శనివారం, మే 18, 2019

రాళ్ళపల్లి ...

చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'అభిలాష' సినిమాలో, చిరంజీవికి ఉరిశిక్ష రద్దయ్యే సన్నివేశం గుర్తుందా? ఓ పక్క ఉరి తీయడానికి ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటే, రద్దు వార్తని జైలు అధికారులకి చెప్పడానికి రొప్పుతూ, రోజుతూ పరిగెత్తుకు వచ్చే సెంట్రీ గుర్తున్నాడా? గుండెలవిసే పరుగు.. అల్లం శేషగిరిరావు 'చీకటి' కథలో డిబిరిగాడి పరుగులాంటి పరుగు. నటుడు రాళ్ళపల్లిని ఎప్పుడు తల్చుకున్నా నాకు మొదట గుర్తొచ్చేది 'అభిలాష' సినిమాలో ఈ సన్నివేశమే. ఆ సినిమాకి ముందు, తర్వాత కూడా రాళ్ళపల్లి ఎన్నో మంచి పాత్రలు చేశారు. కానీ, నావరకూ 'అభిలాష' ప్రత్యేకం. 
 

ఎప్పుడా సినిమా చూస్తున్నా, ఆ సన్నివేశం రాగానే ఊపిరి బిగపడతాన్నేను. తెరమీద జైలు సెంట్రీ పరిగెడుతుంటే, నా డొక్కలు ఎగిరిపడుతున్న అనుభూతి కలుగుతుంది. రాళ్ళపల్లి కన్నా సెంట్రీనే కనిపిస్తాడు (యూట్యూబ్ లో ఉన్న వీడియోలో ఈ పరుగు సీన్ ఎడిట్ అయిపొయింది). ఇలాంటి సీరియస్ పాత్రలే కాదు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రల్నీ అలవోకగా చేసేశారు. కావాలంటే 'సిలోన్ సుబ్బారావ్ బావ' ని గుర్తు చేసుకోండి. అసలా పాత్ర లేకపోతే 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డేన్స్ ట్రూప్' సినిమా రెండోసగం ఎంత వెలితిగా ఉండేదో కదా. ఆ వెంటనే మణిరత్నం 'బొంబాయి' సినిమా చూస్తే అర్ధమవుతుంది రాళ్ళపల్లి బహుముఖీనత.

తనతరం నటులు చాలామంది లాగే, రాళ్ళపల్లి కూడా రంగస్థలం నుంచే సినిమా రంగానికి వచ్చారు. అదికూడా, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకుని. సాధారణంగా అనిపించే ముఖ కవళికలు, ఎలాంటి మాడ్యులేషన్నైనా అలవోకగా పలికించేయగల స్వరం, వీటి సాయంతో ఎలాంటి పాత్రనైనా అర్ధంచేసుకుని, సొంతం చేసేసుకునే నటనా పటిమ. వేసిన పాత్ర ఏదైనా, కేవలం పాత్ర మాత్రమే కనిపించేలా నటించడం ఆషామాషీ విషయం కాదు. మంచి చదువరి, రచయిత కూడా అయిన రాళ్ళపల్లి, సినిమాల్లోకి వచ్చాక నటన మీద మాత్రమే దృష్టి పెట్టి, రచనని పక్కన పెట్టేశారు. రచయిత, నటుడు తనికెళ్ళ భరణిని తన శిష్యుడిగా సినిమా రంగానికి అందించారు.

రాళ్ళపల్లి ఈడువాళ్ళు, ఇంకాస్త పెద్దవాళ్ళు ఇచ్చిన, ఇస్తున్న టీవీ ఇంటర్యూలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఓచోట వాళ్ళు తమకి రావాల్సినంత పేరు, అవార్డులు రాలేదనో, సంపాదించుకోవాల్సినంత డబ్బు సంపాదించలేదనో చెప్పడం కనిపిస్తుంది. కానీ, రాళ్ళపల్లి నుంచి అలాని ఫిర్యాదు వినిపించలేదు. 'నా పని నేను చేశాను' అన్న నిమిత్తమాత్రపు ధోరణే కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో వరసగా తగిలిన ఎదురు దెబ్బలు ఎంతగానో రాటుదేల్చాయి ఆయన్ని. అందుకే కాబోలు, సంపాదన, ఆస్తుల బెంగలేదు. 'ఓ ప్రభుత్వోద్యోగి కన్నా ఎక్కువే సంపాదించా' అని ఊరుకున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా అదే నిర్లిప్తత.

ప్రేక్షకుల్లో చాలామంది రాళ్ళపల్లి నటనకి అభిమానులైతే, సినిమావాళ్లలో చాలామంది ఆయన చేతివంటకి అభిమానులు. జంధ్యాల మొదలు కమల్ హాసన్ వరకూ ఆ జాబితా చాలా పెద్దది. కమల్ అయితే 'శుభసంకల్పం' షూటింగ్ అప్పుడు, 'మీరు నటుడిగా రిటైర్ అయ్యాక నాదగ్గరికి వచ్చేయండి, వండి పెడుదురుగాని' అని అడిగేశాడట. 'షూటింగ్ లో వంటంటే మనిష్టం. ఇంట్లో అయితే మా ఆవిడ ఒప్పుకోదు. నెలకి సరిపడా వంటనూనె, ఒక్కరోజులో ఖాళీ చేసేస్తానని..' ఈమాటా రాళ్లపల్లిదే. వెండితెరమీద ఎన్నో పాత్రలకి ప్రాణప్రతిష్ట చేసిన రాళ్ళపల్లి ఇక లేక లేరన్న వార్త బాధాకరం. నటనని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లకి ఆయన పాత్రలు ఎన్నో కొత్తవిషయాలు చెబుతాయి. వారి ఆత్మకి శాంతి కలుగుగాక..

4 కామెంట్‌లు:

  1. జీవితమంతా అందరికి సాయం చేస్తూ, సంతృప్తితో హుందాగా బ్రతికిన ఒక మనిషికి సరైన నివాళి.

    రిప్లయితొలగించండి
  2. అన్వేషణలో కూడా రాళ్ళపల్లిది గుర్తుండిపోయే పాత్ర. ఇది గుర్తుండిపోయే eulogy.

    రిప్లయితొలగించండి
  3. చాలామంది హాస్య నటులకి మార్గదర్శకుడని విన్నానండీ ఈయన, జంధ్యాల కి బాగా నచ్చిన నట/రచయితల్లో ఇతను ఒకరనుకుంటా

    రిప్లయితొలగించండి