సోమవారం, ఫిబ్రవరి 25, 2019

రాగం తీసే కోయిల ...

"గుండెలో మురళిని గొంతులో ఊదకే..
పదే పదే పదే పదాలుగా..."

సందర్భోచిత గీతాలు రాసేప్పుడు గేయ రచయితలు పాత్రల ఔచిత్యాలని బట్టి పాట రాయాలా, లేక సందర్భంలో గాఢతకి తగినట్టుగా సాహిత్యం అందించాలా? వేటూరి లాంటి కవులు రెండూ చేశారు. బహుశా, 'ఎప్పటి కెయ్యది ప్రస్తుత'మో అప్పటికా విధంగా రాసేసి ఉంటారు. పాత్రౌచిత్యానికి మించే  అయినప్పటికీ, సందర్భంలో గాఢతని మరింత పెంచే విధంగా అనేక పాటలు రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. వాటిలో 'నాగమల్లి' (1980) సినిమా కోసం రాసిన 'రాగం తీసే కోయిల...' అనే విషాద యుగళం ఒకటి. 



"రాగం తీసే కోయిల.. కోయకు గుండెలు తీయగా..  
రాతిరి వేళలా రగిలే ఎండలా.. "

అంటూ నాయిక పల్లవితో మొదలవుతుంది ఈపాట.  నిజానికి ఇది పల్లవిలో తొలి సగం. రాత్రివేళలో ఎండ కాయడం అన్నది అసహజ పరిణామం. తీయగా వినిపించే కోయిల పాట గుండెని కోయడం కూడా అంతే అసహజం.

"బాసలెన్నో చేసుకున్న ఆశే మాయగా..
పిలవని పిలుపుగా రాకే నీవిలా.."

ఈ మాటలతో పల్లవిని పూర్తి చేశాడు కథానాయకుడు. వాళ్లిద్దరూ ఎన్నో బాసలు చేసుకున్నారు. ఆ బాసల నుంచి వాళ్ళకెన్నో ఆశలు పుట్టాయి. కానీ ఇప్పుడు అవన్నీ మాసి పోయాయి. ఆ విషాద సందర్భంలో ఉన్న వాళ్ళ మనః స్థాయికి కోయిలకి స్వాగతం పలికేదిగా లేదు. అందుకే, పిలవని పిలుపుగా రావద్దు అని కోయిలని వేడుకుంటున్నాడతను.

కథానాయకుడు నాగరాజు గిరిజన యువకుడు. పెద్దగా చదువబ్బకపోయినా వేణుగానం అతనికి సహజంగా అబ్బిన విద్య. కోయిల పాడినంత తీయగానూ, అలవోకగానూ వేణువుని పలికిస్తాడతను. అదిగో, ఆ పాట విని అతనితో ప్రేమలో పడిపోయింది మల్లి. ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్న ఆ అమ్మాయి, ఇష్టంలేని పెళ్లిని తప్పించుకోడానికి ఇంటి నుంచి తప్పించుకుని, పట్నానికి చేసే ప్రయాణంలో నాగరాజుని కలిసి, అతని వేణుగానం విని, ప్రేమలో పడిపోయింది. కలుసుకున్నంత సేపు పట్టలేదు, వాళ్లిద్దరూ ఊహించని పరిస్థితుల్లో విడిపోడానికి. ఒకచోట ఆమె బందీగా మారింది. ఆమె జాడ తెలియక, తల్లడిల్లుతూ వెతుకుతున్నాడు అతను.

"జంటని ఎడబాసిన.. ఒంటరి నా బ్రతుకున..  
మల్లెల సిరివెన్నెల మంటలు రేపగా.."

తొలి చరణంలో తొలిభాగాన్ని ఆమె పాడింది. జంటని విడిచిన జీవితం మల్లెల, సిరివెన్నెల మంటలా ఉందంటోంది. నిజానికి మల్లెపూలు, వెన్నెల హాయిని ఇవ్వాలి. కానీ, అతడి ఎడబాటు కారణంగా ఆమెలో అవి మంటల్ని నింపుతున్నాయి.

"వయసులా నులివెచ్చని..  వలపులా మనసిచ్చిన.. 
నా చెలి చలి వేణువై వేదనలూదగా.."

అతడు అందుకుని ఆమెని, ఆమె ప్రేమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 'చలి వేణువు' అన్నది వేటూరికి చాలా ఇష్టమైన పదప్రయోగం బహుశా. ('మెరుపులా మెరిశావు..' లాంటి పాటల్లో కూడా వినిపిస్తుంది). చలి అంటే జడము అని, జడము అంటే మూగ అని అర్ధాలున్నాయి. చలి వేణువు కి మూగవేణువు అని అర్ధం చెప్పుకోవచ్చేమో. ఒక టీవీ కార్యక్రమంలో ఎస్పీ బాలూ అయితే, చలిగా ఉన్నప్పుడు వేణువు సరిగా పలకదు అని అర్ధం చెప్పారు. ఎప్పుడూ హాయైన పాటలు పాడే తన వేణువు నుంచి వేదన వినిపించడం బాధిస్తోంది అతన్ని.

"తొలకరి పాటలే.. తోటలో పాడకే.. 
పదే పదే పదే పదాలుగా.."

కోయిలని పాడొద్దని వేడుకుంటూ తొలి చరణం ముగించింది ఆమె. పాట మొత్తం ఆమె వేడుకోలు కోయిలకైతే, అతని విన్నపాలు వేణువుకి!

"పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై.. 
అడవిలో వినిపించిన ఆమని పాటగా.."

ఆమె వియోగం అతడి హృదయాన్ని బద్దలు చేసింది. బద్దలైన హృదయం రాగమై రగిలింది. మామూలుగా అయితే హృదయం పలకాలి. ఇక్కడ అతడి స్థితి కారణంగా రాగం రగిలింది. అది కూడా, అడవిలో వినిపించిన ఆమని పాటలా ఉంది. ఇది రెండో చరణం ప్రారంభం.

"అందమే నా నేరమా..  పరువమే నా పాపమా..  
ఆదుకోమని చెప్పవే ఆఖరి మాటగా.."

అంటూ ఆమె కొనసాగింపు. ఆమెని బంధించిన వాళ్లకి హృదయంతో పని లేదు. వాళ్ళకి కావాల్సింది ఆమె అందం, పరువమూను. ఆమెని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు, అతడు తప్ప.

"గుండెలో మురళిని గొంతులో వూదకే.. 
పదే పదే పదే పదాలుగా.."

'గుండె గొంతుకలోన కొట్టాడుతాది' అనే కవితాత్మక వాక్యానికి కొనసాగింపులా వాక్యం ఇది.  వేణువు అతడికి ప్రాణం. ఒక్కమాట చెప్పాలంటే తన గుండెల్లో వేణువుతో పాటు ఆమెకీ చోటిచ్చాడు అతను. అలాంటిది ఇప్పుడు ఆమె వియోగంతో వేణువు మీదకి కూడా మనసు పోవడం లేదతనికి.

ముందే చెప్పుకున్నట్టుగా, నాయికా నాయకుల పాత్రల ఔచిత్యాలకి ఏమాత్రమూ పొసగని సాహిత్యం ఇది. అయితేనేం, ప్రేమించి, వియోగం బారిన పడిన ప్రతి జంటా తమని తాము ఈ పాటలో చూసుకుంటారు అనడంతో అతిశయోక్తి లేదు. రాజన్-నాగేంద్ర సంగీతంలో బాలు, సుశీల పాడిన ఈ పాటకి, దేవదాస్ కనకాల దర్శకత్వంలో చంద్రమోహన్, మల్లిక అభినయించారు. సందర్భ బలం, నటీనటుల నటనని మించిన పాట ఇది, స్వరం, పాడిన విధానం కూడా సాహిత్యానికి తగ్గట్టుగా అమిరాయి.

మంగళవారం, ఫిబ్రవరి 19, 2019

చినుకులన్నీ కలిసి చిత్రకావేరి ...

"కడలిలో వెతకొద్దు కావేరి నీరు.. 
కడుపులో వెత కొద్ది కన్నీరు కారు.."

ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య వచ్చే అభిప్రాయ భేదాల వల్ల ఒక్కోసారి పరోక్షంగా ఏదో ఒక మేలు జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఇలా జరగడం విశేషమేమీ కాదు. 'కళాతపస్వి' కె. విశ్వనాధ్, గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తి కలిసి ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. 'శంకరాభరణం' 'సాగర సంగమం' కేవలం ఉదాహరణలు మాత్రమే. కారణాలు తెలీదు కానీ, 'జననీ జన్మభూమి' (1984) తర్వాత వాళ్లిద్దరూ కలిసి పనిచేయలేదు. దాని ఫలితంగా తెలుగు సినిమా పరిశ్రమకి 'పద్మశ్రీ' సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే కవి దొరికారు.

ఈ పెద్దలిద్దరినీ ఒకటి చేయడానికి మరో పెద్దమనిషి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంకణం కట్టుకున్నారు. గాయకుడైన బాలూ నిర్మాతగా మారి విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందించిన 'శుభసంకల్పం' (1995) లో వేటూరి పాటలు ఉండాల్సిందే అని పట్టుపట్టారు. ఫలితంగా, పదకొండేళ్ల విరామం తర్వాత విశ్వనాధ్, వేటూరి కలిసి పనిచేశారు. కథకి, సందర్భానికి అతికినట్టుగా పాటలు రాయడంలో వేటూరిది అందెవేసిన చేయి అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా. 'శుభసంకల్పం' లో రెండు వరుస సందర్భాలకు వేటూరి రాసిన చిన్న పాటల్ని చూద్దాం:



"చినుకులన్నీ కలిసి చిత్రకావేరి.. 
చివరికా కావేరి కడలి దేవేరి.." 

కథానాయకుడు మత్స్యకారుడు. వడ్రంగం పని చేసుకుని జీవించే గంగ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ ప్రమాదంలో ఆమె గాయపడి కోమాలోకి వెళ్ళింది. దాదాపు మరణం అంచున ఉంది. నాయకుడు ఆమెని నావలో సముద్రంలోకి తీసుకెళ్లి ఆమెచేత గంగమ్మకి పూజ చేయించే సన్నివేశానికి రాసిన పాట ఇది. చినుకులన్నీ కలిస్తే నది అవుతుంది. ఆ నది చివరికి సముద్రంలో కలుస్తుంది. నది స్త్రీరూపం, సముద్రుడు పురుషుడు. సాగరసంగమం తర్వాత కావేరి సాగరానికి దేవేరి (భార్య) అవుతుంది.

"కడలిలో వెతకొద్దు కావేరి నీరు.. 
కడుపులో వెత కొద్ది కన్నీరు కారు.."

సంగమం జరిగిపోయిన తర్వాత తర్వాత సముద్రంలో నది నీటికోసం వెతకొద్దు. ఆ నీటి రంగూ రుచీ కూడా మారిపోతుంది కదా. కడుపులో ఉన్న బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తుంది.

"గుండెలోనే ఉంది గుట్టుగా గంగ.. నీ గంగ.. 
ఎండమావుల మీద ఎందుకా బెంగ.."

నీ గంగ ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు. నీ గుండెల్లోనే ఉంది. నిన్ను విడిచి గంగ వెళ్లడం అన్నది ఎండమావి లాంటిది. అది తల్చుకుని ఎందుకు బెంగ పడడం?

"రేవుతో నావమ్మకెన్ని ఊగిసలో 
నీవుతో నాకన్ని నీటి ఊయలలు.."

రేవుకీ నావకీ ఉన్న అవినాభావ సంబంధం లాంటిదే, నీకూ నాకూ మధ్య ఉన్నది కూడా. మన బంధం విడిపోదు అని నాయిక నాయకుడితో చెబుతున్నట్టుగా సాగుతుందీ పాట. కోమాలో ఉన్న నాయికకు స్పృహ వస్తే ఇలాగే చెబుతుందేమో అనిపించేలాంటి పాట. బాలూ ఆలాపన నేపథ్యంలో ఎస్పీ శైలజ గుర్తుండిపోయేలా పాడారు ఈ పాట.

అనారోగ్యంతో గంగ కన్నుమూసింది. తన గుర్తుగా ఒక బిడ్డని, జీవితకాలపు జ్ఞాపకాల్నీ అతనికి వదిలి వెళ్ళింది. ప్రేమించిన మనిషి దూరం కావడం, పసిబిడ్డ తల్లిలేని వాడు కావడం, అంతే కాక తాను ఎంతగానో ప్రేమించి, గౌరవించే వ్యక్తి నుంచి తన భార్య మరణ వార్తని దాచాల్సి రావడం.. ఇదీ నాయకుడి స్థితి.. ఈ స్థితిలో అతడు పడుకునే పాట: 



"నరుడి బ్రతుకు నటన.. ఈశ్వరుడి తలపు ఘటన..
ఆ రెంటి నట్టి నడుమ.. నీకెందుకింత తపన..
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా..
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా..
ఏటిలోని అలలలవంటి.. కంటిలోని కలలు కదిపి..
గుండియలను అందియలుగ చేసీ..
తకిట తధిమి తకిట తధిమి తందాన..
హృదయలయల జతుల గతుల తిల్లాన..
తడబడు అడుగులు తప్పని తాళాన..
తడిసిన పెదవుల రేగిన రాగాన.. 
శ్రుతిని లయని ఒకటి చేసి..."

నిజానికి ఈ సాహిత్యం అంతా 'సాగర సంగమం' సినిమాలో "తకిట తధిమి తకిట తధిమి తందాన" మకుటంతో రాసిన పాటలోదే. ఆ పాట చరణంలో వచ్చే "నరుడి బ్రతుకు నటన" నుంచి ఈ పాటని ప్రారంభించి, సగం పాటని పల్లవిగా మార్చేసి, చరణాలని కొత్తగా రాశారు వేటూరి.

"కంటిపాపకు నేను లాల పొసే వేళ.. 
చంటిపాపా నీకు లాలినౌతానంది.. " 

తనకి పుట్టిన బిడ్డ తన కంటిపాప. ఆ బిడ్డకి తాను లాల పోస్తున్నాడు. మామూలుగా అయితే తల్లి చేయాలి, లేదా తమ ఇద్దరి సమక్షంలోనైనా ఉండాలి. ఆమె జ్ఞాపకం అతణ్ణి చంటి పిల్లాడిని చేసి ఏడిపించింది. ఆ దుఃఖానికి ఓదార్పుని మళ్ళీ ఆమే ఇచ్చింది. ఆమె జ్ఞాపకాలు అతడికి లాలిపాడాయి.

"ఉత్తరాన చుక్క ఉలికిపడతా ఉంటె.. 
చుక్కానిగా నాకు చూపు అవుతానంది.."

రోజులతరబడి సముద్రంలో వేట చేసే వెళ్లే మత్స్యకారులకి దిక్కులే మార్గదర్శులవుతాయి. ఆకాశంలో ఉత్తరంవైపున ఉరుములు వినిపించి, మబ్బులు కనిపించాయంటే కుంభవృష్టిగా వర్షం కురవబోతోందని అర్ధం. అలా వస్తున్న ఉరుములకి, మబ్బులకి ఉత్తరం దిక్కున నక్షత్రాలు ఉలికి పడుతూ ఉంటే, ఆమె అతడికి చుక్కాని అవుతానంది. నిజానికి అతనున్నది సముద్రంలో కాకపోయినా, కథానాయకుడి మానసిక స్థితి తుఫాను సమయంలో కడలి కల్లోలంలా ఉందని భావం. అప్పుడు కూడా ఆమె నేనున్నాను అంటోంది.

"గుండెలో రంపాలు కోతపెడతా ఉంటె.. 
పాతపాటలు మళ్ళీ పాడుకుందామంది.."

గుండెల్లో రంపపు కోత అనేది మామూలు వాడుకే అయినా, కథ ప్రకారం ఆమె వడ్రంగం పని చేసుకునే అమ్మాయి కావడం, నాయికా నాయికలిద్దరూ రంపంతో ఒక దుంగని కోసే సమయంలో ప్రేమలో పడడం వల్ల ఈ పదప్రయోగం సందర్భానికి తగ్గట్టుగా అమిరింది. అతడా రంపపు కోతతో బాధ పడుతూ ఉంటే, ఆమె 'బాధ పడకు, పాత పాటలు జ్ఞాపకం చేసుకో' అంటోందిట.

"అన్నదేదో అంది.. ఉన్నదేదో ఉంది.. 
తలపైన గంగ తలపులో పొంగింది.."

'అయిందేదో అయింది' అనడం వాడుకే. అలాగే అతడు కూడా ఆమె అన్నదేదో అంది, ఉన్నదేదో మిగిలింది అంటూనే, 'తలపైన గంగ తలపులో పొంగింది' అంటున్నాడు. తన ప్రాణం (తలపు = హృదయము) అయిన గంగ తన తలపులో (తలపు = జ్ఞాపకం) మిగిలింది అంటున్నాడు.

"ఆదివిష్ణు పాదవంటి ఆకాశాన ముగ్గుపెట్టి.. 
జంగమయ్య జంటకట్టి కాశీలోన కాలుపెట్టి.. 
కడలి గుడికి కదలిపోయే గంగా..."

ఆవేశంతో మొదలయ్యే ఈ పాట ముగింపులో కూడా ఆవేశమే వినిపిస్తుంది. హరిపాదాల్లో పుట్టింది గంగ. అక్కడ పుట్టి, ఆకాశం మీదుగా శివుని జటాజూటం చేరి, అక్కడి నుంచి సముద్రాన్ని చేరుకుంది. అలాగే, అతడి గంగ కూడా కడలి గుడికే చేరుకుంది. కథానాయకుడి ఆవేదనని, ఆవేశాన్నీ సమపాళ్లలో రంగరించి పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. స్వరకర్త కీరవాణి, 'సాగర సంగమం' నుంచి తీసుకున్న సాహిత్యానికి ఇళయరాజా బాణీనే కొనసాగించి, చరణాలకి వెంటాడే విధంగా సంగీతం చేశారు. ఈ సినిమా సంగీతానికి గాను ఆ యేటి 'ఫిలిం ఫేర్' పురస్కారం అందుకున్నారు కూడా. కమల్ హాసన్ అభినయాన్ని గురించి కొత్తగా చెప్పేదేముంది?

శుక్రవారం, ఫిబ్రవరి 15, 2019

మేఘమా దేహమా ...

"నాకొక పూమాల తేవాలి నువ్వు.. 
అది ఎందుకో..." 

తాను ప్రేమించిన అబ్బాయి తననీ ఇష్టపడుతున్నాడన్న శుభవార్త. ఆవెనుకే తనకి ప్రాణాంతకమైన వ్యాధి సోకిందనీ, ఇంకెంతో కాలం జీవించే అవకాశం లేదన్న చేదు కబురు. ఇప్పుడామె ప్రేమని పండించుకున్నందుకు పండుగ చేసుకోవాలా లేక తనువు చాలించే క్షణాలకి తను మానసికంగా సిద్ధపడి, అతడినీ సిద్ధం చేయాలా? 'మంచుపల్లకీ' (1982) సినిమాలో ఈ సందర్భానికి అతికినట్టుగా సరిపోయే విధంగా రాసిన గీతాన్ని ఇలా ప్రారంభించారు వేటూరి: 


"మేఘమా దేహమా.. మెరవకే ఈ క్షణం.. 
మెరిసినా, కురిసినా.. కరుగునీ జీవనం.." 

మేఘానికి, దేహానికీ పోలిక పెడుతూ పాటని మొదలుపెట్టడం బహు చక్కని ఎత్తుగడ. మెరిసి, కురిస్తే మేఘం కనుమరుగవుతుంది. నిలువెల్లా ప్రేమతో మెరిసి, వర్షిస్తున్న ఆమె దేహమూ కరిగిపోబోతోంది. పైగా, 'కరుగునీ జీవనం,' 'కరుగు-నీజీవనం' రెండు వేర్వేరు అన్వయాలు కుదురుతున్నాయి. రెండూ సందర్భానికి సరిపోతున్నాయి.

"మెరుపులతో పాటు ఉరుములుగా.. 
మూగబోయే జీవ స్వరములుగా.. 
వేకువ ఝామున వెన్నెల మరకలుగా.." 

మొదటి చరణంలో తొలి సగం ఇది. మేఘం,మెరుపు, ఆ వెంటే ఉరుము. మేఘానికి గొంతు ఉరుమే. ఆమె దేహం విషయానికి వస్తే, జీవ స్వరం క్రమంగా మూగపోబోతోంది. అర్ధరాత్రి ప్రకాశవంతంగా కనిపించే పండువెన్నెల, వేకువ వేళ వచ్చేకొద్దీ వెలుగు తగ్గి మారకలుగా మిగిలినట్టే, ఆమె దేహమూ, స్వరమూ కూడా వెలుగుని కోల్పోతున్నాయి. 

"రేపటి వాకిట ముగ్గులుగా.. 
స్మృతిలో మిగిలే నవ్వులుగా.. 
వేసవిలో మంచు పల్లకిగా.."

ఆమెలోని జీవితేచ్ఛకి ప్రతీక 'రేపటి వాకిట ముగ్గులు' కావాలనుకోవడం. కానీ, అతడి స్మృతిలో నవ్వుగా మిగిలిపోయే తరుణం వచ్చేస్తోంది తెలుసు. క్షణాల్లో కరిగిపోయే మంచుపల్లకీ, వేసవి వేడిమికి మరింత త్వరగా నీరైపోతుంది. 'పల్లకీ' ని పెళ్లి అని అర్ధంలో వాడతారు మామూలుగా. దానికి 'మంచు' చేర్చి మరణానికి ప్రతీకగా ఉపయోగించారు కవి. 

"పెనుగాలికి పెళ్లి చూపు.. 
పువ్వు రాలిన వేళా కళ్యాణం.. 
అందాకా ఆరాటం.. 
ఆశలతో పేరంటం..." 

మేఘం, మెరుపు, ఉరుము.. ఆ వెంటనే రావాల్సింది పెనుగాలి. ఆ పెనుగాలికి పెళ్లి చూపు. గాలితాకిడి పువ్వు రాలిన వేళే పెళ్ళిముహూర్తం. గాలికీ, పువ్వుకీ పెళ్లి జరిగే వరకూ ఆరాటం తప్పదు. ఆశలూ తప్పవు. జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్న నాయికకి ఒక పక్క బతకాలన్న కాంక్ష, మరోపక్క మరణం తప్పదన్న ఎరుక. పువ్వులా తాను రాలిపోయే వరకూ, బతకాలనే ఆరాటం, బతుకుతానన్న ఆశల పేరంటం తప్పవు. పెళ్లిని, పేరంటాన్నీ విషాదాని సూచించడానికి ఉపయోగించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. 

"నాకొక పూమాల తేవాలి నువ్వు.. 
అది ఎందుకో..."

ప్రియురాలు, ప్రియుణ్ణి పూమాల తెమ్మందంటే ఎందుకు? మామూలు సందర్భంలో అయితే పెళ్లి చేసుకోడానికి. మరి ఇక్కడ ఎందుకు తెమ్మంటోంది పూమాల? అతనితో పెళ్ళికా, లేక తన అంతిమ యాత్ర సందర్భానికా?? 

దర్శకుడిగా వంశీ తొలిసినిమా ఇది. ఎమ్మార్ ప్రసాదరావు నిర్మాత. రాజన్-నాగేంద్ర స్వరకల్పనలో ఎస్. జానకి కరుణారస ప్రధానంగా పాడారీ పాటని. ముఖ్యంగా మొదట్లో వచ్చే ఆలాపన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. తెరపై సుహాసిని, చిరంజీవి అభినయించారు.

బుధవారం, ఫిబ్రవరి 06, 2019

వేదం .. అణువణువున నాదం ...

"సాగరసంగమమే ఒక యోగం.. క్షార జలధులే క్షీరములాయే.. 
ఆ మధనం ఒక అమృత గీతం.. జీవితమే చిరనర్తనమాయే..." 

సంగీతం సామవేదం నుంచి పుడితే, నాట్యం మాత్రం నాల్గు వేదాల నుంచీ ఉద్భవించింది. నాట్యమే జీవితంగా, జీవితమే నాట్యంగా గడిపిన ఓ కళాకారుడు, కళను తప్ప కాసుల్ని, కీర్తిని పోగుచేసుకోలేని వాడు, జీవిత చరమాంకంలో తన విద్య మొత్తాన్ని ఒక ప్రియమైన విద్యార్థినికి ధారబోసి, ఆమె నాట్యంలో తనని తాను చూసుకుని, మైమరిచి, తృప్తితో కన్నుమూసే సందర్భానికి ఒక పాట కావాలి. సంగీత, నాట్యాలమీద సమగ్రమైన అవగాహన ఉన్న కవి ఆ పాటని ఎలా ఆరంభిస్తారు? 'సాగరసంగమం' (1983) సినిమా కోసం తాను రాసిన పాటని వేటూరి ఇలా మొదలు పెట్టారు: 



"వేదం.. అణువణువున నాదం.. 
నా పంచప్రాణాల నాట్య వినోదం.. 
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై..." 

నాట్యమంటే వేదం.. శ్రద్ధగా నాట్యం చేస్తున్నప్పుడు నర్తకుడు/నర్తకి శరీరమంతా నాదమయమే. నాయకుడికి నాట్యం కేవలం ప్రాణం కాదు, పంచప్రాణాలూను. నాట్యం తాలూకు నాదం 'హంసానంది' రాగాలై రేగుతోంది. సంగీతజ్ఞులు 'హంసానంది' ని సంధ్యారాగం గా వర్గీకరించారు. అంటే, ఈ రాగంలో స్వరం చేసిన కృతులు సాయం సంధ్య వేళ పాడుకోడానికి అనువుగా ఉంటాయి. కథ ప్రకారం, ఈ పాట వచ్చే సందర్భం నాయకుడి జీవిత సంధ్యా సమయం. 

"సాగరసంగమమే ఒక యోగం.. క్షార జలధులే క్షీరములాయే.. 
ఆ మధనం ఒక అమృత గీతం.. జీవితమే చిరనర్తనమాయే.. 
పదములు తామే పెదవులుకాగా.. గుండియలే అందియలై మ్రోగ..." 

నది, సముద్రంలో కలవడం సాగరసంగమం. కళని తనలో నింపుకున్న కళాకారుడు, లయకారుడిలో లీనమవ్వడం కూడా అలాంటిదే.. అది ఒక యోగం. ఉప్పునీటి సముద్రాలు పాలుగా మారుతున్నాయి. జరుగుతున్న మధనం అమృతగీతమై వినిపిస్తుంటే, జీవితం మొత్తం పురాతనమైన నాట్యమైపోయింది. పాదాలు పెదవులుగా రాగం ఆలపిస్తుంటే, గుండెలు మువ్వలుగా మోగుతూ సంగీతం సమకూరుస్తున్నాయి. ...కళనే ఊపిరిగా చేసుకుని బతికినవాడు కదా, చివరి క్షణాల్లో కూడా ఆ కళే కనిపిస్తోంది, వినిపిస్తోంది.. 

"మాతృదేవోభవ..పితృదేవోభవ.. 
ఆచార్యదేవోభవ..అతిథిదేవోభవ.." 

దశోపనిషత్తుల్లో ఏడోదైన తైత్తరీయోపనిషత్తు తల్లి, తండ్రి, గురువులు, అతిధులు దైవంతో సమానమని చెబుతోంది. వాటిని గుర్తు చేసుకుంటూ, గురువు నుంచి నేర్చుకున్న విద్యని ప్రదర్శించడానికి వేదికెక్కింది శిష్యురాలు. 

"ఎదురాయె గురువైన దైవం.. ఎదలాయె మంజీర నాదం.. 
గురుతాయె కుదురైన నాట్యం.. గురుదక్షిణై పోయే జీవం.. 
నటరాజ పాదాన తలవాల్చనా..నయనాభిషేకాన తరియించనా.. 
సుగమము.. రసమయ.. నిగమము.. భరతము గానా..." 

సాక్షాత్తూ దేవుడే గురువు రూపంలో రావడంతో ఆమె ఎదసడి మువ్వలసవ్వడిగా మారిపోయింది. కుదురైన నాట్యాన్ని నేర్పిన గురువుకి దక్షిణగా ఇచ్చేందుకు ఏముందని? జీవితమే గురుదక్షిణ అయిపొయింది. సాక్షాత్తూ నటరాజస్వరూపుడైన ఆయన పాదాలపై తలవాల్చి, కన్నీటితో అభిషేకించడం తప్ప ఇంకేం చేయగలను? సులభమైనది, రసమయమైనది, వేదస్వరూపమైనదీ కదా నాట్యం... ఆ నాదం వింటూ అతని ప్రాణదీపం కొండెక్కిపోయింది. 

"జయంతితే సుకృతినో రససిద్ధః కవీశ్వరః 
నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం" 

భర్తృహరి నీతి శతకంలో ఇరవయ్యో పద్యం ఇది. మంచి పుస్తకాలని రచించిన కవులు పుణ్యాత్ములై, పాఠకులకి కలిగించిన రససిద్ధి కారణంగా జరామరణాలు లేని కీర్తికాయులు, యోగులు అవుతారని భావం. ఇక్కడ నాయకుడు, తన నాట్యం ద్వారా ప్రేక్షకుల్లో రససిద్ధి కలిగించి యోగిగా మారాడన్నది అన్వయం.అతడు లేకపోయినా, శిష్యురాలి రూపంలో అతని నాట్యం కళాభిమానులందరికీ రససిద్ధిని కలిగిస్తూనే ఉంది..  

'హంసానంది' రాగంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటని బాలు, శైలజ హృద్యంగా ఆలపించారు. ముఖ్యంగా 'మాతృదేవోభవ...' కి ముందుగా వచ్చే శైలజ ఆలాపన కట్టిపడేస్తుంది. గురువుగా కమల్ హాసన్, శిష్యురాలిగా శైలజ నటించారు ఈ నాట్యప్రధానమైన గీతంలో. 'పూర్ణోదయా' నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రానికి 'కళాతపస్వి' కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించారు.

సోమవారం, ఫిబ్రవరి 04, 2019

ఆకాశాన సూర్యుడుండడు ...

"ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి.. 
జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే..."

కర్మ సిద్ధాంతాన్ని రంగరించి సాంత్వన వచనాలు చెప్పడం సులువే. కానీ, అవే మాటల్ని తిరిగి మనకి ప్రియమైన వాళ్ళు, వాళ్ళని గురించి చెబుతుంటే వినడం మాత్రం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు ఓ మేస్టారూ, ఆయన భార్యా. ఆ కష్టం వచ్చింది ఎవరి వల్లనో కాదు, కూతురిలా చూసుకున్న విద్యార్థిని నుంచి. నిజానికివి రెండు వేర్వేరు సందర్భాలు. రెండు పాటలు ఉండాలి న్యాయంగా. కానీ ఇక్కడ కవి వేటూరి కాబట్టి, రెండు భిన్న సందర్భాలకీ తగిన విధంగా ఒకే పాటని రాసి, శిష్యురాలి సందర్భానికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు మాత్రమే చేశారు.

'సుందరకాండ' (1992) సినిమాలో రెండు సార్లు వచ్చే "ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే.." పాటని సినిమాతో పాటుగా చూస్తున్నప్పుడు రెండు వేర్వేరు పాటలుగానే అనిపిస్తాయి. సందర్భాన్ని అవగాహన చేసుకుని, పాత్రలని ఆవాహన చేసుకుని, కథని వేగంగా ముందుకి నడిపే విధంగా సాహిత్యాన్ని అందించారు కవి. అందుకే, ఒకే పాట రెండుసార్లు వచ్చినా పునరుక్తి అనిపించదు, సినిమా నడకకి అడ్డంకి అన్న భావనే కలగదు.


"ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే.. 
చందమామకి రూపముండదు తెల్లవారితే.. 
ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో.. 
ఒక పూటలోనే రాలు పూవులెన్నో.."

విదేశంలో ఉన్న తన తల్లి తండ్రీ ఒకేసారి హత్యకి గురయ్యారని తెలుసుకున్న ఓ కాలేజీ విద్యార్థిని దుఃఖంలో మునిగిపోతే, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఆ అమ్మాయి అలా బావురుమనడం చూడలేని మేష్టారు ఆమెని ఓదార్చి, ధైర్యం నింపడానికి మాటలకి బదులుగా పాటని ఎంచుకున్నారు.

"నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా.. 
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా..వికసించాలే ఇక రోజాలా.. 
కన్నీటిమీద నావ సాగనేల.."

తన గుండెల్లో ముల్లు ఉందని, గులాబీ వికసించడం మానదు. మనసులో దుఃఖం ఉందని నవ్వడం మానాల్సిన అవసరం లేదు. ఏదీ శాశ్వతం కాని ప్రపంచం ఇది. సాయంత్రమయ్యేసరికి అప్పటివరకూ వెలుగులు చిమ్మిన సూర్యుడు అస్తమిస్తాడు. తెల్లవారేసరికి అప్పటివరకూ చల్లదనాన్ని పంచిన చందమామ తన రూపాన్ని కోల్పోతుంది. సౌరభాలు చిమ్మే పూల జీవితం ఒక్క పూటలోనే ముగిసిపోతుంది. జీవితం అనే పడవని, కన్నీటి మీద నడపనవసరం లేదు, నవ్వులతో నింపుకోవచ్చు.

"కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో.. 
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే.. 
చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా.. 
పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు..మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు.. 
మమతానురాగ స్వాగతాలు పాడ.."

తోటంతా కొత్తగా వికసించిన పూలతో నిండి ఉన్నప్పుడు, ఆ పూల మధ్య తిరిగే తుమ్మెదకి నూరేళ్ళ జీవితం ఎందుకు? ఒక్క పూటలోనే జీవితకాలానికి సరిపడే తేనె దొరికేస్తోంది కదా.. ఈ బతుకు నడక చాలా చిత్రమైనది. పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు. మరణించిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టకా తప్పదు.. మళ్ళీ పుట్టబోతున్న మన వాళ్ళకోసం స్వాగత గీతాలు పాడాలి తప్ప, ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ..మాస్టారిక్కడ భగవద్గీతలో కర్మ సిద్ధాంతాన్ని భోదించారు శిష్యురాలికి.

"నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే.. 
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే.. 
పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు.. 
మైనా క్షణమైనా పలికిందే భాష.. ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ.. 
విధిరాత కన్న లేదు వింత పాట.."

ఇవాళ నీ జెడలో తురుముకున్న గులాబీలకి కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజున అవి నీ జడకే కాదు, దేవుడి గుడికి కూడా పనికిరావు. వాడిపోయిన పూలని కోరి జెడలోనూ తురుముకోరు, దేవతార్చనకి అంతకన్నా వాడరు కదా. ప్రాణం పక్షిలా ఎగిరిపోయినప్పుడు, దేహం ఖాళీ పంజరంలా మిగిలిపోతుంది. మైనా పక్షి రోజంతా పాడుతూ ఉండదు. తన భాషని వినిపించేది ఒక్క క్షణమే. మెలకువలోనూ, నిద్రలోనూ కూడా జీవితేచ్చ మనల్ని వదిలిపోదు. విధిరాతని మించిన వింత పాట ఏముంది కనుక? ..భగవద్గీతనే ఆశ్రయించి రెండో చరణాన్ని ముగించారు గురువుగారు.

కొంత కాలం గడించింది. తనకి వచ్చిన కష్టం నుంచి కోలుకుని ఆ అమ్మాయి మామూలు మనిషయ్యింది. ఎప్పటిలాగే తన అల్లర్లని కొనసాగించింది. అయితే ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త. అమ్మాయికి కాదు, మేష్టారికి. నవ్వుతూ, తుళ్ళుతూ తిరుగుతున్న ఆ అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడి, మరణానికి చేరువలో ఉంది. తనని ఆదరించి, ఆశ్రయం ఇచ్చిన మేష్టారికి, ఆయన భార్యకీ కూడా తన అనారోగ్యం విషయం చివరి వరకూ తెలియనివ్వలేదు. ఆమె బతికేది ఇంకొద్ది రోజులే అని తెలిసిన ఆ ఇద్దరూ చేష్టలుడిగి పోయారు. వాళ్ళని ఓదార్చే బాధ్యతని ఆ అమ్మాయే తీసుకుంది. మేష్టారికి ఆయన పాఠాన్ని తాను తిరిగి అప్పగించింది.



"ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే.. 
చందమామకి రూపముండదు తెల్లవారితే.. 
ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో.. 
ఒక పూటలోనే రాలు పూవులెన్నో..

నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా.. 
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా..వికసించాలే ఇక రోజాలా.. 
కన్నీటిమీద నావ సాగనేల.."

సూర్యచంద్రాదులకే తప్పలేదు మాస్టారూ, ఇక నేనెంత? ఒక్క పుటలో రాలిపోయే అనేక పూలల్లో నేనూ చేరబోతున్నాను. గుండెల్లో ముల్లులాంటి వ్యాధి నా దేహంలో చేరినా నవ్వుతూ రోజులు గడుపుతున్నాను.. నేను కన్నీరెందుకు పెట్టుకోవాలి? నాకోసం మీరెందుకు బాధ పడాలి??

"కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో.. 
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే.. 
చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా.. 
పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు..మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు.. 
మమతానురాగ స్వాగతాలు పాడ.."

నూరేళ్ళ జన్మ నాకెందుకు మాస్టారూ? మీ అందరితోనూ సంతోషంగా గడిపిన ఈ కొద్దిరోజులూ చాలవూ నాకు?? ఏమో, మళ్ళీ మీ ఇంటికే పాపగా వస్తానేమో.. నాకోసం బాధ పాడడం ఆపి, తిరిగి మీ ఇంటికి రాబోతున్న 'నాకు' స్వాగతం పాడరెందుకూ..


"ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి.. 
జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే.."

అమ్మాయి కోసం వేటూరి కొత్తగా చేసిన మార్పు ఇది. ఆమె సిగ కోరని, కోవెల చేరని పువ్వు కాదు. తనలోపలి ముల్లుని పువ్వుగానూ, బాధని నవ్వుగానూ మార్చుకున్న గులాబీ. ఆ రోజాకి జన్మ బంధమైనా, ప్రేమగంధమైనా నూరేళ్లు అవసరంలేదు.. ఒక్క పూట చాలు.

"పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు.. 
మైనా క్షణమైనా పలికిందే భాష..  ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ.. 
విధిరాత కన్న లేదు వింత పాట.."

ఇవన్నీ మాస్టారి మాటలే.. చెప్పడం కన్నా వినడం చాలా కష్టమని ఆయనకీ అర్ధమైన క్షణాలు. తనవాళ్ళని పోగొట్టుకుని అనాధగా మారిన అమ్మాయిని ఓదారుస్తూ తాను చెప్పిన అనునయ వాక్యాలనే, ఇప్పుడు ఆమె తనని విడిచి వెళ్లిపోతూ చాలా మామూలుగా చెప్పేస్తోంది. నవ్వడం ఎంత కష్టమో మేష్టారికి అనుభవంలోకి వచ్చింది. అప్పుడు తను నవ్వడానికి, ఇప్పుడు తమని నవ్వించడానికి ఆ అమ్మాయి చేస్తున్న ప్రయత్నం పూర్తిగా అర్ధమయ్యింది. తన ఇంటికి తిరిగి రాబోతున్న ఆమెకి స్వాగతం చెప్పడం తప్ప, అతనేం చేయగలడు?

ఈ సందర్భాన్ని ఇంకే కవికి ఇచ్చినా రెండు వేర్వేరు పాటలు రాసేవారేమో. రెండు సందర్భాలకీ అతికినట్టు సరిపోయే విధంగా తేలికైన పదాలతో బరువైన పాటని రాయడం, ఆ పాట గుండె బరువుని తగ్గించేదిగా మాత్రమే కాక పెంచేదిగానూ ఉండడం వేటూరి ప్రత్యేకతే. పాట ఔచిత్యానికి భంగం కలగనివిధంగా కీరవాణి స్వరపరచగా, ఒకే ట్యూనుకి బాలు, చిత్ర విడివిడిగా పాడారు. బాలూ స్వరంలో ప్రభోదాత్మకంగా అనిపించే ఈ పాట, చిత్ర గొంతులో లాలనగా వినిపిస్తుంది.  ఈ పాటకి గాను చిత్రకి ఆ యేటి ఉత్తమ గాయని గా 'నంది' పురస్కారం లభించింది. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్, మీనా, అపర్ణ నటించారీ సినిమాలో. వీళ్ళతో పాటు, నిర్మాత కెవివి సత్యనారాయణనీ అభినందించాల్సిందే.

శుక్రవారం, ఫిబ్రవరి 01, 2019

వెన్నెల్లో గోదారి అందం ...

"నాకులేదు మమకారం ..
మనసు మీద అధికారం ..
ఆశలు మాసిన వేసవిలో ..."

మమకారాన్ని చంపుకోవడం, మనసు మీద అధికారాన్ని వదులుకోవడం అంటే విరాగిగా మారిపోవడమే. జీవితంలో చూడాల్సినవన్నీ చూసేసి, వానప్రస్థాన్ని చేరుకున్న చాలామందిలో ఈ వైరాగ్యం సహజంగానే కలుగుతుంది. అంతే కాదు, తక్కువ జీవితంలోనే ఎక్కువ అనుభవాల్ని - అందునా చేదు అనుభవాల్ని - చూసిన వాళ్ళూ ఈ దశకి త్వరగానే చేరుకుంటారు. అలా చేరుకున్న ఓ పాతికేళ్ళమ్మాయి, తన ప్రమేయం లేకుండా జరిగిన అనేక సంఘటనల కారణంగా విరాగిగా మారిపోయి, తన మనఃస్థితిని పాట రూపంలో బయట పెడితే? 'సితార' (1984) సినిమాలో కథానాయిక కోసం అలాంటి పాటనే రాశారు వేటూరి.


"వెన్నెల్లో గోదారి అందం..
నది కన్నుల్లో కన్నీటి దీపం..
అది నిరుపేద నా గుండెలో..
చలి నిట్టూర్పు సుడిగుండమై..
నాలో సాగే మౌనగీతం.."

వెన్నెల్లో గోదారిని చూడడం ఓ అనుభవం. మొదట ఆ అందం మైమరపిస్తుంది. సమయం గడిచాక ఐహిక ప్రపంచంతో లంకె తెగిపోతుంది.. మరింత సమయం తర్వాత 'ప్రాణాన్ని విడిచేసితే మాత్రమేం?' అని అనిపించేస్తుంది. ఆ స్థితిని విరక్తి అనలేం.. వెన్నెల్లో గోదారిని తనివితీరా చూసిన వాళ్లకి మాత్రమే సంభవించే స్థితి అది. 'నది కన్నుల్లో కన్నీటి దీపం..' నిజానికిదో గొప్ప కవితాతాత్మక వాక్యం. ఈ పాట నిండా ఇలాంటి వాక్యాలెన్నో పొదిగారు కవి. నది కళ్ళలో నీరు కారి, ఆ కన్నీటితో దీపం వెలుగుతోందట!

'అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై..' ఆ దీపం, నాయిక నిరుపేద గుండెలో 'చలి నిట్టూర్పు' సుడిగుండమై తిగురుతోంది. నిట్టూర్పు వేడిగా ఉండడం అందరికీ అనుభవం. ఆ నిఛ్వాస చల్లబడితే? చల్లబడ్డ ఆ నిట్టూర్పు లోలోపల సుడిగుండమై తిరుగుతుంటే?? 'నాలో సాగే మౌన గీతం..' లోపల ఏం జరుగుతోందో ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? అందుకే ఆ చలి నిట్టూర్పు సుడిగుండం నాయిక లోలోపల మౌన గీతమై సాగుతోంది. అది విషాద సంగీతమని, విషాదానికి పరాకాష్ట అనీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా..

"జీవిత వాహిని అలలై.. ఊహకు ఊపిరి వలలై..
బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..
ఎడబాటే.. ఒక పాటై.. పూలతీవెలో సుమ వీణ మోగునా.."

నదిలో కనిపించేవి అలలు, వలలూను. జీవన ప్రవాహం అలలుగా సాగుతోంది. వలలు అడ్డం పడుతూండడంతో ఊహలకి మాత్రం ఊపిరి అందడం లేదు. గతం అనే చీకటి గదిలో జీవితమే ఒక బంధనంగా మారిపోయింది. ఎడబాటు పాటై సాగుతున్నప్పుడు, పూలతీగెతో రాగాలు పలికించడం సాధ్యమేనా?? నాయిక గతం చీకటిమయం. దానిని ఆమె చీకట్లోనే ఉంచాలనుకుంది. కానీ అది సాధ్య పడలేదు. మొదటి చరణంలో నాయిక పరిచయం, ఆమె గతం తాలూకు ప్రస్తావనా జరిగాయి.

"నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై..
యవ్వనాలు అదిమి అదిమి.. పువ్వులన్ని చిదిమి చిదిమి..
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే.."

రెండో చరణంలో మొదటి భాగం ఇది. ఆమె తన గతమంతా బాణాలతో చేసిన పంజరంలో గడిపింది. అది దాటి వచ్చి స్వరపంజరంలో నిలబడింది. బాణాల నుంచి స్వరాలకి మారినా అది పంజరమే. ఆమె స్వేచ్ఛ లేనిదే. పొంగి పొరలుతున్న కన్నీరు కళ్ళమీద తెరలు కట్టడంతో, ఆమె ఏమీ చూడలేని 'మంచుబొమ్మ' గా మారిపోయింది. అంటే, గడ్డకట్టుకు పోవడమే కాదు, నెమ్మదిగా కరిగి నీరైపోతోంది కూడా. యవ్వనాన్ని అదిమేసి, పువ్వుల్ని చిదిమేసి, చేజేతులా వెన్నెలని 'ఏటిపాలు' చేసుకుంది. మామూలుగా అయితే 'అడవి కాచిన వెన్నెల' అంటారు. కానీ, ఈ పాట నదిని గురించి, నదిలాంటి నాయికని గురించీ కాబట్టి, ఆమె 'ఏటిపాలు' చేసుకుంది అంటున్నారు.

"నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే.. మనసు వయసు కరిగే..
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో..

తిరిగే.. సుడులై.. ఎగసే ముగిసే కథనేనా .. ఎగసే ముగిసే కథనేనా.."

జీవితం కన్నీటి మయమై, వయసు, వలపు ఏటిపాలైపోయిన తర్వాత ఇక మిగిలేది వైరాగ్యపు స్థితే. తనమీద తనకి ప్రేమ లేని స్థితి, మనసు ఎటువైపుకీ మళ్లించలేని స్థితి. ఆశలన్నీ మాసిపోయి, వసంతంలా సాగాల్సిన జీవితం వేసవి గాడ్పుల మయమైపోయినప్పుడు చేసే ఆలాపన ఆవేదనలమయమే. మదిలో నింపుకున్న కలలన్నీ నదిలో వెల్లువలా పొంగి, ఆరిపోయాయి. మనసు, వయసు కరిగిపోయాయి, సరాగమే కానరాలేదు. వలపులు బాధని పెంచేవే.. అవి వేగంగా సుడులు తిరిగి ఎగిసి ఎగిసి కథని ముగిస్తున్నాయి. ముగించేది కథనేనా? కథ-నేనా (నాయిక)?? 'కథనేనా' అని రెండు సార్లు అన్నారు కాబట్టి, రెండు అర్ధాలనీ తీసుకోవచ్చా?? చేయగలిగినన్ని ఆలోచనలు చెయొచ్చు, శక్తి, ఆసక్తి మేరకు.

రాణివాసంలో రహస్యపు జీవితం గడిపి, ఆ రహస్యం కన్నా బరువైన ఒక విషాదాంత ప్రేమానుభవాన్ని గుండెల్లో దాచుకుని, నటిగా కొత్తజీవితం మొదలు పెట్టిన అమ్మాయి మీద ఆ గతమే పగబట్టి, వెంటాడి, వేధిస్తే? జీవితకాలం పాటు తనలోనే దాచుకోవాల్సిన రహస్యాలు, బహిరంగమై తనని వెక్కిరిస్తుంటే, విరక్తి కాక కలిగేదేముంటుంది? ఆమె వేదనని తనదిగా చేసుకుని పదాల్ని పరవళ్ళెత్తిస్తూ వేటూరి రాసిన ఈ పాటని నిజానికి గాఢత కలిగిన కవిత్వం అనాలి.

నది, దుఃఖం రెండూ కూడా సన్నగా మొదలై ఉధృతమవుతాయి. ఆ రెండింటి మేళవింపైన ఈ పాట నడక కూడా అంతే. స్వరజ్ఞాని ఇళయరాజా 'గౌరీ మనోహరి' రాగంలో స్వరపరిచిన పాటని, గుండెల్ని పిండేలా ఆలపించిన ఎస్. జానకి కి యేటి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం లభించింది. పీడకల లాంటి గతాన్ని తల్చుకుని అమ్మాయిగానూ, లోకుల వేధింపుల నించి పారిపోయే నటిగానూ జీవించింది భానుప్రియ. మంద్రంగా మొదలై ఉఛ్చస్థాయికి చేరే స్వరానికి తగిన విధంగా అభినయించింది.

ఇళయరాజా చేత ట్యూన్ చేయించుకుని, వేటూరి చేత రాయించుకుని, గీత రచయిత భావాలకి అద్దంపట్టేలా చిత్రించిన దర్శకుడు వంశీని, నిర్మాత 'పూర్ణోదయా' నాగేశ్వర రావునీ కూడా పాటతో పాటుగా గుర్తుపెట్టుకోవాలి.