తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడో చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది గతంలో ఎప్పుడూ లేనిది, నిర్మాతలు ఊహించనిదీను. సినిమా హాళ్ళకి ప్రేక్షకులు రావడం లేదు. ఒకప్పుడు ప్రత్యేక పరిస్థితులు, కారణాలు చెప్పి టిక్కెట్టు రేటుకి రెట్టింపు వసూలు చేసినా అమితమైన ఉత్సాహంతో టిక్కెట్లు కొనుక్కుని భారీ సినిమాలని అతిభారీగా విజయవంతం చేసిన ప్రేక్షకులు, ఇప్పుడు 'టిక్కెట్టు రేటు తగ్గించాం, సకుటుంబంగా థియేటర్ కి వచ్చి మా సినిమా చూడండి' అని సినిమా వాళ్ళు సగౌరవంగా పిలుస్తున్నా, ఆవైపు వెళ్ళడానికి తటపటాయిస్తున్నారు. ఫలితంగా, భారీ సినిమాలు కోలుకోలేని విధంగానూ, మధ్యరకం సినిమాలు తగుమాత్రంగానూ నష్టపోతున్నాయి. 'చిన్న సినిమాలు' అనేవి దాదాపుగా కనుమరుగైపోయాయి కదా.
నిజానికి 'సినిమా నష్టాలు' అనేది కొత్త విషయమేమీ కాదు, ఉండుండీ అప్పుడప్పుడూ చర్చకి వస్తూనే ఉంటుంది. తేడా ఏంటంటే, నష్టాలకి కారణాలు మారుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నష్టాలకి కారణం ప్రేక్షకులే. జాతి గౌరవాన్నో, అభిమాన హీరో పరువునో నిలబెట్టడం కన్నా కష్టర్జితాన్ని ఇతరత్రా ఖర్చులకి వెచ్చిస్తున్నారు వాళ్ళు. ఫలితంగా, అటు పెద్ద పెట్టుబడులతో సినిమా తీసి, పెద్దల సాయంతో టిక్కెట్టు రేట్లు పెంచుకున్న సినిమాలకీ, ఇటు సంసారపక్షంగా తగుమాత్రం బడ్జెట్టుతో సినిమా పూర్తి చేసి టిక్కెట్టు రేటు తగ్గించిన సినిమాలకీ కూడా థియేటర్ల దగ్గర ఫలితం ఒకలాగే ఉంటోంది. హాలుకొచ్చి టిక్కెట్టు కొని సినిమా చూసే ప్రేక్షకులనే నమ్ముకుని సినీ కళామతల్లి సేవకి జీవితాలని అంకితం చేసిన నటీనటులకీ, దర్శక నిర్మాతలకీ ఇది బొత్తిగా మింగుడు పడని పరిణామం.
కరోనా కారణంగా జనమంతా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైపోయారు. నట్టింట వినోదానికి అలవాటు పడిపోయారు. ఓటీటీల పుణ్యమా అని ఇతర భాషల సినిమాలని నేరుగానూ, డబ్బింగు వెర్షన్ల ద్వారానూ చూసేశారు. ఫలితం ఏమిటంటే, తెలుగు సినిమాలని ఆయా భాషల సినిమాలతో పోల్చుకోవడం మొదలు పెట్టారు. రాజుని చూడ్డానికి అలవాటు పడిపోయిన కళ్ళు మరి. నాటకాలు తదితర కళలన్నీ విజయవంతంగా అవసాన దశకి చేరుకొని, సినిమా మాత్రమే ఏకైక వినోదంగా మిగిలింది కాబట్టి నాణ్యతతో సంబంధం లేకుండా హాల్లో సినిమాలు చూసి తీరాలి నిజానికి. చిక్కు ఎక్కడొచ్చిందంటే, కరోనా అనంతర పరిస్థితుల్లో ఖర్చు వెచ్చాల్లో తేడాలొచ్చేసి నెల జీతాల వాళ్ళు బడ్జెట్లు, ఖర్చు చేసే ప్రాధాన్యతా క్రమాలు ఉన్నట్టుండి మారిపోయాయి.
Google Image |
కరోనా పేరు చెప్పి చాలామందికి జీతాలు పెరగలేదు. ఉద్యోగం నిలబడింది, అందుకు సంతోషించాలి అనుకునే పరిస్థితి. మరోపక్క ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం అనే వంక కూడా దొరికింది, ధరల పెరుగుదలకి. తారుమారైన ఇంటి బడ్జెట్లలో, సినిమా ఖర్చు అనివార్యంగా 'తగ్గించుకో గలిగే ఖర్చుల' జాబితాలోకి చేరిపోయింది. మనవాళ్ళు అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ, సినిమా చూడకుండా ఉండలేరని సినిమా వాళ్ళకో ఘాట్టి నమ్మకం. దాన్నేమీ వమ్ము చేయడం లేదు. వచ్చిన సినిమాని వచ్చినట్టు చూస్తున్నారు, కాకపోతే థియేటర్లో కాదు, ఓటీటీలో. హాల్లో రిలీజైన రెండు మూడు వారాల్లోపే ఇంట్లో టీవీలో చూసే సౌకర్యం ఉన్నప్పుడు, వస్తున్న సినిమాలు కూడా ఆమాత్రం రెండు మూడు వారాలు ఆగగలిగేవే అయినప్పుడు అన్నం మానేయాల్సిన అవసరం ఏముంది?
పైగా ఒక్క టిక్కెట్టు రేటు మాత్రమే కాకుండా, పార్కింగ్ మొదలు పాప్ కార్న్ వరకూ చెల్లించాల్సిన భారీ మొత్తాలు కూడా ఆదా అయి ఖర్చులో బాగా వెసులుబాటు కనిపిస్తోంది. మొత్తం సినిమానో, కొన్ని భాగాలో బాగా నచ్చితే మళ్ళీ చూసే వెసులుబాటుతో పాటు, నచ్చకపోతే వెంటనే టీవీ కట్టేసే సౌకర్యాన్ని కూడా ఓటీటీ ఇస్తోన్నప్పుడు కష్టపడి సినిమాహాలు వరకూ వెళ్ళాలా? అన్నది బడ్జెట్ జీవుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇలా ఉన్నట్టుండి ప్రేక్షకులు వాళ్ళ స్వార్ధం వాళ్ళు చూసుకోడంతో సినిమావాళ్ళు కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు. కళామతల్లికి ఖరీదైన సేవ చేసే పెద్ద నటీనటుల జోలికి వెళ్లడం లేదు కానీ, రోజువారీ కూలీకి పని చేసే కార్మికులు, చిన్నా చితకా ఆర్టిస్టుల ఖర్చుల వైపు నుంచి నరుక్కొద్దామని చూస్తున్నారు.
రోజువారీ వేతనాలు సవరించమంటూ మొన్నామధ్యన సినిమా కార్మికులు మొదలు పెట్టిన సమ్మె ఒక్కరోజులోనే ఆగిపోయింది. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి సినిమాలు నిర్మిస్తాం తప్ప, మీ డిమాండ్లు పరిష్కరించం అని తెగేసి చెప్పేశారు నిర్మాతలు. సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కానీ, ఫలానా తేదీ లోగా పరిష్కరించాలనే నిబంధనలేవీ లేవు. చట్టంలాగే ఆ కమిటీ కూడా తన పని తాను చేసుకుపోతుంది కాబోలు. ఈ ప్రకారంగా అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల కళాసేవకి ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాతలు పాపం తమవంతు కృషి చేస్తున్నారు. ఇతరత్రా ఉపాయాలు కోసం వేరే రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే, అన్నిరకాలుగానూ తెలుగు సినిమా ప్రత్యేకమైనది. ఇప్పటి పరిస్థితీ ప్రత్యేకమైనదే. అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశ లేదు కానీ, రాబోయే రోజుల్లో కళాసేవ ఏవిధంగా జరుగుతుందో చూడాలన్న కుతూహలం మాత్రం పెరుగుతోంది .