గురువారం, సెప్టెంబర్ 23, 2010

"శుభికే! శిర ఆరోహ"

అవి జాతీయోద్యమం రోజులు. జాతి యావత్తూ గాంధీజీ మాటని వేదవాక్కుగా ఆచరిస్తున్న కాలం. అత్యంత బలవంతులైన ఆంగ్లేయులపై పోరాటానికి జనం సన్నద్ధం అవుతున్న వేళ, వారికి మార్గదర్శనం చేయడానికి ముందుకొచ్చిన మహాత్ముడు జాతిని ఏక తాటిపై నిలపాల్సిన అవసరాన్ని గుర్తించాడు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం కోసం గాంధీజీ అనుసరించిన మార్గాలలో కొన్ని నూలు వడికించడం, హిందీ భాషని ప్రచారం చేయడం. బలవంతంగా హిందీని తమ మీద రుద్దడాన్ని చాలామంది వ్యతిరేకించారు. విఖ్యాత కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వారిలో ఒకరు.

హిందీ పట్ల తన వ్యతిరేక వైఖరిని వ్యక్తపరుస్తూ తనదైన హాస్య వ్యంగ్య ధోరణిలో శాస్త్రిగారు 1942 లో రాసిన కథ "శుభికే! శిర ఆరోహ." కథాస్థలం రాజమండ్రిలో న్యాయవాది జగ్గప్ప ఇల్లు. ముదుసలి తల్లి, భార్య రత్తమ్మ, ఇద్దరు కుమార్తెలు జానకి, అన్నపూర్ణ, ఇదీ జగ్గప్ప కుటుంబం. కళా సంస్కృతులంటే యెంతో మక్కువ జగ్గప్పకి. కూతుళ్లిద్దరికీ కర్ణాటక సంగీతం నేర్పిస్తూ ఉంటాడు. పెద్దమ్మాయి జానకి పదహారేళ్ళ పిల్ల. ఆమెని తమ కోడలిగా చేసుకోవాలని జగ్గప్ప అక్కలు గంగమ్మ, రంగమ్మ ల కోరిక. తమ్ముడితో పెళ్ళిసంబంధం మాట్లాడ్డం కోసం వాళ్ళిద్దరూ తమ కొడుకులని తీసుకుని రాజమండ్రి వస్తారు.

రంగమ్మ కొడుకు రామేశం లా చదివాడు. కాకినాడలో న్యాయవాదిగా పనిచేస్తూ ఏడాదికి రెండువేల వరకూ సంపాదిస్తున్నాడు. అయితే జగ్గప్ప తల్లి ముసలమ్మగారికి మాత్రం మనవరాలిని గంగమ్మ కొడుకు 'రొమేష్' కి ఇచ్చి చెయ్యాలని ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చదువుకుంటున్న రొమేష్ కి ఆమాత్రం డబ్బు నెలజీతంగా వచ్చే ఉద్యోగమే అవుతుందని ముసలమ్మగారికి గట్టి నమ్మకం. పుట్టి పెరిగిందీ, ఉంటున్నదీ ఏలూరులోనే అయినా కొన్నాళ్ళపాటు కలకత్తాలో చదివి, ప్రస్తుతం కాశీలో చదువుకుంటున్న రొమేష్ దృష్టిలో సంప్రదాయం అంటే ఉత్తరాది వాళ్ళదే. సంగీతం, కళలు, ఒకటేమిటి ప్రతి ఒక్కటీ వారినుంచే నేర్చుకోవాల్సిందే.

"జారిపోతుందా అన్నట్టు వొదులు వొదులుగా బిళ్ళగోచీ పెట్టి పంచె కట్టుకునీ, దానిమీద మోకాళ్ళ దాకా పల్చని బెంగాలీ లాల్చీ వేసుకునీ, దానిమీద హిందూస్తానీ పొట్టికోటు తొడుక్కునీ, నెత్తిన లేసుగుడ్డ టోపీ పెట్టుకునీ ఉన్నాడతను. బీడీ వొకమాటు నోట ఉంచుకుని పీలుస్తూ, వొకమాటు తీసేసుకుంటూ, మధ్య మధ్య రకరకాలుగా పొగ విడుస్తూ, ఫ్రెంచి కట్టింగు మీసాలు కూడా సవరించుకుంటూ పోజుమీద పోజుకూడా మారుస్తూ ఉన్నాడతను." ఇదీ రొమేష్ పాత్ర పరిచయం. అతను మిఠాయి అంగడి మీద కూర్చునే వాడిలా కనిపిస్తాడు జగ్గప్ప, రత్తమ్మలకి.

తల్లి గంగమ్మ చేత హిందీ పరీక్షలు రాయించడమే కాదు, ఇంట్లో హిందీలోనే మాట్లాడాలనీ, తమ సంప్రదాయం కాకపోయినా నెత్తిమీద ముసుగు విధిగా ధరించాలనీ కచ్చితంగా చెప్పేస్తాడు రొమేష్. కొడుకు 'గొం-గామాయ్' అని పిలవగానే ప్రాణాలు లేచొస్తాయావిడకి. "గొంగ అంటే తెనుగులో శత్రువు, తెలుసా?" అని జగ్గప్ప అడిగితే, "వెధవ తెలుగు ఫోనిస్తూ తమ్ముడూ!" అనేశారావిడ. మొన్నటివరకూ వాల్మీకం చదివిన గొం-గామాయ్ గారు ఇప్పుడది పక్కన పెట్టేసి తులసీదాస్ రామాయణం పారాయణం చేస్తున్నారు. రాత్రి వేళ అన్నం బదులు గోధుమ రొట్టెలే తింటున్నారు, వరి అన్నంలో ఏమీ లేదనీ, రొట్టెలే బలమనీ 'నాయన' చెప్పాడు మరి.

పెళ్లికాగానే జానకిని 'నాయన' కి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచనలు చేస్తూ ఉంటుంది గంగమ్మ. ఆమెకి హిందూస్తానీ సంగీతం చెప్పిస్తాననీ, అన్నం బదులు గోధుమ రొట్టెలే తినాల్సి ఉంటుందనీ, నెత్తిమీద ముసుగు తప్పనిసరిగా ధరించాల్సిందేననీ తన తల్లితో చెప్పేస్తుంది. మరోపక్క మనవరాలికి రొమేష్ సంబంధం ఖాయం చేయడానికి ముసలమ్మగారు తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

గంగమ్మకి రంగమ్మ పోటీ వస్తుందేమో అని ఆవిడకి ఏమూలో భయం లేకపోలేదు. ఓ మంచి ముహూర్తం చూసి, సంగీతం మేష్టారిని పిలిచి జానకి కచేరీ ఏర్పాటు చేస్తుందావిడ. కచేరీ తర్వాత అక్కాబావాలకి మంగళ హారతి ఇవ్వమని అన్నపూర్ణని ఆదేశిస్తుందావిడ. పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి పురోహితుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కచేరీ ముగింపులోనే కథకి ఆసక్తికరమైన, హాస్యస్పోరకమైన ముగింపు ఇచ్చారు రచయిత.

విశాలాంధ్ర ప్రచురించిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మూడు కథల సంపుటాల్లో రెండో సంపుటంలో ఉందీ కథ. ముప్ఫై పేజీల కథలో ప్రతి పాత్రనీ, సన్నివేశాన్నీ కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు రచయిత. శాస్త్రిగారి ప్రతి కథా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేదే. ప్రస్తుతం ఈ సంపుటాలు అందుబాటులో లేవు. త్వరలోనే 'విశాలాంధ్ర' నుంచి కొత్త ప్రింటు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

14 వ్యాఖ్యలు:

 1. నాకు చాలా ఇష్టమయిన కథ ఇది. ఎంతో కాలంగా ఈ కథ గురించి రాద్దామని అనుకుంటూ కుదరలేదు. నాకు కుదరకపోవడమే మంచిదయ్యింది, మీరు చాలా బాగా విశ్లేషించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "శాస్త్రిగారి ప్రతి కథా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేదే"...ఎంత అలవోకగా అనేశారండీ.
  ఒక్కసారి చదవడానికే నాకు సృష్టి తలక్రిందులైనంత పనైంది. అయినా పట్టు పట్టి సాధించాననుకోండీ..బాగుంది పుస్తకం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈపుస్తకం సంగతి కరుణానిధికి చెప్తే తమిళంలో అనువాదహక్కులు కొనేసుకుని, కార్యకర్తలందరికీ ఉచితపంపిణీ కార్యక్రమం పెట్టించి, రెండేళ్ళ తర్వాత సిలబస్లో కలిపేస్తాడు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అత్యద్భుతమైన కథ.
  శ్రీపాదవారి వ్యంగ్యం, హాస్యం .. అబ్బో. ఈ కథలో పదేళ్ళ పిల్ల అన్నపూర్ణ పెద్దబావకి పెట్టే చురకలు - బ్రమ్మాండం!
  పనిలోపనిగా తమ జాతి సంస్కృతి వైభవాల్లోని విశిష్టతని గుర్తించుకోలేని తోటి తెలుగు దద్దమ్మలకి గూడా బాగానే వాతలు పెట్టారు శ్రీపాదవారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నా దగ్గర కొన్ని శ్ర్రీపాద వారి సంపుటిలు ఉన్నాయి కానీ, వాటిల్లో ఈ కధ లేదే!! ఇంకోసారి వెతికి అప్పుడు మీ టపా చదువుతా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నమస్తే మురళి గారు, మీ బ్లాగ్లో కమెంట్ రాయడం మొదటిసారి..మీ టపాలు ఇదివరకు చదివాను...చాలా బాగున్నాయి..మీ ఉషా పరిణయం, కన్నయ్య కనిపించడేం...నాయికల్లో సుభద్ర బాగున్నాయి......కాని ఇంకా బోలెడు టపాలు చదవాలి..
  కాని ఈ టపా చదివాక వెంటనే గూగ్లించాను మీరు చెప్పిన కథ దొరుకుతుందా అని...ఇది వృథా ప్రయత్నెమేమో అని అనిపించింది...మీరు ఈ కథ కి సంబంధించిన లింక్ కాని , ఆ కథా సంపుటి వివరాలను కాని ఇస్తే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇప్పుడే ఈ పుస్తకం చదివెయ్యాలనిపించేటట్లు పరిచయం చేస్తారు మీరు పుస్తకాలని. తప్పక చదువుతా ఈ పుస్తకాన్ని. నేను ఈ మధ్యే చిలకమర్తి వారి రామ చంద్ర విజయం చదివాను. బాగుంది అది కూడా. వీలయితే చదవండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @ స్నిగ్ధ .. శ్రీపాదవారి కథలేవీ జాలంలో అచ్చులో ఉన్నట్టు లేవు.
  మీరు గనక ఆంధ్రదేశంలో నివాసమున్నట్లయితే విశాలాంధ్ర షాపుల్లో ప్రయత్నించవచ్చు. వివరాలకి ఈ టపా చూడండి.
  http://kottapali.blogspot.com/2010/01/4.html

  శ్రీపాదవారిదే ఇంకో ప్రసిద్ధ కథ మార్గదర్శి శ్రవ్యకం ఇక్కడ వినవచ్చు.

  http://kottapali.blogspot.com/2009/09/blog-post_25.html

  ఇంకోకథ గూడుమారిన కొత్తరికం గురించి ఇక్కడ
  http://kottapali.blogspot.com/2008/03/blog-post_04.html

  @ప్రణీతస్వాతి - ఏంటో చాలా డేమేజింగ్ స్టేట్‌మెంట్లు చేస్తున్నారు. సృష్టి ఎందుకు ఎలా తల్లకిందులైందో వివరించ ప్రార్ధన

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @అఫ్సర్: మీరుకూడా తప్పకుండా రాయండి.. ఒక్క టపానే రావాలని ఏమీ లేదు కదండీ.. ధన్యవాదాలు.
  @ప్రణీత స్వాతి: కొత్తపాళీ గారి ప్రశ్నే నాదీనండి.. మీ జవాబు కోసం వెయిటింగ్.. వ్యావహారికంలోనే ఉంటుంది కదండీ?? ..ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: నిష్టుర సత్యం చెప్పారండీ.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: పనిలోపనిగా కాదండీ, అసలు పనిగానే.. ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @మేధ: మీదగ్గరున్నవి ప్రగతి పబ్లిషర్స్ వాళ్ళ ప్రచురణ అయినట్టయితే 'మార్గదర్శి' అనే సంపుటిలో మొదటి కథ ఇదేనండీ.. ధన్యవాదాలు.
  @స్నిగ్ధ: కథాసంపుటి గతంలో విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించారండీ, మొత్తం మూడు సంపుటాలు. ప్రస్తుతం స్టాక్ అయిపొయింది. మీరు ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నట్టైతే మీకు దగ్గరలోని విశాలాంధ్ర షాపులో ఒకసారి ప్రయత్నించండి.. అదృష్టవ శాత్తూ దొరకొచ్చు. ప్రగతి ప్రచురణలు వాళ్ళు నాలుగైదు సంపుటాలు ప్రచురించారండీ.. ఇవి కూడా తక్కువ కాపీలే అందుబాటులో ఉన్నాయి. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, దిశా పుస్తకాల షాపుల్లో ప్రయత్నించండి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
  @రిషి: చిలకమర్తి వారిని పలకరించి చాలా రోజులయ్యిందండీ. తప్పక చదువుతాను. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మురళీ గారూ, కొత్తపాళీ గారూ..నా తెలుగు భాషా పాండిత్యం(టపా కూడా రాశానుగా) తెలిసి కూడా అలా అడుగుతారేంటండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కొత్తపాళీ గారికి,మురళి గారికి,

  అడగ్గానే వివరాలు అందించినందుకు నెనర్లండీ. బహుశా నాకు బెంగళూరులో దొరక్కపొవచ్చెమో అండీ.ఏదైనా exhibitions లో చూడాల్సిందే...

  ప్రత్యుత్తరంతొలగించు
 13. హమ్మయ్య ! మీరు ప్రస్తావించిన కథ నేను కూడా ఎప్పుడో చదివానహో.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @ప్రణీత స్వాతి: శాస్త్రి గారు వ్యావహారికమే వాడారు కదా అని ఆశ్చర్యం అండీ..
  @స్నిగ్ధ: మీ వ్యాఖ్యని తెలుగులో రాయడానికి ఈ లంకె ఉపయోగపడుతుంది చూడండి..
  http://www.google.com/transliterate/
  @వాసు: మీదగ్గర ప్రగతి వారి పుస్తకాలు ఉన్నట్టున్నాయి కదండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు