మంగళవారం, సెప్టెంబర్ 28, 2010

వినండి చెబుతా...

'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అనేది చాలా పాత సామెత. ఎవరో 'వినే' వాడే వినీ, వినీ బోల్డంత అనుభవం సంపాదించి ఆ అనుభవంతో సృష్టించి ఉంటాడీ సామెత. మనందరమూ ఏదో ఒక సందర్భంలో వినేవాళ్ళమూ, చెప్పేవాళ్ళమూ కూడా. ఏమాటకామాటే చెప్పుకోవాలి. 'వినేవాడు' పాత్ర కన్నా 'చెప్పేవాడు' పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో. మనం చెప్పేదంతా వినేవాడు దొరకాలే కానీ ఒళ్ళు మర్చిపోతాం కదూ మనం?

వినడం అనేది చిన్నప్పుడే మొదలుపెట్టాం మనం. ఇంట్లో పెద్దవాళ్ళు, బళ్ళో మేష్టార్లు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, నాన్న స్నేహితులు... ఇలా అందరూ మనకి చెప్పేవాళ్ళే. ఏం చెప్పేవాళ్ళు? "అల్లరి చెయ్యకూడదు.. బుద్ధిగా చదువుకోవాలి.. ఫస్టున పాసవ్వాలి.." ఇలా అన్నీ మనకి నచ్చని విషయాలే. అయినా ఎదురు చెప్పకుండా వినాల్సిందే.

అలా వినడం అలవాటైపోవడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే మనం పెద్దైపోయాక పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పినా వినగలగడం. ఇప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పి ఒప్పించడం మన తరమా? ఆమధ్య ఎప్పుడో ఓసారి పక్కింటి పిల్ల నాలుగేళ్ల దానికి ఆల్ఫాబెట్స్ చెబుదామనిపించి 'ఏ' అన్నప్పుడు ఆ పిల్ల తడుముకోకుండా 'బీ' అంది. ఏం చెయ్యగలం? "అదే మా రోజుల్లో అయితేనా?" అని నిట్టూర్చడం తప్ప.

బుద్ధిగా వినడం అలవాటైపోడం వల్ల మనం ఎన్నెన్ని వినగలుగుతున్నామో చూడండి. టీవీ యాంకర్ మాట్లాడే సంకర భాష మొదలు రాజకీయనాయకుడు నీతులు, బూతులు కలిపి ఇచ్చే ప్రసంగం వరకూ ప్రతిదీ వినేస్తున్నాం. నిజజీవితంలో ఆదాయంపన్ను ఎగ్గొట్టే సిని తారలు సినిమాల్లో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా తెగ బారెడు డైలాగులు చెబుతున్నా కిమ్మనకుండా వింటున్నాం. ఇలా ఎన్నెన్ని వింటున్నామో లెక్కలేసుకుంటే మనకే బోల్డంత ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ జీవకోటిలో మన మాట వినే ప్రాణి ఏదైనా కనిపిస్తే... మనంత అదృష్టం ఇంకెవరికైనా ఉంటుందా? మనం చెప్పడం మొదలు పెట్టామంటే ఎవరైనా మనకి పోటీకి రాగలరా? ఏం? మనమేమీ చెప్పలేమా? ఆకలినీ, నిద్రనీ మరిచి, మధ్యలో మంచినీళ్ళు తాగడానికి కూడా బ్రేక్ తీసుకోకుండా అలా చెబుతూనే ఉండిపోగలం. వినేవాడు దొరకాలే కానీ ఎంతసేపైనా, ఎన్ని విషయాలైనా చెప్పగలం.

అవునూ.. ఒకవేళ వినడానికి ఎవరైనా దొరికితే మనం ఏమేం చెప్పగలం? నిజానికి ఏమేం చెప్పలేం? అని అడగాలి. మనం ఎంత గొప్పవాళ్ళమో చెప్పొచ్చు. ఎంత ప్రిన్సిపుల్డో, ఎన్నెన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చామో చెప్పొచ్చు. సమాజం పట్ల మన బాధ్యత లాంటి బరువైన విషయాలూ చెప్పేయొచ్చు.

వినేవాడు అవకాశం ఇవ్వాలే గానీ అతగాడు ఎంత అల్పుడో జ్ఞానోదయం చేసేయొచ్చు. మనం చెప్పేవన్నీ మనం పాటించి తీరాలన్న రూలేదీ అస్సలు లేదు కాబట్టి ఎలాంటి సందేహాలకీ తావు లేదు. ...మరి వినడానికి ఎవరూ దొరక్కపోతే?? ఇది కూడా ఓ సందేహమేనా? ఇలా ఓ టపా రాసేయడమే!!

19 వ్యాఖ్యలు:

 1. మాకు జ్ఞానోదయం అయింది స్వామీ, కళ్ళు తెరిపించారు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మాకు జ్ఞానోదయం అయింది స్వామీ, కళ్ళు తెరిపించారు,
  మేమెంత అల్పులమో గ్రహింపజేసారు, నమోనమః :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బుద్ధిగా వినడం అలవాటైపోడం వల్ల మనం ఎన్నెన్ని వినగలుగుతున్నామో చూడండి. టీవీ యాంకర్ మాట్లాడే సంకర భాష మొదలు రాజకీయనాయకుడు నీతులు, బూతులు కలిపి ఇచ్చే ప్రసంగం వరకూ ప్రతిదీ వినేస్తున్నాం. నిజజీవితంలో ఆదాయంపన్ను ఎగ్గొట్టే సిని తారలు సినిమాల్లో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా తెగ బారెడు డైలాగులు చెబుతున్నా కిమ్మనకుండా వింటున్నాం. ఇలా ఎన్నెన్ని వింటున్నామో లెక్కలేసుకుంటే మనకే బోల్డంత ఆశ్చర్యం కలుగుతుంది.
  baagundandi.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళిస్వామిగారు ,మాకు జ్ఞానాన్ని ఇచ్చి ,మా కళ్ళు తెరిపించి మీరు సామెతను తిరగరాసేరు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. 'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అన్నవారే' వినదగునెవ్వరు చెప్పిన 'అన్నారందుకేనేమోనండీ :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఇకపై "రాసేవాడికి చదివేవాడు లోకువ" అనుకుందామా? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇలా ఎన్నెన్ని వింటున్నామో మరి:)
  బాగుంది.....

  ప్రత్యుత్తరంతొలగించు
 8. సామెత ను రాసే వాడికి చదివే వాడు లోకువ అనుకున్టేనో? ఏది ఏమయినా మీ పోస్ట్ బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఏంది అప్పుడే ఐపొయిందా....!! ఇంకా ఎక్వశేపు ఏమన్నా జెప్తారేమోనని ఇననీకె ఫిక్స్‌ ఐపోయిన...

  ప్రత్యుత్తరంతొలగించు
 10. వినదగు నెవ్వరు చెప్పిన.
  ఈ చెవితో విని ఆ చెవితో వొదిలెయ్య గలవాడు ధన్యుడు నన్నడిగితే.
  బాగా చెప్పారు మాష్టారూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. అలా డిసైడ్ చేసి మొత్తానికి మాకు చెపుతున్నారన్న మాట. :-) బాగుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఇది మరీ బాగుందండీ,అస్తమాను మీరు చెప్పేవి వింటూనే వున్నాము కదా :-) మేము చెప్పేవి కూడా కాస్త సహనం తో వినొచ్చు కదండీ :-(

  ప్రత్యుత్తరంతొలగించు
 13. హ హ 'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అన్న అదే నోటితో ’అడిగేవాడికి చెప్పేవాడు లోకువ’ అని కూడా అన్నారని తెలియచేసుకుంటున్నాం అధ్యక్షా..

  >>"మరి వినడానికి ఎవరూ దొరక్కపోతే?? ఇది కూడా ఓ సందేహమేనా? ఇలా ఓ టపా రాసేయడమే!!<<

  ఇది మాత్రం కరెక్ట్.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @శిశిర: ధన్యవాదాలండీ..
  @ఆ.సౌమ్య: యెంత మాట! యెంత మాట!! :-) :-) ..ధన్యవాదాలండీ..
  @రాధిక (నాని); ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @గాజుల: :-) :-) ..ధన్యవాదాలండీ..
  @పరిమళం: నిజమే సుమండీ.. ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: అనుకోవచ్చంటారా?? ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
  @భాను: :-) :-) ..ధన్యవాదాలండీ..
  @నాగార్జున: ఇంకా వింటారా? అయితే వింటూనే ఉండండి :-) :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @కొత్తపాళీ: వదిలెయ్యలేకే కదండీ... ...ధన్యవాదాలు.
  @భావన: ఎదోనండీ, ఇప్పటికిలా :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @చిన్ని: చెప్పండి, చెప్పండి.. మేము సిద్ధమే :-) ..ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: నిజమేనండోయ్ :-) :-) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు