సోమవారం, ఏప్రిల్ 13, 2020

ఏప్రిల్ 1 విడుదల

(తొలి ప్రచురణ: 'నవతరంగం' వెబ్సైట్, డిసెంబర్ 23, 2008)

ఆరేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రిక వంశీని ఇంటర్వ్యూ చేస్తూ 'మీరు తీసిన సినిమాల్లో మీకిష్టమైన సినిమా?' అని అడిగితే, దానికి వంశీ సమాధానం: "సితార లో కొంత భాగం, ఏప్రిల్ 1 విడుదల లో కొంత భాగం" అని. మనం 'సితార' గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడిక 'ఏప్రిల్ 1 విడుదల' గురించి. తెలుగు సినిమాల గురించి ఏమాత్రం ఆసక్తి ఉన్నవాళ్ల దగ్గరైనా ఈ సినిమా పేరు చెప్పి చూడండి. అప్రయత్నం గానే వాళ్ల ముఖంలో చిరునవ్వు మెరవడాన్ని గమనించొచ్చు. ఈ ఒక్కటీ చాలు, ఈ సినిమా ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి.

'ఇంట్లో ఇద్దరు భార్యలు ఉన్నా, పక్కింటి భాగ్యం కోసం అష్టకష్టాలు పడే పేనుకొరుకుడు చిన్నారావు..' ఈ సినిమా పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చే మొదటి పాత్ర ఇదే. నిజానికి దివాకరం (రాజేంద్రప్రసాద్), భువనేశ్వరి (శోభన) లాంటి బలమైన పాత్రలున్న ఈ సినిమాలో వాళ్ళందరితోనూ పోటీ పడి 'చిన్నారావు' గా మెప్పించారు మల్లికార్జునరావు.   కోలపల్లి ఈశ్వర్, ఎం.ఐ. కిషన్ రాసిన 'హరిశ్చంద్రుడు అబద్దమాడితే..' నవలకు వంశీ తన నవల 'గోకులంలో రాధ' లో కాలనీ నేపధ్యాన్ని జోడించి, మరికొన్ని మార్పులుచేర్పులతో రూపుదిద్ది 'ఏప్రిల్ 1 విడుదల' గా మలచారు. ఇప్పటి ప్రముఖ హాస్య నటుల్లో ఒకరైన ఎల్.బి. శ్రీరామ్ అత్యంత సహజమైన సంభాషణలు అందించారు. ఇప్పటి మరో ప్రముఖ హాస్య నటుడు కృష్ణ భగవాన్ తొలిసారిగా ఈ సినిమాలో ప్రాముఖ్యం ఉన్న పాత్రను  (గోపీచంద్) పోషించారు. వంశీ-ఇళయరాజాల కాంబినేషన్ వెండితెరపై మరోసారి మేజిక్ ని సృష్టించింది.

కథానాయకుడు దివాకరానికి అబద్దాలడడం, మోసాలు చేయడం మంచినీళ్ళు తాగినంత సులభమైన పనులు.  తను అనుకున్నదానిని ఎలా అయినా సాధించే రకం. అనుకోకుండా విజయనగరంలో తను వీడియో తీయడానికి వెళ్ళిన ఓ పెళ్ళిలో భువనేశ్వరిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. రైల్వేలో బుకింగ్ క్లర్క్ గా పనిచేసే భువనేశ్వరి ప్రిన్సిపుల్స్ ఉన్న మనిషి. అబద్ధాన్ని, మోసాన్ని సహించలేదు. భువనేశ్వరి మేనమామ (ప్రదీప్ శక్తి) ని పరిచయం చేసుకుని తను ఉంటున్న రాజమండ్రి నుంచి విజయనగరానికి ఉత్తరాలు రాస్తూ, ఫోన్లు చేస్తూ ఉంటాడు దివాకరం. భువనేశ్వరికి ఈ విషయం చెప్పకుండా ఆమె పేరుతో తనే ఉత్తరాలకి జవాబులు ఇస్తూ ఉంటాడు ఆమె మేనమామ.

భువనేశ్వరి తన కాళ్ళ మీద నిలబడే వాడినే భర్తగా అంగీకరిస్తుందని తెలుసుకుని, తను ఉండే కాలనీ వాళ్ళందరినీ మోసం చేసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించి ఓ వీడియో షాప్ ప్రారంభిస్తాడు దివాకరం. ఇంతలొ రాజమండ్రి కి బదిలీ అయి వచ్చిన భువనేశ్వరి దివాకరం ఎవరో తనకి తెలీదంటుంది.  ఆ తర్వాత కాలనీ వాళ్ల ద్వారా అతని కథ విని అతన్ని అసహ్యించుకుంటుంది. అయినా పట్టు విడవని దివాకరం ఆమె వెంట పడుతుంటే, కేవలం అతన్ని వదుల్చుకోవడం కోసం అతనితో ఓ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం నెల్లాళ్ళ పాటు దివాకరం నిజమే మాట్లాడాలి. పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు. ఏ ఒక్క అబద్ధం చెప్పినా అగ్రిమెంట్ కాన్సిల్ అవుతుంది.


ఈ పరీక్షలో దివాకరం నెగ్గితే భువనేశ్వరి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పట్టుపడితే వదలని దివాకరం షరతులన్నీ ఒప్పుకుని అగ్రిమెంట్ పై సంతకం పెడతాడు. ఆ తర్వాత దివాకరం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అబద్ధలమీదే బతికే అతను కేవలం నిజాలే మాట్లాడాడా?  భువనేశ్వరిని పెళ్లి చేసుకోగలిగాడా? వీటన్నంటికీ  సమాధానమే సినిమా రెండో సగం. సినిమా మొదటి సగంలో దివాకరం చెప్పే అబద్ధాలు, మోసాలు ప్రేక్షకులని నవ్విస్తే, రెండో సగంలో అతను చెప్పే నిజాలు, వాటి తాలూకు పరిణామాలు రెట్టింపు హాస్యాన్ని అందిస్తాయి. రైల్వే కాలనీ లో మధ్యతరగతి మనుషుల మధ్య అత్యంత సహజంగా కథ నడుస్తుంది.

ఇద్దరు భార్యలున్న చిన్నారావు, ఇద్దరు భర్తలతో 'గుట్టుగా' కాపురం చేసుకుంటున్న భాగ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ, ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు. వై. విజయ, ఆమె భర్త సాక్షి రంగారావు చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటారు.  వీడియో షాప్ కోసం వీళ్ళందరి దగ్గర దివాకరం డబ్బు వసూలు చేసే సన్నివేశాలు, బాకీ ఎగ్గొట్టడం కోసం చెప్పే అబద్ధాలు కథను నడిపిస్తూ ఉండగా, అగ్రిమెంట్ పుణ్యమా అని అతను నిజాలే మాట్లాడాల్సి వస్తుంది. చాల సిన్సియర్ గా అతను చెప్పే నిజాలవల్ల కాలని వాళ్ల మధ్య వచ్చే కలహాలు సైతం అత్యంత సహజంగా ఉంటాయి. వీడియో షాప్ ఓపెనింగ్ సీన్, డొక్కు టీవీని జపాన్ టీవీ అని చెప్పి సాక్షి రంగారావు కి అంటగట్టే సన్నివేశం, 'భక్త ప్రహ్లాద' ఎపిసోడ్ బాగా నవ్విస్తాయి. 'పాము' ఎపిసోడ్ చివర్లో "నా పేరు నాగరాజు కాదు నూకరాజు" అంటూ పాములతని ఎంట్రీ సీన్ లో ఆర్టిస్ట్ ల టైమింగ్ పర్ఫెక్ట్. 

ఇక, దివాకరం నిజాలు చెప్పడం మొదలెట్టాక భాగ్యం కొడుకు ఎవరి పోలికో చెప్పే సీన్ terrific.  అలాగే, చిన్నారావు భాగ్యాన్ని పెళ్లి చేసుకున్నా ఏమేమి చేయాలని ప్లాన్ చేసుకున్నాడో అతని ఇద్దరు భార్యలకూ దివాకరం చెప్పే సీన్ కూడా. దివాకరం, భువనేశ్వరిలుగా రాజేంద్రప్రసాద్, శోభనల నటనకి వంక పెట్టలేము.  కృష్ణభగవాన్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. శోభన తల్లిగా జయవిజయ, మేనమామగా ప్రదీప్ శక్తి చక్కటి హాస్యాన్ని అందించారు. అందరికీ 'ఆశీస్సులు' చెప్పి వాళ్ల చేత నమస్కారాలు పెట్టించుకునే ముదురు బ్రహ్మచారి పాత్ర అతనిది. నిజానికి ఈ పాత్రలన్నీ మన చుట్టూ ఉన్నాయనిపిస్తాయి, సినిమా అయిపోయాక కూడా.

ఇళయరాజా సంగీతంలో 'చుక్కలు తెమ్మన్నా..' పాట ఓ అద్భుతం. ఆ పాటకి ముందు వచ్చే మ్యూజిక్ బిట్ కోసం ఆ పాట వింటాను నేను. అలాగే 'మాటంటే మాటేనంటా..' పాట కూడా. 'ఒక్కటే మాట,,' పాట చిత్రీకరణ అంతా వంశీ మార్కు లో ఉంటుంది.  ఇంత చక్కని సినిమాకి క్లైమాక్స్ కూడా 'వంశీ మార్కు' లోనే ఉంటుంది, అదొక్కటే లోపం. ముగింపులో అనవసరపు మెలోడ్రామాని తగ్గించి ఉంటే మరింత బాగుండేది.  ఎం.వి. రఘు ఫోటోగ్రఫీ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా డివిడి ని మీ లైబ్రరీ లో ఉంచుకోండి. ఎప్పుడైనా మూడ్ బాగోనప్పుడు పూర్తిగా కాకపోయినా కొన్ని సీన్స్ అయినా చూడండి. తప్పకుండా రిఫ్రెష్ అవుతారు.

4 కామెంట్‌లు:

  1. చుక్కలు తెమ్మన్నా పాట ఒక క్లాసిక్. దీనికి తమిళ సూపర్ హిట్ మాతృక 'చిత్తిర సెవ్వానం ' ( https://www.youtube.com/watch?v=9-1-_EETrfg ) పల్లవి తీసుకొని చరణాలు బాణీ మార్చారు. తెలుగులో ఇంకా బాగుంది అనిపిస్తుంది.

    ఒక వంశీ మార్కు సినిమా గా చెప్పవచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి.. ఒరిజినల్ కన్నా ఈ పాట బాగా వచ్చిందని ఇళయరాజా కూడా అన్నారట.. ఎక్కడో చదివాను. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. భలేగా చెప్పారు.నిజమే, ఈ సినిమా పేరు వినగానే నవ్వొచ్చేస్తుంది

    శోభన సినిమా కథ వినకుండానే చేసిన సినిమా ఇది(వంశీగారి "పొలమారిన జ్ఞాపకాలు" నుంచి).

    మిగతా పాటలుకూడా మరీఅంతా తీసేయదగ్గవేమీ కావనుకుంటా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పట్లో 'నవతరంగం' కోసం రాసిందండీ.. ఆ సైట్ మూతపడడంతో, డ్రాఫ్ట్స్ లో నుంచి తీసి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నా. మార్చి ఉండొచ్చు కానీ, నాకు మార్పులు చేర్పులు చేయాలని అనిపించలేదు. అప్పట్లో వాళ్ళకి క్లుప్తంగా రాయాలి కాబోలని తగ్గించి రాశాను. ..ధన్యవాదాలు. 

      తొలగించండి