"ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి..
జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే..."
కర్మ
సిద్ధాంతాన్ని రంగరించి సాంత్వన వచనాలు చెప్పడం సులువే. కానీ, అవే మాటల్ని
తిరిగి మనకి ప్రియమైన వాళ్ళు, వాళ్ళని గురించి చెబుతుంటే వినడం మాత్రం
చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు ఓ మేస్టారూ, ఆయన భార్యా. ఆ
కష్టం వచ్చింది ఎవరి వల్లనో కాదు, కూతురిలా చూసుకున్న విద్యార్థిని నుంచి.
నిజానికివి రెండు వేర్వేరు సందర్భాలు. రెండు పాటలు ఉండాలి న్యాయంగా. కానీ
ఇక్కడ కవి వేటూరి కాబట్టి, రెండు భిన్న సందర్భాలకీ తగిన విధంగా ఒకే పాటని
రాసి, శిష్యురాలి సందర్భానికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు మాత్రమే
చేశారు.
'సుందరకాండ' (1992) సినిమాలో రెండు
సార్లు వచ్చే "ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే.." పాటని సినిమాతో పాటుగా
చూస్తున్నప్పుడు రెండు వేర్వేరు పాటలుగానే అనిపిస్తాయి. సందర్భాన్ని అవగాహన
చేసుకుని, పాత్రలని ఆవాహన చేసుకుని, కథని వేగంగా ముందుకి నడిపే విధంగా
సాహిత్యాన్ని అందించారు కవి. అందుకే, ఒకే పాట రెండుసార్లు వచ్చినా
పునరుక్తి అనిపించదు, సినిమా నడకకి అడ్డంకి అన్న భావనే కలగదు.
"ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే..
చందమామకి రూపముండదు తెల్లవారితే..
ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో..
ఒక పూటలోనే రాలు పూవులెన్నో.."
విదేశంలో
ఉన్న తన తల్లి తండ్రీ ఒకేసారి హత్యకి గురయ్యారని తెలుసుకున్న ఓ కాలేజీ
విద్యార్థిని దుఃఖంలో మునిగిపోతే, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఆ అమ్మాయి
అలా బావురుమనడం చూడలేని మేష్టారు ఆమెని ఓదార్చి, ధైర్యం నింపడానికి మాటలకి
బదులుగా పాటని ఎంచుకున్నారు.
"నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా..
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా..వికసించాలే ఇక రోజాలా..
కన్నీటిమీద నావ సాగనేల.."
తన
గుండెల్లో ముల్లు ఉందని, గులాబీ వికసించడం మానదు. మనసులో దుఃఖం ఉందని
నవ్వడం మానాల్సిన అవసరం లేదు. ఏదీ శాశ్వతం కాని ప్రపంచం ఇది.
సాయంత్రమయ్యేసరికి అప్పటివరకూ వెలుగులు చిమ్మిన సూర్యుడు అస్తమిస్తాడు.
తెల్లవారేసరికి అప్పటివరకూ చల్లదనాన్ని పంచిన చందమామ తన రూపాన్ని
కోల్పోతుంది. సౌరభాలు చిమ్మే పూల జీవితం ఒక్క పూటలోనే ముగిసిపోతుంది.
జీవితం అనే పడవని, కన్నీటి మీద నడపనవసరం లేదు, నవ్వులతో నింపుకోవచ్చు.
"కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో..
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే..
చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా..
పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు..మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు..
మమతానురాగ స్వాగతాలు పాడ.."
తోటంతా
కొత్తగా వికసించిన పూలతో నిండి ఉన్నప్పుడు, ఆ పూల మధ్య తిరిగే తుమ్మెదకి
నూరేళ్ళ జీవితం ఎందుకు? ఒక్క పూటలోనే జీవితకాలానికి సరిపడే తేనె
దొరికేస్తోంది కదా.. ఈ బతుకు నడక చాలా చిత్రమైనది. పుట్టిన వాళ్ళు మరణించక
తప్పదు. మరణించిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టకా తప్పదు.. మళ్ళీ
పుట్టబోతున్న మన వాళ్ళకోసం స్వాగత గీతాలు పాడాలి తప్ప, ఏడుస్తూ కూర్చుంటే
ఎలా? ..మాస్టారిక్కడ భగవద్గీతలో కర్మ సిద్ధాంతాన్ని భోదించారు
శిష్యురాలికి.
"నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే..
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే..
పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు..
మైనా క్షణమైనా పలికిందే భాష.. ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ..
విధిరాత కన్న లేదు వింత పాట.."
ఇవాళ
నీ జెడలో తురుముకున్న గులాబీలకి కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజున అవి నీ
జడకే కాదు, దేవుడి గుడికి కూడా పనికిరావు. వాడిపోయిన పూలని కోరి జెడలోనూ
తురుముకోరు, దేవతార్చనకి అంతకన్నా వాడరు కదా. ప్రాణం పక్షిలా
ఎగిరిపోయినప్పుడు, దేహం ఖాళీ పంజరంలా మిగిలిపోతుంది. మైనా పక్షి రోజంతా
పాడుతూ ఉండదు. తన భాషని వినిపించేది ఒక్క క్షణమే. మెలకువలోనూ, నిద్రలోనూ
కూడా జీవితేచ్చ మనల్ని వదిలిపోదు. విధిరాతని మించిన వింత పాట ఏముంది కనుక?
..భగవద్గీతనే ఆశ్రయించి రెండో చరణాన్ని ముగించారు గురువుగారు.
కొంత
కాలం గడించింది. తనకి వచ్చిన కష్టం నుంచి కోలుకుని ఆ అమ్మాయి మామూలు
మనిషయ్యింది. ఎప్పటిలాగే తన అల్లర్లని కొనసాగించింది. అయితే ఉన్నట్టుండి
పిడుగులాంటి వార్త. అమ్మాయికి కాదు, మేష్టారికి. నవ్వుతూ, తుళ్ళుతూ
తిరుగుతున్న ఆ అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడి, మరణానికి చేరువలో ఉంది.
తనని ఆదరించి, ఆశ్రయం ఇచ్చిన మేష్టారికి, ఆయన భార్యకీ కూడా తన అనారోగ్యం
విషయం చివరి వరకూ తెలియనివ్వలేదు. ఆమె బతికేది ఇంకొద్ది రోజులే అని తెలిసిన
ఆ ఇద్దరూ చేష్టలుడిగి పోయారు. వాళ్ళని ఓదార్చే బాధ్యతని ఆ అమ్మాయే
తీసుకుంది. మేష్టారికి ఆయన పాఠాన్ని తాను తిరిగి అప్పగించింది.
"ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే..
చందమామకి రూపముండదు తెల్లవారితే..
ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో..
ఒక పూటలోనే రాలు పూవులెన్నో..
నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా..
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా..వికసించాలే ఇక రోజాలా..
కన్నీటిమీద నావ సాగనేల.."
సూర్యచంద్రాదులకే తప్పలేదు మాస్టారూ, ఇక నేనెంత? ఒక్క పుటలో
రాలిపోయే అనేక పూలల్లో నేనూ చేరబోతున్నాను. గుండెల్లో ముల్లులాంటి వ్యాధి
నా దేహంలో చేరినా నవ్వుతూ రోజులు గడుపుతున్నాను.. నేను కన్నీరెందుకు
పెట్టుకోవాలి? నాకోసం మీరెందుకు బాధ పడాలి??
"కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో..
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే..
చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా..
పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు..మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు..
మమతానురాగ స్వాగతాలు పాడ.."
నూరేళ్ళ
జన్మ నాకెందుకు మాస్టారూ? మీ అందరితోనూ సంతోషంగా గడిపిన ఈ కొద్దిరోజులూ
చాలవూ నాకు?? ఏమో, మళ్ళీ మీ ఇంటికే పాపగా వస్తానేమో.. నాకోసం బాధ పాడడం
ఆపి, తిరిగి మీ ఇంటికి రాబోతున్న 'నాకు' స్వాగతం పాడరెందుకూ..
"ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి..
జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే.."
అమ్మాయి
కోసం వేటూరి కొత్తగా చేసిన మార్పు ఇది. ఆమె సిగ కోరని, కోవెల చేరని పువ్వు
కాదు. తనలోపలి ముల్లుని పువ్వుగానూ, బాధని నవ్వుగానూ మార్చుకున్న గులాబీ. ఆ
రోజాకి జన్మ బంధమైనా, ప్రేమగంధమైనా నూరేళ్లు అవసరంలేదు.. ఒక్క పూట చాలు.
"పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు..
మైనా క్షణమైనా పలికిందే భాష..
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ..
విధిరాత కన్న లేదు వింత పాట.."
ఇవన్నీ
మాస్టారి మాటలే.. చెప్పడం కన్నా వినడం చాలా కష్టమని ఆయనకీ అర్ధమైన
క్షణాలు. తనవాళ్ళని పోగొట్టుకుని అనాధగా మారిన అమ్మాయిని ఓదారుస్తూ తాను
చెప్పిన అనునయ వాక్యాలనే, ఇప్పుడు ఆమె తనని విడిచి వెళ్లిపోతూ చాలా
మామూలుగా చెప్పేస్తోంది. నవ్వడం ఎంత కష్టమో మేష్టారికి అనుభవంలోకి
వచ్చింది. అప్పుడు తను నవ్వడానికి, ఇప్పుడు తమని నవ్వించడానికి ఆ అమ్మాయి
చేస్తున్న ప్రయత్నం పూర్తిగా అర్ధమయ్యింది. తన ఇంటికి తిరిగి రాబోతున్న
ఆమెకి స్వాగతం చెప్పడం తప్ప, అతనేం చేయగలడు?
ఈ
సందర్భాన్ని ఇంకే కవికి ఇచ్చినా రెండు వేర్వేరు పాటలు రాసేవారేమో. రెండు
సందర్భాలకీ అతికినట్టు సరిపోయే విధంగా తేలికైన పదాలతో బరువైన పాటని రాయడం, ఆ
పాట గుండె బరువుని తగ్గించేదిగా మాత్రమే కాక పెంచేదిగానూ ఉండడం వేటూరి
ప్రత్యేకతే. పాట ఔచిత్యానికి భంగం కలగనివిధంగా కీరవాణి స్వరపరచగా, ఒకే
ట్యూనుకి బాలు, చిత్ర విడివిడిగా పాడారు. బాలూ స్వరంలో ప్రభోదాత్మకంగా
అనిపించే ఈ పాట, చిత్ర గొంతులో లాలనగా వినిపిస్తుంది. ఈ పాటకి గాను
చిత్రకి ఆ యేటి ఉత్తమ గాయని గా 'నంది' పురస్కారం లభించింది. కె. రాఘవేంద్ర
రావు దర్శకత్వంలో వెంకటేష్, మీనా, అపర్ణ నటించారీ సినిమాలో. వీళ్ళతో పాటు,
నిర్మాత కెవివి సత్యనారాయణనీ అభినందించాల్సిందే.
మంచి మంచి పాటలు ఎన్నుకుంటున్నారు మురళి గారు.. చాలా బావుంటున్నాయ్ ఈ సిరీస్ లో వ్యాసాలు.. ఇంత ఓపికగా రాస్తున్నందుకు ధన్యవాదాలు.. కీప్ రైటింగ్..
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: వేటూరి మంచి పాటలు రాశారండీ మరి :) ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిpaatalaku vere label ivvandi. raasilonu vaasilonu 'avee-ivee' lo kalipekannaa vidigaa unchitaggavi
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య చైతన్య: మంచి ఆలోచనండీ, ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి