శుక్రవారం, అక్టోబర్ 08, 2010

వానగోదారి

ఆకాశం మబ్బుపట్టి ఉంది. ఉదయం కరిగి మధ్యాహ్నం మొదలవ్వబోతున్న వేళైనా వాతావరణం చల్ల చల్లగా ఉంది. ఉండుండి వీస్తున్నగాలి హాయిగొలుపుతోంది. మరి కాసేపట్లో గోదారి బ్రిడ్జి చేరుకోబోతున్నా. వర్ష ఋతువు కదూ.. ఎర్రెర్రని నీళ్ళతో కళకళ్ళాడిపోతూ ఉండి ఉంటుంది గోదారమ్మ. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఒక్కో ఋతువులోనూ ఒక్కో అందం మా గోదారిది. వేసవి వేడికి చిక్కిపోయిన గోదారే, నాలుగు వానలు పడేసరికి పెద్దరికం తెచ్చేసుకుని నిండు ముత్తైదువలా గాంభీర్యాన్ని ప్రదర్శించేస్తూ ఉంటుంది.

మాటల్లోనే వచ్చేసింది గోదారి బ్రిడ్జి. ఎక్కడా..యెర్ర నీళ్ళు కనపడవే? వరదల్లో భయపెట్టిన ఉగ్రరూపం ఆనవాళ్ళుకూడా లేవిప్పుడు. అచ్చం ఏమీ తెలియని నంగనాచిలా చూస్తోంది అందరికేసీ. నీళ్ళు నిశ్చలంగా, తేటగా ఉన్నాయి. ఆకాశంలో పరుగులు తీస్తున్న నల్ల మబ్బుల నీడలు అద్దంలాంటి గోదారి నీళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. చుట్టూ కొబ్బరి చెట్లు అంచు కడితే, మధ్య మధ్యలో పైకి తేలిన ఇసుక పర్రలూ, ఇక్కడోటీ అక్కడోటీగా తిరుగుతున్న పడవలూ చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లా మార్చేశాయి గోదారిని.

అరె.. మధ్యాహ్నం కాబోతుండగా ఇప్పుడు చలేస్తోందేమిటి? జర్కిన్ తెచ్చుకోవాల్సింది. బలంగా వీచిన గాలికి అనుకుంటా నిశ్చల చిత్రంలా అనిపించిన గోదారిలో కదలికలు కనిపించాయి. నీళ్ళలో కనిపిస్తున్న మబ్బుల తాలూకు నీడల ఆకృతుల్లో మార్పులు వచ్చేస్తున్నాయ్. ఏం జరుగుతోందబ్బా? ఠప్ ఠాప్ మంటూ నెత్తిమీద పడ్డ రెండు వాన చినుకులు జరుగుతున్నదేమిటో చెప్పకనే చెప్పాయి. చూస్తుండగానే, జ్ఞానం తెలియని పసివాడు తన రెండు చేతుల్నీ రకరకాల రంగుల్లో ముంచి వాటిని మళ్ళీ ఆర్టు పేపర్ మీద పెట్టినట్టుగా.. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే మాడరన్ ఆర్టులా మారిపోయింది గోదారి.

పడవలో నల్ల గొడుగు తెరుచుకుంది. సరంగు బహుశా చుట్ట కాల్చుకుంటూ ఉండి ఉంటాడా? నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. చినుకులకి తడుస్తున్నానన్న స్పృహ నాకు కలగక ముందే వాన ఆగిపోయింది. క్రమ క్రమంగా మాడరన్ ఆర్టు నిశ్చల చిత్రంగా మారుతోంది. మరి కాసేపు వర్షం పడితే ఎలా ఉండేదో? చినుకులు ఆగిపోయాయనడానికి సాక్ష్యంగా ఓ పక్షుల గుంపు శక్తి మేరకి ఎగురుతూ గోదారి దాటే ప్రయత్నం చేస్తోంది. ఉన్నట్టుండి మబ్బు చాటు నుంచి సూరీడు మెరిశాడు. ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు.. అదీ గోదారి మీద.. సౌందర్యానికి ఇంతకన్నా అర్ధం ఏముంటుంది?

ప్రయాణం సాగుతూ ఉండగానే రోజు ముగింపుకి వచ్చేసింది. సూరీడు మబ్బు దుప్పటి వదలక పోవడంతో గడియారం చూస్తే కానీ సమయం తెలియడం లేదు. గోధూళి వేళ.. కానీ గోవులూ లేవు, ధూళీ లేదు. ఉన్నదంతా బురదే. మళ్ళీ గోదారి. పూటన్నా గడవక ముందే మళ్ళీ ఏం చూస్తావ్? అనలేదు తను. ఎంతసేపు చూసినా అదివరకెరుగని కొత్తదనం ఏదో ఒకటి తనలో కనిపిస్తూనే ఉంటుంది. అందుకే మళ్ళీ చూడడం. నిజం చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ చూడడం. వాన ఉద్ధృతంగా పడుతోందిప్పుడు. నింగినీ నేలనీ ఏకం చేస్తున్న వాన. రెయిన్ కోట్ నన్ను తడవనివ్వడం లేదు.

నల్లని ఆకాశం నుంచి తెల్లని వాన నీటి ధారలు నల్లని గోదారిలోకి చేసే ప్రయాణాన్ని చూడాల్సిందే. అప్పుడప్పుడూ మెరిసే మెరుపుల్లో ఈ నీటి ధారలు వెండి దారాలేమో అనిపిస్తోంది. పడవలు ఒడ్డుకి వచ్చేశాయ్. గొడుగుల జాడ లేదు. రంగురంగుల వర్ణ చిత్రంలోని రంగులన్నింటినీ కృష్ణవర్ణం తనలో కలిపేసుకుంది. ఇప్పుడు గోదారి కేవలం నలుపు తెలుపుల సమ్మేళనమే. చూస్తుండగానే చిన్న చిన్న ఇసుక పర్రలు మరింత చిన్నవై, ఇక అంతకన్నా చిన్నవి కాలేక గోదారిలో కలిసిపోయాయి మౌనంగా. సూర్యుడు అస్తమించేసినట్టున్నాడు. ఛాయామాత్రంగా అయినా కనిపించడం లేదు. దట్టంగా అలుముకున్న చీకటి వానగోదారిని తనలో కలిపేసుకుంది.

12 వ్యాఖ్యలు:

 1. చాలా బాగుంది. వానలో తడుస్తున్న గోదావరిని కళ్ళముందు సాక్షాత్కరింపచేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పడవలో నల్ల గొడుగు తెరుచుకుంది. సరంగు బహుశా చుట్ట కాల్చుకుంటూ ఉండి ఉంటాడా? నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. బాగుందండి మీ వానగోదారి వర్ణన ,అనుభవం .
  నాకు గోదారి అంటే చాలా ఇష్టం.ఎప్పుడ చూసినాకొత్తగా ఉండి అందమైన అనుభూతి నిస్తుంది. మీది ఏ ఊరు మురళీ గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. దసరా ప్రయాణమా లేక సరదా ప్రయాణమా మురళి గారూ ..ఏది ఏమైనా చినుకుల నడుమ గోదారి... ఇంద్ర ధనుస్సును కళ్ళముందు ఆవిష్కరించారు. గోదావరిని ఎంత చూసినా తనివి తీరదండి...థాంక్స్ :):)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీరు చూపించిన ఈ సౌందర్యాన్ని నా కళ్ళు కలకాలం మళ్ళీ మళ్ళీ తలుస్తూనే ఉంటాయి మురళి గారు. చిరుజల్లుల్లో తడిసి మురిపాలు పోయిన గోదారమ్మ ఆనందం నేను కూడా ఎంతగానో అనుభవించాను. ప్రకృతిలో మమేకమైన ఆ ఆనందం వర్ణనాతీతం. వాన జల్లులకి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధం ఏనాటికీ పూర్తిగా తెలుసుకోలేనిది.... అలాగే వానకి, గోదారికీ... మీకూ ఉన్న సంబంధం కూడా.....:)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అద్భుతమైన వర్ణ చిత్రాన్ని, అందం పోకుండా, అందులోని చిత్రాకారుడి ఆత్మని చెక్కుచెదరనీకుండా పదాల్లోకి తర్జుమా చేసినట్టుంది...సూపర్బ్...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @వేణూ శ్రీకాంత్: గోదారిని చూసొచ్చాక నాకేమనిపించిందో అక్షరాల్లో పెట్టాలని అనిపించిందండీ.. ఆ ప్రయత్నమే ఇది.. ధన్యవాదాలు.
  @హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
  @రాధిక(నాని): ఆయ్.. మాది కోనసీవండి బాబూ.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @శిశిర: ధన్యవాదాలండీ..
  @పరిమళం: రెండూ కాదండీ.. ఓ అత్యవసర ప్రయాణం.. ధన్యవాదాలు.
  @జయ: నిజమేనండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @శేఖర్ పెద్దగోపు: ఇది మీ మార్కు వ్యాఖ్య అండీ.. ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: స్వర్ణముఖి తొణికిసలాడక పోతుందా.. మేము చూడక పోతామా చెప్పండి? ..ధన్యవాదాలు.
  @సవ్వడి: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు