జుట్టున్నమ్మ ఏ కొప్పు ముడిచిన అందంగానే ఉంటుంది అన్నట్టుగా విషయపరిజ్ఞానం, రాయడంలో ఒడుపూ తెలిసిన వాళ్ళు ఏం రాసినా చదివించేదిగానే ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ శ్రీరమణ నుంచి వచ్చిన 'నవ్వులో శివుడున్నాడురా' అనే 'విశేషాల' సంకలనం. వ్యాసాలు, కబుర్లు, చమక్కులూ.. వీటన్నింటి కలగలుపు ఈ 232 పేజీల పుస్తకం. మొత్తం మూడు అధ్యాయాలుగా విభజింపబడిన ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలో హాస్యాన్ని గురించి పదిహేను వ్యాసాలున్నాయి. ఇవన్నీ హాస్యభరితంగా ఉంటూనే అకడమిక్ విలువని కలిగి ఉన్నాయి. 'తెలుగు సాహిత్యంలో హాస్యం' అనే అంశం మీద పరిశోధన చేయాలనుకునే వారు తప్పక రిఫర్ చేయాల్సిన వ్యాసాలివి. కేవలం లిఖిత సాహిత్యం మాత్రమే కాదు, హరికథలు, అవధానాలు లాంటి అలిఖిత సాహిత్యంలో హాస్యాన్నీ ఈ వ్యాసాల్లో సందర్భోచితంగా చేర్చారు. ఇవన్నీ శ్రీరమణ చేసిన రేడియో ప్రసంగాలు.
"త్యాగరాజ స్వామి కృతుల్లో కొన్నిచోట్ల చిత్రమైన శబ్దాలు కనిపిస్తాయి. ఒక కీర్తనలో 'నాదుపై ఏల దయరాదూ' అని ఉంటుంది. 'నాదు శబ్దం ఎలా చెల్లుతుంది స్వామీ' అని ఒక శిష్యుడు అడిగాడు. 'చెల్లదు నాయనా! చెల్లదు. అజ్ఞానం వుంది కనకనే ఏల దయరాదూ అని రాముణ్ణి వేడుకోవడం' అన్నారట త్యాగయ్య" ...మచ్చుకి ఇదొక్కటి. ఇలాంటివి ఈ పదిహేను వ్యాసాల నిండా కోకొల్లలు. కవులు, రచయితలు, నాటక కర్తలు, చిత్రకారులు, కార్టూనిస్టులు.. ఇలా ఎందరెందరి కబుర్లో వినిపిస్తాయీ వ్యాసాలలో. ఇలాంటి చోట విశ్వనాథ ప్రస్తావన రాకపోతే అది శ్రీరమణ రచనే కాదు. ఓసారి విశ్వనాథ, రుక్కాయిని (జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి - పేరడీలు సృష్టికర్త మాత్రమే కాదు, 'ఒఖ్ఖ దణ్ణం' లాంటి కాలానికి నిలబడే కథలెన్నో రాశారు కూడా) 'ఏం చేస్తున్నావు నాయనా?' అని అడిగారట. 'వేయిపడగల్ని తెలుగులోకి అనువదిస్తున్నా' అన్నారట రుక్కాయి తడుముకోకుండా.
రెండో భాగం 'బాపూరమణశ్రీరమణ' లో మొత్తం ఎనిమిది వ్యాసాలున్నాయి. పేరులోనే చెప్పినట్టుగా ఇవన్నీ బాపూ-రమణలని గురించే. ఆ ద్వయంతో శ్రీరమణది సుదీర్ఘమైన అనుబంధం. బాపు పుస్తకాలకి ముందుమాటలు రాయడం మొదలు, వాళ్ళ సినిమాలకి పనిచేయడం (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) వరకూ వాళ్ళని చాలా దగ్గరగా చూశారు శ్రీరమణ. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాళ్లతో చేసిన ఇంటర్యూలు, రమణ వెళ్ళిపోయాక రాసిన నివాళి వ్యాసమూ ఉన్నాయి భాగంలో. వీటిలో 'దక్షిణ తాంబూలం అను కార్తీక దక్షిణ' అస్సలు మిస్సవకూడనిది. దూరదర్శన్ వారి 'టెలి స్కూల్' కార్యక్రమానికి వీడియో పాఠాలు షూట్ చేయడం కోసం గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఓ లాకు సూపర్వైజర్ గారింట్లో చేసిన కార్తీక భోజనం కథ ఇది. చదువుతుంటే, ఆ చిన్న ఇంట్లో మనం కూడా ఆ దంపతుల ఆతిధ్యం పొందుతున్నట్టు అనిపిస్తుంది. ఆధరువులన్నీ వాటి రుచులతో సహా ఎంతగా గుర్తు పెట్టుకున్నారో శ్రీరమణ. బహుశా అందుకే 'మిథునం' రాయగలిగారు!
ఇక పుస్తకంలో ముచ్చటైన మూడోభాగం శీర్షిక 'సశేషాలు-విశేషాలు' తొమ్మిది వ్యాసాల సంకలనం. వీటిలో మొదటిది 'నాస్తికానికి ముందుమాట' పేరుతో నరిశెట్టి ఇన్నయ్య ఆత్మకథకి రాసిన ఇరవై పేజీల ముందుమాట. "అర్ధంకాకో, ఎందుకులే అనుకునో ఈ ముందుమాటని ఆ పుస్తకంలో చేర్చుకోలేదు" అన్న చివరిమాట నిజంగానే మాస్టర్ స్ట్రోక్. ఈ ఒక్క వ్యాసం కోసమైనా ఈ పుస్తకాన్ని మన లైబ్రరీలో దాచుకోవాలి. నాలుగు ఎలిజీలు - ఎస్వీ భుజంగరాయ శర్మ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, నండూరి రామ్మోహన రావు - మళ్ళీ మళ్ళీ చదివించేవిగా ఉన్నాయి. మద్రాసులో ఓసారి అనుకోని విధంగా శ్రీరమణ గారబ్బాయి అక్షరాభ్యాసం శ్రీకాంతశర్మ చేతులమీదుగా జరిగింది. "కొన్నాళ్ళు గడిచినాయ్. బళ్ళో మావాడి ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడొచ్చినా కాపీ తీయించి శర్మకి పోస్ట్ చేసేవాణ్ణి. 'ఇదేంటండీ? నన్నీవిధంగా హింస పెడుతున్నారు. నేను వద్దు మొర్రో అన్నా వినకుండా నాతో దిద్దబెట్టించారు. నేనెప్పుడూ లెక్కల్లో పూరే. వాడికి లెక్కల్లో తోకలేని తొమ్మిదులు, తల లేని ఆర్లు వస్తుంటే నాదా పూచీ' అంటూ జవాబులు వస్తుండేవి." ..చదువుతూ నవ్వాపుకోవడం మన తరమా?
వ్యాసాల చివర్లో పేజీల్లో ఖాళీలు మిగిలిపోతే వాటినలా వదిలేయకుండా బాపూ కార్టూన్లు ప్రచురించడం వల్ల పుస్తకానికి అదనపు శోభ చేకూరింది. 'నవ్వులో శివుడున్నాడురా' అన్న మాట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిదట. ఈ పుస్తకానికి చక్కగా అమిరింది. సరసి గీసిన కైలాసం ముఖచిత్రంలో శ్రీరమణ వేషంలో ఉన్న శివుడు, ఆయన మెడలో ఫణిరాజుతో సహా ఎల్లరూ నవ్వులు చిందిస్తున్నారు. తన మిత్రులు వేలమూరి శ్రీరామ్ ప్రోత్సాహంతో ఈ పుస్తకం తీసుకొచ్చానని చెబుతూ, "దేవుడు మేలు చేస్తే చిలకలపందిరి, సరసం.కామ్ (హాస్య కదంబాలు), విరాట, ఉద్యోగ పర్వాలు, ఇంకా మరికొన్ని పుస్తకాలు రావాల్సి ఉన్నాయి" అని చెప్పేశారు. వీటిలో 'చిలకలపందిరి' కోసం నేను బాగా ఎదురు చూస్తున్నా - శ్రీరమణ రాతకి, మోహన్ గీతకీ మధ్య విపరీతమైన పోటీ ఉంటుందా పందిట్లో. వీవీఐటీ ప్రచురించిన 'నవ్వులో శివుడున్నాడురా' వెల రూ. 180. ఆన్లైన్ లో లభిస్తోంది.