బుధవారం, సెప్టెంబర్ 01, 2010

కన్నయ్య కనిపించడేం...?

ఉదయం నుంచీ అలుపెరగకుండా వెతుకుతున్నాను. అయినా కనిపించలేదు.. ఎవరి మీద కోపం వచ్చిందో? ఎందుకు అలిగాడో? ఏ రాచకార్యం భుజాన వేసుకున్నాడో? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో..? ఎందెందు వెతికినా కన్నయ్య జాడ లేదు. ఏమైపోయాడో మరి.. ఉదయాన్నేఇవాళ కృష్ణాష్టమి అన్న విషయం గుర్తొచ్చి 'ఆ రెండు చానళ్ళు' మార్చి మార్చి చూశాను.

నిరాశా నిస్పృహలు ముప్పిరిగొంటున్న వేళ... ఇంటి గుట్టు రచ్చ చేసి ఊరంతా హడావిడి చేసిన వాళ్ళ చానల్ లో కనిపిస్తాడేమో అన్న ఆశతో వెతికాను. ప్చ్.. లాభం లేకపోయింది. నేను వెతుకుతున్న కన్నయ్య నివాసం ఉండేది ద్వారకలో కాదు. గిన్నీసు పుస్తకంలో చోటు సంపాదించిన చిత్ర నగరిలో. బుల్లి తెరని ఏక చత్రాధిపత్యంగా ఏలి, ఆ తర్వాత వెండితెరపై ఓ మెరుపు మెరిసి, సంచలనాలు సృష్టించిన నల్లనయ్య ఇప్పుడెందుకో నల్లపూసైపోయాడు.

ఒకప్పుడు నాకు కృష్ణుడంటే అన్నగారే.. పౌరాణిక సినిమాల పుణ్యమా అని రాముడినీ, కృష్ణుడినీ తలచుకోగానే మొదట నందమూరి తారకరాముడి రూపమే కళ్ళముందు మెదిలేది. 'రామజన్మభూమి' శిలాన్యాసం పుణ్యమా అని రాముడి స్థానాన్ని అప్పట్లో ఊరేగించి, పూజలు చేసి అయోధ్యకి పంపిన పాల రాతి శిల ఆక్రమించింది.

ఇక కృష్ణుడిది కొంచం పెద్ద కథే.. ఓ పుష్కర కాలం క్రితం స్కూలు వార్షికోత్సవానికి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లలంతా విచిత్ర వేషాలు వేసి ఆడి పాడుతున్న వేళ, ఉన్నట్టుండి ఓ భారీ కృష్ణుడు స్టేజీ మీద ప్రత్యక్షమయ్యాడు. వస్తూనే భగవద్గీత శ్లోకమొకటి అందుకుని ఆపై ఎవరు ఆపమన్నా ఆపకుండా తనకి అలుపు వచ్చే వరకూ శ్లోకాలు చదువుతూనే ఉన్నాడు, తనవైన హావభావాలతో సహా..

ఉదు కృష్ణుడిని స్టేజి మీద చూడగానే తమ పిల్లలకి దిష్టి తగలదు లెమ్మని సంతోష పడ్డ తల్లిదండ్రులకి శోష వచ్చినంత పనయ్యింది. మొత్తానికి ఆవేళ మాకందరికీ శ్రీకృష్ణుల వారి దివ్య దర్శనం ప్రాప్తించింది. అప్పుడప్పుడూ ఆ కృష్ణుడిని తల్చుకుని ఉలికిలికి పడుతుండగానే ఓ శుభోదయాన బుల్లితెరమీద మరో ముద్దు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.

ప్రత్యక్షం అయ్యీ అవుతూనే బలరాముడితో కయ్యానికి సయ్యన్నాడీ కృష్ణుడు. అలా 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' చూసిన నాటినుంచీ కృష్ణుడిని తలుచుకోగానే సుమనోహరుడు చిరునవ్వులు చిందిస్తూ కళ్ళ ముందు కనిపించడం మొదలుపెట్టాడు. టీవీలో ప్రసారమైన రెండుసార్లూ ఆ యుద్ధాన్ని చూసి, పదే పదే తలుచుకుని ఆనందిస్తుండగానే 'ఉషా పరిణయం' జరిపించేశారు స్వామి.

అంతేనా? ఆది విష్ణువుని కీర్తిస్తూ 'శ్రీహరి స్వరాల'ను ఆశువుగా ఆలపించి యావదాంధ్ర దేశాన్నీ భక్తిరస సాగరంలో ఓలలాడించారు..కీర్తించే భక్తుడూ, ఆలకించే స్వామీ తానే అయ్యారు. ఇవన్నీ చూసిన వాళ్లకి కృష్ణుడనగానే కళ్ళ ముందు మరో రూపం ఎలా కనిపించగలదు?? అంతఃపురం లో రాధమ్మని లాలిస్తున్నాడో.. కంసుడి పీచమణుస్తున్నాడో.. ఆయన లీలా వినోదాలు ఆయనకి మాత్రమే తెలుసు.. మము పాలింపగ టీవీ తెర మీదకి రావయ్యా కృష్ణయ్యా....

18 కామెంట్‌లు:

  1. మీరు ఈటివీ మూయించే వరకూ నిద్రపోయేట్టులేరే..

    రిప్లయితొలగించండి
  2. మొదటి పేరా చదవగానే మీ వెతుకులాట ఎవరికోసమో అర్ధమయింది. బాగా బెంగ పెట్టుకున్నట్టున్నారు. మీకు అంతగా చూడాలనుంటే ఏ డి.వి.డి లో తెచ్చుకుని రహస్యంగా ఒక్కరూ చూడండి కాని "మము పాలింపగ టీవీ తెర మీదకి రావయ్యా కృష్ణయ్యా...." ఈ రెక్వెస్టులేమిటండీ బాబూ. అందరికీ మీకున్న గుండెధైర్యం ఉండద్దూ. :)

    రిప్లయితొలగించండి
  3. అబ్బబ్బా! ఇదెక్కడి దిగులండి బాబు. వాళ్ళ నాన్న ఎక్కడికో పంపించేసి ఉంటాడు. రేపు కనిపిస్తాడేమోలెండి మీ సుమనోహరుడు:)

    రిప్లయితొలగించండి
  4. మొత్తానికి మీ సుమనోహర భక్తి పోనిచ్చుకున్నారు కాదు...మీరెంత పంకా అయినా మరీ ఇంత ఇదా:)

    రిప్లయితొలగించండి
  5. అయ్యో, ఒక్క ఛానెల్ వారుకూడా అన్నగారిది ఒక్క సీనుకూడా వెయ్యలేదా? ప్చ్- చక్కనోడి సంస్మరణలో మునిగిపోయినట్లున్నారు.

    రిప్లయితొలగించండి
  6. హ్హహ్హహ్హ ఆయన సిత్రాలు ఆయనే వేసుకుని చూసుకుంటూ సిత్రమైన లోకంలో కెళ్ళిపోయి ఆ ఆనండోలికల్లో కొత్త సిత్రాలు గీస్తూ సరికొత్త సిత్రరాజాన్ని రూపుదిద్దుతున్నాడేమో?వీరాభిమానుల ఆర్తి వినిపించేవుంటుందిలెండి వచ్చేస్తాడు తొందర్లో కుతంత ఓపిక చేసుకోండి మరి.
    రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా...మీతోపాటు నేను గొంతు కలిపాలెండి.

    రిప్లయితొలగించండి
  7. హ్హహ్హ... నేను నిన్న చాలా ఎదురుచూశాను కన్నయ్య కోసం.. ప్చ్... ఎక్కడా జాడ లేదు... కొండొకచో ఊసులు వినపడలేదు...

    రిప్లయితొలగించండి
  8. మీరు ఆయనకు ఇంత పెద్ద అభిమానాని తెలియదు :)

    రిప్లయితొలగించండి
  9. >>>మము పాలింపగ టీవీ తెర మీదకి రావయ్యా కృష్ణయ్యా....

    ఒరిజినల్ కృష్ణయ్యా, మురళిగారు ఏదో కుట్ర పన్నుతున్నారు చూశావా? మము రక్షింపగా రావేమి కన్నయ్యా....'మురళిగారి కన్నయ్య' నుండి మము కాపాడగ రావా? ఈ పోస్టు 'ఆ' కన్నయ్యకు కనపడకుండా నీ లీలలు చూపించు నాయనా...:)

    రిప్లయితొలగించండి
  10. జాగ్రత్త సార్, పైన తథాస్తు దేవతలుంటారు

    రిప్లయితొలగించండి
  11. ఇహ లాభంలేదు. మేమందరం హాయిగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నావా మురళిబాబు. ఎవరక్కడ?? భావన, సుజాత.. ఎవరెవరి దగ్గర ఆర్.సంధ్యాదేవి నవళ్లు ఉన్నాయో నాకు పంపండి. ఒక మనిషిని పెట్టి మరి ఈ మురళికి వినిపిస్తాను. దెబ్బకు ఈ కన్నయ్య భూతం దిగిపోతుంధి.. హన్నా!!....

    రిప్లయితొలగించండి
  12. మీ అభిమానానికి మీ మొద్దు కృష్ణుడు ...సారీ ..ముద్దు కృష్ణుడు మీకు పిలిచి మరీ సన్మానం చేయాలి మేమంతా ఆ చానల్లోనే చూడాలి... :)
    ఇక నిజంగా ఐతే కన్నయ్యను మాఇంట్లో కట్టిపడేశాగా ..ఇక మీకెక్కడ దొరుకుతాడు? మీరెన్ని నెమలికన్నులు ఇస్తానన్నా రాడు :) జన్మాష్టమి శుభాకాంక్షలు మురళిగారు!

    రిప్లయితొలగించండి
  13. @తార: అయ్యయ్యో.. అలా అయితే కన్నయ్య అస్సలు కనిపించదు కదండీ :-) ..ధన్యవాదాలు..
    @శిశిర: అవునండీ కొంచం బెంగ గానే ఉంది :-) ఏదో అందరికీ కొంచం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అని :-) :-) ..ధన్యవాదాలు..
    @జయ: ప్చ్.. కనిపించలేదండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  14. @సిరిసిరిమువ్వ: కృష్ణాష్టమి కదండీ మరి :-) ..ధన్యవాదాలు..
    @JB-జేబీ: అన్నగారు కాదండీ, సుమనోహరుడు.. ధన్యవాదాలు..
    @శ్రీనివాస్ పప్పు: హమ్మయ్య.. మీరు కూడా గొంతు కలిపారు, అంటే చాలు.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. @మేధ: మీరు తల్చుకుంటారనే అనుకున్నానండీ.. ధన్యవాదాలు..
    @వాసు: కానిది ఎవరు చెప్పండి? :-) :-) ..ధన్యవాదాలు..
    @శేఖర్ పెద్దగోపు: మధ్యలో ఈ ఒరిజినల్ కృష్ణుడు ఎవరండీ? కృష్ణుడంటే సుమనోహరుడే.. అంతే.. :-) :-) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @కొత్తపాళీ: చల్లనిమాట సెలవిచ్చారు :-) ..ధన్యవాదాలండీ..
    @జ్యోతి: అవన్నీ చదివానండీ.. సుమనోహరుడి ముందు అవన్నీ బలాదూర్ :-) ..ధన్యవాదాలు.
    @పరిమళం: చూశానండీ మీ వేడుకలు.. నా కామెంట్ ప్రచురింపబడలేదు ఎందుకో :( ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. అవునాండీ!! మీ కామెంట్ రాలేదెందుకో మురళి గారూ !

    రిప్లయితొలగించండి
  18. హహహ ఎందుకో ఈటపా మిస్స్ అయ్యాను. బహుశా ఆటైంలో ఇంటికెళ్ళడం వల్లనేమో. అన్నట్టు ఇంట్లో మీకన్నయ్య గురించే పెద్దడిస్కషన్ పెట్టా. ఏదో మమ్మల్ని ఇలా బతకనీరా అని మామామలు, బంధువులు అంటున్నారు. ఏమైనా ఆకన్నయ్య ఫిల్మ్‌సిటీలో ఉంటే "గుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాడు నడువగలుగు బృందావనం మూఢునుకి జ్ఞానమొసగు(కన్నయ్యకి అవసరమేమో) బృందావనం..." అని పాడేసుకోవచ్చు

    రిప్లయితొలగించండి