సోమవారం, సెప్టెంబర్ 06, 2010

శనగలమాసం

"ఇవ్వాళ శనగలు సాతాళించొద్దమ్మా.. మాటోళీ చేసుకుందాం. లేకపొతే వడలేసినా సరే.." అమ్మా, బామ్మా పేరంటానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగానే రాబోయే శనగలని ఏం చేయాలో నిర్ణయించేశాను నేను. శనగలతో బోల్డన్ని వంటకాలు చేసుకోవచ్చు కదా మరి. "మాటోళీ ఏవిటి మాటోళీ? పాటోళీ అనాలి. వెనకటికి నీలాంటి వాడే, చదువుకి ముందు కాకరకాయ్, చదువయ్యాక కీకరకాయ్ అన్నాట్ట.." బామ్మింకా ఏమో అనేదే కానీ తాతయ్య నన్ను రక్షించేశారు "వాడు సరిగ్గానే చెప్పేడు లేవే.. నువ్వు చేసేదాన్ని మాటోళీ అనే అనాలి..."

బామ్మ మాట తిరగెయ్యబోయింది కానీ అప్పుడే గేటు దాటి లోపలికి వస్తున్న ఆడవాళ్ళని చూసి ఆగిపోయింది. పట్టు చీరలు కట్టుకుని, బోల్డన్ని నగలు పెట్టుకుని వచ్చారు వాళ్ళు. మరి పేరంటానికి వెళ్ళాలంటే అలాగే తయారవ్వాలి కదా. అమ్మ, బామ్మా కూడా తయారైపోయారు. అసలు శ్రావణ మాసం వస్తుందనగానే తనకి ఉన్న రెండు పట్టు చీరలూ గుర్రమ్మకి వేసేస్తుంది అమ్మ, ఓ వంద జాగ్రత్తలు చెప్పి. పేరంటానికి పట్టు చీరలే కట్టుకుని వెళ్లాలని అమ్మ సిద్ధాంతం. బామ్మేమో కొత్తచీర పట్టుచీరతో సమానం అంటుంది.

రోజూ ఇంట్లో సరిగ్గా ముడైనా వేసుకోకుండా ఉంటుందా? పేరంటం అంటే బామ్మ ఎంత బాగా తయారవుతుందో. జుట్టు ముడేసి దానికి ఒక బన్ను పెడుతుందా.. అది జారి పడిపోకుండా ఇంగ్లిష్ 'యు' లా ఉండే పిన్నులు గుచ్చుతుంది. ఆ పిన్నులు కనిపించకుండా పైన పూలదండ. కొత్త చీర కట్టేసుకుని, నుదుటిమీద గుండ్రంగా సబ్బు రాసుకుని, ఆ తడిలో రాళ్ళ కుంకం దిద్దుకుంటే బామ్మ తయారైపోయినట్టే. అప్పటికే ముస్తాబులై వచ్చిన స్నేహితురాళ్ళు "ఆలీసం అయిపోతోంది.. తొరగా వచ్చేయండి.." అని తొందర పెట్టగానే అత్తా కోడళ్ళిద్దరూ పేరంటానికి బయలుదేరతారన్న మాట.

శ్రావణ మంగళవారం అంటే కనీసం అరడజను పేరంటాలు తప్పకుండా ఉంటాయి ఊళ్ళో. ఇవి కాకుండా ఇంటికొచ్చి వాయినం ఇచ్చేవాళ్ళు సరేసరి. ఇంటినిండా వద్దంటే శనగలు. సాతాళింపు, వంకాయి-శనగల కూర, శనగ వడలు, పాటోళీ...నెలంతా ఇవే వంటకాలు మాకు. అసలు ఈ పేరంటానికి వెళ్ళడం ఓ పెద్ద ప్రహసనం. మధ్యాహ్నం పేరంటానికి పొద్దున్న నుంచీ హడావిడి. మధ్యాహ్నం కాఫీలవ్వగానే బయలుదేరతారా, మళ్ళీ దీపాలు పెట్టే వేళకి ఇళ్ళు చేరేవాళ్ళు. మామూలుగా అయితే మగ పిల్లలకి పేరంటాల్లో ప్రవేశం లేదు.. మరి నాకు ఎలా దొరికిందంటే.. బోల్డు బోల్డు శనగలు పట్టుకుని ఒక్కసారే ఇంటికి రావడం అమ్మకీ, బామ్మకీ కష్టం కదా అందుకని నేను ప్రతి పేరంటానికీ వెళ్లి శనగలు ఇంటికి చేరేసే వాడినన్న మాట.

నేనలా పేరంటాలకి వెళ్ళడం బామ్మకి నచ్చేది కాదు. "వీడెందుకూ పోతు పేరంటాల్లా.." అనేది కానీ, నేనస్సలు పట్టించుకునే వాడిని కాదు. పేరంటంలో తను ఏం మాట్లాడిందో నేను తాతకి చెప్పేస్తానని బామ్మ అనుమానమని నాకు తర్వాతెప్పుడో తెలిసింది. అమ్మ నన్ను వద్దు అనేది కాదు కానీ బోల్డన్ని జాగ్రత్తలు చెప్పేది. ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి నా అభిప్రాయాలు చెప్పొద్దని మరీ మరీ చెప్పేది. అలా పిలవని పేరంటంలా మాట్లాడకూడదుట కదా, అందుకన్న మాట. నేను అప్పుడప్పుడూ జాగ్రత్తగానే ఉండేవాడిని.

పేరంటం శనగల్లో వేసే కొబ్బరి ముక్కలు ఎంత బాగుంటాయో. శనగలు ఇంటికి తెచ్చినప్పుడల్లా నేను కొన్ని కొబ్బరి ముక్కలు నోట్లో వేసుకుని (అన్నీ తీసేసుకుంటే బామ్మకి అనుమానం వస్తుంది) దేవుడి గూట్లో నైవేద్యం కోసం పెట్టిన బెల్లం ముక్కలు కూడా బుగ్గన వేసుకుంటూ ఉండేవాణ్ణి.. అలా నోట్లోనే కొబ్బరి లౌజు తయారు చేసుకునే ఏర్పాటు ఉండేది. ఒక్కోసారి శనగలు మరీ ఎక్కువ వస్తే అమ్మ కొన్నింటిని ఆవుకి పెట్టేసేది. "పాడు చేసుకునే కన్నా, దూడకి పెడితే పుణ్యం" అంటూ.

అసలు పేరంటంలో ఎన్నేసి విషయాలు మాట్లాడుకుంటారంటే.. కొత్తగా చేయించుకున్న నగల మొదలు, రేడియోలో వచ్చే నాటకాల వరకూ దొర్లని టాపిక్ ఉండదు. పిల్లల చదువులు, పక్కింటి వాళ్ళతో గొడవలు..ఇవన్నీవినిపిస్తూ ఉండేవి. ఒక్కోసారి మాటా మాటా పెరిగి సిగపట్ల వరకూ వెళ్ళిపోయేది వ్యవహారం. మళ్ళీ వాళ్ళలో వాళ్ళే సర్దుబాటు చేసేసుకునే వాళ్ళు. ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు. అందుకేనేమో బామ్మెప్పుడూ పేరంటం మిస్సయ్యేది కాదు. ఇప్పుడెక్కడా అలాంటి సందడి కనిపించడం లేదు.. కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..

21 కామెంట్‌లు:

  1. బావుంది.

    పాటో ళి మా ఇంట్లో కూడా చేస్తారు కానీ పెసర పప్పుతో చేస్తారు. భలే బావుంటుంది. శెనగలది
    ఒరిజినల్ వంటకం ఏమో.

    చాలా మందికి ఈ పేరు తెలియదు.

    రిప్లయితొలగించండి
  2. "ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు. అందుకేనేమో బామ్మెప్పుడూ పేరంటం మిస్సయ్యేది కాదు".బాగా చెప్పారు.

    కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..ఇదొక్కటేనా కొన్నాళ్ళకి మనం అన్నం తినేవాళ్ళం,ఇంట్లో వంటలు వండుకునేవాళ్ళం,పండగలు చేసుకునేవాళ్ళం,అందరం కలిసుండేవాళ్ళం లేకపోతే పండక్కి అందరూ కలుసుకునేవాళ్ళం,ప్రతీ ఊర్లోనూ ఒకటో రెండో చెరువులుండేవిట,వాటి పక్కనే దేవుడి గుళ్ళుండేవిట,ఒక్కో పండక్కి ఒక్కోవిధంగా సంబరాలు జరిగేవిట,ఆడోళ్ళు మొహాన కుంకుమ బొట్టేట్టుకునేవారుట,పెళ్ళిచూపులని ఓ తంతు జరిగేదిట,మంగళసూత్రాలని ఏవో ఆభరణం ఉండేదిట,విడాకులంటే అదేమిటది మామిడాకుల్లా ఇంకో రకం ఆకులా అని అడిగేవారనీ,పోస్టల్‌కార్డుమీద ఉత్తరప్రత్యుత్తారాలు జరిగేవిటని ఇలా చాలా చెప్పుకోవచ్చు కాశీ మజిలీ కధల్లాగ వినే ఓపికుంటే.

    రిప్లయితొలగించండి
  3. చిన్నప్పటి పేరంటాలను గుర్తు చేసేరు. అదే కాదు పాట పాడు పాట పాడూ అనే వారు, తీరా ఆ అమ్మాయి పాడుతుంటే ఒక్కరూ వినే వారు కాదు, ఐనా మొదలెట్టీన పిల్ల పూర్తి చేసి కాని వదిలేది కాదు. నాకు మాత్రం చాలా కోపం వచ్చేది ఆ అమ్మాయి ని బలవంతం చేసి మరి ఇప్పుడూ ఇలా ముచ్చట్లు ఆడతారేమిటీ అని. అలా తిని తినే నాకు శనగలన్నా, లడ్డులన్నా, బాదుషా (ఇదోరకం స్వీట్ తెల్లగా వుండెది అందరికి తెలుసో లేదోఈ పేరు తో) లన్నా విరక్తి వచ్చేసింది.

    రిప్లయితొలగించండి
  4. బాగుందండి మీబామ్మ గారి పేరంటం ముచ్చట్లు.మీ రన్నది నిజమే నండి .మా ఊరు పల్లెటూరు అయినా మేము ఇప్పుడే పేరంటాల కు వెళ్లడం లేదండి.ఇంకా కొన్ని సంవత్సరాలైతే పుస్తకాలలో చదువుకోవాల్సిందే మన తరువాత తరాల వారు.

    రిప్లయితొలగించండి
  5. Naaku baga nachindhi........ achu palletooru vasana vasthundhi mee senagalamasam... I love it.

    రిప్లయితొలగించండి
  6. జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. ప్రతీ జ్ఞాపకాన్నీ ఇలా రాయగలగడం మాత్రం అందరివల్ల కాదు. మా ఊరూ, నా చిన్నతనం గుర్తొచ్చేసింది. :)

    రిప్లయితొలగించండి
  7. నిజమేనండీ...ఇప్పుడు పేరంటాలు కరువై పోయాయి శ్రావణశుక్రవారం వచ్చినా ఏదో ఫ్లాట్ లో వారికి తాంబూలం ఇవ్వటమే కాని శనగలు నానబోసి ఇవ్వటం అరుదైపోయింది. ఏమైనా మీ టపా చదివాక శ్రావణ మాసం పేరంటాల గురించి రాయాలన్న ఐడియా నాకెందుకు రాలేదా అనుకొంటున్నా :( పట్టు పరికిణీ కట్టుకొని బురద అంటకుండా పైకేత్తిపట్టుకొని (అసలు సంగతి కాళ్ళకు పెట్టుకున్న మువ్వల పట్టీలు, పారాణీ కనపడాలని :) ) అమ్మవెనకాల పేరంటానికి వెళ్ళటం...అక్కడ అంతా పాటలు పాడుతుంటే నేనూ వరవీణా మృదుపాణీ ...పాడటం ( అదొక్కటేనా అన్న సందేహం వద్దు అక్కడితో మన సంగీత మహాయానం ఆగిపోయిందిలెండి :) అన్నీనిన్నో మొన్నో జరిగినట్టుకళ్ళముందు కొచ్చేశాయ్ ...థాంక్స్ మురళిగారూ !

    రిప్లయితొలగించండి
  8. బ్రిలియంటున్నర!
    "నేను అప్పుడప్పుడూ జాగ్రత్తగానే ఉండేవాడిని." - బావుంది.
    కొబ్బరిలౌజు ఏర్పాటు మరీ బావుంది సార్.

    రిప్లయితొలగించండి
  9. శ్రావణ మాసం అనగానే శనగలు గుర్తొచ్చేస్తాయి నాకు..నేను తాంబూళాలు ఇస్తే తప్పనిసరిగా శనగలు ఇస్తాను ...మీరన్నట్లు ఇంకొద్ది సంవత్సరాల తరువాత ఈ సాంప్రదాయాలు కనుమరుగు అవుతాయేమో ... మంచి పోస్ట్ రాసారు ..
    పరిమళం గారు వరవీణ మృదుపాణి అబ్బా ఎన్నాళ్ళయ్యింది ఆ పాటపాడుకుని :)

    రిప్లయితొలగించండి
  10. chala bagundandi, na schooldays anni gurthukochhay, perantalaku pilavadanikani potapotiga friends andaram velladalu, evarenni illulu cover chesaru, evaru ekkuvamandini pilicharani goppaga cheppukodalu, perantalaku andarini pilichi pilichi alasipoyamani phose kottadalu anni marapurani gurthulu,

    parimalam garu, miru adrustavanthulandi koddiga ayina, kanisam flats lonyna thambulam ivvagaluguthunnaru, maku kanisam thambulaniki piliche nadhudu ledu, kanisam memu pilichina vochhe nadhudu ledu, sarigada, orra verri vengalayini chusunattu sorry yar memu busy, i cant make it out ani cheppesthunnaru
    pchmmmmmm

    రిప్లయితొలగించండి
  11. శ్రావణమాసం అంటేనే నాకు చాలా ఇష్టం మురళిగారు. ఎన్ని పనులున్నా, తప్పని సరిగా, పూర్తి సంప్రదాయబద్ధం గా చేసుకోటం నాకు చాలా ఇష్టం. నేను పుట్టింది కూడా శ్రావణ శుక్రవారం రోజే. అందుకే ఇంకొంచెం అభిమానం కూడా ఎక్కువే:) చాలామందిని పేరంటం పిలుస్తాను, వెల్తాను కూడా. మీ ముచ్చట్లు మాత్రం నాకు బాగా నచ్చాయి.వాయనమైతే చక్కటి ఫాన్సీ కవర్లో ఒక గిఫ్ట్ తో పాటుగా ఇస్తాను. నాకలా చాలా ఇష్టం. మీ బామ్మ, అమ్మల ముచ్చట్లేనా. మరి ఇప్పటి మీ ఇంట్లో శ్రావణ మాసం ముచ్చట్లు మాకు చెప్పరా. మీకొక అమ్మాయి ఉండాలి అని నా కోరిక. ఎంత బాగా చేయిస్తారో అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  12. హ హ ఎప్పటిలాగానే చాలా బాగుంది మురళి గారు :) తాతయ్య గారి చమత్కారం, కొబ్బరి లౌజు అన్నీ సూపర్ :)

    రిప్లయితొలగించండి
  13. హ్మ్మ్. బెంగుళూరు లో శ్రావణ శుక్రవారం నేనైతే సెలవ పెట్టాల్సి వచ్చింది. మా కాంప్లెక్స్ వాళ్ళు 4-5 మంది పిలవగా.. వేరే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిచారు.

    ఆరోజు రాత్రి పైగా.. ప్రతి ఇంట్లో, ఒట్టి శనగలతో కానీయలేదు. అమ్మవారి ప్రసాదాలు తొమ్మిదో ఎన్నో రకాలు చేసినవి కూడా అందరిళ్ళల్లో, తిని, స్టీల్ , ప్లాస్టిక్,గాజు గిన్నెలూ, ప్లేట్లూ వాటి తో నిండిపోయింది.

    కాకపోతే ఈ పిలిచిన వాళ్ళు 30-45 వయస్సు వాళ్ళే.. వాళ్ళ ఇళ్ళల్లో ఆడ పిల్లలు కూడా బయటకెళ్ళిపోయారు, పేరంటం లో తల్లులకి సహాయం చేయకుండా.. దాన్ని బట్టి.. అనిపించింది.. ముందరి తరాల్లో .. ఇంక ఉండదని.

    రిప్లయితొలగించండి
  14. మురళి గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

    హారం

    రిప్లయితొలగించండి
  15. కనుమరుగౌతున్న సంప్రదాయాన్ని ,మీ రచనా కౌశలంతో కనులముందు ఉంచుతున్నందుకు మీకు నా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. @వాసు: పెసరపప్పుతో మా ఇంట్లోనూ చేసేవారండీ.. కానీ శ్రావణంలో శనగలు చెల్లాలంటే పాటోళీ వండక తప్పదు మరి.. ధన్యవాదాలు..
    @కొత్తపాళీ: Thank you..
    @శ్రీనివాస్ పప్పు; నిజమేనండీ చాలా ఉన్నాయి చెప్పడానికి.. కానీ మార్పు అనివార్యం కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @భావన: పాటల సంగతి భలేగా గుర్తు చేశారండీ.. నిజంగానే అదో పెద్ద ప్రహసనం.. ధన్యవాదాలు.
    @రాధిక (నాని): నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @ప్రియ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  18. @శిశిర: నాకు అప్పుడప్పుడూ అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం; మీరు 'వరవీణా మృదుపాణీ' సంగతి రాయాల్సిందేనండీ.. ధన్యవాదాలు.
    @చదువరి: ఉపాయం లేని వాణ్ని ఊరినుంచి తరిమేయాలనేవాళ్లండీ అప్పట్లో.. అందుకని అలాంటి ఉపాయాలు :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @నేస్తం; పరిమళం గారి వ్యాఖ్య చూడగానే ఆ పాట పాడేసుకున్నారన్న మాట!! ..ధన్యవాదాలు.
    @స్ఫూర్తి: ధన్యవాదాలండీ..
    @జయ: అయితే పుట్టిన రోజు జరిపేసుకున్నారన్న మాట!! ఆలస్యంగా శుభాకాంక్షలు.. మీరు అడిగిన సంగతులు రాయాలనే నాకూ ఉందండీ.. కొన్ని అనుమతులు రావాల్సి ఉంది.. అవి వచ్చేస్తే... ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @కృష్ణ ప్రియ: బాగున్నాయండీ విశేషాలు.. ముందుముందు సందేహమేనండీ.. ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: ధన్యవాదాలండీ..
    @వాజసనేయ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి