శుక్రవారం, ఏప్రిల్ 24, 2020

ఇది నా ప్రియ నర్తన వేళ ...

"ఉత్తరాన ఒక ఉరుము వురిమినా
ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక.. చిరు మెదలిక..
గిలిగింతగ జనియించగా.. "

నాట్యాన్ని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్న ఆ అమ్మాయికి, ప్రమాదంలో ఓ కాలిని కోల్పోవడం చాలా పెద్ద షాక్. అంగవికలురాలిని అయ్యానన్న బాధ కన్నా, తనకి ఇష్టమైన నాట్యాన్ని ఇక మళ్ళీ చేయలేనన్న బాధే ఆమెని ఎక్కువగా కుంగదీసింది. ఒక్కసారిగా తన శరీరంలో వచ్చిన మార్పు, ఆమెకి తన చుట్టూ ఉన్న వాళ్ళని అర్ధం చేసుకోడానికి ఉపకరించింది. సమాజం చూపించే నిరసనలు, సానుభూతి ఆమెలో పట్టుదలని పెంచాయి. కృత్రిమ కాలిని గురించి విన్నప్పుడు ఆమె మొదటి ఆలోచన, 'ఆ కాలితో తిరిగి నాట్యం చేయగలనా?' అనే. 

నిజానికి అదంత సులువైన విషయం కాదు. అసాధ్యం అన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఆమెలో పట్టుదల ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. అప్పటికే ఔపోసన పట్టిన నాట్యాన్ని కృత్రిమ కాలితో మళ్ళీ నేర్చుకుంది. తన నాట్యం మీద తనకి నమ్మకం కుదిరాక, నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. నవ్విన నలుగురినీ పిలిచింది. వాళ్ళ ఎదుట మరింత ఆత్మవిశ్వాసంతో ప్రదర్శన ఇచ్చింది. 

సుధాచంద్రన్ నిజజీవిత గాధకి కాస్త కల్పనని జోడించి సింగీతం శ్రీనివాసరావు రూపు దిద్దిన సినిమా 'మయూరి' (1984). తాన పాత్రని తానే పోషించింది సుధా చంద్రన్. కృత్రిమ కాలితో ఆమె చేసే నాట్యం సినిమాకి పతాక సన్నివేశం. ఆ సందర్భానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు వేటూరి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత సారధ్యంలో నిరుపమానంగా పాడారు ఎస్. జానకి. 


"అందెలు పిలిచిన అలికిడి లో
అణువణువున అలజడులూ
ఎద పదమొకటౌ లాహిరిలో
ఎన్నడు ఎరగని వురవడులూ.. " 

కాలి అందెలు రా రమ్మని పిలుస్తూ ఉంటే ఆ నర్తకి శరీరంలో అణువణువూ అలజడికి లోనవుతుంది. గుండె చప్పుడు, అందెల సవ్వడీ  కలిసిపోయి, ఆమెలో అంతకు మునుపెన్నడూ లేని వురవడి కలుగుతోంది. 

"ఇది నా ప్రియ నర్తన వేళ
తుది లేనిది జీవన హేల.. " 

తనకెంతో ఇష్టమైన నాట్యాన్ని (మళ్ళీ) చేస్తున్న వేళ.. జీవన్నాటకానికి ముగింపు ఎక్కడుంది??

"ఉత్తరాన ఒక ఉరుము వురిమినా
ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక.. చిరు మెదలిక..
గిలిగింతగ జనియించగా.. "

నాట్య మయూరి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టంలో పాడుకునే పాటకి వర్షాన్ని నేపధ్యంగా ఎంచుకోవడం.. ఎంత గొప్ప ఆలోచన అసలు? వర్షం వచ్చినప్పుడే కదా నెమలి మైమరిచి నాట్యం చేస్తుంది. ఉత్తరం వైపున ఆకాశం ఉరిమిందంటే కుంభవృష్టి కురవబోతోందని అర్ధం. పైగా, ఉరుముకి తోడు ఒక (ఉలిపి) చిలిపి మెరుపు కూడా మెరిసింది. ఆమెలో కదలికకి అంతకన్నా ఇంకేం కావాలి? 

"నాలుగు దిక్కుల నడుమ
పుడమి నా వేదికగా నటన మాడనా
అనంత లయతో నిరంత గతితో 
జతులు పాడనా.. ఆడనా.."

వర్షం ఉత్తరదిక్కు వైపునుంచి వస్తూ ఉండొచ్చు. కానీ ఆమె నాట్యానికి మాత్రం విశాలమైన వేదిక కావాలి. నాలుగు దిక్కులా మధ్యనా ఉన్న నేలంత విశాలమై ఉండాలి. ఎందుకంటే ఆమె లయలు అనంతం, గతులు నిరంతం.. మళ్ళీ చేయలేనేమో  అని బెంగపడ్డ నాట్యాన్ని తనివితీరా చేసి చూపుతానంటోంది ఆ కళాకారిణి. 

"మేఘ వీణ చలి చినుకు చిలికినా
మేను లోన చిరు అలలు కదిలినా
ఒక లహరిక.. మధు మదనిక.. 
వలవంతగ..  జనియించగా.. "

ఉరుము ఉరిమిన తర్వాత చినుకులు రాలడం అత్యంత సహజం. అంతే సహజంగా ఆమె శరీరం అలలుగా (లహరిక), మెరుపు తీగెలా (మదనిక) కదులుతూ, (నాట్యం మీద) వియోగం (వలవంత) కలిగిస్తోంది. 

"సుగమ నిగమ సుధ ఎడద పొంగగా
వరదలాగ ఉప్పొంగనా
వరాళి ఎదలో.. స్వరాల రొదతో 
పదము పాడనా.. ఆడనా ... "

వేదఘోషకి హృదయం పొంగుతూ ఉంటే (సామవేదం నుంచి సంగీతం పుడితే, నాలుగు వేదాల నుంచీ నాట్యం పుట్టింది) తానే వరదలా ఉప్పొంగుతాననీ, 'వరాళి' లో పాడి ఆడతాననీ (గురువు నేర్పించని రాగం 'వరాళి,' ఇది ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవాల్సిందే. 'వరాళి' లో పాడడం అంటే, సంగీతాన్ని పూర్తిగా నేర్చుకోవడం) ముక్తాయించిందా నర్తకి. (రెండు చరణాలూ 'పాడనా.. ఆడనా..' తోనే ముగిశాయి). గమకాలని అలవోకగా పలికించే జానకి ప్రతి పదాన్నీ భావగర్భితంగా పలకగా, సాహిత్యంలో ప్రతి పదాన్ని అర్ధం చేసుకుని అభినయించింది సుధా చంద్రన్. 

4 కామెంట్‌లు:

  1. అటువంటి పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు నిరాశా నిస్పృహలతో క్రుంగిపోయి ఇది నా ఖర్మ అనుకుంటూ బతుకు వెళ్ళదీయడం అనే చట్రంలో ఇరుక్కుపోవడం చాలా తేలిక. కానీ అలాంటి వాటికి తావివ్వకుండా ధృఢనిశ్చయం, మనోనిబ్బరంతో జీవితం మీద తిరిగి పట్టు సాధించిన మహా వ్యక్తి సుధా చంద్రన్. A rare personality 👏👏.

    రిప్లయితొలగించండి
  2. ఈ పాటను స్వరపర్చినది కూడా వర్షానికనువయ్యే బృందావని సారంగ లో. దానివల్ల పాటకి ఒక విలక్షణత ఏర్పడిందింది.
    అయితే సాహిత్య పరంగా నాకు "స్వరాల రొద" అన్న ప్రయోగం నచ్చలేదు.స్వరాలలో వినిపించేది నాదం కానీ రొద కాదు కదా?
    అంతే కాదు, శుధ్ధ రిషభ రాగం వరాళి ప్రస్తావన ఈ పాటలో అనవసరమనిపిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
    కూడా
    ఇలాటి వ్యక్తిత్వం వున్న ఇంకొక వ్యక్తి గురించి నేను రాసింది వీలైతే చదవండి. (కామెంట్లలో మీ స్థలాన్ని వాడుతున్నందుకు క్షంతవ్యురాలిని).
    https://sbmurali2007.wordpress.com/2017/07/13/%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a5%e0%b0%82-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%88%e0%b0%ab%e0%b1%8d/

    శారద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదివానండీ ఆ తబలా విద్వాంసుడి గురించి.. ఏమనగలను, 'బల్లే బల్లే' తప్ప. 'క్షంతవ్యురాలిని' .. ఇంత పెద్దమాట ఎందుకండీ ?  ఇక వేటూరి గురించి, 'రొద' అనే పదాన్ని ఎక్కడా నెగిటివ్ సెన్స్ లో వాడినట్టు అనిపించలేదు నాకు. 'సిరిసిరిమువ్వ' లో కూడా 'ఎదలోని సొదలా ఎలదేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా' అన్నారు కదా.. ధన్యవాదాలు.. 

      తొలగించండి