మా చిన్నప్పుడు ఇంటి వెనుక కొబ్బరితోట సరిహద్దులో పాముపుట్టకి అటూ ఇటూ మొగలిపొదా, ఆకుసంపెంగ చెట్టూ ఉండేవి. పుట్టలో వృద్ధ నాగరాజు నివాసం ఉంటూ ఉండడంతో పిల్లలకి 'అధికారికంగా' అటువైపు వెళ్లే అవకాశం ఉండేది కాదు. మొగలిపొత్తులు, సంపెంగల వాసన ఆకర్షించకుండా ఉంటుందా? ఆకుసంపెంగలతో పరిచయం అప్పుడు మొదలైంది. సన్నని, దళసరి, ఆకుపచ్చ రేకులు, కాసింత మత్తు కలగలిసిన గాఢమైన వాసనతో ఉండే ఆ పూవులు ఎండిపోయినా కూడా సువాసన నిచ్చేవి, పుస్తకాల పేజీలలో. కాలారా తిరగడం మొదలయ్యాక పరిచయమైనవి సింహాచలం సంపెంగలు. పసుపచ్చని పల్చని రేకలతో ముట్టుకుంటే నలిగిపోయే సుకుమారం, తీయని వాసనా వీటి ప్రత్యేకతలు. నాకీ రెండు రకాల సంపెంగలూ ఇష్టమే కానీ, శ్రీరమణకి సింహాచలం సంపెంగలంటేనే ఇష్టమట అందుకే తన తాజా కథల సంపుటికి 'సింహాచలం సంపెంగలు' అని పేరు పెట్టుకున్నారు.
కథల్లాంటి అనుభవాలు, అనుభవాల్లాంటి కథలూ మొత్తం కలిపి పదమూడు. అసలు నాస్టాల్జియా అనేసరికి శ్రీరమణ కలం పరవళ్లు తొక్కుతుంది కదా, 'షోడా నాయుడు' సాక్షిగా. కథలన్నింటిలోనూ ఎక్కడో అక్కడ రచయిత తొంగిచూస్తూ ఉంటారు. అసలు పుస్తకానికి శీర్షికగా ఉంచిన 'సింహాచలం సంపెంగలు' కథ శ్రీరమణ స్వానుభవమేనేమో అని అనుమానం వచ్చేస్తుంది కూడా. ఇదో కొత్తపెళ్ళికొడుకు కథ. బరువుగా ఆషాఢం పూర్తయ్యి, బిరబిరా శ్రావణం రాగానే, బొగ్గుల రైలెక్కి అత్తారింటికి బయల్దేరిన కొత్త పెళ్ళికొడుకు, దార్లో సింహాచలం సంపెంగలు పొట్లం కట్టిస్తాడు, భార్యకోసం. ఆ సంపెంగలు, వాటి నిమిత్తం అతగాడాడిన ఓ అబద్ధమూ కథని కొత్త మలుపులు తిప్పేస్తాయి. హాస్యమే కాదు, బోల్డంత వ్యంగ్యం కూడా ఉందీ కథలో. ఈ ఒక్క కథే కాదు, మొత్తం కథలన్నింటిలోనూ హాస్యమూ వ్యంగ్యమూ చీరంచులో జరీపోగుల్లా (ఈ పోలిక రచయితదే, వేరే సందర్భానికి) తళుక్కుమంటాయి.
అసలు మొదటి కథ 'బైపాస్ సాములోరు' పేరు చూస్తూనే 'అరటిపువ్వు సాములోరు' గుర్తొచ్చేస్తారు. కాకపోతే ఈ బైపాసాయన బహు పాతకాలం వాడు. అప్పుడే ఫోటో కెమెరాలు కొత్తగా ఊళ్లలోకి వచ్చిన రోజుల నాటివాడు. 'ఉత్తమజాతి ఉడుముక్కూడా పట్టు దొరకనంత నున్నగా ఉంది గురువుగారి గుండు' లాంటి చమక్కులకి లోటే లేదు. 'చివ్వరి చరణం' కథ బ్లాగు మిత్రులందరికీ తెలిసిందే. బ్లాగుల స్వర్ణయుగంలో పొడిచిన 'పొద్దు' పత్రికలో చదివిందే కూడా. 'బేడమ్మ' లాంటి కథలు రాయడం, 'అలా మొదలైన నీళ్ల మోత సాగి సాగి, బేడమ్మ తలమీంచి కొసలనుంచి జారిన నీటిచుక్కలతో రోడ్డు వారగా పడిన నీళ్లచార వీధికి అంచుదిద్దినట్టు అయ్యేది' లాంటి వర్ణనలు చేయడం శ్రీరమణకి 'పీచ్మిఠా' తో పెట్టిన విద్య. ఒకప్పుడు ఇలాంటి బేడమ్మలు లేని వీధులూ, ఊళ్ళూ ఉండేవి కాదు. అగ్రహారపు కథల్లో తప్పక కనిపించే పాత్ర ఇది.
చదువుతూండగానే ఆకట్టేసుకునేదీ, పుస్తకం పక్కన పెట్టాక కూడా ఓ పట్టాన విడిచిపెట్టనిదీ 'గుర్రాల మామయ్య' కథ. ఒక్కమాటలో చెప్పాలంటే మాంచి రుచికరమైన కథ. అసల్నా అనుమానం ఏవిటంటే, ఈ కథలో మావయ్యా అత్తయ్యలు వాళ్లకి ముసలితనం వచ్చాక అప్పదాసు, బుచ్చిలక్ష్మిలుగా పరిణామం చెంది మనందరికీ 'మిథునం' అందించారేమో అని. కాకపోతే ఈకథలో అత్తయ్యకి పలుకే బంగారం, బుచ్చిలక్ష్మేమో నోరు తెరిచినందంటే అప్పదాసుకి పాపం మరి మాట్లాడే అవకాశం ఉండదు. చిన్నప్పటి సర్కస్ జ్ఞాపకాలని కళ్ళముందుకి తెచ్చే కథ 'సింహం చెట్టు'. కథలా కాక, నిజంగా జరిగిన సంఘటనని రికార్డు చేసినట్టుగా ఉంటుంది. అలాగని కథలో పడాల్సిన దినుసులకి లోటు రానివ్వలేదు ఇలాంటిదే ఇంకో కథ 'తాడిచెట్లు పీకే వస్తాద్'. నాకు 'తేనెలో చీమ' లీలగా గుర్తొచ్చింది, పోలికేమీ లేకపోయినా.
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒక పాత్రగా ఉన్న కథలు రెండు. నిజానికి ఇవి నిజ సంఘటనలే. కర్ణాకర్ణిగా విన్నవాటికి కథారూపం ఇచ్చారు రచయిత. 'వెండిగొట్టంలో దానపత్రం అను వరహాపురం అగ్రహారం' కథ శ్రీరమణకి ఏడుతరాల పూర్వుడైన జ్యోతిష్యవేత్త వంకమామిడి దక్షిణామూర్తి శాస్త్రులది కాగా, 'మనిషి పక్షిలా ఎగిరినందుకు..' కథేమో ఊరూరూ తిరుగుతూ సర్కస్ ఫీట్లు చేసే జక్కులకి సంబంధించింది. అడుగడుగునా మలుపులు తిరుగుతూ, ఓ పక్క నవ్విస్తూనే మరోపక్క తర్వాత ఏమవుతుందో అని ఆత్రుతని కలిగించే కథ 'అస్తికలు'. ఈ కథ చదువుతుంటే 'గడించే వాడొకడు, గుడించే వాడొకడు' అనే పాత సామెత గుర్తొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నో రియలెస్టేట్ కథ అనేయొచ్చు.
బాపూ, రమణ, శ్రీరమణ, గోదారి - కలిపితే 'గోదారి పిలిచింది..' ఇది కథ కేటగిరీలోకి రాదు కానీ, కథలాగే చదివిస్తుంది. చదువుతున్నంతసేపూ నోరూరిస్తుంది. గోదారి మీద లాంచీ మాట్లాడుకుని కథా చర్చలు చేసుకోవడం బాపూ-రమణల అలవాటని 'కోతికొమ్మచ్చి' లో తెలిసింది కదా. అలాంటి కొన్ని కథా చర్చలకు ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీరమణ నాటి అనుభవాలని, పెసరప్పడం, దప్పళం, కందట్టు, పుల్లట్టు తదాది రుచుల్నీ తన్మయంగా జ్ఞాపకం చేసుకున్నారు. భోజనానికి ముందు ఈ కథ చదవకండి. 'ఆ చేతులెవరివో' ని కూడా కథ అనలేం, అలాగని అనకుండా ఉండలేం. పుస్తకంలో చివరిదైన 'సర్వనామం' మాత్రం కథ కాదు. ఓ చిన్న వ్యాసం. వీవీఐటీ, నంబూరు, ప్రచురించిన ఈ 109 పేజీల పుస్తకం వెల రూ. 90. నవోదయ బుక్ హౌస్ లో దొరుకుతోంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ 'సింహాచలం సంపెంగలు' తో పాటు 'నవ్వులో శివుడున్నాడురా' అనే కబుర్ల సంపుటి కూడా విడుదలయ్యింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి