సోమవారం, సెప్టెంబర్ 18, 2017

లుబ్ధావధాన్లు

సత్యమూర్తి అనే పేరుగల మహానుభావుడు అసత్యం తప్ప మరొకటి ఆడకపోవచ్చు. భీముడన్న పేరు కలిగి గాలేస్తే ఎగిరిపోయేంత అర్భకంగానూ ఉండొచ్చు. అందరూ అలాగే ఉంటారా అన్న ప్రశ్న రాకుండా ఉండడం కోసం, పేరుకు తగ్గట్టుగా.. ఇంకా చెప్పాలంటే ఆ పేరు తనకి అతికినట్టు సరిపోయేలా ప్రవర్తించే వ్యక్తి లుబ్ధావధాన్లు. ఈ రామచంద్రపురం అగ్రహారీకుడు ముందు పుట్టాడా, పీనాసితనం ముందుగా పుట్టిందా అని అడిగితే 'కన్యాశుల్కం' నాటకం చదివిన వాళ్లంతా జవాబు కోసం ఒక్క క్షణం తడుముకుంటారు. పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎటూ అతి జాగ్రత్తపరుడు కనుక ఏమీ ఖర్చు పెట్టకుండా మరింత జాగ్రత్త చేశాడు. ఒక్కగానొక్క కూతురు మీనాక్షికి ఈడైన సంబంధం తెచ్చి పెళ్లి చేయకుండా,  శుల్కానికి ఆశించి బాగా పెద్దవాడికి ఇచ్చి పెళ్లిచేశాడు.

మీనాక్షికి అత్తవారి తరపున ఆస్తిపాస్తులు బాగానే కలిసొచ్చాయి. కానీ, భర్తే కలిసిరాలేదు. ఈమె కాపురానికి వెళ్లేముందే, అతగాడు పరలోకానికి ప్రయాణం కట్టేశాడు. వితంతువుగా పుట్టింటిలోనే మిగిలిపోయిన మీనాక్షికి లోకం మీద కించిత్ కోపం. అందుకే, కట్టుతప్పి ప్రవర్తిస్తూ తండ్రికి నిజమైన 'గుండెలమీద కుంపటి' గా మారింది. రోజులు మారుతున్నా, వితంతు పునర్వివాహాలు జరుగుతున్నా అటువైపు బొత్తిగా ఆలోచన చేయడు లుబ్ధావధాన్లు. అవడానికి వేదం చదువుకున్న వాడే కానీ, ఆచరణకు వచ్చేసరికి ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి చూడడం బాగా అలవాటైపోయింది. మీనాక్షిని కట్టడి చేసే మార్గాల కోసం వెతుకుతున్న లుబ్దావధాన్లుకి తన జాతకంలో వివాహ ధన యోగాలు జమిలిగా ఉన్నట్టుగా తెలియడంతో పాటు, పెళ్లి జరక్కపోతే పెద్ద ఎత్తున నష్టం వచ్చిపడిపోయే సూచనలు కూడా ఉన్నట్టు ఒకరిద్దరు సిద్ధాంతులు కుండబద్దలుకొట్టి చెబుతారు.

తల్లిలేని మీనాక్షి తలచెడి తన ఎదురుగానే తిరుగుతూ ఉంటే, ఆమెని గురించి ఆలోచించకుండా మరో పెళ్లి మాట తలపెట్టడం ఏమిటన్న స్పృహ ఏమాత్రం లేదు లుబ్దావధాన్లుకి.  చవగ్గా వచ్చే సంబంధం చేసుకుంటే, వచ్చే పిల్ల మీనాక్షినీ, మీనాక్షి ఆ పిల్లనీ కట్టడిలో పెడతారన్న దూరాలోచన చేస్తాడు. 'ఆడదానికి ఆడదే శత్రువు' అన్న నానుడి ఎటూ ఉండనే ఉంది కదా. లుబ్ధావధాన్లుకి ఆప్త మిత్రుడు రామప్పంతులు. వ్యవహారాలన్నింటిలోనూ సలహా సంప్రదింపులు పంతులుతోనే. ఆ పంతులికీ, మీనాక్షికీ సంబంధం ఉందన్న విషయం అవధాన్లుకి తెలియంది కాదు. చూసీ, చూడనట్టు నటిస్తూ ఉంటాడు. పంతులు సలహా మేరకు, కృష్ణరాయపురం అగ్రహారీకుడు అగ్నిహోత్రావధానులు కూతురు సుబ్బిని పద్ధెనిమిది వందలు శుల్కమిచ్చి పెళ్లి చేసుకోడానికి ఏర్పాటు చేసుకుంటాడు లుబ్దావధాన్లు. కరటక శాస్త్రి, మధురవాణీ పూనుకోకపోతే పెళ్లి జరిగిపోయేదే. వాళ్ళ పూనిక వల్ల ఆ పెళ్లి జరగక పోగా, అవధాన్లు మీద ఖూనీ కేసు వచ్చి పడింది.

లుబ్ధావధాన్లుకి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేకపోవడాన్ని తనకి అనుకూలంగా మలుచుకుంటాడు రామప్పంతులు. సంబంధం వద్దంటూ, అగ్నిహోత్రావధానులు రాసినట్టుగా ఒక ఫోర్జరీ ఉత్తరం రాయడమే కాదు, అప్పటికప్పుడు గుంటూరు శాస్త్రులు కూతురితో లుబ్దావధాన్లుకి పెళ్లి నిశ్చయం చేసేస్తాడు. పన్నెండు వందల రూపాయలకే సంబంధం కుదిరినందుకు మిక్కిలి సంతోషించిన అవధాన్లు, వధువు పూర్వాపరాలేవీ విచారించకుండా, పంతులు మాట మీద నమ్మకం ఉంచి పెళ్లి చేసేసుకుంటాడు. తాను ఊళ్ళో లేకుండా చూసి పెళ్లి జరిగిపోవడమూ, తన వాటా డబ్బు ఎగేసి గుంటూరు శాస్త్రులు పారిపోవడంతో హద్దుమాలిన కోపం వస్తుంది రామప్పంతులుకి. ఆ కోపంలో, ఆ గుంటూరు శాస్త్రులు పాంచాళీ మనిషనీ, ఆ పిల్ల రెండో పెళ్లి పిల్లనీ నోటికొచ్చినట్టు దూషిస్తాడు. అటుపైన పంతులు చల్లబడ్డా, అవధాన్లులో అనుమానం మిగిలిపోతుంది.

రామప్పంతులు నాటిన అనుమాన బీజం పెరిగి పెద్ద వృక్షమైపోవడంతో తిండీ నిద్రా కరువవుతాయి లుబ్ధావధాన్లుకి. తను పెళ్లాడిన పిల్ల మొదటి మొగుడొచ్చి తన పీక నులిమేస్తున్నట్టు పీడకలలు. ఇది చాలదన్నట్టుగా, మధురవాణి కంటెతో సహా మాయగుంట పారిపోవడం, కంటెని సంపాదించడం కోసమని రామప్పంతులు ఖూనీ కేసు బనాయించడంతో ఊపిరాడదు ఆ వృద్ధుడికి. ఒకవైపు ఆ పిల్ల ఏమైందో అని ఆందోళన, మరోవైపు కేసులభయం, ఇంకో వైపు డబ్బు ఖర్చయిపోతుందని బెంగ, ఇవి చాలవన్నట్టు తమ్ముడి వరసయ్యే గిరీశం వచ్చి తన పేరిట పవరాఫ్ టర్నామా గిలికి ఇచ్చేయమని పీకమీద కూర్చుంటాడు. "నాకున్న బంధువులంతా నా దగ్గిర డబ్బు లాగాలని చూసేవారే కానీ, నా కష్టసుఖాలకి పనికొచ్చేవాడు ఒక్కడైనా కనపడడు" అని తమ్ముడి మీద నిష్టూరమాడతాడు లుబ్ధావధాన్లు.

కేసు గురించే తప్ప, ఫీజు మాట ఎత్తకపోవడం వల్ల కావొచ్చు, వకీలు సౌజన్యారావు పంతులు మీద మాంచి గురి కుదిరింది అవధాన్లుకి. తాను చేసిన తప్పులన్నింటినీ ఆ వకీలు ఒక్కొక్కటిగా ఎత్తి చూపిస్తే, ఎదురు చెప్పకపోగా అంగీకరించి, వాటిని సరిదిద్దుకునేందుకు సిద్ధ పడతాడు లుబ్ధావధాన్లు. మీనాక్షి మంచిచెడ్డలు చూడకపోవడం మొదలు, వృద్ధాప్యంలో చిన్న పిల్లని పెళ్లి  చేసుకోవడం వరకూ తాను చేసిన తప్పులన్నింటినీ అంగీకరిస్తాడు. సౌజన్యారావుని "దొడ్డ" వాడిగా అంగీకరించి, తన మంచి  చెడ్డల భారం అతగాడిమీద పెట్టేసి, నిశ్చింత పొందుతాడు లుబ్దావధాన్లు. తనమీద ఒకేసారి జరిగిన బహుముఖ దాడి, లుబ్దావధాన్లులో మార్పుకి కారణం అయి ఉంటుంది బహుశా. అదే సమయంలో, తన డబ్బుని కాక తనకి మంచి జరగాలని మాత్రమే ఆశించి, తన తరపున పనిచేస్తున్న సౌజన్యారావు పంతులు సౌజన్యమూ కొంతమేరకు పనిచేసింది.

నాటకం ప్రధమార్ధంలో తన పిసినారితనం, అమాయకత్వంతో నవ్వించే లుబ్ధావధాన్లు పాత్ర, మాయగుంట మాయమైన అనంతరం వచ్చిపడే చిక్కుల కారణంగా సింపతీని సంపాదించుకుంటుంది. కీలకమైన 'ఉత్తరం' సన్నివేశంలో "ఏవిటీ అభావచేష్టలూ?" మొదలు, లుబ్ధావధాన్లు పలికే ప్రతి సంభాషణా తెగ నవ్విస్తుంది. "ఏం ధూళి? సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా" అంటూ మధురవాణి తలకి నూనె రాయడం ఆరంభించింది మొదలు, ఒకపక్క ఉత్తరంలో విషయాలకి కోపం ప్రకటిస్తూ, పెళ్లి చేసుకోడాన్ని గురించి నిర్ణయాలు క్షణక్షణానికీ మార్చుకుంటూ, మరోవంక మధురవాణి స్పర్శకీ, ఆమె చేతుల మృదుత్వానికీ తన్మయుడయ్యే లుబ్దావధాన్లని మర్చిపోగలమా? తప్పులు అందరూ చేసినా, చేసినవాటిని అంగీకరించి, మార్గాన్ని  మార్చుకోడానికి సిద్ధపడే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ మార్పు జరగాలంటే ఎన్ని దెబ్బలు తగలాలో చెబుతుంది లుబ్దావధాన్లు పాత్ర.

5 కామెంట్‌లు:

  1. మీరన్నట్లు "లుబ్ధావధానులు" కాస్త అమాయకుడిలాగానే అనిపిస్తాడు. తరవాత కాలంలో వచ్చిన కాళ్ళకూరి నారాయణరావు గారి "వరవిక్రయం" నాటకంలో లుబ్ధాగ్రేసర చక్రవర్తి అనిపించుకునే "సింగరాజు లింగరాజు" పాత్రకు ప్రేరణా అనిపిస్తుంది "కన్యాశుల్కం" లోని "లుబ్ధావధానులు" పాత్ర (సింగరాజు లింగరాజు మాత్రం లోభే కానీ అనాయకుడు కాదు. అదే తేడా).

    "కన్యాశుల్కం" నాటకం నేను రంగస్ధలం మీద చూడలేదు కాబట్టి ఆ ఫార్మాట్ గురించి నాకు తెలియదు; దాన్ని గురించి చెప్పాలంటే వోలేటి వారే సరైనవారు. సినిమాలో మాత్రం (1950లది) డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు అద్భుతంగా పోషించిన పాత్ర "లుబ్ధావధానులు". ఆ సినిమాలో సుబ్బారావు గారు తతిమ్మా నటులందరినీ ఓవర్-షాడో చేసారని కూడా నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  2. రావి కొండలరావు దర్శకత్వంలో, గొల్లపూడి మారుతీరావు గిరీశంగా నటించిన కన్యాశుల్కం సీరియల్ లో పీసపాటి నరసింహమూర్తి గారు లుబ్ధావధాన్లు పాత్రకి జీవం పోశారనే చెప్పాలి. 99TV వారు ప్రసారం చేసిన అన్ని ఎపిసోడ్ లూ యూట్యూబ్ లో ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  3. ఆచారవ్యవహారాలు జీవనశైలిలో ఒక భాగం..తప్పొప్పులు తో పనిలేదు..ఈరోజుల్లో లక్షలుపోసి పిల్లలను lkg నుండి చదివించడం ఆచారం..మళ్ళీ ఆ లక్షలు రాబట్టుకోవడం కోసం నానా గడ్డి తినడం ఆచారం..ఎవరికీ తప్పు అనిపించదు పైగా ఒకరిని మించి మరొకరు అంతకు రెట్టింపు ఖర్చుపెట్టి చదివిస్తున్నారు..కానీ పిల్లల్లో నైతిక విలువలు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు..
    అలాగే ముసలివారు చిన్నపిల్లలను పెళ్ళాడటం ఆనాటి ఆచారం...అది దురాచారం అన్నది వారికి తెలీదు..
    It's common in all families..
    అందువలన లుబ్ధావధాన్లు అనే పాత్ర సమాజంలోంచి పుట్టిన సజీవ పాత్ర..రామప్పంతులు, గిరీశం లాంటి పాత్రలు నాటకీయత తో వాక్చాతుర్యం తో వైవిధ్యమైనవి..కానీ ఏ మాత్రం శషభిషలు లేని పాత్ర..తన మనసులో ఉన్నదే నిస్సందేహంగా బయటకు చెప్పేస్తాడు..తనలోని ఆశలు, కోరికలు, భయాలూ, బాధలూ, నిరాశ, పశ్చాత్తాపం అన్నీ పెంచుకుంటాడు..

    పెళ్ళిసీనులో రామప్పంతులు తో సమానంగా వాదిస్తాడు..కాబట్టి అమాయకుడేంకాదు..
    గిరీశాన్ని చేయనివ్వడు..సౌజన్యరావుగారి యందు పూర్తి విశ్వాసం కనబరుస్తాడు...
    విన్నకోటి గారన్నట్టు‌..సింగరాజు లింగరాజు పాత్రకి, లుబ్ధావధాన్లకి చాలా తేడా ఉంది..లోభికి, పిసినారికీ ఉన్నంత తేడా...
    లింగరాజు చూస్తే ఎంతటి వాడికైనా ఛీ కొట్టబుద్ది అవుతుంది..లుబ్ధావధాన్లు చూస్తే జాలి కలుగుతుంది..
    నాకు తెలిసింది నేను రాసాను..క్లుప్తంగా...
    తప్పు అయినచో సరిచేయ విన్నపం..


    రిప్లయితొలగించండి
  4. Sir....నా వ్యాఖ్యలో "అన్నీ పంచుకుంటాడు" అని ఉండాలి...కానీ..."పెంచుకుంటాడు" అని తప్పుగా పడింది..

    రిప్లయితొలగించండి

  5. @విన్నకోట నరసింహారావు: ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఇచ్చారండీ గురజాడ. ఇక, సినిమాలో ఓవర్-షాడో విషయానికి వస్తే సావిత్రిని గురించి విన్నానీ మాట.. సుబ్బారావు గారి నటనకి వంక పెట్టలేం.. ఈ సినిమా షూటింగ్ విశేషాలే కాబోలు, ముళ్ళపూడి రమణ రాశారు 'కోతికొమ్మచ్చి' లో సుబ్బారావు గారి ప్రస్తావన వచ్చినప్పుడు.. ..ధన్యవాదాలు.
    @సూర్య: మొదట మా టీవీలో వచ్చింది కదండీ ఆ సీరియల్? వివరం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    @Voleti: గిరీశం, రామప్పంతులు పట్నవాసపు వాసనలు తెలిసినవాళ్ళు కాగా, లుబ్ధావధాన్లు అచ్చమైన పల్లెటూరి మనిషని నాకు అనిపిస్తుందండీ.. స్టేజీ మీద ఈ పాత్ర చేయడం (ఆ మాటకొస్తే 'కన్యాశుల్కం' లో ప్రతి పాత్రా కూడా) ఒక ఛాలెంజి ఏమో కదండీ నటీనటులకి.. ..మీ పరిశీలన చాలా బావుంది.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి