బెంగళూరు శివార్లలోని వెంకటాల అనే ఊరికి దగ్గరలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో పుట్టి పెరిగాడు జిమి. నిజానికి జిమి అతని అసలు పేరు కాదు. చిన్నప్పుడోరోజు తాజా చేపలు కొనడానికి యలహంక సంతకి వెళ్లి, చేపలకన్నా ముందు ఓ పాత న్యూస్ పేపర్ మీదకి దృష్టి పోవడంతో అక్కడే నిలబడి చదివేశాడు. అది ప్రఖ్యాత గిటారిస్ట్ జిమి హెండ్రిక్స్ పేరుతో ప్రసిద్ధుడైన జాని అలెన్ హెండ్రిక్స్ గురించిన వార్తా కథనం. ఆ క్షణంలోనే తన పేరుని జిమి అని మార్చేసుకుని, క్వార్టర్స్ లోనే గిటార్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తల్లితండ్రులు రామన్-నీల లకి ఒక్కడే సంతానం కావడంతో ఆ ఇంట్లో జిమి ఆడింది ఆట, పాడింది పాట. టీనేజీ దాటేసరికి, గిటార్ నేర్చుకోడం నుంచి నేర్పడానికి ప్రమోట్ అయ్యాడు జిమి. క్లాసులు కూడా క్వార్టర్స్ లోనే. దాదాపు అదే సమయంలో అతని జీవితంలోకి వచ్చిన అతనికి ఎంతో ఇష్టమయిన రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్, ప్రియ శిష్యురాలు తరుణిల కారణంగా జిమి జీవితంలో వచ్చిన మార్పులే 'రాయల్ ఎన్ ఫీల్డ్' నవల.
కన్నడ సాహిత్య రంగంలో కవిగా ప్రవేశించి, కథలు, నాటకాలు, నవలలు రాసిన మంజునాథ వి.ఎం. తొమ్మిదేళ్ల క్రితం రాసిన 'రాయల్ ఎన్ ఫీల్డ్' నవలని అదే పేరుతో తెనిగించారు రంగనాథ రామచంద్ర రావు. ప్రస్తుతం బెంగళూరులో సొంతంగా థియేటర్ ట్రూప్ నిర్వహిస్తున్న మంజునాథకి నాటక శిల్పం మీద మంచి పట్టు ఉందనిపించింది ఈ నవల చదువుతుంటే. సహజత్వాన్ని మింగేయని నాటకీయతని కల్పించడంలో మంచి పట్టు సాధించారనిపించింది. వెంకటాలలో పుట్టి పెరిగిన ఈ రచయిత నవల్లో కథ మొత్తాన్ని పోలీస్ క్వార్టర్స్, వెంకటాల, యలహంక, హెబ్బాళలోనే నడిపారు. సెల్ఫోన్లు వాడకంలో ఉన్నప్పటికీ ఇంకా ఎస్సెమ్మెస్‌లు చేసుకునే రోజులు, నగరం మింగేయని బెంగళూరు శివార్లు కనిపిస్తాయి ఈ నవలలో.
అతి తక్కువ కాలంలోనే తరుణితో స్నేహం ప్రేమగా మారుతుంది జిమికి. రాయల్ ఎన్ ఫీల్డ్ మీద వర్షంలో లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం, ఎడ్వెంచర్లు చేయడం వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. అలా ఒక రోజు లాంగ్ డ్రైవ్ నుంచి తిరిగొస్తూ ఓ పబ్ దగ్గర ఆగినప్పుడు, తరుణికి తన చిన్ననాటి స్నేహితుడు గిరి కనిపిస్తాడు. ఖరీదైన కార్లో నుంచి దిగిన గిరిని తరుణి గుర్తుపట్టదు, పట్టించుకోదు. కానీ, గిరి ఆమెతో మాట కలిపి, గతం గుర్తు చేస్తాడు. కేవలం జిమి పబ్ లోకి వెళ్లి, బీర్ టిన్నుతో తిరిగి వచ్చేలోగా గిరితో అతని కార్లో వెళ్ళిపోతుంది తరుణి. తనో పెద్ద బిజినెస్ పర్సన్ అని పరిచయం చేసుకున్న గిరి, తరుణితో కలిసి కొత్త వ్యాపారం చేయడానికి ప్లాన్లు చర్చించడం మొదలుపెడతాడు. అతన్ని పూర్తిగా నమ్ముతుంది తరుణి. జిమికి మాత్రం గిరి మీద మంచి అభిప్రాయం లేదు. త్వరలోనే తరుణి నిజం తెలుసుకుని తన దగ్గరకి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు.
ఊహించనంత వేగంగా జిమిని తనకి అడ్డు తొలగించుకునేందుకు పావులు కదుపుతాడు గిరి. పోలీసులకి డబ్బు వెదజల్లి జిమిని ఇబ్బంది పెట్టడం మొదలు, అతను గిటారిస్టుగా పనిచేసే పబ్ వాళ్ళని ప్రభావితం చేసి ఉద్యోగం పోగొట్టడం, అక్కడితో ఆగకుండా బెంగళూరు లోని అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేసేలా చేయడంలో కృతకృత్యుడవుతాడు. సరిగ్గా అప్పుడే తరుణి నుంచి బ్రేకప్ ఉత్తరం అందుతుంది జిమికి. దాంతో పూర్తిగా కుంగిపోతాడు. ఫ్లాట్‌లో సామానుతో పాటు, తనకెంతో ఇష్టమైన రాయల్ ఎన్ ఫీల్డ్ ని అమ్మకానికి పెడతాడు. గిటార్ ని కూడా అమ్మేద్దాం ఆనుకుని, చివరి నిమిషంలో మనసు మార్చుకుంటాడు. మిత్రుల సాయంతో కొత్త ఉద్యోగాల వేట మొదలు పెడతాడు. ఓ మిత్రుడికి చెందిన ఎన్ ఫీల్డ్ షోరూమ్ లో ఉద్యోగం దొరుకుతుంది.
దాదాపు అదే సమయంలో జిమి జీవితంలోకి అనూహ్యంగా ప్రవేశిస్తుంది అల. ఓ పబ్ నిర్వహిస్తూ, తీరిక వేళల్లో కవిత్వం రాసే అలకి గిటార్ అంటే ఇష్టం. మొదట జిమిని అపార్ధం చేసుకున్నా, తర్వాత అర్ధం చేసుకుని స్నేహం చేస్తుంది. అంతా కుదురుకుంటోంది అనుకునే సమయంలో అల నుంచి ఓ కుదుపు, తరుణి నుంచి మరో కుదుపు వస్తాయి జిమి జీవితంలోకి. వీళ్ళ ముగ్గురి కథ ఏ తీరం చేరిందన్నదే నవల ముగింపు. పూర్తి అర్బన్ పోకడలతో సాగే కథనంలో జిమి గిటార్ మీద వాయించే పాటలు, అల రాసే భావుకత నిండిన కవితలు, వర్షంలో లాంగ్ డ్రైవ్‌లు మాత్రమే కాదు ఇంగ్లీష్ నవలలు చదువుకుంటూ ఉండే డాన్ గణేష్, తన ముద్దు పేరుకి అర్ధం 'జింక' అని బలంగా నమ్మే 'డాంకి' ల ఉప కథలూ ఉన్నాయి. క్వార్టర్స్, పల్లె, నగరం ఈ మూడు జీవితాలనీ నిశితంగా చిత్రించారు రచయిత. తొలిపేజీలు కొంచం బరువుగా తిరిగినా కథలో పడ్డాక ఆపకుండా చదివిస్తుంది కథనం.
రంగనాథ రామచంద్ర రావు అనువాదంలో అక్కడక్కడా కొన్ని పలుకురాళ్లు తగిలాయి - 'గాఢనిద్ర' కి బదులుగా 'దీర్ఘనిద్ర' లాంటివి. ఇవే కాకుండా అచ్చు తప్పులు కూడా కొంచం ఎక్కువగానే ఉన్నాయి. క్లుప్తంగానే చెప్పినప్పటికీ రామన్-నీలల ప్రేమకథ గుర్తుండిపోతుంది. పంకజం పాత్ర ప్రారంభం, ముగింపు కూడా నాటకీయంగానే ఉన్నాయి. బెంగళూరు కి చెందిన శ్రీ యంత్రోద్ధారక ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ ప్రచురించిన ఈ 184 పేజీల పుస్తకం వెల రూ. 175. అనువాద సాహిత్యం అంటే ఇష్టపడేవాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే అర్బన్ జీవిత చిత్రణలని చదివేందుకు ఇష్టపడే వారికి కూడా. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి