మంగళవారం, ఏప్రిల్ 07, 2020

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

(తొలిప్రచురణ 'నవతరంగం' వెబ్సైట్, నవంబర్ 18, 2008)

సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్' ఒకటి.  ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ల గురించి కొంత చెప్పాలి. వీధి నాటకాలకి ఆదరణ తగ్గి, పల్లెల్లో ఉత్సవాలకి 16mm తెరపై సినిమాలు ప్రదర్శించే పధ్ధతి ప్రారంభం కాడానికి ముందు, అంటే డెబ్బై, ఎనభై దశకాలలో ఈ ట్రూప్ లు పల్లె ప్రజలకు వినోదాన్ని అందించాయి. 

ప్రారంభంలో వీరి నృత్యాలు అశ్లీలానికి దూరంగా ఉన్నా, ట్రూప్ ల మధ్య పెరిగిన పోటీ కారణంగా తరువాతి కాలంలో అసభ్య ప్రదర్శనలు మొదలయ్యాయి. వంశీ 'మా పసలపూడి కథలు' లో 'పాముల నాగేశ్వర రావు' 'కుమారి మా ఊరొచ్చింది' కథల్లో ఈ ట్రూప్ ల ఒకనాటి వైభవాన్ని తెలుసుకోవచ్చు. (అంబాసిడర్ కార్లలో వచ్చే ట్రూప్ సభ్యులకు సినీ తారలకు ఉన్నంత ఆదరణా ఉండేది.)  ఈ ట్రూప్ లు ఉచ్ఛదశలో ఉన్నకాలంనాటి కథ ఇది. తనికెళ్ళ భరణి,  వేమూరి సత్యనారాయణ లతో కలిసి వంశీ తయారుచేసిన ఈ కథ రికార్డింగ్ డాన్సర్ల తెర వెనుక జీవితాన్ని చూపిస్తుంది. తెర వెనుక వాళ్ళూ మామూలు మనుషులే అని చెబుతుంది. 

మేనల్లుడి ఆస్తిని అనుభవించే ట్రూప్ యజమాని యాళ్ళ పాపారావు (కోట శ్రీనివాస రావు), భర్త వదిలేస్తే పిల్లల్ని పెంచడం కోసం డాన్సులు చేయడం మొదలుపెట్టిన ఆకుల అనంతలక్ష్మి(వై. విజయ), మామ చాటు మేనల్లుడు దొరబాబు (భరణి), తన బావ సిలోన్ సుబ్బారావు(రాళ్ళపల్లి) కోసం కలలు కంటూ కొత్త కొత్త డాన్సులు చేసే పట్టు పద్మిని(సంధ్య),  తల్లి, తండ్రి చిన్నప్పుడే చనిపోతే తన మేనమామ (భీమరాజు) దగ్గరే ఉంటూ అతనంటే భయపడుతూ ఉండే గోపాలం(నరేష్),  ట్రూప్ వ్యాన్ నడిపే డ్రైవర్ మస్తాన్, పెళ్ళయిన బ్రహ్మచారి వ్యాన్ క్లీనర్ పెనుగొండ అబ్బులు (మల్లికార్జున రావు),  వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టిఆర్, జూనియర్ ఏయన్నార్, జూనియర్ చిరంజీవి ఈ ట్రూప్ సభ్యులు. 

గోపాలం హీరో కృష్ణ డాన్సులు చేస్తూ ఉంటాడు ట్రూప్ ప్రోగ్రామ్స్ లో. రాజమండ్రి దేవి చౌక్ కి చెందిన ఈ ట్రూప్ ఊళ్ళు తిరిగి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది. గోపాలం హోటల్ కి పాలు సప్లయ్ చేసే పాడి సుందరమ్మ (నిర్మలమ్మ) మనవరాలు సీత (హిరోయిన్ మాధురి) పిరికి వాడైన గోపాలాన్ని ప్రేమించి, అతని కోసం ట్రూప్ లో చేరి అతన్ని పెళ్లి చేసుకోడమే ఈ సినిమా కథ. దొరబాబు సీతని ప్రేమించడం, తన స్వార్ధం కోసం పాపారావు కూడా వాళ్ల పెళ్ళికి అంగీకరించడం కథలో మలుపులు. నిజానికి ఇలాంటి కథతో సినిమా తీయడం సాహసం. ఐతే 'లేడీస్ టైలర్' తో కామెడి బాట పట్టిన వంశీ ఈ సినిమా ను హాస్యరస భరితంగా తెరకెక్కించాడు. చివరి ఇరవై నిమిషాలు మినహాయిస్తే, నవ్వకుండా ఈ సినిమా చూడడం అసాధ్యం. పూర్తిగా డైలాగ్ కామెడీ. ప్రతి మాటా తూటాలా పేలుతుంది. పాపారావు పాత్ర లో కోట శ్రీనివాస రావు జీవించాడు. మిగిలిన వాళ్ళూ అతనితో పోటీ పడ్డారు. 


ముఖ్యంగా సీత కాలికి గాయం అయినపుడు పరామర్శించడానికి తన ట్రూప్ అంతటినీ పాపారావు సుందరమ్మ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని కూచిపూడి భాగవతార్ లు గా పరిచయం చేయడం, సుందరమ్మ కోరికపై 'రామాయణం' ప్రదర్శించే సీన్ సినిమా మొత్తానికే హైలైట్. అలాగే దొరబాబు కోడితో సీతకి లవ్ లెటర్ పంపే సీన్, రాంబాబు కి పోటీగా జూనియర్ ఎన్టిఆర్ ని ప్రోత్సహించే సీన్స్ గుర్తుండిపోతాయి. సినిమా హీరోల మధ్య ఉండే జెలసీలను సింబాలిక్ గా చుపించారనిపిస్తుంది. ఎక్కడా నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

ఈ సినిమా లో ఊతపదాలకీ కొదవ లేదు. 'ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెబుతున్నాను' అంటూ పెనుగొండ అబ్బులు, 'అదంతా వీజీ కాదు' అంటూ దొరబాబు,  'దొరబాబూ ఉక్కెట్టవా' అంటూ పట్టు పద్మిని..ఈ డైలాగులు ఇప్పటికి మనకి ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఇక సిలోన్ సుబ్బారావు సినిమా మొదటి సగం లో తెరపై కనిపించకుండానూ, రెండో సగం లో తెరపై కనిపించీ ప్రేక్షకులకు వినోదం పంచుతాడు. పట్టు పద్మినిని సిలోన్ సుబ్బారావు సినిమా హీరోయిన్ లా ట్రీట్ చేయడం, అది చూసి పాపారావు కడుపు మండడం, దొరబాబు కి పెనుగొండ అబ్బులు 'ఫ్రెండ్షిప్ కొద్దీ' ఇచ్చే సలహాలూ, పట్టు పద్మిని 'భరతపూడి' ప్రదర్శన,  పాపారావు కి సుందరమ్మ చేసే అవమానాలూ ప్రేక్షకులకి కావల్సినంత వినోదాన్ని పంచుతాయి. 

ఇళయరాజా సంగీతం లో పాత పాటల రీమిక్స్ లను వినొచ్చు.  రెండు స్ట్రెయిట్ పాటలు 'వెన్నెలై పాడనా' 'ఏనాడు విడిపోని' ఆకట్టుకుంటాయి. 'వెన్నెలై' పాటలో వంశీ మార్కు చిత్రీకరణ కనిపిస్తుంది. నైట్ అఫెక్ట్ లో రికార్డింగ్ డాన్స్ లను చాలా సహజంగా చిత్రీకరించారు. రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో మిగిలిన నటులంతా చాలా సహజంగా చేసినా, జూనియర్ కృష్ణ గా నరేష్ సూట్ కాలేదని నాకు అనిపిస్తుంది. కృష్ణ అభిమానులు అతనికి కరెన్సీ నోట్ల తో దండ వేసి దానిని ఊరు దాటేవరకూ తీయొద్దనడం ఓ ప్రహసనం. ప్రతి విషయంలోనూ  ఆచితూచి వ్యవహరించే సుందరమ్మ తన మనవరాలి పెళ్లి విషయంలో ఎందుకు తొందర పడుతుంతో, తను ఏమాత్రం నమ్మని పాపారావుని గుడ్డిగా నమ్ముతుందో అర్ధంకాదు. ఇక క్లైమాక్స్ ఐతే 'ఏదో సినిమాని ముగించాలి కాబట్టి' అన్నట్టుగా ఉంటుందే తప్ప కన్విన్సింగ్ గా ఉండదు.  

సినిమా ప్రారంభంలో వచ్చే కాఫీ హోటల్ సీన్లో టిఫిన్ తిని బిల్ ఎగ్గొట్టి పప్పురుబ్బే దొంగ సన్యాసి పాత్రలో వంశీ కనిపిస్తాడు. వంశీ నటించిన ఒకే ఒక సినిమా ఇది. ఈ సినిమా కి మొదట అనుకున్న టైటిల్ 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ రాజమండ్రి.' పేరు బాగా పెద్దదైందని 'రాజమండ్రి' తీసేసారు. ఐతే సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి లోను, కోనసీమ గ్రామాల్లోనూ చేసారు. (ఈ మధ్యనే 'కొత్త బంగారు లోకం' చూసాక, మళ్ళీ ఈ సినిమా చుస్తే గడిచిన రెండు దశాబ్దాల కాలంలో రాజమండ్రి ఎంతగా మారిపోయిందో అర్ధమైంది.)  వంశీ మార్కు గోదావరిని చాలా షాట్స్ లో చూడొచ్చు. ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన ఈ లో-బడ్జెట్ సినిమా అంతగా విజయవంతం కాలేదు. రికార్డింగ్ డాన్స్ కాన్సెప్ట్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవడం కూడా ఒక కారణమని చెబుతారు. కామెడీలని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా విసుగు కలగదు.

11 కామెంట్‌లు:

  1. Very Good review murali garu. ఈ చిత్రంలో 'ఏనాడు వీడిపోని ' పాట ఒక ఆణిముత్యం. చక్రవాక రాగం లో ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా బాలు గారు పాడిన తీరు అద్భుతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'ఏనాడు విడిపోని.. ' పాటకి ప్రేరణ 'స్వాతిముత్యం' సినిమాలో వినిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండీ. అది బాగా నచ్చి పూర్తి పాట చేయించుకున్నారట వంశీ. ..ధన్యవాదాలు. 

      తొలగించండి
  2. Super movie.I like tankellabharini character so much.Also silonu subbrao dilouge.nice movie.thank you making us remember it.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ.. భరణి అమాయకత్వం, సిలోన్ సుబ్బారావు కోతలు భలేగా నచ్చేస్తాయి.. ధన్యవాదాలు. 

      తొలగించండి
  3. ఈ సినిమా చూస్తుంటే కోనసీమలో నాలుగు రోజులు తిరిగినట్లు ఉంటుంది కాని సినిమా చూస్తున్నట్లు ఉండదు. అందుకే మిగిలిన ప్రాంతాల వారికి అంతగా నచ్చి ఉండదు.
    నా చిన్నప్పుడు పండుగలకి రికార్డింగ్ డాన్సులు పెట్టడం మామూలు. వాళ్ళ తెర వెనుక జీవితాలు ఈ సినిమాలో వంశీ సహజంగా చూపించాడు.

    రిప్లయితొలగించండి
  4. నేనీ సినిమాని ఇదివరలో ఎలా మిస్ అయ్యానో గుర్తు రావడం లేదు. పైన మీ రివ్యూ చదివిన తర్వాత ఇప్పుడు చూశాను యూట్యూబ్ లో. మీ రివ్యూలోని చాలా అంశాల విశ్లేషణ లాగానే ఉంది సినిమా. ముగింపు గురించి మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను ... చాలా పేలవంగా ఉన్నట్లు అనిపించింది.

    నటీనటుల్లో మీరు చెప్పినవారితో బాటు నాకు మరింత బాగా నచ్చినది నిర్మలమ్మ నటన. ఆ పెద్దరికపు గద్దింపులు చేసే పాత్రల్లో బాగా జీవించేది ఆవిడ. ఆవిడ నటించిన ఏ సినిమాలోనయినా ఆవిడ నటన నచ్చుతుంది నాకు.

    ఇక మనవరాలి పెళ్ళికి సుందరమ్మ ఎందుకు తొందరపడుతోందో అన్నారు మీరు. ఆడపిల్లకు త్వరగా పెళ్ళి చేసెయ్యడం పల్లెటూళ్ళల్లో మామూలే కదా అనుకోవాలేమో? పాపారావుని ఎలా నమ్మిందీ అంటే గోపాలం ప్రేమ బెడద తప్పించుకోవడానికి పాపారావు మేనల్లుడి సంబంధానికి రాజీ పడిందేమో అనిపిస్తుంది నాకు.

    మీరు చెప్పిన డబ్బైలు, ఎనభైల్లోనే కాదు అరవైల్లోనే రికార్డింగ్ డాన్సులు ఉండేవి. కోనసీమలో నేనూ చూశాను. ఈ సినిమాలో నాకర్ధం కాని సంగతొకటుంది. ట్రూప్ వాళ్ళు గుడారాలు వేసుకుని నైట్‌హాల్ట్ చెయ్యడం కాస్త వింతగా అనిపించింది. సాధారణంగా తమ ఊళ్ళో ప్రోగ్రాం ఇవ్వడానికి ఊరివారు ఒప్పుకుంటే గనక చిన్నదో పెద్దదో ఏదో ఒక వసతిసదుపాయం ఊరి వాళ్ళే ఏర్పాటు చేస్తారని అనుకుంటుండే వాడిని ... అందులోనూ ఆడవాళ్ళు కూడా ఉండే ట్రూప్ కాబట్టి (అఫ్‌కోర్స్ మాట్లాడుకున్నదాన్ని బట్టి కూడా ఉంటుంది లెండి). రికార్డింగ్ డాన్సులు చూసిన కాలంలో నేను ఇటువంటి విషయాల గురించి పట్టించుకోలేదు, అప్పట్లో అంత అవగాహనా లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిర్మలమ్మ - చాలా సహజంగా ఉంటుందండీ ఆమె ఏ పాత్ర వేసినా, నటిస్తున్నట్టే అనిపించదు. మనవరాలి పెళ్లి విషయంలో, బహుశా మీరు చెప్పింది నిజమే కావొచ్చు. చాలా తెలివైన వాళ్ళు కూడా ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా. 
      అరవైలు - నిజమేనండి, కానీ ఉధృతి పెరిగింది మాత్రం డెబ్భైల్లోనే. అరవైల్లో నాటకాలకే పెద్ద పీట కదా. 
      గుడారాలు - ముందుగా ప్లాన్ చేసుకుంటే ఊరి వాళ్ళే ఆతిధ్యం ఇస్తారండి. అవన్నీ ముందే మాట్లాడుకునే వారు కూడా. అనుకోకుండా వ్యాన్ బ్రేక్ డౌన్ అవడం వల్ల వాళ్లంతా గుడారాలు వేసుకుని ఉండాల్సొచ్చింది. దారిమధ్యలో ఏదో ఊరి వాళ్ళు ఇంతమందికి అప్పటికప్పుడు ఆతిధ్యం ఇవ్వడం అంటే సాధ్యం కాదు కదా (పైగా ఆ ట్రూపు వీళ్ళ ఊళ్ళో ప్రోగ్రాం ఇచ్చింది కూడా కాదు) 
      సినిమా ఎడిటింగ్ లో కూడా చాలా లోపాలున్నాయి లెండి. కాల్లో గాజుపెంకు గుచ్చుకున్న సీత, తర్వాత సీన్లోనే గోదారికి నీళ్ళకి వెళ్లడం లాంటివి. 
      ..వివరంగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.. 

      తొలగించండి
    2. మళ్ళీ వచ్చాను ... అదే గుడారాల గురించి. వాన్ బ్రేక్‌డౌన్ కారణం అన్నారు గదా అని ఆ సీన్లు మళ్ళీ చూశాను. బ్రేక్‌డౌన్ అయిన రోజున కరక్టే గానీ తతిమ్మా రోజుల్లో కూడా (ప్రోగ్రాం ఇచ్చే ఊరిలో కూడా) టెంట్లు వేసుకునే గడిపారనిపించింది. అదే నాకు విచిత్రంగా తోచింది.

      ఏదో అధిక "క్లారిటీ" గురించే నా ఈ వ్యాఖ్య గానీ టెంట్ల సంగతి పెద్ద విషయం కాదు లెండి. బహుశః సినిమాటిక్ గా ఉండాలని తాపత్రయ పడ్డాడేమో వంశీ? థాంక్స్.

      తొలగించండి
  5. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మొట్టమొదటగా ర్యాలి గ్రామంలో రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం ఒకటి చూసాను. అబ్బే వెళ్ళి చూడలేదండి. మా ర్యాలి అమ్మమ్మ గారి ఇంటిముందే స్టేజీ వేసారు మరి. అందుకే చూసానన్న మాట. ఇద్దరమ్మాయిలు చేసారు. వాళ్ళు చేసిన పాట ఒకటి 'అనుకున్నదొక్కటీ ఐనది ఒక్కటీ బోల్తాకొట్టిందిలే బుల్‍బుల్‍ పిట్టా అన్నది. పదేళ్ళప్రాయంలో వాళ్ళేం పాడుతున్నారో స్టేజీచుట్టూ ఎందుకు తిరుగుతున్నారో ఏమీ అర్ధం కాలేదు కాని ఆ పాట సంగీతం బాగా అనిపించింది - పైగా ఒకతను చిన్నతుపాకీ పుచ్చుకొని వాళ్ళ మధ్యలో తిరుగుతుంటే ఇంకా తమాషాగా అనిపించింది. ఆ అమ్మాయిలిద్దరూ రాజులపిల్లలట, బాగా చేస్తున్నారుట అన్నమాట ప్రోగ్రాం మొదలు కాకముందే మా అమ్మమ్మగారితో ఒకరనటం విన్నాను. ప్రోగ్రాం జరుగుతుండగానే నిద్రపోయినట్లు గుర్తు.

    రానురాను అటు కాంట్రాక్టు నాటకాలేమీ, ఇటు ఈ రికార్డింగు డాన్సు లేమీ చాలా అసభ్యంగా తయారవటంతో మెల్లగా రెండూ జనం వెలివేతకు గురి అయ్యాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగున్నాయండి మీ అనుభవాలు. నిజమే, బాగా మొదలైనవన్నీ చివరికి నాసిగానే మారిపోయాయి. 'చింతామణి' నాటకం లాగా. మొదట్లో కాళ్ళకూరి వారి నాటకమే వేసేవాళ్ళు. రానురాను ఒరిజినల్ నాటకంలో లేని సీన్లు వచ్చి చేరడం మొదలు పెట్టి, చివరికి వచ్చేసరికి పాత్రల పేర్లు తప్ప ఒరిజినల్ నుంచి ఇంకేమీ మిగలని దశ వచ్చేసింది. అసభ్యత కన్నా కూడా వీధుల్లో తెరలు కట్టి సినిమాలు వెయ్యడం  నాటకాలని, రికార్డింగ్ డేన్సులని ఎక్కువుగా నష్టపరిచిందని నాకనిపిస్తుందండి. ధన్యవాదాలు. 

      తొలగించండి