బుధవారం, సెప్టెంబర్ 22, 2010

సరదాగా కాసేపు

చాలా రోజుల తర్వాత వంశీ సినిమాని రిలీజ్ రోజు రిలీజ్ షో చూడలేదు. వంశీ కూడా చాలా రోజుల తర్వాత పూర్తిగా కూర్చుని చూడగలిగే సినిమా ఇచ్చారు. సినిమా పేరు 'సరదాగా కాసేపు.' కాసేపే సరదాగా ఉంటుందని టైటిల్ లో చెప్పకనే చెప్పేశారు. అక్కడక్కడా రొడ్డకొట్టుడు కనిపించినా, మొత్తానికి సరదాగానే సాగిందీ సినిమా. వంశీ సినిమాల్లో మెజారిటీ సినిమాల్లాగే ఇదికూడా సింగిల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ. ఈ కథని తనకి కొట్టిన పిండైన కామెడీ చట్రంలో బిగించి రెండున్నర గంటల సినిమాగా మలిచాడు దర్శకుడు.

ఓ కోటీశ్వరుడి కొడుకు శ్రీనివాస్ ('అష్టా చమ్మా' ఫేం అవసరాల శ్రీనివాస్) అతని కారు డ్రైవర్ రంగబాబు (అల్లరి నరేష్) ల కథ ఇది. ఫారిన్ నుంచి చదువు పూర్తి చేసి వచ్చిన శ్రీనివాస్ కి పెళ్లి సంబంధం సెటిల్ చేసి ఉంచుతారు తలిదండ్రులు. వధువు మణిమాల (నూతన నటి మధురిమ) ఓ రిటైర్డ్ జైలర్ రాజారావు (ఆహుతి ప్రసాద్) కూతురు. పెళ్ళికి ముందు ఓ పది రోజులు అమ్మాయి ఇంట్లో గడిపి, ఆమె కుటుంబ సభ్యులందరినీ స్టడీ చేశాక గానీ పెళ్ళికి ఒప్పుకోనంటాడు శ్రీనివాస్.


అతని తలిదండ్రులు ఆమె తల్లిదండ్రులని ఒప్పించడంతో అమ్మాయిని చూడ్డానికి రంగాబాబుతో కలిసి అమ్మాయి ఊరు హైదరాబాద్ బయలుదేరతాడు, అమెరికన్ యాక్సంట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, అమెరికన్ రోడ్ల మీద డ్రైవ్ చేసినట్టే కారు డ్రైవ్ చేస్తూ. శ్రీనివాస్ అతి తెలివి కారణంగా సృష్టించుకున్న సమస్యలు అత్తవారింట్లో అతనికోసం ఎదురు చూస్తూ ఉంటాయి. తొలిచూపులోనే మణిమాలతో ప్రేమలో పడిపోయిన రంగబాబు పరిస్థితులని తనకి అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు? తన ప్రేమని పెళ్ళివరకూ ఎలా తీసుకెళ్లగలిగాడు? అన్నది మిగలిన కథ.

రాజారావు మిలటరీ డిసిప్లిన్, అతని సోదరుడు నీలకంఠం (ఎమ్మెస్ నారాయణ) అమాయకత్వంతో కూడిన మంచితనం మొదటి సగంలో చక్కని హాస్యాన్ని పుట్టించినా రెండో సగానికి వచ్చేసరికి విసుగు కలిగిస్తాయి. ముఖ్యంగా నీలకంఠం లాయర్ చిట్టిరాజు (కృష్ణ భగవాన్) నీలకంఠం నుంచి డబ్బులాగే సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా ఉన్నాయి. అయితే చిట్టిరాజుకి రంగబాబు కౌంటర్ ఇచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈమధ్య వచ్చిన వంశీ సినిమాల్లో కామెడీ తో పోలిస్తే ఈ సినిమాలో సన్నివేశాలు చాలా నయమనే చెప్పాలి.


ప్రధాన పాత్రలు పోషించిన అల్లరినరేష్, అవసరాల శ్రీనివాస్ లు తమ పాత్రలకి న్యాయం చేశారు. అల్లరి నరేష్ మీద కొన్ని టైట్ క్లోజప్ షాట్లు తీయకుండా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. కథానాయిక మధురిమకి అందమైన కళ్ళున్నాయి. కానీ ఆ కళ్ళలో ఎలాంటి ఎక్స్ప్రెషనూ పలికించాల్సిన అవసరం కానీ, పలికించడానికి అవకాశంకానీ లేని పాత్ర. మిగిలిన వాళ్ళంతా సీజండ్ ఆర్టిస్టులే, వాళ్ళ వాళ్ళ శైలిలో చేశారు. లోకి సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ, ప్రారంభ సన్నివేశాల్లోనూ, నాయిక పరిచయ సన్నివేశంలోనూ క్లారిటీ లోపించినట్టుగా అనిపించింది. ఒకవేళ థియేటర్లో సమస్యేమో తెలీదు.

చక్రి సంగీతం ఎప్పటిలాగే ఇళయరాజా సంగీతాన్ని గుర్తు చేసింది. ఒకపాటకి స్టీలు డబ్బాలు, బిందెలు, కుండలతో వేసిన సెట్ ఆకట్టుకుంది. పాటలన్నీ ఒకలాగే వినిపించాయి. పూర్తి వంశీ మార్కు చిత్రీకరణ. ఒక్క 'నవ్వు' పాటలో మాత్రమే గోదారి కనిపించింది. మొత్తం మీద 'ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!!' తర్వాత (ఆ స్థాయిలో లేనప్పటికీ) ఆసాంతమూ కూర్చుని చూడగలిగే సినిమాగా చెప్పాలి ఈ 'సరదాగా కాసేపు'ని. స్క్రిప్ట్ (ముఖ్యంగా రెండో సగం), డైలాగులు, సన్నివేశాల చిత్రీకరణ పరంగా మరికొంచం వైవిధ్యాన్ని చూపించగలిగితే మరింత చక్కని సినిమాగా అయి ఉండేది. అయితే, నెమ్మదిగా అయినా సరే.. వంశీ మళ్ళీ ట్రాక్ లో పడుతున్నాడన్న ఆనందాన్ని మిగిల్చిన సినిమా ఇది

13 వ్యాఖ్యలు:

 1. ఐతే చాలా రోజులతరువాత వంశిగారి నుండి ఒక మంచి సినిమా వచ్చిందా....
  .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రిలీజ్ కు ముందురోజు -- క్రితం ఏడాది గో.గో.గో కి శెలవుపెట్టి మరీ వెళ్ళానని మీరు రాసిన టపా,జరిగిన హాడావుడి గుర్తువచ్చి ఈసారి తొందరపడి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళకండి అని రాద్దాం అనుకున్నా...
  రిలీజ్ అయ్యి వారమౌతున్నా సినిమా రివ్యూ ఇంకా రాయలేదేంటా అనుకున్నా...
  హమ్మయ్య మొత్తానికి రాసేసారు...:)
  పాటలు విన్నాకా నాకైయితే చూసే ధైర్యం చెయ్యాలనిపించలేదండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ రోజే వంశీ ఇంటర్వ్యూ చూశాను అంధ్రజ్యోతి చానల్లో, కొంచెం జాలి కొంచెం ఆశ్చర్యం కలిగాయి మనుషుల్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించింది, మీ టపా చూశాక కొంచెం సంతోషం వేసింది ఎలాగూ గో గో గో చూడలేదు ఈ సినిమా మిస్సవకుండా చూడాలి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ మద్య సినిమాలు చూడక చాలా రోజులైంది . ఐతే ఈ సినిమా చూడొచ్చు అంటారు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఇలాంటి సినిమా వచ్చిందని కూడా తెలీదు. పోస్టర్లు బాగున్నాయి. మీరు మేము చదవాల్సిన బుక్సే కాకుండా చూసే సినిమాల లిస్ట్ కూడా పెంచేస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. థాంక్స్ ఫర్ పాజిటివ్ రివ్యూ . సినిమా చూడాలి అయితే !

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వో ఈ సినిమా రిలీజ్ అయ్యిందా.హమ్మయ్య పోనీలే కాస్త చూడబుల్ సినిమా వచ్చిందన్నమాట చివరాఖరికి. మా వూరులో ఇంకా రాలేదు. :-(

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మురలిగారూ!నేను రిలీజ్ రోజే చూసేశానోచ్ ... పాటలు వంశీగారి స్టైల్లో డిఫరెంట్ గా ఉన్నాయి. సినిమాని హాయిగా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు.కాకపొతే మీరన్నట్టు కృష్ణభగవాన్ ,చిట్టిరాజుల ప్లాన్లు,ఆహుతిప్రసాద్ పనిష్మెంట్లు...కాస్త ఓవర్ అయ్యాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. "అయితే, నెమ్మదిగా అయినా సరే.. వంశీ మళ్ళీ ట్రాక్ లో పడుతున్నాడన్న ఆనందాన్ని మిగిల్చిన సినిమా ఇది" నేను హాలునుండి బయటకి వస్తూ సరిగ్గా ఇదే మాట అనుకున్నాను మురళి గారు. ఇదే ట్రెండ్ లో స్క్రిప్ట్ వర్క్ ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకుని ప్రయత్నిస్తే ఒకప్పటి మ్యాజిక్ మళ్ళీ చూడచ్చేమో అని ఆశకలిగించిన సినిమా ఇది. డైలాగ్స్ లో కూడా కాస్త స్పీడ్ తగ్గించాలి. హడావిడి గా పంచ్ డైలాగ్స్ తో కామెడీ చొప్పించాలనే ప్రయత్నం ఇంకాస్త అదుపులో పెట్టుకోవాలి. కానీ శ్రీనివాస్ ని అనవసరంగా ఈ క్యారెక్టర్ కి బలి చేశారు అనిపించింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @రాధిక (నాని): ఈమధ్య తీసిన సినిమాలతో పోలిస్తే పర్లేదు అనిపించిందండీ.. ధన్యవాదాలు.
  @తృష్ణ: పాటలన్నీ ఒకే మూసలో పోసినట్టు ఉన్నాయండీ.. సినిమా పర్లేదు.. ధన్యవాదాలు.
  @వెంకట్: గోగోగో చూడనందుకు రిగ్రెట్స్ అవసరం లేదండీ.. ఇది పర్లేదు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @మాలాకుమార్: మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి.. ధన్యవాదాలు.
  @జయ: నెమ్మదిగా చూడండి పర్లేదు :-) ..ధన్యవాదాలు.
  @a2z dreams: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @భావన: అవునండీ, ఎట్టకేలకి :-) ..ధన్యవాదాలు.
  @పరిమళం: అదేదో సామెత ఉంది కదండీ 'గుడ్డిలో మెల్ల' అని.. అలా సరిపెట్టుకోవడమే.. ధన్యవాదాలు.
  @వేణూశ్రీకాంత్: శ్రీనివాస్ పాత్రని యాక్టివ్ గా మారిస్తే అల్లరి నరేష్ పాత్ర ప్రాధాన్యత తగ్గిపోతుంది కదండీ.. అందుకని పాసివ్ చేసి పారేసినట్టున్నారు. కామెడీ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. గోపీ-గోపిక-గోదావరి చూసి గోదాట్లో మునిగి అతి కష్టం మీద పైకి తేలిన ఫీలింగ్ కలగడం వల్ల ఇంక వంశీ సినిమాలు చూడకూడదనిపించిందండి. కానీ మీ పాజిటివ్ రివ్యూ చదివాక మీరు చెప్పారన్న భరోసాతో ఈ సినిమా చూస్తాను. :)

  ప్రత్యుత్తరంతొలగించు