గురువారం, సెప్టెంబర్ 02, 2010

ఏడాది తర్వాత...

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణించి ఏడాది పూర్తయ్యింది. గడచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. నాయకత్వ లోటు చాలా సార్లు స్పష్టంగా బయట పడింది. కాంగ్రెస్ అధిష్టానానికి సొంతమైన 'వేచి చూసే ధోరణి' వై.ఎస్. వారసుడి ఎంపిక విషయంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. రక్తం పంచుకుని పుట్టిన వారసుడు పదవీ వారసత్వం కోసం తన ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఆరేళ్ళ పాలనలో వైఎస్ ఇచ్చిన హామీలని అమలు పరచడం, వైఎస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నరోశయ్యకి తలకి మించిన భారంగా పరిణమించింది. వాటిని అమలు పరచలేక, అమలు పరచాలేనని చెప్పలేక రోశయ్య పడుతున్న అవస్థ వర్ణనాతీతం. ఇది చాలదన్నట్టు వైఎస్ తనయుడు పోషిస్తున్న 'అసమ్మతి' పాత్ర ప్రస్తుత ముఖ్యమంత్రికి కంటిమీద కునుకుని దూరం చేసింది.

గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరగబోతోందన్నది ఎవరి ఊహకీ అందడం లేదు. ఈ ఏడాది కాలంలోనూ పోలీసు వ్యవస్థ బాగా బలపడిందని చెప్పాలి. అలాగే న్యాయ వ్యవస్థ ప్రభుత్వం మీద చురకలు వేస్తూనే ఉంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కొత్త విషయం కాకపోయినా గడిచిన ఏడాది కాలంగా ఈ పెంపు ఊహించని వేగంతో పైపైకి పోతోంది.

ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అప్పుడప్పుడూ 'ప్రభుత్వానికి సహకరిస్తోందా?' అన్నసందేహం కలుగుతోంది. ధరల పెరుగుదల మీద అయితేనేమి, అవినీతి ఆరోపణల మీద అయితేనేమి ప్రతిపక్షం స్పందించాల్సినంతగా స్పందించడం లేదన్న భావన కలుగుతోంది. ఇక ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఏడాది కాలంగా ఎన్నో మలుపులు తిరిగింది. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణా రాష్ట్ర సమితికి బోల్డంత బలాన్నీ, స్తైర్యాన్నీ ఇచ్చాయన్నది నిర్వివాదం.

వైఎస్ కుటుంబానికి చెందిన పత్రిక, టీవీ చానల్ చెబుతున్న రీతిలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ వైఎస్ లేకపోవడంతో ముడి పెట్టలేం. అలా అని ప్రస్తుత వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తోందనీ అనలేం. రాష్ట్ర స్థాయిలో ఏ నిర్ణయాన్నీ స్వతంత్రంగా తీసుకోక పోవడం, ప్రతి చిన్న విషయానికీ కేంద్రం మీద ఆధార పడడం, 'అంతా హైకమాండే చూసుకుంటుంది' అన్న ధోరణి సమస్యలని పెంచి పోషిస్తున్నాయి.

అటు కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ప్రతి విషయానికీ నాన్చుడు ధోరణినే అవలంబిస్తోంది. రాజ్ భవన్ లో జరిగిన కొన్ని సంఘటనలు, ఫలితంగా జరిగిన కొన్ని మార్పుల నేపధ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారా? అన్న సందేహం కలిగినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పటి ప్రభుత్వానికి (?) ఏ ఇబ్బందీ లేనట్టే కనబడుతోంది. బహుశా ఇప్పటి ప్రభుత్వం అధిష్టానానికి చాలా సౌకర్యవంతంగా ఉన్నట్టుంది. రాష్ట్ర రాజకీయంలో మార్పులు తేనున్న 'వారసుడి' నిర్ణయం జరిగేవరకూ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండవనే అనిపిస్తోంది..

8 వ్యాఖ్యలు:

 1. ఆయన ఏదో గొప్ప ముఖ్యమంత్రి కాదు కానీ రాజకీయం చాతుర్యం కలవాడు బాగా.అది లోపించే వారసుడు ఇంతదాకా తెచ్చుకున్నాడు.

  >>గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరగబోతోందన్నది ఎవరి ఊహకీ అందడం లేదు.

  మా బాగా చెపారు. వైఎస్సారు పాలన అవినీతి స్వర్ణ యుగం అయినా కానీ కొంతమందిని చెప్పుకింద తేలు లా అణచిపెట్టారు. ఆయన పోయాకా ఇక వారికి అదుపు లేకుండా పోతోంది.

  ముఖ్యంగా తెలంగాణా పులకేశి కి అసలు ఇంతలా పిచ్చి ప్రేలాపనలకి ఛాన్సు ఉండేది కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >>ప్రస్తుత వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తోందనీ అనలేం.
  బాగ చెప్పారు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. >>>>రాష్ట్ర స్థాయిలో ఏ నిర్ణయాన్నీ స్వతంత్రంగా తీసుకోక పోవడం, ప్రతి చిన్న విషయానికీ కేంద్రం మీద ఆధార పడడం, 'అంతా హైకమాండే చూసుకుంటుంది' అన్న ధోరణి సమస్యలని పెంచి పోషిస్తున్నాయి..

  అయినా ఇక్కడ ప్రజల మనోభావాలు, వారి ఇబ్బందులు, ఆర్ధిక స్థితిగతులు, సమస్యలు ఇక్కడ ఉన్నవారికి బాగా తెలుస్తాయి...కానీ ఇక్కడ జరపవలసిన కార్యక్రమాలకు ఎక్కడో డిల్లీ గల్లీలో రిపోర్ట్‌లు తెప్పించుకుని,నిర్ణయాలు తీసుకునే అమ్మ, ఆమే చెంచా నాయకులు బీజం వేస్తారు...ఈ విషయంలో తమిళవాళ్ళని చాలా మెచ్చుకోవచ్చు...వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా ఇప్పటిదాక ప్రాంతీయ పార్టీలకే పెద్దపీట వేస్తూ వస్తున్నారు...ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలో ప్రధానమంత్రి పిండి ముద్ద బొమ్మల్లా కనిపిస్తున్నారు...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మన రాష్ట్ర 'ప్రజల' మనోభావాలే టపాగా రాసినట్టున్నారు!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. So true.
  If Rosayya were left to govern without interference from high command, I think he could have tackled Jagan too in an effective way, and would have exerted a positive influence on the state as a whole. This is Indira - Anjayya era all over again. History repeats itself and people deserve the government they elect!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. రాష్ట్రానికి ఇదొక సంధికాలం.
  తెలంగాణా విషయం తేలేవరకూ ఇంతే.
  పాతకాలపు కాంగ్రెస్ అధిష్టాన పరిపాలన నడుస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మిగతానాలుగేళ్ళూ రోశయ్యే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది నా అభిప్రాయం. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ విషయంలో విచ్చలవిడితనం తగ్గిందనిపిస్తుంది. దేనికి ఒకపద్దతీపాడూలేని ఒకవిషసంస్కృతి రాష్ట్రంలో పెరిగింది. నాయకుడంటే నియమనిబంధనలకు అతీతుడు, 'ఎలాగైనా' తనుకోరుకున్నది చేసితీరేవాడు, అన్నింటికీ అతీతుడు లాంటి రాజరికపువాసనలు తగ్గుతాయనుకుంటున్నా.అవినీతి లేదననను కానీ విచ్చలవిడితనం తగ్గింది. ఆ'వారసుడొ'చ్చి మనకు ఒరగబెట్టేదేమీ లేదు. మరో రెండు గనులు, పదిప్రాజెక్టులు, పథకాలకి నాన్నపేరు, ఇంకా తీరిక మిగిల్తే వంద కొత్తచర్చిలు

  ప్రత్యుత్తరంతొలగించు