన మాట. ఎంపికైన వారు 'జిల్లాకి ఒక్కరు' అనిపించేలా లేరన్నది ఫిర్యాదు. అలాగే మార్కులని మరికొంచం పారదర్శకంగా ఇస్తే బాగుంటుంది. కనీసం క్వార్టర్ ఫైనల్స్, కీలకమైన సెమి-ఫైనల్స్ దశలో అయినా మార్కులకి సంబంధించి మరికొంచం వివరణ జోడించడం అవసరం. అనవసరపు మసాలాలు ఏవీ చేర్చకుండా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని ఆశిస్తూ...

16 కామెంట్‌లు:

  1. ఓ రాజేష్ గెలుచుకున్నాడా, రాజేష్ కు అభినందనలు. నేను కూడా లిప్సిక అభిమానినే తనే గెలుస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను. రాజేష్ పాట ప్రొఫెషనల్ గా డ్యూటీ చేస్తున్నట్లు పాడితే లిప్సిక చాలా ఇన్వాల్వ్ అయి పాడుతుంది అందుకే తనపాట మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. మల్లిక సబీహల విషయంలోకూడా నా అంచనా తారుమారైంది. సబీహ ముందుంటుంది అనుకున్నాను.

    చివరి రెండు వారాలు చూడటం నాకు వీలుపడలేదు. వెంటనే అప్డేట్ తెలియచేసినందుకు నెనర్లు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  2. చాలా చక్కటి రివ్యూ.. నేను ఎప్పుడూ రియాలిటీ షోలకి దూరం గా ఉంటూ వచ్చాను.. కానీ ఇది ఒక ఎక్ సెప్షన్! నేను ఈ ప్రోగ్రాం గురించి అనుకున్న విషయాలే చెప్పారు, మెరుగ్గా.. అందంగా..
    ఇంకో విషయం నాకు నచ్చినది.. ఈ పోటీ కి వచ్చిన గెస్టులు,,,. వాళ్ళతో మాట్లాడుతూ.. ఎన్నో విషయాలు ఎస్ పీ బీ చెప్పటం..

    రిప్లయితొలగించండి
  3. ముందుగా రాజేష్‍గారికి అభినందనలు.గాయకులంతా విజయనగరం,శ్రీకాకుళం,రాజమండ్రి తదితర కోస్తా ప్రాంతాలనుంచే ఎక్కువగా వస్తున్నారు మా అనంతపురం జిల్లానుంచి గాయకులనేవారే లేరా అనుకునేవాణ్ణి కానీ నా అనుమానాన్ని పటాపంచలు చేస్తూ గత సంవత్సరం శ్రీనిధి,ఇప్పుడు రాజేష్ మొదటి స్థానాల్లో నిలవడం చాలా ఆనందకరమైన విషయం.

    రిప్లయితొలగించండి
  4. నిజానికి నేనీ కార్యక్రమం క్రమం తప్పకుండా చూడడానికి కారణం సబీహ....

    నేను కూడా! ప్రొఫెషనలిజాన్ని సంతరించుకోని ఒక స్వచ్ఛత సబీహ గొంతు సొంతం! పచ్చి పాల లాంటి ఆ raw ness ఆమె గొంతులో ప్రత్యేకం!

    మొత్తం మీద ఈ సారి పోటీలో శాస్త్రీయ సంగీతం బేస్ గా గల వాళ్ళు తక్కువమందే ఉన్నారు. మల్లిక గొంతులో expressions పలకడానికి గల కారణం కూడా ఆమె స్టేజ్ (ఆర్కెస్ట్రా) సింగర్ కావడమే!

    సబీహాకు కూడా మైనస్ పాయింట్ ఇదే! శాస్త్రీయ సంగీతం పునాది కొద్దిగా అయినా ఉంటే పద్యాల వంటి రౌండ్లు పాడేటపుడు సంగతులు, గమకాల విషయంలో ఇబ్బంది పడకుండా ఉండేది. అయినా కూడా లవకుశ లోని సీత పద్యాన్ని మల్లిక కంటే కూడా సబీహానే బాగా పాడిందని, నాకూ బాలూకి కూడా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  5. rajesh geluchukovadam naaku aaschryamanipincha ledu.kaaranam atadu finals varaku raavadame vinta.kevalam oka maga potidarudu vundalani vunchinatlugane nenu bhavinchanhindi.finalslo lipsika leda sabiha vastarani bhavinchamu.variddarilo evariki vacchina parvaledu.rajeshki ravadam ematram sariayindikadu.Naa abhiprayamto modatinundi programmeni chustunna veekshakulu angikaristaru.u.cheppukodagga sravyatagani,mecchukodagga spashtatagani atani patalo kanpinchaledu,vinipinchaledu.Inka cheppalante s.p.b. okinta lipsikaku,sabihaku nyayam cheyaledani anipinc

    రిప్లయితొలగించండి
  6. నేను కూడా నిన్న విజేతని చూసి ఆశ్చర్యపోయా. రాజేష్ ని అస్సలు ఊహించలేదు. నా వోటు ఎప్పుడూ లిప్సికా కే, సబీహ సెకండ్ అయినా వస్తుంది అనుకున్నా. అంచనాలనీ తారుమారు చేస్తూ విజేతలను ప్రకటించారు.

    మీరన్నట్టు ముగింపు హడావుడిగా జరిగింది, కార్యక్రమం సమగ్రంగా అనిపించలేదు.

    ఒక్కమాట చెప్పుకోవాలి. ఒక్క ఇంగ్లీషు పదం కూడా వాడకుండా చిరంజీవి ఎంతచక్కగా తెలుగులో ఉపన్యాసం ఇచ్చాడో, చాలా ముచ్చటేసింది. "అపరిమితమయిన" "నిర్వీర్యమయిపోతున్నాయి" "కలివిడితనం"...లాంటి పదాలు వింటున్నప్పుడు చెవుల్లో తేనె పోసినట్టనిపించింది. అలా చక్కని తెలుగు మాట్లాడే నటులు ఇక మనకి రారేమో.

    రిప్లయితొలగించండి
  7. dear murali garu,
    great show and good review. but comparitivley earlier shows exhibits better standareds. rajesh pickupped during last stages (he scored good marks in aAtaryami song)and lipsica might have chosen a better song for final.any how congratulations to winners

    రిప్లయితొలగించండి
  8. నేను తప్పకుండా చూసే టి వి కార్యక్రమం ఇదొక్కటే.
    నిజానికి వాళ్ళు పాడే పాటలకంటే మధ్యలో బాలు గారు చెప్పే సంగతులే ఆసక్తికరంగా ఉంటాయి.
    నేను మల్లిక విజయం సాధిస్తుందనుకున్నాను ఎందుకంటే అందరికంటె ఆమె సీనియరులా అనిపించారు.
    తరువాత స్థానం లిప్సికకి ఇవ్వవచ్చు.
    కాని రాజేష్ గెలవడం ఆశ్చర్యమే.
    సబీహ కూడా కొన్ని పాటలు చాలా బాగా పాడింది.

    రిప్లయితొలగించండి
  9. నేను లిప్సిక, మల్లిక లలో ఒకరిని ఎక్స్పెక్ట్ చేశా! సబీహ గొంతు చాలా చాలా నచ్చేసింది కానీ ఆ అమ్మాయి పాడేప్పుడు మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా బ్లాంక్ గా పెట్టి పాడుతుంటే పాటని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని.. రాజేశ్ మంచి సింగర్ అనడంలో సందేహం లేదు కానీ ఎందుకో ఈ అమ్మాయిల హవాలో అతనికి మొదటి స్థానం రాదేమో అనిపించింది.. మొత్తానికి అందరిని ఆశ్చర్యపరుస్తూ టైటిల్ గెలుచుకున్న అతనికి శుభాభినందనలు..

    త్వరలో చిన్నపిల్లల పాడుతా తీయగా మొదలవబోతోందంట.. Can't wait for that! :-)

    రిప్లయితొలగించండి
  10. నేను ఈప్రోగ్రాంమొదలయ్యింది అనితెలిశాక బహుశా కామ్ల్ హాసన్ రౌండునుంచి అనుకుంటా టీవీ, టాటాస్కైపెట్టించుకున్నాను. రాజేష్ గెలుస్తాడని మొదట్నుంచి అనుకునేవాడిని. అతనిలో ప్రొఫెషనలిజం బాగా ఉందండీ. మగపిల్లలకు స్వరస్థానాలను అందుకోవడంలో సహజంగా ఉండె ఇబ్బందే ఇతనికి అప్పుడప్పుడూ ఎదురయ్యి మార్కులు తగ్గేవి.
    మిగతావాళ్ల విషయానికొస్తే లిప్సిక సెమిఫైనల్ నుంచి అలిసిపోయినట్టుగా అనిపించింది. సబీహ వాళ్ళ అన్నయ్యగురించి చెప్పినప్పుడు కొంచెంబాధేసింది. ఆఅమ్మాయి కొన్నిరకాలపాటలనుపాడలేదన్న సంగతి తెలిసినా ఇంప్రూవ్ చేసుకోలేదనిపించింది. నాకుమాత్రం తనుపాడిన స్నేహమేనా జీవితం సూపర్. అప్పట్నుంచి ఫాన్ అయిపోయా. మల్లికను అస్సలు ఊహించి ఉండరన్నుకుంటా. ఒక్కొక్కంచెలో చాలాబాగా మెరుగుపడింది. నేను గీత అని మెదక్ నుంచి వచ్చింది ఆమెను ఫైనల్స్ వరకూ వస్తుంది అనుకున్నా. మా అమ్మఫేవరెట్.
    ఇక చిరంజీవి రావడం కాకతాళీయం.
    http://swarnmukhi.blogspot.com/2010/07/blog-post_827.html

    రిప్లయితొలగించండి
  11. @వేణూ శ్రీకాంత్: అవునండీ.. ఊహించని విధంగా :-) యూట్యూబ్ లో విడియోలు దొరుకుతున్నట్టున్నాయండీ.. ధన్యవాదాలు.
    @కృష్ణ ప్రియ: నిజమండీ.. అతిధులతో మాట్లాడుతూ బాలూ చాలా చక్కని విషయాలు చెప్పారు, "ఆపాట నాకిస్తే ఇంకా బాగా పాడేవాడిని" వంటివి మినహా :-) ..ధన్యవాదాలు.
    @చిలమకూరు విజయమోహన్: అనంతపురం అనగానే నాకు వజ్రాలు గుర్తొస్తాయండి.. వజ్రాల్లాంటి కళాకారులు కూడా ఉన్నారు కదూ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @సుజాత: "పచ్చి పాల లాంటి రా నెస్.." నేను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన భావాన్ని చాలా చక్కగా అక్షరీకరించారండీ.. గొంతులో ఎక్స్ ప్రెషన్ ని పలికించ లేక పోవడమే సబీహాకి మైనస్ అని నా నమ్మకం.. ధన్యవాదాలు.
    @మోహన్: నేనుకూడా సెమి-ఫైనల్స్ వరకు సబీహ లేదా లిప్సిక అనే అనుకున్నానండీ.. ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: భాష బాగుందండీ.. పాల్గొన్న నలుగురినీ పరిచయం చేసుకుని మాట్లాడతాడు అనుకుంటే తనేమో ఎక్కడెక్కడికో వెళ్లి పోయాడు :( ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @రత్నాజి: నిజమేనండీ.. ఈసారి గాయనీగాయకుల ఎంపికలోనే క్వాలిటీ తగ్గింది.. లిప్సిక తో పాటు సబీహా కూడా పాటల ఎంపిక మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనిపించింది నాకు.. ధన్యవాదాలు.
    @బోనగిరి: మల్లిక పెర్ఫార్మన్స్ చివరి రౌండ్స్ లో బాగుందండీ.. బాలూ వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి ఒక ప్లస్ పాయింట్.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @నిషిగంధ: అమ్మాయిల హవాలో రాజేష్ కి అవకాశం తక్కువ అని నేనూ అనుకున్నానండీ.. కానీ బాలూ మనందర్నీ ఆశ్చర్య పరిచారు.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: గీతకి శాస్త్రీయ సంగీత నేపధ్యం లేకపోవడం మైనస్ అండీ.. లిప్సిక, సబీహ పాటల ఎంపికలో పొరపాట్లు చేశారండి.. మీ టపా బాగుంది, నేను మిస్సయ్యాను... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. hello murali garu,
    mi anlasyes bagundi.nenu sabeha gelushtuandi modatinunchi expect chesa.kania rajesh finals lo baga padi gelchukunnadu. mi blog lo nenu chadavani postlu chaala vunnayandi.elagina ivla chaduvudmanai decide ayya.

    రిప్లయితొలగించండి
  16. ముందుగా రాజేష్ కి అభినందనలు.నాక్కూడా పాడుతా తీయగా ప్రోగ్రాం అంతే ఇష్టం..ఏడుపులూ ,తిట్టుకోవడాలు వంటివి లేకుండా హుందాగా ఉంటుంది. సబీహ రెండు లేక మూడో స్థానంలో ఉంటుందనుకున్నా...ప్చ్ ..కాస్త నిరాశ కలిగింది.
    ప్రోగ్రాం విషయంలోచివరి పేరాలోని సూచనలు బావున్నాయి....ప్రోగ్రాం గురించి చక్కగా వివరంగా ప్రస్తావించారు.

    రిప్లయితొలగించండి