బుధవారం, అక్టోబర్ 13, 2010

చూడాల్సిందేనా?

ఒక నటుడికి అవార్డు వచ్చినందుకూ, మరో నటుడికి రానందుకూ రెండు వర్గాల మధ్యనా మాటల యుద్ధం. అవార్డు రావడం ఎంత సమంజసమో ఒకరు వివరిస్తే, రాకపోవడం వెనుక కుట్రల్ని మరొకరు బహిర్గతం చేస్తారు. వీళ్ళిలా కొట్టుకుంటూ ఉంటే జనం చచ్చినట్టు తమ చానల్నే చూస్తారన్న ఆనందం సదరు టీవీ చానల్ యాంకర్ ముఖంలో దాచినా దాగదు. మాటల మంటలు ఆరిపోకుండా మధ్య మధ్యలో సమిధలు విసురుతూ ఉంటాడతను. ఈలోగానే ఈ ముఖ్యాతి ముఖ్యమైన విషయం గురించి జనం తమ అమూల్య అభిప్రాయాలు ఎస్సెమ్మెస్ ద్వారా చెప్పాలంటూ స్క్రోలింగులు... చూడాల్సిందేనా?

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. డైలీ సీరియల్ని మించిన ట్విస్టులతో మాంచి ఉత్కంఠ భరితమైన మలుపులు తిరుగుతోంది. రాజ్యాంగ, రాజ్యాంగేతర శక్తులన్నీ తమ తమ శక్తి మేరకి ఈ కథకి మసాలా దినుసులని అందిస్తున్నాయి. తలనెరిసిన జనాలంతా రాజకీయ విశ్లేషకుల అవతారాలెత్తి చానళ్ళని పావనం చేసి జరుగుతున్న సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రమనీ, దిగ్భ్రాంతినీ తమ వాక్చాతుర్యం మేరకి వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాల నిర్వాహకులు ప్రజాస్వామ్యానికి ఇంతటి కష్టం ఇంతకుముందెప్పుడూ కలగలేదనీ, మరిన్ని అప్డేట్స్ కోసం తమ చానల్ చూస్తూనే ఉండమనీ సూచిస్తున్నారు... చూడాల్సిందేనా??

సంపదలో తాజాగా టాటాలనీ, బిర్లాలనీ మించిపోయిన రాజకీయ వారసుడు ఎవరూ ఊహించని మొత్తాన్ని ముందస్తు ఆదాయపు పన్నుగా చెల్లించాడు. కిట్టని వాళ్ళు ఈ పన్ను ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేసి గుండెలు బాదుకుంటుండగా, అతనేం చేసినా ముద్దుగానే అనిపించే వాళ్ళు అణా పైసలతో సహా లెక్కేసి పన్ను కట్టేయడం అతని నిజాయితీని సూచిస్తోందనీ, విమర్శలు చేసేవాళ్ళంతా పన్నులు ఎగేసే రకాలనీ టీవీ చానళ్ళ సాక్షిగా జనాలకి వివరిస్తున్నారు. చానళ్ళన్నీ ఇరువర్గాలతో తమకున్న సంబంధ బాంధవ్యాల మేరకు జరుగుతున్న తతంగాన్నంతా తమదైన దృష్టి కోణం నుంచి తిలకిస్తూ, ప్రేక్షకులని కూడా అదే దృష్టితో చూడమంటున్నాయి... చూడాల్సిందేనా???

ఎందుకొచ్చిన వార్తలనిపించి, ఎంటర్టైన్మెంట్ చానళ్ళ వైపు మళ్ళితే, ఒకప్పుడు వెండితెర మీద ఆడిపాడిన నాయిక ఇప్పుడు పెద్దంచు చీరలు కట్టుకుని పెద్ద తరహాగా కుటుంబ సమస్యలకి పరిష్కారాలు చెప్పేస్తోంది. గొడవ పడుతున్న కుటుంబ సభ్యులని రెండు పక్కలా కూర్చోబెట్టుకుని, వాళ్ళు ఒకరినొకరు తిట్టుకునే తిట్లని సెన్సార్ లేకుండా వింటూ, మనకి వినిపిస్తూ తనకి తోచిన సలహాలు చెప్పేస్తోంది. పనిలో పనిగా లాయర్లనీ, మానసిక వైద్యులనీ స్టూడియోలకి రప్పించి వాళ్ళచేతా సలహాలు చెప్పించేస్తోంది. వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే పరిమితం చేసుకోవాల్సిన గొడవలని మనం చూడాల్సిందేనా?

మానవ హక్కుల కమిషన్ తప్పు పట్టినా చలించకుండా ముక్కు పచ్చలారని పసిపిల్లలకి మూడోవంతు కురచ బట్టలేసి, ఏకార్ధపు పాటలకి వాళ్ళ చేత డాన్సులు చేయిస్తున్న 'అన్నయ్య'లూ 'తాతయ్య'లూ అంతటితో ఆగకుండా "వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలని ఉందమ్మా.." అంటూ తమ తమ పాత్రల్లో జీవించేస్తున్నారు. "ఇలాగేనా స్టెప్పులేయించడం?" అని డేన్సు మేష్టర్లని అదిలించడం అయితేనేమి, "పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ కాకపొతే నిన్ను ఎలిమినేట్ చేసేస్తా" అంటూ చిన్నారుల్ని బెదిరించడం అయితేనేమి.. ఈ రియాలిటీ షోలు తమ పంధాని ఏమాత్రం మార్చుకోలేదు. అయినా కూడా వీటిని చూడాల్సిందేనా??

ఓపక్క థియేటర్లు జనాల్లేక వెలవెలబోతున్నా తమ సినిమా అన్ని రికార్డులనీ బద్దలుకొడుతోందని నిర్లజ్జగా ఇంటర్యూలిచ్చే సినిమా బృందాలు, "నీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? మరి పాటని ఎవరికి డెడికేట్ చేయమంటావ్?" అంటూ కుర్రాళ్ళని కవ్వించే యాంకరీమణులు, వందలూ వేలూ ఎపిసోడ్లు జరిగిపోయాక కూడా ఇంకా పాలల్లో విషాలు కలుపుకునే అత్తలూ, కోడళ్ళూ, తన రెండో భర్తకి మూడో భార్య ఉందని తెలిసి రగిలిపోయే మహిళా పాత్రలున్న, అపూర్వ మహిళాదరణతో దీర్ఘ కాలంగా కదులూ మెదులూ లేకుండా కొనసాగుతున్న అరవ డబ్బింగ్ సీరియళ్ళూ... వీటన్నింటినీ కిమ్మనకుండా చూడాల్సిందేనా???

23 వ్యాఖ్యలు:

 1. అందుకే నేనెపుడు NGC, DISCOVERY చూస్తాను, ఎందుకంటే అవి నిజాలే చెబుతాయి, ఇంకా మనకు తెలియంది చాల ఉందని కూడా గుర్తు చేస్తాయి :-)

  అన్నట్టు నేటి మీడియా గురించి చాల చక్కగా రాసారు .. కాస్త మీ శైలికి భిన్నంగా !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మొత్తానికి కరెంటఫైర్స్ బ్లాగుల్లో ఇంకోటిచేరిందన్నమాట.
  >>>పక్క థియేటర్లు జనాల్లేక వెలవెలబోతున్నా తమ సినిమా అన్ని రికార్డులనీ బద్దలుకొడుతోందని నిర్లజ్జగా ఇంటర్యూలిచ్చే సినిమా బృందాలు
  విడుదైలనరోజే డబ్బాలన్నీ వెనక్కొచ్చేసినా సూపర్ హిట్టని చెప్పుకునే నిర్మాతలా ఆమొహం చూడు. :)
  కర్టసీ: జంద్యాల, అరగుండు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగుంది.
  మిమ్మల్ని పూర్తి ఉయ్యల మీద చూడటం బాగుంది.
  (Good to see you in full swing.
  ,మరీ దీనికి అచ్చ తెలుగు అనువాదం అరవ సీరియళ్ళలా ఉందా?)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కళ్ళూ చెవులూ కూడా మూసుకుంటే మంచిది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారు, చాలా చాలా బాగుందండీ మీ టపా. నిజమే ఈ మధ్య ఏ ఛానెల్స్ చూడలేక పోతున్నాం. మీ శైలి నాకు చాలా చాలా నచ్చింది..
  >>వందలూ వేలూ ఎపిసోడ్లు జరిగిపోయాక కూడా ఇంకా పాలల్లో విషాలు కలుపుకునే ,కోడళ్ళూ, తన రెండో భర్తకి మూడో భార్య ఉందని తెలిసి రగిలిపోయే మహిళా పాత్రలున్న, అపూర్వ మహిళాదరణతో దీర్ఘ కాలంగా కదులూ మెదులూ లేకుండా కొనసాగుతున్న అరవ డబ్బింగ్ సీరియళ్ళూ
  ఏం చెప్తాం చెప్పండి.. చూసే వాళ్లుంటే వాళ్లు మాత్రం తియ్యకుండా ఎందుకుంటారు..!!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భలె చురకలు వెసారండి... ఇవి చిన్న విషయలెమీ కాదు... వీటి వల్ల వచ్చె నష్టం కుడా చిన్న దేమి కాదు.... అస్సలు నాకొ విషయం అర్థం కాదు, ఈ సొ కాల్డ్ జౌర్నలిస్ట్స్/ఆంకర్స్ కి qualification ఎంటి? ఆసలు వీల్లకి యె ప్రస్న వెయ వచ్చొ ఎది అడగ కూడదొ తెలుసంటారా?
  ఆ మధ్య Ram Gopal Varma TV9 తొ interview చూసను.... 'Rakta Charitra' లొ హింస ఎక్కువ గా ఉంది కదా మరి అది జనాలకి చెడు చెస్తదెమొ అని ఎదొ అడిగడు ఆ TV9 అతను.... రాము ఆన్సెర్ 'ఇది మీరు చెప్తున్నరా? ప్రొధ్ధున లెస్తె తల నరుక్కొవటాలు live లొ చూపిస్తుంటారు ' అని.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చాలా బావుంది మీ టపా.నిజమే ఏ ఛానల్ పెట్టాలన్నా భయంగా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. >>సంపదలో తాజాగా టాటాలనీ, బిర్లాలనీ మించిపోయిన రాజకీయ వారసుడు ఎవరూ ఊహించని మొత్తాన్ని ముందస్తు ఆదాయపు పన్నుగా చెల్లించాడు. కిట్టని వాళ్ళు ఈ పన్ను ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేసి గుండెలు బాదుకుంటుండగా, అతనేం చేసినా ముద్దుగానే అనిపించే వాళ్ళు అణా పైసలతో సహా లెక్కేసి పన్ను కట్టేయడం అతని నిజాయితీని సూచిస్తోందనీ, విమర్శలు చేసేవాళ్ళంతా పన్నులు ఎగేసే రకాలనీ టీవీ చానళ్ళ సాక్షిగా జనాలకి వివరిస్తున్నారు

  సూపర్

  :) :)
  మంచి పోస్ట్

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అదరహో!! ఏ ఒక్క కార్యక్రమాన్ని ఛానల్ ని వదలకుండా మొత్తాన్ని చీల్చి చెండాడేశారుగా :-)

  అందుకే బుద్దిగా కేబుల్/శాటిలైట్ లింక్ కట్ చేసేసి టీవీని నచ్చిన సినిమాల డీవీడీలు చూసుకోడానికి మాత్రమే ఉపయోగించుకోవడం ఉత్తమోత్తమం.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. anduke andi, memu kevalam cartton network, pogo channels, srikrishna, chotabeem, tom &jerry lantivi chusthunnam pillalatho paatuga.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చూడాల్సిందేనా! అంటే ....చూస్తున్నాంగా మరి:) చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అంటారు....తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అంటాం...అంతే మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. అందుకే నేను బాగా తగ్గించేసా తెలుగు ఛానళ్ళు చూడడం.
  ఒక్క ఛానల్ ఉన్నప్పుడు (దూరదర్షన్) ఉన్నప్పుడు హాయిగా ఉండేది. క్వాలిటీ ఉండేది.

  అందరికీ బానే వడ్డించారుగా . బావుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 13. బాగా చెప్పారు.
  కానీ, ఎవరు చూడమన్నారు?
  (వారాంతాల్లో తప్ప) మామూలురోజుల్లో టి వి చూసేవాళ్ళంతా కాలక్షేపానికి చూసేవాళ్ళే.
  వాళ్ళకి వినోదం ఉచితమే కాబట్టి ఎలా ఉన్నా పరవాలేదు.
  నాకైతే ఏడుపుగొట్టు డబ్బింగు సీరియళ్ళు చూసేవాళ్ళని చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
  అది మానసిక బలమో, రోగమో నాకు అర్థం కాదు.
  నేనైతే చూడలేను.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @Mahesh Telkar: నిజమేనండీ, అవి చూడడమే బాగుంటుంది.. ఇన్ని చానళ్ళు ఉన్నాయికదా, వెతికితే తెలుగులో కూడా ఏమన్నా మంచి కార్యక్రమాలు కనిపిస్తాయేమో అని ఆశ.. ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: కరెంట్ అఫైర్స్ అప్పుడప్పుడూ ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి కదండీ.. ధన్యవాదాలు.
  @రమేష్: విన్నానండీ, విన్నాను :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @రిషి: 'పూర్తి ఊయల..' :-) :-) భలే బాగుందండీ.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: అంతకన్నా మార్గం కనిపించడం లేదండీ మరి.. ధన్యవాదాలు.
  @మనసు పలికే: నిజమేనండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @మధు: ఇప్పుడు చానళ్ళు బాగా పెరిగిపోవడం వల్ల క్వాలిఫికేషన్ చూడ్డం లేదనుకుంటానండీ, లాజిక్ ఉన్నా లేకున్నా నాన్ స్టాప్ గా మాట్లాడితే చాలేమో.. ధన్యవాదాలు.
  @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
  @హరే కృష్ణ: :-) :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @వేణూ శ్రీకాంత్: వార్తల కోసం, అప్పుడప్పుడూ మెరిసే కొన్ని మంచి కార్యక్రమాల కోసం అండీ.. ధన్యవాదాలు.
  @3g: ధన్యవాదాలండీ..
  @స్ఫూర్తి: బాగుందండీ మీ ఛాయస్.. ధన్యవాదాలు.
  @శిశిర: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @జయ: సినిమాల్లాగే టీవీ కూడా.. అంతేకదండీ.. ధన్యవాదాలు.
  @వాసు: దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లో ప్రత్యామ్నాయం ఉంటే బాగుండును అనుకున్నామండీ.. ధన్యవాదాలు.
  @బోనగిరి: కొంచం తీరిక చిక్కి రిమోట్ తిప్పితే, ఇదిగో ఇలా.. అదండీ సంగతి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. nijame muraligaru,
  tv chudlante e madhya kevam comedy scenes vahce channelni matrame chushtuanam ma intlo.antha chirkauga vuntuanyi tv karyakaramalu

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఈ సీ'రియల్ 'కష్టాల గురించి ఓ టపా రాద్దామని అనుకొంటున్నానండీ...ఈ లోపు మీరు మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీభలే కవర్ చేస్తూ రాసారు....ఈ మధ్య మా అమ్మగారు, పిన్ని వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర్నుంచి నా మైండ్ అంతా సీరియళ్ళమయం అయిపోయిందనుకోండి ఆ పాత్రలన్నీ నా చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ ...కొద్ది రోజులుగా కలల్లో కూడా అవే దృశ్యాలు ప్చ్...

  ప్రత్యుత్తరంతొలగించు