ఆదివారం, అక్టోబర్ 03, 2010

మిస్సమ్మ

తెలుగునాట గిలిగింతలు పెట్టే హాస్యంతో వచ్చిన సినిమాల జాబితా వేయాలంటే ఈనాటికీ మొదటివరుసలో ఉండే పేరు విజయా వారి 'మిస్సమ్మ'. నిర్మాణ విలువలకి పెట్టింది పేరైన విజయ సంస్థ, చక్రపాణి స్క్రిప్టు, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం, సావిత్రి, రామారావు, యస్వీ రంగారావు, జమున, నాగేశ్వర రావు, రేలంగి వంటి ఉద్దండపిండాల అసమాన నటవైదుష్యం, పింగళి నాగేంద్ర రావు మాటలు, సాలూరి రాజేశ్వర రావు సంగీతం... వీటన్నింటి కలబోతే యాభై ఐదేళ్ళ నాటి ఆణిముత్యం 'మిస్సమ్మ.'

ఓ చిన్న కథని రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాగా మలచడంలో ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో చేసిన కృషి ఈ సినిమాని చిరంజీవిని చేసింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. బ్రిటిష్ వారి పుణ్యమా అని ఆంగ్ల విద్యా బోధనా పెరగడంతో ఊరూరా బీయేలు పెరిగిపోయారు. మరోపక్క వారికి ఉద్యోగాలు చూపించగల స్థితిలో లేదు ప్రభుత్వం. ఈ నిరుద్యోగ సమస్యని ఉన్నదున్నట్టుగా చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుందే కానే కలకాలం నిలిచిపోయే సినిమా అవ్వదు కదా.

అందుకే ఈ కథకి "చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లకోసం వెతకడం" అనే ఫ్యామిలీ డ్రామాని జత చేసి ఎవ్వరికీ ఎక్కడా విసుగు కలిగించని విధంగా ఆసక్తికరమైన సినిమాగా మలిచారు నాగిరెడ్డి-చక్రపాణి మరియు ఎల్వీ ప్రసాద్ లు. కథ విషయానికొస్తే, మదరాసు మహా నగరంలో ఎం. టి. రావు (ఎన్టీ రామారావు) ఓ అనాధ. బీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకులాటలో అతనికి మిస్ మేరీ (సావిత్రి) తో పరిచయం అవుతుంది. ఆమె కూడా బీఏ, ఉద్యోగం ఆమెకి కూడా అవసరం, వృద్ధులైన తల్లిదండ్రులకి ఆమె ఒక్కర్తే ఆసరా. అదీకాక అవసరానికి అప్పిచ్చి, ఆపై పెళ్ళిచేసుకుంటానని వేధిస్తున్న డేవిడ్ (రమణారెడ్డి) ని వదిలించుకోడానికైనా ఆమెకి డబ్బు, అందుకోసం ఉద్యోగం అవసరం.

మదరాసుకి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఆంధ్రదేశంలో అప్పాపురం అనే ఓ పల్లెటూళ్ళో గోపాలరావు (యస్వీ రంగారావు) ఓ ధనవంతుడు. భార్య (ఋష్యేంద్ర మణి), కూతురు సీతాలక్ష్మి (జమున), మేనల్లుడు 'డిటెక్టివ్' రాజు (నాగేశ్వర రావు) ఇదీ అతని కుటుంబం. పదహారేళ్ళ క్రితం మహాలయ అమావాస్య నాడు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు అప్పటికి నాలుగేళ్ల పిల్లగా ఉన్న పెద్ద కూతురు మహాలక్ష్మి జనసందోహంలో తప్పిపోతుంది. ఆమె పేరిట ఊళ్ళో ఓ ఎలిమెంటరీ స్కూలు నడుపుతూ ఉంటాడు గోపాలరావు.

మేష్టార్లు సరిగా పాఠాలు చెప్పని కారణంగా బడి మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇష్టం లేని గోపాల రావు ఇద్దరు బీయేల కోసం పేపర్లో ప్రకటన ఇప్పిస్తాడు. వారిలో ఒకరుసంగీతం వచ్చిన స్త్రీ అయితే, ఆమె దగ్గర సీతాలక్ష్మికి సంగీతం నేర్పించవచ్చునన్నది ఆయన ఆలోచన. కూతుర్ని ఎలాగైనా బీయే ని చేయాలన్నది ఆయనకున్న మరోకోరిక. మేష్టర్లిద్దరికీ తనే వసతి ఏర్పాటు చేసి, మంచి జీతలివ్వాలనుకుంటాడు. "వాళ్ళిద్దరూ భార్యా భర్తలై ఉండాలని రూలు పెడితే, ఒకే వసతి సరిపోతుంది కదా" అన్న రాజు సలహా మేరకు ప్రకటనలో ఆ మేరకు మార్పు చేయిస్తాడు గోపాలరావు.

సరిగ్గా అప్పుడే "నీ డిటెక్టివ్ పని చేసి, తప్పి పోయిన మా అక్కని వెతికి పెట్టొచ్చు కదా బావా" అన్న సీతాలక్ష్మి ప్రతిపాదన, రాజు లోని డిటెక్టివ్ ని ఉత్సాహ పరుస్తుంది. అప్పటికే పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రావు, మేరీ ఆ ప్రకటన చూసి ఉద్యోగాల కోసం భార్యాభర్తలుగా నటించడానికి సిద్ధపడి, దరకాస్తు చేస్తారు. సర్టిఫికేట్లైనా చూడకుండానే వాళ్లకి ఉద్యోగం ఇచ్చేస్తాడు గోపాలరావు. మిసెస్ రావు ని (కనీసం ఆమె పేరైనా అడగరు వాళ్ళు) చూడగానే తెలియని వాత్సల్యం పుడుతుంది గోపాలరావు దంపతులకి. మేరీనే మహాలక్ష్మి ఎందుకు కాకూడదు అన్న సందేహం మొదలవుతుంది రాజుకి.

ఓపక్క తనకి ఏమాత్రం ఇష్టం లేని హిందూమత సంప్రదాయాలని పాటిస్తూ, అస్సలు ఇమడలేని కొత్త వాతావరణంలో ఇబ్బందులు పడే మేరీ, మరోపక్క ఆమెలో తమ కూతుర్ని చూసుకుని ఆపేక్ష చూపించే గోపాలరావు దంపతులు, ఇంకోపక్క మేరీయే మహాలక్ష్మి అన్న అనుమానంతో పరిశోధన చేసే రాజు. రావు, మేరీల మధ్య వచ్చే తగువులకి ప్రత్యక్ష సాక్షి రావు స్నేహితుడు దేవయ్య (రేలంగి). రావు, మేరీల కథంతా తెలుసు దేవయ్యకి. ఇదిగో ఈ దేవయ్యనే ఉపయోగించుకుని పరిశోధన చేయాలనుకుంటాడు రాజు.

కానీ చేతిలో 'తైలం' పడందే పెదవి విప్పుడు దేవయ్య. (ఈ సినిమా విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన 'అందాల రాముడు' లో అల్లు రామలింగయ్య 'ఆమ్యామ్యా' ని పరిచయం చేసేవరకూ, లంచానికి ముద్దు పేరుగా కొనసాగింది ఈ తైలమే) పోనీ తైలం పడ్డాకైనా నిజం చెబుతాడా అంతే, అదీ లేదు. అమాయకురాలైన సీతాలక్ష్మి చేష్టల పుణ్యమా అని రావు మేరీల మధ్య స్పర్ధలు పెట్టి, ప్రేమ పెరగడానికి దోహదం చేస్తాయి. రావు-మేరీల నాటకం గోపాలరావుకి తెలిసిందా? మహాలక్ష్మి దొరికిందా? తదితర ప్రశ్నలకి జవాబిస్తూ సినిమా ముగుస్తుంది.

నటీనటుల గురించి చెప్పాలంటే మొదటగా చెప్పాల్సింది టైటిల్ పాత్ర పోషించిన సావిత్రి గురించే. బొట్టూ, పూలూ ధరించడంలో అయిష్టత చూపడం మొదలు, అమాయకురాలైన సీతాలక్ష్మి రావుతో చనువుగా ఉంటే భరించలేక ఆవేశ పడడం వరకూ ప్రతి సన్నివేశంలోనూ ప్రతి చిన్న హావభావాల్నీ అత్యంత సమర్ధంగా పోషించి, మిస్సమ్మ ని సజీవంగా కళ్ళముందు నిలిపింది సావిత్రి. 'సీమంతం' అంతే ఏమిటో తెలియకుండా సీమంతం జరిపించేసుకునే సన్నివేశం, రాజు వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా అతనికి సంగీతం నేర్పించే సన్నివేశాలని మర్చిపోవడం అంత సులభం కాదు. రావు పాత్రని తెర మీద చూసినప్పుడల్లా 'కన్యాశుల్కం' గిరీశం రేఖామాత్రంగా గుర్తొస్తాడు నాకు. తనకీ, మేరీకీ మధ్య జరిగిన తగువుల్ని గోపాలరావు దగ్గర 'మేనేజ్' చేసే సన్నివేశాల్లో రావుగా ఎన్టీఆర్ నటన గుర్తుండి పోతుంది.

పల్లెటూరి దంపతులుగా ప్రేమనీ, ఆపేక్షనీ కలబోసి చూపే పాత్రల్లో యస్వీఆర్, ఋష్యేంద్రమణి జీవించారనే చెప్పాలి. ఈ దంపతులు రావుని ఎంతగా నమ్మారంటే, ఒకసందర్భంలో సహనం కోల్పోయిన మేరీ "నేను క్రిష్టియన్ని, నా పేరు మేరీ, నాకింకా పెళ్ళికాలేదు" అని చెబితే, పంతులమ్మకి దెయ్యం పట్టిందనుకున్నారే తప్ప, ఆమె నిజమే చేబుతోందేమో అన్న అనుమానం లేశమైనా కలగలేదు వాళ్లకి. రావు-మేరీలని అమ్మాయి-అల్లుడు అంటూ ఆప్యాయంగా పిలవడం మొదలు, వాళ్లకి ఇబ్బంది కలగ కూడదనుకుంటూ వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్లకి కలిగే ఇబ్బందులు, అప్పుడు పుట్టే హాస్యం తెర మీద చూడాల్సిందే.

పల్లెటూరి పిల్లగా జమున నటన గురించి చెప్పాలంటే మచ్చుకి ఒక సన్నివేశాన్ని గుర్తు చేయాలి. పంతులమ్మ దగ్గర సంగీతం నేర్చుకోడానికి మేష్టారింటికి వెళ్తుంది సీతాలక్ష్మి. పంతులమ్మ లోపలెక్కడో ఉంటుంది. మేష్టారి పక్కన సోఫాలో చనువుగా కూర్చుని కుశలాలు మొదలుపెడుతుంది సీతాలక్ష్మి. "కాఫీ తాగుతావా?" అని మేష్టారంటే "వద్దు మేష్టారూ, ఇప్పుడే చద్దన్నంలో పెరుగేసుకుని తినొచ్చా" అని చెబుతుంది. కాసేపట్లో పంతులమ్మ వచ్చి, మేష్టారి పక్కన కూర్చున్నందుకు భగ్గున మండి, సోఫాలో నుంచి లెమ్మంటే "ఇది మా సోఫా, నేనిక్కడే కూర్చుంటా"నంటుంది. అంతలోనే పంతులమ్మ "తెలుసుకొనవె చెల్లీ.." అని పాఠం మొదలెడితే, అలక మర్చిపోయి పాఠానికి వెళ్ళిపోతుంది.

రావు-మేరీ పాత్రలని ఇరుసు-చక్రం అనుకుంటే, ఆరెంటినీ సరిగ్గా పనిచేయించే కందెన దేవయ్య. ఈ పాత్రలో రేలంగి ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని మర్చిపోవడం అంత సులువు కాదు. తన పని కోసం వీళ్ళ చుట్టూ తిరిగే డిటెక్టివ్ రాజు గా నాగేశ్వరరావు నవ్విస్తాడు. రేలంగి-నాగేశ్వర రావు ల మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో నాగేశ్వరరావు సహాయకుడిగా నటించిన నటుడి హావభావాలు... ఇలా ఒకటేమిటి? సినిమా మొత్తాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. స్క్రిప్టు పకడ్బందీగా ఉండడం, ఎక్కడా ఏ సన్నివేశమూ అనవసరం అనిపించక పోవడం చక్రపాణి గొప్పదనం అనే చెప్పాలి. ఈ సినిమాకి మూలం ఓ బెంగాలీ సినిమా అంటోంది వికీపీడియా.

రాజేశ్వర రావు సంగీతంలో పాటలని గురించి చెప్పకుండా ఈ సినిమా గురించి చెప్పడం పూర్తి కాదు. ఏ.ఏం. రాజా, లీల, సుశీల పాడిన పాటల్లో 'ఆడువారి మాటలకు..,' 'రావోయి చందమామ...,' 'బృందావనమిది అందరిదీ..,' 'కరుణించు మేరి మాతా..' ఇంకా 'బాలనురా మదనా..' పాటలు సంగీత ప్రియుల కలెక్షన్లలో శాశ్విత స్థానం పొందాయి. ఈ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో వచ్చే నేపధ్య సంగీతానికీ, రెండేళ్ళ తర్వాత విజయ సంస్థ తీసిన 'మాయా బజార్' సినిమాలోని 'భళి భళి భళి భళి దేవా..' పాట ట్యూన్ కీ దగ్గర పోలికలు వినిపిస్తాయి. మనసు బాగోనప్పుడు 'మిస్సమ్మ' సినిమా చూడడం కన్నా మంచి మందు మరొకటి ఉండదు.

23 వ్యాఖ్యలు:

  1. బాగుంది.
    నాగేశ్వర్రావుకి అసిస్టెంటుగా చేసిన నటుడు బాలకృష్ణ (అంజిగాడు). ఇతను సినిమా మొదణించీ చివరిదాకా ఒక్క మాట కూడా మాట్లాడ్డు.
    రవు మేరీ ఉద్యోగాల్లోకి రాకముందు పంతులుగా అటుపైన వైద్యుడిగా భూతవైద్యుడిగా అల్లు హాస్యం కూడా సామాన్యం కాదు. అసలు ఈ సినిమాలో ప్రతి అంగుళం ఫిల్మూ ఏదో ఒక రకంగా ప్రత్యేకమే.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మాయాబజార్ లాగ ఈ సినిమాని కూడ అసలునెగటివ్‌లు సంపాయించి రంగుల్లోకి మారిస్తే బాగుండును.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నాకెంతో ఇష్టమైనవి, ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో లెక్క తేలనివి అయిన సినిమాలు మాయాబజార్, మిస్సమ్మ, సువర్ణ సుందరి. మిస్సమ్మ తమిళంలో "మిస్సియమ్మ"గా వచ్చింది. దాని విసిడి సంపాదించి చూసాను. సావిత్రి, జమున, ఎస్వీఆర్,ఋష్యేంద్రమణి అందులోను నటించారు. దీనిని హిందీలో "మిస్ మేరీ" పేరుతో నిర్మించారు. జెమినీ గణేషన్, జమున అందులోను నటించారు. ఒకటి రెండు పాటలు టీవీలో చూడడమే కాని సినిమా చూడలేదు. హిందీ చిత్రాన్ని డౌన్ లోడ్ చేసికొనడానికి ఎవరైనా "లింక్" ఇచ్చి పుణ్యం కట్టుకోండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. భళి..భళి..భళి..మిస్సమ్మ ను బ్లాగ్లో చూయించారు. సినిమా చుసిన ఫీల్ కలిగింది

    ప్రత్యుత్తరంతొలగించు
  5. ఆ పాతమధుర సినిమా "మిస్సమ".ఈ సినిమాను మళ్ళి చుడాలనిపించేలా చేసిందండి మీ టపా .చాలా బాగుందండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. భలే చెప్పారు మాస్టారు, మిస్సమ్మని కళ్ళ ముందుంచారు. సావిత్రి ముద్దుమోము, ఎన్.టి.ఆర్ చిపిలితనం, నాగేస్రావు, జమునల అమాయకత్వం, రేలంగి గడుసుతనం, రంగారావు,-ఋష్యేంద్రమణిల మంచితనం...ఓహ్ ఎంత చెప్పినా తరగనిది మిస్సమ్మ దృశ్యకావ్యం.

    దీనిలో సావిత్రి గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. శ్రీజానకీ దేవి పటలో, "కొమరుని గని" అని రాగానే సావిత్రి ఉలిక్కిపడుతుంది...ఆ నటన ఆమెకే చెల్లు. ఏమిటో ఈ మాయలో వెన్నెలంతా ఆమె మోమునుండి జాలువారుతున్నట్టే ఉంటుంది. ముగ్ధమోహనరూపం అంటారే, అదేదో సాక్షాత్కరిస్తుంది ఆ పాటలో.

    "తైలం", "అగ్గిఫోర్స్", "సంప్రదింపులకు పోయారు" లాంటి డైలాగులూ ఇప్పటికీ వాడుతూ ఉంటాం మా ఇంట్లో.

    ఎ.ఎం.రాజా,-లీలల గొంతు, భావం మైమరపిస్తాయి. సరే పింగళివారి గురించి, సాలూరి వారి గురించి చెప్పేదేముంది. ఈ సినిమాని ఎల్.వి. ప్రసాద్ గారు మలచిన తీరు అనన్యసామాన్యం.

    మంచి సినిమా గుర్తుచేసి మనసుకి ఉత్తేజం కలిగించారు మురళీగారు. Many many thanks!

    ప్రత్యుత్తరంతొలగించు
  7. మిస్సమ్మ సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు . మనసుకు ఇది ఒక టానిక్ . విజయా వారి చందమామ అందాలు చూసితీరాల్సిందే .
    చాలా మంచి సినిమా గురించి , చాలా బాగా చెప్పారు . థాంక్ యు .

    ప్రత్యుత్తరంతొలగించు
  8. నాకు తెలిసి బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నేను చూసిన మొదటి సినిమా ఇది..అప్పట్లో ఎవరైనా పాత సినిమల్లో ఎం చూశావు అని అడిగితే నేను చెప్పే మొదటి పేర్లు మిస్సమ్మ, గుండమ్మ కథ.
    మిస్సమ్మ చూసిన ప్రతి సారి కొత్తగా అనిపిస్తుంది...మీ రివ్యూతో సినిమాని మళ్ళీ చూసినట్లయ్యింది...
    :)

    ప్రత్యుత్తరంతొలగించు
  9. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది. ఐతే చివర్లో జరిగే సంఘటనలు కొన్ని అర్థం కాలేదు. తెలిస్తే చెప్పగలరు:
    NTR గదిలోకి సావిత్రిని పంపినపుడు, సావిత్రి జమున పేరు చెప్పగానే NTR డాబా పైనుండి దూకి ఇంటికి వెళ్తాడు. పైనుంచి దూకేంత ప్రమాదం ఏముంది. అలా ఎందుకు చేస్తాడో అర్థం కాలేదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  10. అంతమంచి కథ, అంతమంది మహానటులు దొరకడం దర్శక,నిర్మాతల అదృష్టం.
    అటువంటి సినిమాలు తెలుగులో రావడం మన అదృష్టం.

    ప్రత్యుత్తరంతొలగించు
  11. శంకరయ్య గారు , మీరు అడిగిన మిస్ మేరీ సినిమా లింకులు :

    http://www.hindilinks4u.net/2009/11/miss-mary-1957.html

    ప్రత్యుత్తరంతొలగించు
  12. మురళి గారు, ఇంత చక్కటి సినిమా ఇలా ఎన్ని మార్లు కథలుగా చెప్పినా ఆ రుచి పెరుగుతోందే కాని తగ్గదు. ఈ సినిమా గురించి పెద్ద గ్రంధమే రాయొచ్చేమో. చాలా బాగా చెప్పారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  13. మాటల్లేవ్ థాంక్స్ అంతే! ఎన్నోసారో చెప్పలేను కాని మళ్ళీ చూడబోతున్నాను మురళిగారూ :) :)

    ప్రత్యుత్తరంతొలగించు
  14. ఎన్నాళ్ళనుంచో నాకో సందేహం. మీరు పుస్తకాలు, చలన చిత్రాల గురించి రాసేప్పుడు వాటిని జ్ఞప్తికి తెచుకుని రాస్తారా లేక ఇష్టమైనవే కాబట్టి ఒక సారి చూసి/చదివి మీదైన శైలి లో రాస్తారా?

    ప్రత్యుత్తరంతొలగించు
  15. Superb movie! మళ్ళీ ఒకసారి సినిమా చూపించేసారండీ మీ పోస్టుతో! :) :)

    ప్రత్యుత్తరంతొలగించు
  16. మీకుమీరే మాకు మేమే..:)
    రేలంగి అంటే ఏమిటొ చూడాలంటే ఈసినిమా బెస్ట్‌ఆప్షన్.
    చందమామ..విజయావారి చందమామ.మీరురాసిన ప్రతిలైనుకి నాకుఓవ్యాఖ్య తన్నుకొస్తోంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  17. చక్కని సినిమా గురించి మరింత చక్కగా పరిచయం చేశారు మురళీ. ఈ సినిమాకు కూడా రంగులద్దే కార్యక్రమం ప్రారంభించారని ఈమధ్యనే విన్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  18. @కొత్తపాళీ: నిజమేనండీ.. ప్రతి పాత్రా గుర్తుండిపోయేదే.. ధన్యవాదాలు..
    @శివ: చిన్న సబ్మిషన్ అండీ.. 'మాయాబజార్' లాగ సగం సినిమాని కాకుండా, పూర్తి సినిమాకి రంగేస్తే బాగుంటుందని.. ధన్యవాదాలు.
    @కంది శంకరయ్య: హమ్మయ్య.. లంకె దొరికేసింది కదా మీకు... ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  19. @భాను: ధన్యవాదాలండీ..
    @రాధిక (నాని): ధన్యవాదాలండీ.
    @ఆ.సౌమ్య: ఈ 'కొమరునిగని' గురించే నేనూ చెప్పాలనుకున్నానండీ.. నిజం, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా యెంత బాగుంటాయో.. ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  20. @మాలాకుమార్: 'విజయా వారి చందమామ' నిజమండీ.. ధన్యవాదాలు.
    @స్నిగ్ధ: ధన్యవాదాలండీ..
    @విజయవర్ధన్: ఈసారి డైలాగులు కొంచం జాగ్రత్తగా వినండి, మీకే తెలుస్తుంది :-) ..ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  21. @బోనగిరి: నిజమండీ, ధన్యవాదాలు.
    @విజయక్రాంతి: ధన్యవాదాలండీ, శంకరయ్య గారి తరపున కూడా..
    @జయ: నిజమేనండీ, గ్రంధం రాయొచ్చు.. ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  22. @పరిమళం: నేను కూడా అంతేనండీ, లెక్క పెట్టడం మానేశాను.. ధన్యవాదాలు.
    @phanikris: రెండు రకాలుగానూనండీ.. పుస్తకం/డీవీడీ అందుబాటులో ఉంటే ఓసారి తిరగేస్తాను.. లేకుంటే గుర్తు చేసుకుని రాస్తూ ఉంటాను.. ధన్యవాదాలు.
    @మధురవాణి: ధన్యవాదాలండీ..

    ప్రత్యుత్తరంతొలగించు
  23. @సుబ్రహ్మణ్య చైతన్య: నీకు 'మీకు మీరే..' చిత్రీకరణ చాలా ఇష్టం అండీ, ముఖ్యంగా నాగేశ్వర రావు ఎక్స్ప్రెషన్స్, సినిమా మొత్తానికి బాగా నచ్చేది ఈ సీన్ లోనే.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: నిజమా అండీ.. శుభవార్త.. సినిమా కట్ చేయకుండా ఉంటే బాగుండును.. ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు