బుధవారం, సెప్టెంబర్ 15, 2010

నాయికలు-సుభద్ర

జీవితం అంటే..?? ఇది అందరూ ఒకే సమాధానం చెప్పే ప్రశ్న కాదు. ప్రశ్న ఒక్కటే అయినా సమాధానాలు వేనవేలు.. సుభద్రకి మాత్రం జీవితం అంటే ఎదురు చూపు.. ఒక సుదీర్ఘమైన ఎదురు చూపు. గతాన్ని నెమరు వేసుకుంటూనే భవిష్యత్తుకోసం చూసే ఎదురు చూపు. అలా అని ఆమె వర్తమానాన్నీ, తన కర్తవ్యాన్నీ మర్చిపోలేదు.. జ్ఞాపకాల సమాధిలో కూరుకుపోలేదు. జి. కళ్యాణ రావు రచన 'అంటరాని వసంతం' లో ఒక ముఖ్య పాత్ర సుభద్ర. పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టినా పదే పదే వెంటాడే పాత్రల్లో ఒకటి.

ఎన్నెలదిన్నెలో పుట్టింది సుభద్ర. పిట్టోడి కూతురు ఆమె. "మాలింట పుట్టినా మాలక్ష్మిలా ఉంది" అని ఎన్నెలదిన్నెఊరు ఊరంతా అనుకుంది. పెద్దింటి ఆడవాళ్ళు కూడా తన కూతురిని ప్రత్యేకంగా చూసేలా పెంచాడు పిట్టోడు. ఆ పల్లెలో మోకాలి కిందకి చీర కట్టిన తొలి పడుచు ఆమె. మెడకీ, చెవులకీ బంగారాన్నీ అలంకరించుకున్నదీ, కాళ్ళకి తోలు చెప్పులు తొడిగిందీ ఆమె. అంత గారంగా పెంచాడు పిట్టోడు.. అంత అపురూపంగా పెరిగింది సుభద్ర.

అలాంటి సుభద్ర ఎల్లన్నని ప్రేమించింది. ఎల్లన్న అంటే ఆటెల్లడు, పాటెల్లడు. ఆటా పాటా అతని జీవితంలో ఒక భాగం. తల్లీ తండ్రీ ఉన్నా మేనత్త బూదేవి పెంపకంలో పెరిగాడు ఎల్లన్న. సుభద్ర మనసు తెలిసిన క్షణం నుంచీ ఎల్లన్న పాటంతా సుభద్రే అయ్యింది. చుక్కల ముగ్గుకర్ర అన్నాడు, పచ్చి పగడానివి అన్నాడు. పండు వెన్నెలవనీ అన్నాడు. బూదేవి చొరవతో వాళ్ళిద్దరి పెళ్ళీ జరిగింది.. తండ్రికి ఎదురు చెప్పి మరీ ఎల్లన్నని పెళ్లి చేసుకుంది సుభద్ర.

ఆ తర్వాత? ఎల్లన్న కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి సుభద్రకి. అప్పటికే నాటకాల్లో పేరు తెచ్చుకున్న ఎల్లన్న, తన గురువు నాగన్నతో కలిసి ప్రదర్శనలకి పొరుగూళ్ళకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మొదట పౌరాణిక నాటకాలే ఆడినా, తన కులానికి జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా తెలిశాక, తమ ఊరికథనే పాటగా మలిచాడు.. పాడడం మొదలు పెట్టాడు. ఆ పాటకి ముగింపు కేవలం శ్రోతల కళ్ళనుంచి జారే కన్నీరు కారాదనీ, వాళ్ళలో ఆలోచన మొదలవ్వాలనీ ఆశించాడు.

"కాస్త పనుంది..ఎల్లోస్తా" అని సుభద్రకి చెప్పి బయలుదేరాడు ఎల్లన్న. ఆ కాస్త పనీ అన్ని సంవత్సరాల ఎడబాటు అనుకోలేదు సుభద్ర. ఎల్లన్న ప్రతి పాట లోనూ సుభద్రని ఉంచాడు. సుభద్రకి చెబుతున్నట్టే పాడాడు. అతని పాటకి పల్లవి సుభద్ర. అల్లికకి అసలైన దారం. శివయ్యకి జన్మనిచ్చిన సుభద్ర ఎల్లన్న కోసం ఎదురు చూస్తూనే కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఏనాడూ గడప దాటి ఎరగనిది కూడా, పంట పొలానికి రావాల్సిన నీళ్ళ కోసం ఊరిని ఎదిరించి, పారతో గట్టు తెగ్గొట్టింది.

ఊరు ఆమెని చూసి భయపడింది. ఆ భయం నుంచి ఆమెని ఒక దేవతని చేసేసింది. అయినా ఏమీ మాట్లాడలేదు సుభద్ర. తన పనేదో తనది. తిరిగే ఎల్లన్న కోసం ఎదురు చూడడం, పెరిగే శివయ్య కోసం చేల గట్లకు శక్తినంతా ధారపొయ్యడం తప్ప సుభద్రకి చెయ్యాల్సింది ఇంకేమీ లేదు. అంతా ఆశే. ఎల్లన్న ఎప్పటికైనా వస్తాడన్న ఆశ. శివయ్య తండ్రి దగ్గర లేకపోయినా గొప్పగా ఎదగాలనే ఆశ.

వలస కూలీల పిల్ల శశిరేఖ పాడిన పాటలో ఎల్లన్న జాడ పట్టుకోగలిగింది సుభద్ర. "మిన్నూ పానుపు మీద.. దూదీ దుప్పటి పైన.. సుక్కాల పూలగుత్తి సూబద్రా.. నువ్వు పచ్చీ పగడానివే సూబద్రా.." అంటూ ఆ పిల్ల పాడిన పాట తనవాడు అల్లినదే అని గుర్తు పట్టింది. ఎల్లన్న-సుభద్రల సమాగమం గుండెని పిండే ఒక సన్నివేశం. సుభద్రని మర్చిపోవడం అంత తేలిక కాదు..ఎల్లన్నకే కాదు, పాఠకులకి కూడా..

5 వ్యాఖ్యలు:

 1. మరొక్కసారి చదవాలి అనిపించేలా వుంది మీ రివ్యు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను చదవవలసిన పుస్తకాల జాబితాను పెంచేస్తున్నారండీ మీరు, ఎప్పటిలాగే చాలా చక్కగా ఆవిష్కరించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. తప్పక చదవాల్సిన నవల. గుర్తుండిపోయే పాత్ర సుభద్ర. రచయిత ఈమెని ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అపురూపంగా తీర్చి దిద్దారనిపిస్తుంది. ఈ పాత్రలోని మెరుపులన్నీ మీ సహజశైలిలో ఒడుపుగా పట్టుకున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @చిన్ని: ధన్యవాదాలండీ..
  @సుభగ: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: నిజమేనండీ సుభద్ర పాత్ర చిత్రణలో రచయిత శ్రద్ధ ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది. చాలా అపురూపంగా మలిచారు ఈ పాత్రని.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చదవలేనేమోనండీ ఈ పుస్తకం..దుఖం వచ్చేస్తుందేమో..టపా చదివితేనే ఇంత బాధగా వుంది..ఇక పుస్తకం చదివితే..? అమ్మో..

  ప్రత్యుత్తరంతొలగించు