గురువారం, అక్టోబర్ 11, 2018

ఇడియట్ - ఓ గొలుసు నవల

ముగ్గురు రచయితలు కలిసి ఓ గొలుసు నవల రాశారు. ఆ రచన 'ఆంధ్రజ్యోతి' లో సీరియల్ గా వచ్చింది, ఇప్పటికి సరిగ్గా యాభయ్ ఏళ్ళ క్రితం. దయగల ప్రచురణ కర్తలు ఓ రెండేళ్ల క్రితం ఆ నవలని మళ్ళీ ప్రచురించారు, నాటి మరియు నేటి పాఠకుల కోసం. నవల పేరు 'ఇడియట్.' రాసిన ముగ్గురూ సాహిత్య జీవులే కాక వేర్వేరు రంగాల్లో పేరు సంపాదించుకున్న వాళ్ళు కావడం విశేషం. పత్రికా సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతి రావు, నవలా రచయితగానే కాక వైద్యుడిగానూ పేరు తెచ్చుకున్న కొమ్మూరి వేణుగోపాల రావు కలిసి రాశారీ నవలని.

'ఇడియట్' కథని ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో మధ్యతరగతి మందహాసం. ఆర్ధిక సమస్యలతో పాటు విలువల విషయంలో నిత్యం సంఘర్షణకి గురయ్యే ఈ వర్గంలోని కొన్ని కుటుంబాలలో ఒక దశాబ్ద కాలంలో జరిగిన పరిణామాలని రికార్డు చేసిన నవల. క్లుప్తంగా కథ చెప్పుకోవాలంటే రావుగారు రంగమ్మలది కలహాల కాపురం. రంగమ్మ తండ్రికి రావుగారితో కొన్ని విభేదాలు ఉండి, కక్ష తీర్చుకోడం అతనిగురించి వ్యతిరేకంగా నూరిపోస్తాడు కూతురికి. కలిసి కాపురం చేస్తున్నా తండ్రి ఎప్పుడో చెప్పిన మాటలు నాటుకుపోయిన రంగమ్మ, రావుగారితో శత్రుభావంతోనే ఉంటుంది. వాళ్లకి ముగ్గురు పిల్లలు. వీళ్ళతో పాటు రావుగారి చెల్లెలి కుటుంబం, ఆయన ఇంట్లో పొరుగు వాటాల్లో అద్దెకి ఉండే వాళ్ళ కథలూ సమాంతరంగా నడుస్తాయి.

మొత్తం 288 పేజీల నవల్లో మొదటి వంద పేజీలూ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాశారు. పాత్రల్ని పరిచయం చేసి, కథకి ఓ ముడి వేశారు. తర్వాత అందుకున్న గొల్లపూడి మారురుతిరావు ఓ 126 పేజీలు రాసి, వీలైనన్ని చిక్కుముడులు వేసి, ముగించే బాధ్యతని కొమ్మూరి వేణుగోపాల రావుకి అందించారు. కేవలం 62 పేజీలు మాత్రమే తీసుకున్న కొమ్మూరి పాత్రల్ని సమస్యలనుంచి వీలైనంత బయటికిలాగి కథని ముగింపు తీరానికి చేర్చారు. పాఠకుల సౌలభ్యం కోసం ప్రచురణ కర్తలు ఏ రచయిత ఏ భాగం రాశారన్న వివరం ఇచ్చారు. ముగ్గురి రచనలలోనూ పరిచయం ఉన్న పాఠకులు మాత్రం విడివిడిగా పేర్లు లేకపోయినా ఎవరిదే భాగమో సులువుగానే పోల్చుకోగలరు.


పురాణం రచనల్లో ఒకలాంటి ఆవేశమూ, ఒక నిర్లిప్తతా కూడా సమపాళ్లలో కనిపిస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ నవల మొదట్లో పాత్రల స్వభావాలు కూడా అవే. ఎన్నో సమస్యలు చుట్టూ ఉన్నా, వాటినుంచి తప్పించుకుని వీలైనంత కులాసాగా బతికేసే ప్రయత్నం చేస్తూ, మళ్ళీ అంతలోనూ అలా ఉండాల్సి వచ్చినందుకు మధన పడుతూ ఉంటాయి. రావుగారి టీనేజీ కూతురు శ్యామల నిత్యం నవలలు చదువుకుంటూ, నవలా నాయకులతో కలల్లో విహరిస్తూ ఉంటే, పెద్దకొడుకు కృష్ణ తన క్లాస్ మేట్ కుసుమతో ప్రేమలో ఉంటాడు. చిన్న కొడుకు మోహన్ బడి ఈడువాడు. వీళ్ళతో పాటు రావుగారి చెల్లెలు డిసిప్లిన్ అత్తయ్య, చుట్టూ వాటాల్లో అద్దెకి ఉండే జగదాంబ, రుక్కు తల్లి, సామ్యూల్ కుటుంబాలతో పాటు, రావుగారూ నిత్యమూ పరిశీలించే మేదరి కుటుంబం పరిచయమూ ఉంటుంది. కుసుమ తండ్రి హఠాన్మరణంతో మొదటిభాగం ముగుస్తుంది.

సంప్రదాయ చట్రాన్ని దాటేందుకు ఇష్టపడనట్టుగా అనిపించే రచయిత గొల్లపూడి మారుతిరావు చేపట్టిన రెండో భాగంలో కృష్ణ తన ఇంటిని విడిచిపెట్టి కుసుమతో సహజీవనం మొదలు పెడతాడు. నిజానికి రావుగారికి పెద్దకొడుకు ఎంతో అవసరమైన సమయం అది. కానీ, తన ఇంటి విషయం కృష్ణకి పట్టదు. తమ్ముడు మోహన్ మీద కోపంతో ఒక నాటకీయంగా సందర్భంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డ శ్యామల అతనివల్ల మోసపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెని తన స్నేహితుడైన ఓ రోజుకూలీకి ఇచ్చి పెళ్ళిచేస్తాడు కృష్ణ. మోహన్ అల్లరి చిల్లర తిరుగుళ్ళకి, వ్యసనాలకీ అలవాటు పడి, డిసిప్లిన్ అత్త కూతురు నర్సుని ప్రేమ పేరుతో మోసం చేసి రెడ్ లైట్ ఏరియా లో అమ్మేసేందుకు సిద్ధ పడతాడు. రావుగారు పక్షవాతం బారిన పడడం, కుసుమ పిన్ని కనకలత తన గతాన్ని ఆయనకి వివరించడంతో ఈ భాగం పూర్తవుతుంది. 

అతితక్కువ నాటకీయతతో జీవితానికి దగ్గరగా ఉండే రచనలు చేసిన రచయితగా పేరు పొందిన కొమ్మూరి వేణుగోపాల రావు రాసిన భాగంలో రంగమ్మ గతం, కృష్ణ-కుసుమ మధ్య గొడవలు, మోహన్ అతివాదిగా మారడం, శ్యామల కష్టాల మీదుగా నడిచి కథ మొదలైన రావుగారి ఇంటి సన్నివేశంతోనే ముగుస్తుంది. నవల మొత్తంలో 'ఇడియట్' ఎవరు అన్న ప్రశ్న అనేకసార్లు కలుగుతుంది పాఠకులకి. ఒక్కో రచయిత రాసిన భాగంలోనూ ఒక్కో పాత్ర ఇడియట్ అనిపిస్తుంది. నిజానికి ప్రతి పాత్రా ఏదో సందర్భంలో ఇడియట్ లా ప్రవర్తించిందే. యాభయ్యేళ్ళ కాలంలో మధ్యతరగతి విలువల్లో వచ్చిన మార్పుని తెలుసుకోడానికి ఉపయోగపడే నవల ఇది. అంతే కాదు, ముగ్గురు రచయితలూ ఎవరికి వారే పూర్తి నవలగా రాస్తే ఎలా ఉండేదో ఊహించుకోడానికి మంచి అవకాశం కూడా. (సాహితి ప్రచురణలు, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

12 కామెంట్‌లు:

  1. ప్రేమికురాలి తండ్రి చనిపోవడం, తన తండ్రికి పక్షవాతం రావడం, తమ్ముడి దుర్వ్యసనాలు, డిసిప్లిన్ మేనత్త వగైరా .. మొత్తంమీద సినిమాటిక్ గా ఉందనిపిస్తోంది.
    అదేవిటండీ, చెల్లెల్ని మరీ రోజుకూలీ వాడికిచ్చి పెళ్ళి చేసే అన్నగారు అతనేం అన్నగారండి బాబూ?
    మీ సమీక్ష చివరి పేరాలో కొమ్మూరి వేణుగోపాలరావు బదులు కొమ్మూరి సాంబశివరావు అని పడింది. టైపింగ్ లో పొరపాటయ్యుంటుంది లెండి. అయినా కొమ్మూరి పేరు వచ్చినప్పుడల్లా వారిద్దరి పేర్లతో కాస్త తికమక వస్తుండడం అరుదేమీ కాదుగా 🙂.

    రిప్లయితొలగించండి
  2. @విన్నకోట నరసింహారావు: టైపింగ్ తప్పు కాదండి, నా పొరపాటే, సరిచేశాను.
    కొంచం కాదండీ, చాలా సినిమాటిక్.. యాభై ఏళ్ళ క్రితం నాటి నవల కదా..
    ఆ పెళ్లి, 'తప్పు' చేసిన చెల్లెలికి రచయిత వేసిన శిక్షలా అనిపించింది నాకైతే :)
    ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  3. గోదావరి జిల్లాల్లో చాలామంది తెలివితేటలున్నా,బాగా చదువుకున్నవాళ్ళయినా, ఆఖరికి బ్రాహ్మణులైనా సరే నల్లగా కూలీవాళ్ళలాగే ఉంటారు.ఒక రచయతగా వారికేం శిక్ష వేయాలో చెప్పండి.

    రిప్లయితొలగించండి
  4. @నీహారిక: చాలా సార్లు చదివినా మీ ప్రశ్న అర్ధం కాలేదండీ.. అసలు నల్లగా ఉన్నందుకు శిక్ష ఎందుకు వెయ్యాలి? ఎవరు వెయ్యాలి? శ్యామల పాత్రకి ఆ నవలా రచయిత వేసిన శిక్షని దృష్టిలో ఉంచుకుని మీరీ ప్రశ్న అడిగారని అనుకున్నా, అది ఒక ప్రత్యేక సందర్భం.. మీ ప్రశ్న కేవలం శరీర ఛాయకి సంబంధించిందిగానే కనిపిస్తోంది.. నేనేమన్నా మిస్ అయ్యానా?

    రిప్లయితొలగించండి
  5. ఓ మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు ధన్యవాదాలు మురళి గారు!

    రిప్లయితొలగించండి
  6. >>>>ఆ పెళ్లి, 'తప్పు' చేసిన చెల్లెలికి రచయిత వేసిన శిక్షలా అనిపించింది నాకైతే :)>>>>>

    కృష్ణవేణి వ్రాసిన మీరేనా ఇలా వ్రాసింది అని బాధేసింది.

    పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కొన్ని కుటుంబ అవసరాలమేరకు నిర్ణయిస్తారు. మా ఇంట్లో మా పెదనాన్నలూ, నాన్న వ్యవసాయదారులు, తమ కూతుళ్ళకు ప్రభుత్వోద్యోగులకే ఇచ్చి పెళ్ళిచేయాలని ఉండేది.
    వాళ్ళ ధ్యాస ప్రభుత్వ ఉద్యోగం మీదే ఉండేది కూలి చేసుకుని బ్రతికినవారి కొడుకైనా సరే కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేసారు. మీరు కూలి చేసుకుని బ్రతికేవారిని చిన్నచూపు చూసినట్లనిపించింది.
    నా విషయంలో కూడా నల్లగా ఉన్నా నేను ఒప్పుకున్నాను. పెళ్ళికి వచ్చినవాళ్ళందరూ ఈ అమ్మాయికి బుద్ధిలేదా ఎలా ఒప్పుకుంది అని నా మొఖం మీదే అడిగేసారు. మీరు శిక్ష అంటుంటే మరీ బాధేసింది.నేను కట్టుకునే చీర కూడా నేనే సెలక్ట్ చేసుకుంటాను.అమ్మనాన్న ఇచ్చే బడ్జెట్ ని బట్టి నాకు నచ్చింది కొనుక్కుంటాను.
    భర్త అయినా అంతే !

    రిప్లయితొలగించండి
  7. @కె.ఎస్. చౌదరి: ధన్యవాదాలండీ..

    @నీహారిక: నేనెక్కడా 'నలుపు' ని ప్రస్తావించలేదు కదా అనుకున్నానండీ.. కూలీని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ అతను సకల గుణాభిరాముడు. శ్యామల అన్నగారు అవేమీ పట్టించుకోకుండా ఆమెకి పెళ్లి కావడమే చాలన్నట్టుగా అతనికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పి మరీ చెల్లెల్నిచ్చి పెళ్లి జరిపించేస్తాడు. తర్వాత ఆ చెల్లెలు ఎలా ఉందో చూడడు కనీసం (ఒకే ఊళ్ళో ఉంటూ కూడా). పెళ్లి తర్వాత ఆ అమ్మాయి జీవితం నరకం అవుతుంది. అదంతా తాను చేసిన తప్పుకి శిక్షగానే ఆమె భావించుకుంటుంది.
    ఇక రచయిత వేసిన శిక్ష అని ఎందుకు అన్నానంటే, ఈ పెళ్లి జరిగేది రెండో భాగంలో. మొదటి భాగంలో అన్నకి చెల్లెలిమీద ఎంతో ప్రేమ ఉంటుంది. రచయిత మారడం వల్ల ఆ ప్రేమకూడా మారిందనిపించింది. ఆమె చేసింది తప్పని నేను అనుకోలేదు కాబట్టే కొటేషన్ లో పెట్టాను. నాకు ఏపనీ చేయకుండా బతికేసేవారిని చూస్తే (చేయగలిగి కూడా) చిన్న చూపండి. పని చేసేవాళ్ళంటే (సమాజం హీనంగా చూసే వాటితో సహా ఏ పని అయినా సరే) చాలా గౌరవం. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  8. నీహారిక గారు, 30 ఏళ్ళ క్రితం కూలీ రేట్లు చాలా తక్కువ కదా. అప్పట్లో వ్యవసాయం వల్ల లాభం ఎక్కువే వచ్చేది అనుకుంటాను. శ్రీకాకుళం జిల్లా వండువ గ్రామంలో 2010 వరకు కూలీ రేటు 25 రూపాయలే ఉండేది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది కాబట్టి మేము 200-300 ఇచ్చినా వాళ్ళు పనికి రారు. నేను చూసినంత వరకు కూలీవాళ్ళు చదువుకోవడం ఈ మధ్యనే మొదలైంది. పూర్వం పల్లెటూర్లలో కరణం, మునసబ్‌ల కుటుంబ సభ్యులు మాత్రమే చదువుకునేవాళ్ళు. కరణం, మునసబ్‌ల పిల్లలే తరతరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకోగలిగేవాళ్ళు. మా అమ్మగారి తండ్రి 1960 వరకు మునసబ్ ఉద్యోగం చేసారు. 1960 తరువాత సర్పంచ్ పదవి, 1975 తరువాత ఎం.పి. పదవిలో ఉండేవారు. అప్పట్లో కాపు, తెలగా కులాల్లో కూడా చాలా మందికి చదువు రాదు. అంత కంటే చిన్న కులాల్లో చదువురానివాళ్ళు ఎక్కువే ఉంటారు. అందుకే అప్పట్లో చదువుకున్న కొద్ది మందికీ ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా దొరికేవి. ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యని తగ్గించేస్తోంది. మనవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే చదువుకోవడానికి అలవాటుపడిపోయారు కనుక తమకి ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఏదీ వద్దు అంటారు.

    రిప్లయితొలగించండి
  9. సకల గుణాభిరాముడు
    ఈ పదంలో ద్వంద్వార్ధం ఉందా ?
    రాముడితో నరకమా ?

    రిప్లయితొలగించండి
  10. @ Pravin,

    >>>2010 వరకు కూలీ రేటు 25 రూపాయలే ఉండేది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది కాబట్టి మేము 200-300 ఇచ్చినా వాళ్ళు పనికి రారు. నేను చూసినంత వరకు కూలీవాళ్ళు చదువుకోవడం ఈ మధ్యనే మొదలైంది.>>
    50 ఏళ్ళ క్రితం సంగతి నేను అడగడం లేదు. ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. ఏదో ఒక పని చేసే వాళ్ళనే కూలీలంటారు. ఇపుడు ఒక కూలీ హైదరాబాద్ లో రోజుకి రూ 1000 లు అడుగుతున్నారు. మీ శ్రీకాకుళంలో 300 ఉంటే మా శ్రీకాకుళంలో 600 రూ అడుగుతున్నారు. అంటే నెలకి 30 వేల రూపాయలు సంపాదిస్తున్నారు. కేంపస్ లో సెలక్ట్ అయిన సాఫ్ట్వేర్ ఎంప్లాయితో సమానంగా సంపాదిస్తున్నా కూలీకిచ్చి పెళ్ళి చేయడమేమిటీ అనడం నాకు నచ్చలేదు. 30 ఏళ్ళ క్రితం సంగతే తీసుకున్నా జీతాలలో అంతే తేడా ఉంది.పనీపాటా చేయని అడుక్కునేవాడికిచ్చి పెళ్ళి చేస్తే అభ్యంతరం పెట్టవచ్చు కానీ కూలీకిచ్చి చేస్తే శిక్ష కాదు అని నేను భావిస్తున్నా!

    >>అప్పట్లో చదువుకున్న కొద్ది మందికీ ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా దొరికేవి. >>>>
    నిజమే ఇప్పట్లో అలా చూసేవారు కానీ ఇపుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలొచ్చాక ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి అడిగే వారు తగ్గిపోయారు. మా అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తోంది, మేము కట్నం ఇచ్చుకోలేము కానీ వరుడు సంవత్సరానికి 12 లక్షల నుండి కోటి రూపాయలు సంపాదిస్తే చాలు అని అడుగుతున్నారు.

    రిప్లయితొలగించండి
  11. @నీహారిక: అవునండి.. అన్ని అవలక్షణాలూ ఉన్నవాళ్ళని 'సకల గుణాభిరాముడు' అని వ్యంగ్యంగా అనడం వాడుకలో ఉంది..

    రిప్లయితొలగించండి
  12. నీహారిక గారు, నేను పండించేది Direct Seeded Rice (నాట్లు వెయ్యకుండా, కలుపు నాశక మందులు వాడి పండించే ధాన్యం). కూలీ రేట్లు పెరగడం వల్ల నాకు పెద్ద నష్టం లేదు. మా తాతకి రైల్వే ఉద్యోగం వచ్చినా వెళ్ళలేదు. మునసబ్ కొడుకు సొంత వ్యవసాయ భూమి చూసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడం ఏమిటి అనుకున్నాడు. ఇప్పుడు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేని ఎమ్మెల్యే కొడుకు కూడా తనకి ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటాడు.

    రిప్లయితొలగించండి