తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని తన రాజకీయ గురువుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ఠీఆర్ మీద అభిమానంతోనే తన కొడుక్కి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు కూడా. అయితే, ఆచరణకి వచ్చేసరికి కొన్ని విషయాల్లో ఆయన తెలుగు దేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్ధతుల్ని అనుసరిస్తున్నారేమో అనిపిస్తోంది. రాజకీయాలలో కూరిమి విరసంబైనప్పుడు ఇదే కేసీఆర్ ఇదే చంద్రబాబుని 'డర్టీయెస్ట్ పొలిటిషన్ ఇన్ ఇండియా' అని అని ఉండొచ్చు గాక, రాజకీయ చాణక్యంలో - కనీసం కొన్ని విషయాల్లో అయినా - చంద్రబాబు నాయుణ్ణి అనుసరిస్తున్నారన్న భావన రోజురోజుకీ బలపడుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని పదవీచ్యుతుణ్ణి చేసిన ప్రస్తుత సందర్భంలో.
కారణాంతరాల వల్ల తనకి ఇష్టం లేని నాయకుల్ని పదవి నుంచి తొలగించడానికి, అధికారులని ఉన్నత పదవులలోకి రాకుండా చేయడానికీ చంద్రబాబు నాయుడు దాదాపు రెండు దశాబ్దాల క్రితమే అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు కేసీఆర్ రాజేందర్ విషయంలో అమలు చేస్తున్నారనిపిస్తోంది. పందొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాటి కేబినెట్లో నేటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్నారు. కారణాలు పైకి రాలేదు కానీ, ముఖ్యమంత్రికి-మంత్రికి కుదరాల్సినంతగా సఖ్యత కుదరలేదు. ఫలితంగా ఒకరోజు ముఖ్యమంత్రి ఒద్దికలో ఉండే ఓ పత్రికలో పంచాయతీ రాజ్ శాఖలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ ముఖ్యవార్త. పంచాయతీ ఆఫీసులకి అవసరమైన స్టేషనరీ కొనుగోలులో నిధుల గోల్ మాల్ జరిగిందన్నది కథనం.
క్రమశిక్షణకు మారుపేరుగా పేరుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ముందుగా మంత్రి రాజీనామాకి, అటుపైన జరిగిన అవినీతిపై విచారణకి ఆదేశాలిచ్చింది. ఒక్క వార్తాకథనంతో మంత్రిగారి పదవి పోయింది. అటుపై చాలారోజుల పాటు విచారణ సా...గి, రిపోర్టులో తేల్చిందేమిటంటే అవినీతిలో మంత్రి పాత్ర లేదని!! కొంచం అటూ ఇటూగా ఇదే సమయంలోనే ఇలాంటి అనుభవమే ఓ ఉన్నతాధికారికీ ఎదురయ్యింది. తెల్లారి లేస్తే ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టుకు ప్రమోషన్ ఉత్తర్వులు అందుకోవాలి. కానీ ఎక్కడో ఏదో ఈక్వేషన్ తేడా కొట్టింది. ఫలితం, ఉత్తర్వులు అందుకోడానికి కొన్ని గంటల ముందుగా - మళ్ళీ ఒద్దికలో ఉన్న పత్రికే - ఓ భారీ భూ కుంభకోణాన్ని బద్దలు కొట్టింది. ఆ కుంభకోణపు తీగని ఈ అధికారికి ముడిపెట్టింది. క్రమశిక్షణకి మారుపేరైన ప్రభుత్వం ప్రమోషన్ ఆపేసింది!! ఆ ఆరోపణల మీద విచారణ ఇంకా కొనసాగుతోందో, మధ్యలో అటకెక్కిందో మరి.
కాలం మారింది. రెండు దశాబ్దాల కాలం చాలా మార్పుల్ని తోడు తెచ్చుకుంది. చంద్రబాబు నాయుడికి ఒద్దికలో ఉన్న పత్రికలు సాయం చేసిపెడితే, కేసీఆర్ చేతుల్లో సొంత మీడియానే ఉంది. సొంత చానళ్ళు పేపర్లతో పాటు, అనుకూల చానళ్ళు, పత్రికలూ మూకుమ్మడిగా రాజేందర్ వ్యతిరేక కథనాలు కూడబలుక్కున్నట్టు ఒకేసారి ప్రసారం చేశాయి. కథనాలు రావడమే తరువాయిగా విచారణ, వెంటనే మంత్రిత్వ శాఖ ఉపసంహరణ, ఆ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్. పరిణామాలన్నీ శరవేగంతో జరిగిపోయాయి. రాత్రికి రాత్రే రాజేందర్ 'మాజీ మంత్రి' అయిపోయారు. ఈసారి ఆరోపణ భూ ఆక్రమణ. నిజానికి ఇది చాలా మందిమీద వచ్చిన చాలా పాత ఆరోపణ. తెలంగాణ రాష్ట్రం రాగానే ముందుగా దృష్టిపెడతామని ఉద్యమకాలంలో కేసీఆర్ హెచ్చరించిన ఆరోపణ. 'లక్ష నాగళ్ళ' తో ఆక్రమణల్ని దున్నే కార్యక్రమాన్ని సొంత మంత్రివర్గ సహచరుడితో మొదలు పెట్టారనుకోవాలా?
రాజేందర్ పై తీసుకున్న 'క్రమశిక్షణ చర్య' గడిచిన రెండు దశాబ్దాల్లో మన చుట్టూ వచ్చిన అనేక మార్పులని పరిశీలించే అవకాశం ఇస్తోంది మనకి. నాటితో పోలిస్తే నేడు ప్రత్యామ్నాయ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా బలపడ్డాయి. ప్రసార సాధనాలు వర్గాలుగా విడిపోవడం వల్ల ప్రతి విషయం తాలూకు బొమ్మనీ, బొరుసునీ తెలుసుకోగలుగుతున్నాం. ఇరుపక్షాల వాదనలనీ వినగలుగుతున్నాం. సోషల్ మీడియా ద్వారా మన అభిప్రాయాలనూ చెప్పగలుగుతున్నాం. వీటి ఫలితమే రాజేందర్ కి దొరుకుతున్న మద్దతు. జరిగింది కేవలం క్రమశిక్షణ చర్య మాత్రమే కాదన్న సంగతి జనబాహుళ్యం అర్ధం చేసుకోగలిగింది. కేవలం పత్రికలు, టీవీల్లో వచ్చింది మాత్రమే నమ్మేసి, అభిప్రాయాలు ఏర్పరుచుకోకుండా, విషయాన్ని మొత్తంగా తెలుసుకుని, విశ్లేషించుకుని ఓ అభిప్రాయానికి రావడానికి వీలవుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయపుటెత్తుగడల్లో కేసీఆర్ ఇంకా ఏమేమి వాటిని అనుసరిస్తారో రాబోయే రోజుల్లో చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి