గురువారం, మే 13, 2021

కామోత్సవ్

చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంతగానో అభిమానించే కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన నవల 'కామోత్సవ్'. ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1987 లో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల అశ్లీల రచనగా ముద్రపడి, కోర్టు కేసుల్ని ఎదుర్కొంది. సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు కేసుని కొట్టేసింది. ఇంతలోనే ఇదే పేరుతో, ఇదే రచయిత పేరుతో మరో రచన అచ్చులోకి వచ్చింది. సాహిత్యంలోనే అరుదైన సంగతి ఇది. ఇన్నేళ్ల తర్వాత శేషేంద్ర ప్రతిని నవలగా అచ్చొత్తించారు ఆయన చిన్న కొడుకు సాత్యకి. అంతే కాదు, శేషేంద్ర తల్లితండ్రులు, భార్యాబిడ్డల విశేషాలను, ఛాయాచిత్రాలతో సహా ప్రచురించారు. శేషేంద్ర రెండో భార్యగా ప్రచారంలో ఉన్న ఇందిరా ధన్రాజ్ గిర్, శేషేంద్రకి ఏరకంగానూ వారసురాలు కాదంటున్నారు సాత్యకి. 

అంతేకాదు, 'కామోత్సవ్' ని "ఈ నవల ఇ.ధ. జీవిత చరిత్ర. ఇ.ధ. అంతరాత్మ కథ" అన్నారు 'వాస్తవాలు' పేరిట రాసిన ముందుమాటలో. (ఆమె పూర్తిపేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు). ఇందిరే తన అనుచరులచేత ఈ నవలని తిరగరాయించి ప్రచురించిందని ఆరోపించారు కూడా. శేషేంద్ర మరణం తర్వాత వారసత్వపు కోర్టు కేసుల తీర్పు తనకి అనుకూలంగా వచ్చిన సందర్భంలో పత్రికలకు ఇచ్చిన ఇంటర్యూలలో తన తండ్రికి సంబంధించిన చాలా విషయాలని ప్రస్తావించిన సాత్యకి, శేషేంద్ర తనని 'కామోత్సవ్' మీద అభిప్రాయం అడిగినప్పుడు "ఈ రచనకి నవల లక్షణాలేవీ లేవు" అని చెప్పానని జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబం తరపున ప్రారంభించిన గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా శేషేంద్ర రచనలన్నీ పునర్ముద్రిస్తున్న క్రమంలో ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన పుస్తకం ఈ 'కామోత్సవ్'. 

'పేజ్ త్రీ పీపుల్' గా వాడుకలో ఉన్న సినిమా నటీనటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉన్నతాధికారుల  వాతావరణంలో సాగే కథ ఇది. డబ్బుని నీళ్లలా ఖర్చుపెడుతూ, పార్టీలివ్వడానికి కారణాలు వెతుక్కునే బాపతు జనమే అంతా. ఈ మందికి కాస్త భిన్నమైన వాడు జ్ఞాన్, ఈ నవలలో కథా నాయకుడు. జ్ఞాన్ చిత్రకారుడు, చదువరి, తాంత్రిక విద్యల్లో ప్రవేశం ఉన్నవాడూను. అతని భార్య కీర్తి ఓ రాజకీయ ప్రముఖుడి పెద్ద కూతురు, హైదరాబాద్ వాసి. జ్ఞాన్ ఓ చిన్న సమస్యలో చిక్కుకోడంతో అతన్ని బొంబాయికి ప్రయాణం చేస్తుంది కీర్తి. అక్కడ వాళ్ళు గడిపే వారం రోజుల జీవితమే ఈ నవల. వాళ్ళు అటెండయ్యే మొదటి పార్టీ వహీదా రహ్మాన్ ఇంట్లో. అది మొదలు ప్రతిరోజూ వాళ్ళకే విసుగొచ్చే అన్ని పార్టీలు. ఆ పార్టీలకి వచ్చే ప్రముఖులందరూ జ్ఞాన్ తో చిత్రకళ గురించీ, కవిత్వం గురించీ చేసే లోతైన చర్చలతో కథ సా...గుతుంది. 

రెండోరోజు ఓ సినీ తార ఇచ్చే పార్టీకి వెళ్తారు జ్ఞాన్, కీర్తి. అవివాహిత అయిన ఆ తార తాంత్రిక ఆరాధన చేస్తుంది. జ్ఞాన్ కి అందులో ప్రవేశం ఉందని తెలియడంతో అతనితో సుదీర్ఘమైన చర్చ చేయడమే కాక, అతనితో కలిసి ఏకాంతంగా తాంత్రిక పూజలో పాల్గొంటుంది. (ఈ రచన మీద 'అశ్లీల' ముద్ర పడడానికి, కోర్టులో కేసు ఫైల్ అవడానికి ఈ సన్నివేశ చిత్రణదే మేజర్ కంట్రిబ్యూషన్). అన్ని వయసుల స్త్రీలకీ జ్ఞాన్ ఇష్టుడు కావడం, వాళ్ళు అతని వెనక పడుతూ ఉండడం కీర్తికి నచ్చదు. అలాగని ఆమె అతన్ని ఏమీ అనలేదు. "నాకున్న ఒకేఒక్క బలహీనత జ్ఞాన్" అంటుందామె. కీర్తి చెల్లెలు తృష్ణ, ఆమె భర్త కుబేర్ తో కలిసి బొంబాయిలోనే ఉంటోంది. కానీ కీర్తి-జ్ఞాన్ లు హోటల్లో దిగుతారు. క్రికెటర్ పటౌడీని ప్రేమించి,  బ్రేకప్ అయిన తృష్ణని ఓదార్చి, కుబేర్ తో పెళ్లి చేసింది కీర్తే. అవ్వడానికి అక్కే కానీ, ఒక తల్లిలా చూసుకుంటుంది తృష్ణని. 

కుబేర్ ఆహ్వానం మేరకు ఒకరోజు తృష్ణ ఇంటికి వెళ్లారు  కీర్తి-జ్ఞాన్. అక్కడ అనుకోని సంఘటనలో జ్ఞాన్ కి దగ్గరవుతుంది తృష్ణ. అటుపైని తృష్ణ తీసుకునే నిర్ణయం, దాని తాలూకు పర్యవసానాలే నవల ముగింపు. జ్ఞాన్ పుట్టుపూర్వోత్తరాల గురించి రచయిత ఎక్కడైనా చెబుతారేమో అని చివరికంటా ఎదురుచూశాను కానీ, ఎక్కడా ఆ ప్రస్తావన తేలేదు. మొత్తం అరిస్ట్రోకటిక్ సెటప్ లో అడుగడుగునా మిస్ఫిట్ గా అనిపించేది జ్ఞాన్ ఒక్కడే. డబ్బు ద్వారా వచ్చే సౌకర్యాలని అనుభవిస్తూనే, వాటి పట్ల వ్యతిరేకత కనబరుస్తూ ఉంటాడతను. పార్టీలని ఒకింత అడ్మిరేషన్ తోనూ, మరికొంత ఉదాసీనత తోనూ పరిశీలిస్తూ గడుపుతాడనిపిస్తుంది. కొన్ని చోట్ల జ్ఞాన్ బహుశా శేషేంద్ర 'ఆల్టర్ ఇగో' అయి ఉండొచ్చు అనిపించింది కూడా. సాత్యకి ముందుమాటని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 'ఇ.ధ' కీర్తా, తృష్ణా అన్న ప్రశ్నకి జవాబు దొరకలేదు. 

వృత్తి ప్రవృత్తులతో సంబంధం లేకుండా కథలో ప్రవేశించే ప్రతి పాత్రా కవితాత్మకంగా మాట్లాతుతూ ఉండడంతో చదువుతున్నది నవలో, కవిత్వమో అర్ధం కానీ పరిస్థితి చాలాసార్లే ఎదురైంది.  కవితా పంక్తులన్నీ వేరు చేస్తే ఓ చిన్న సైజు కవిత్వం పుస్తకం వేయొచ్చు. అలాగే జ్ఞాన్ ని నక్సల్ సానుభూతిపరుడిగా చూపడం వల్ల కథకి ఒనగూరిన అదనపు ప్రయోజనం ఏమిటో కూడా అర్ధం కాలేదు. మొత్తం మీద  చూసినప్పుడు 'కామోత్సవ్' ని ఒక నవల అనడం కన్నా, మధ్యతరగతి దృష్టికోణం నుంచి ధనవంతుల జీవితాలలో కొన్ని పార్శ్వాలని వర్ణించే ర్యాండమ్ రైటింగ్స్ అనొచ్చు. అక్కడక్కడా కొంచం విసిగించినా, మొత్తంమీద పూర్తిగా చదివిస్తుంది. మొత్తం 200 పేజీల ఈ పుస్తకం వెల రూ. 200. హైదరాబాద్ నవోదయ ద్వారా ఆన్లైన్ లో లభిస్తోంది. 

5 కామెంట్‌లు:

  1. Interesting.
    ఙ్ఞాన్, కీర్తి, తృష్ణ - పేర్లు చాలా మెటఫర్ ల లాగున్నాయి కదా?
    శారద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పేర్లే కాదండీ, చాలా సన్నివేశాలు కూడా మెటఫరికల్ గా అనిపించాయి.. అందుకే ఆపకుండా కాక, ఆలోచిస్తూ చదవాల్సి వచ్చింది :) ధన్యవాదాలు.. 

      తొలగించండి
    2. జ్ఞాన్ పుట్టు పూర్వోత్తరాల గురించి ఎక్కడా చెప్పకపోవతం ఒక్కటే లోపం."లెFటిస్ట్ భావాల పట్ల ఆకర్షణ ఉన్న జ్ఞాన్ ఒక బూర్జువా కుటుంబంతో అనుబంధం ఎలా కలిసింది?" అన్నది అంత తీసి పారెయ్యదగిన ప్రశ్న అయితే కాదు కదా!

      ఇక మీకర్ధం కాలేదన్న నక్సలిజం పటల్ ఆకర్సణ్ అలేకపోతే అతను బొంబాయి వెళ్ళడం జరిగేది కాదు కదా - అది సంవిధానం(Drama and Plot Twist) కోసం చేసిన మంచి ప్రయత్నమే.అయితే,"లెFటిస్ట్ భావాల పట్ల ఆకర్షణ ఉన్న జ్ఞాన్ ఒక బూర్జువా కుటుంబంతో అనుబంధం ఎలా కలిసింది?" అన్న ప్రశ్నకి జవాబు చెప్పి ఉంటే ఇది కూడా నవలకి ఇచ్చిన క్లమాక్స్ ఇచ్చిన ధ్రిల్ మరింత అదిరిపోయి ఉండేది.

      తొలగించండి
  2. Visionary Poet of the Millennium
    An Indian poet Prophet
    Seshendra Sharma
    October 20th, 1927 - May 30th, 2007
    http://seshendrasharma.weebly.com/
    https://seshen.tributes.in/
    https://www.facebook.com/GunturuSeshendraSharma/
    Seshendra Sharma is one of the most outstanding minds of modern Asia. He is the foremost of the Telugu poets today who has turned poetry to the gigantic strides of human history and embellished literature with the thrills and triumphs of the 20th century. A revolutionary poet who spurned the pedestrian and pedantic poetry equally, a brilliant critic and a scholar of Sanskrit, this versatile poet has breathed a new vision of modernity to his vernacular.Such minds place Telugu on the world map of intellectualism. Readers conversant with names like Paul Valery, Gauguin, and Dag Hammarskjold will have to add the name of Seshendra Sharma the writer from India to that dynasty of intellectuals.

    Rivers and poets
    Are veins and arteries
    Of a country.
    Rivers flow like poems
    For animals, for birds
    And for human beings-
    The dreams that rivers dream
    Bear fruit in the fields
    The dreams that poets dream
    Bear fruit in the people-
    * * * * * *
    The sunshine of my thought fell on the word
    And its long shadow fell upon the century
    Sun was playing with the early morning flowers
    Time was frightened at the sight of the martyr-
    - Seshendra Sharma
    B.A: Andhra Christian College: Guntur: A.P: India
    B.L : Madras University: Madras
    Deputy Municipal Commissioner (37 Years)
    Dept of Municipal Administration, Government of Andhra Pradesh
    Parents: G.Subrahmanyam (Father) ,Ammayamma (Mother)
    Siblings: Anasuya,Devasena (Sisters),Rajasekharam(Younger brother)
    Wife: Mrs.Janaki Sharma
    Children: Vasundhara , Revathi (Daughters),
    Vanamaali ,Saatyaki (Sons)

    Seshendra Sharma better known as Seshendra is
    a colossus of Modern Indian poetry.
    His literature is a unique blend of the best of poetry and poetics.
    Diversity and depth of his literary interests and his works
    are perhaps hitherto unknown in Indian literature.
    From poetry to poetics, from Mantra Sastra to Marxist Politics his writings bear an unnerving pprint of his rare genius.
    His scholar ship and command over Sanskrit , English and Telugu Languages has facilitated his emergence as a towering personality of comparative literature in the 20th century world literature.
    T.S.Eliot ,ArchbaldMacleish and Seshendra Sharma are trinity of world poetry and Poetics.
    His sense of dedication to the genre of art he chooses to express himself and
    the determination to reach the depths of subject he undertakes to explore
    place him in the galaxy of world poets / world intellectuals.
    Seshendra’seBooks :http://kinige.com/author/Gunturu+Seshendra+Sharma
    Seshendra Sharma’s Writings Copyright © Saatyaki S/o Seshendra Sharma
    Contact :saatyaki@gmail.com+919441070985+917702964402



    రిప్లయితొలగించండి
  3. పేజ్‌ త్రీ కేళీ.. కామోత్సవ్‌
    Published Thu, Feb 18 2021 4:32 PM | Last Updated on Tue, Feb 23 2021 8:19 AM

    Gunturu Seshendra Sharma Book Kamostav Review in Telugu - Sakshi
    విలువలు మధ్యతరగతి జీవితాల వెలలు. ఆ పై తరగతికి సంతోషమే పరమావధి.. కింది తరగతికి బతుకీడ్చమే ప్రధానం. అందుకే ఆ రెండింటి భారాన్ని మధ్యతరగతి మోస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘కామోత్సవ్‌’ ఈ విషయాన్నే వెల్లడిస్తుంది ఉన్నత వర్గపు జీవన శైలిని నవల రూపంలో. కథానాయకుడు జ్ఞాన్‌.. చిత్రకారుడు. చిత్రకళ మీదే కాదు సాహిత్యం, చరిత్ర, సమకాలీన రాజకీయాల మీదా పట్టున్నవాడు. లెఫ్ట్‌ ఐడియాలజీ ప్రేమికుడు. ఎలీట్‌ కుటుంబపు అల్లుడు. ఆ లైఫ్‌స్టయిల్‌లోని సుఖభోగాలన్నిటినీ అనుభవిస్తుంటాడు, ఆస్వాదిస్తుంటాడు. పోలీసు నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తిని కలిసి పోలీసులకు పట్టుబడి.. వాళ్ల కన్నుగప్పి పారిపోయి నిందితుడిగా వాళ్ల గాలింపులో ఉంటాడు. భార్య కీర్తి జ్ఞాన్‌ను కాపాడుకునే ప్రయత్నంతో ముంబై తీసుకెళ్తుంది. అక్కడ స్టార్‌ హోటల బస, సినిమా, వ్యాపార, రాజకీయవేత్తల, కళాకారుల పార్టీలతో కాలం వెలిబుచ్చుతుంటారు. అది ఏ మలుపు తీసుకొని ఎక్కడికి వెళ్తుందనే గమనం ఆసక్తిగా సాగుతుంది. ఈ క్రమంలో ఉన్నత వర్గాల జీవితాలను, సంబంధాలను, చట్టాలకతీతమైన వాళ్ల వెసులుబాటునూ చెప్తుందీ నవల. 1987లో అప్పటి ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా వచ్చిన కామోత్సవ్‌ను ఈ యేడు నవలగా తీసుకొచ్చారు. కాలతీతం కాని రచన. వర్తమానాన్నే ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంటుంది పాఠకులకు. అప్పట్లో ఈ సీరియల్‌ ఒక సంచలనం. అశ్లీల రచనగా కోర్ట్‌ దాకా వెళ్లింది. కాని ఆ కేసును కోర్ట్‌ కొట్టిపారేసింది. ఇప్పటి సాహిత్యమే కాదు, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కథాంశాలు, చిత్రీకరణలతో పోల్చుకుంటే కామెత్సవ్‌ మీద అశ్లీల రచన ముద్ర హాస్యాస్పదం అనిపిస్తుంది. ‘పేజ్‌ త్రీ’ సినిమా కంటే ఎన్నో ఏళ్ల ముందే తెలుగులో ఆ కల్చర్‌ మీద ఈ రచన వచ్చింది. పేజ్‌ త్రీ కల్చర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న పాఠకులకు ఆ కుతూహలాన్ని తీర్చే నవల కామోత్సవ్‌.
    పేజ్‌ త్రీ కేళీ.. కామోత్సవ్‌
    Published Thu, Feb 18 2021 4:32 PM | Last Updated on Tue, Feb 23 2021 8:19 AM

    Gunturu Seshendra Sharma Book Kamostav Review in Telugu - Sakshi

    రిప్లయితొలగించండి