ఆదివారం, అక్టోబర్ 10, 2010

తోడికోడలు

కుటుంబ బంధాల్లో చాలా చిత్రమైన బంధం తోడికోడలు. అప్పటివరకూ ఒకరికొకరు ఏమాత్రం తెలియని స్త్రీలు, ఒకే కుటుంబంలోని అన్నదమ్ములని వివాహం చేసుకున్న కారణంగా ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్ళుగా కలిసి ఉండాల్సిన పరిస్థితి. అంతే కాదు, ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఒక కుటుంబం కలిసి ఉండడంలోనూ, విడిపోవడంలోనూ కూడా ప్రధాన పాత్ర పోషించింది తోడికోడళ్ళే. ఈ బంధాన్ని కథావస్తువుగా తీసుకుని దశాబ్దకాలం క్రితం చంద్రలత రాసిన కథ 'తోడికోడలు.'

కథానాయిక చిత్ర అమెరికాలో కంప్యూటర్స్ లో ఎంఎస్ పూర్తి చేసింది. తన చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ పెళ్ళికి సంపత్ వైపు నుంచి పెద్దరికం వహించింది అతని అన్న అనంత్ భార్య శారద. అలా తన తోడికోడలు శారదని తొలిసారిగా తన ఇంట్లో కలుసుకుంది చిత్ర. పొడవు లోనూ, చదువులో మాత్రమే కాదు, అంతస్తులోనూ చిత్ర కన్నా తక్కువే శారద. ఆమె కట్టు, బొట్టు, మాట, మన్నన అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయితే, చిత్రని తొలి చూపులోనే ఆకర్షించింది శారద కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ధీమా.

డిఫార్మసీ చేసిన శారద ఓ చిన్న పల్లెటూరి నుంచి హైదరాబాద్ వచ్చింది. అది కూడా అనంత్ ని పెళ్లి చేసుకున్నాకే. పెళ్ళయ్యాక ఓ పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది. శారద లో కనిపించే ధీమాకి పక్కతాళం వేస్తున్నట్టు చురుకైన చూపులు. ఆ చూపుల్లో అహంకారం, అభిజాత్యం కనిపించకపోయినా, ఆ చూపులు వెంటాడుతూనే ఉన్నాయి చిత్రని. అనంత్ ఉద్యోగం మానేసి ఫైనాన్స్ కంపెనీ పెడితే, తను ఉద్యోగం చేస్తూ తనకి తెలిసిన వాళ్ళందరినీ చిట్టీల్లో చేర్పించింది శారద.

పెళ్ళయ్యాక ఉద్యోగానికి అమెరికా వెళ్ళిపోయిన చిత్రకి ఓ అర్ధరాత్రి పుట్టింటి నుంచి ఫోన్. శారద తమ ఇంటికి వచ్చిందనీ, అనంత్ కనిపించక రెండు వారాలు అయ్యిందనీ. చిత్ర కళ్ళ ముందు ధీమాగా ఉండే శారద రూపం మెదులుతుంది. కానీ, కట్టాల్సిన బాకీ డబ్బు ముప్ఫై నలభై లక్షలు ఉందనగానే గుండెల్లో రాయి పడుతుంది. అమెరికాలో ఇప్పుడిప్పుడే స్థిర పడుతున్న తమ మీద ఆ భారం పడుతుందేమో అన్న ఆలోచన ఆమెని స్థిరంగా ఉండనివ్వదు. అప్పు చేసి కొన్న కారు, కొనాలనుకుంటున్న ఇల్లూ కళ్ళ ముందు మెదులుతాయి.

తమకి సెలవు దొరికాక ఇండియాకి వెళ్తారు చిత్ర, సంపత్. అనంత్ సంగతులు శారదకి తెలిసినా ఎవరికీ చెప్పడం లేదని సంపత్ కి చెబుతుంది అతని తల్లి. చిట్టీలు కట్టిన వాళ్ళూ, పోలీసులూ, రౌడీలూ శారదని ఎలా ఇబ్బందులపాలు చేస్తున్నారో చిత్రకి వివరిస్తారు ఆమె తల్లిదండ్రులు. తిరిగి అమెరికాకి వెళ్ళే రోజున శారదతో మాట్లాడడానికి వెళ్తారు చిత్ర,సంపత్ లు. తనక్కడ ఉంటే శారద మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందని భావించిన చిత్ర పక్క గదిలోకి వెళ్ళబోతే, ఆమెని చేయి పట్టి ఆపుతుంది శారద.

చిత్ర భయపడ్డట్టుగానే, అన్నగారి బాకీలన్నీ తను తీర్చేస్తానని వదినకి హామీ ఇస్తాడు సంపత్. అన్నకి విడాకులిచ్చేయమని వదినకి సలహా ఇస్తాడు కూడా. చిత్రని ఆశ్చర్య పరుస్తూ ఆ సాయాన్ని తిరస్కరిస్తుంది శారద. అంతే కాదు, అనంత్ గురించి తనకి మాత్రమే తెలిసిన ఒక రహస్యాన్ని చిత్రతో పంచుకుని, తను ఏం చేయబోతోందో కూడా వివరంగా చెబుతుంది. "నువ్వు సంపత్ కు ఈ విషయం చెప్పవనే నా నమ్మకం చిత్రా. ఎందుకంటే... సంపత్ ఆ అన్నకు తమ్ముడేగా...!" శారద మాటల్లో హేళన ఉందో, హెచ్చరికే ఉందో తెలియదు చిత్రకి. ఆమాటలు అనుక్షణం ఆమెని వెన్నాడుతూనే ఉన్నాయి, శారద చూపుల్లాగే.

చంద్రలత కథల సంపుటి 'ఇదం శరీరం' లో 'తోడికోడలు' కథని చదవవచ్చు. 'ప్రభవ' పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 75. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. 'తోడికోడలు' తో పాటు ఉన్న మిగిలిన ఎనిమిది కథలూ ఆసాంతమూ చదివించేవే.

6 కామెంట్‌లు:

  1. టైటిల్ చూసి , తోటి కోడళ్ళు సినిమా పరిచయమనుకున్నాను.
    మీరు తొడికోడళ్ళ బంధము గురించి రాసినది అక్షరాలా నిజం అండి .
    చంద్రలత గారి కథ బాగుందండి . మంచి కథ పరిచయము చేసారు . ఈ సారి బజారు కెళ్ళినప్పుడు ఆ బుక్ కొని తప్పక చదువుతాను .

    రిప్లయితొలగించండి
  2. ఈ చంద్రలత గారు మడతపేజీ బ్లాగు రాసే చంద్రలత గారు ఒక్కరేనా ?
    మీ పరిచయం బాగుంది పుస్తకం సంపాదించి చదవాలి .

    రిప్లయితొలగించండి
  3. @మాలాకుమార్: కథలన్నీ బాగుంటాయండీ.. తప్పక చదవండి.. ధన్యవాదాలు..
    @శ్రావ్య వట్టికూటి: అవునండీ, ఒక్కరే.. ఆవిడ ప్రొఫైల్ లో ఉంటుంది చూడండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. కధా పరిచయం బావుంది మురళిగారూ! తోటి కోడళ్ళకి ఒకరిపట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఒకే కుటుంబంలోకి వచ్చామన్న భావంతో పుడతాయి.కాని కొద్దిరోజులకే మానవ సహజమైన ఈర్ష్య , అసూయల వల్ల,ఆధిపత్య ధోరణుల వల్ల అవి మరుగున పడిపోతాయి.అక్క చెల్లెళ్ళలా ఉండేవారు అసలు ఉండరనికాదు అరుదు! ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువయ్యాక ఎవరి జీవితాలు వారివే !

    రిప్లయితొలగించండి
  5. మురలి గారు మీ తోటీకోడలు చదివాను బాగుంది కాని పుస్థకం ఎక్కడ దొరుకుతుందొ చెప్పగలరు

    రిప్లయితొలగించండి
  6. @పరిమళం: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @శ్రీదేవి: విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఇంకా అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి