"సఖియా.. చెలియా.. కౌగిలి.. కౌగిలి.. కౌగిలి..." తాతగారి పాట
మొదలవ్వడంతోనే అప్రయత్నంగా కారు వేగం కాస్త పెంచి, అంతలోనే తగ్గించాను.
ఏటిగట్టుని ఆనుకుని కొత్తగా వేసిన తార్రోడ్డు నల్లత్రాచులా ఉంది. గోదారి
మీంచి వీస్తున్న గాలికోసం కారు అద్దాన్ని పూర్తిగా కిందకి దించాను.
"కొత్త
రోడ్డు మీద పది పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాక ఎడం వైపుకి ఎర్ర కంకర రోడ్డు
వస్తుంది.. అగ్రహారంరా ఆ ఊరి పేరు. మొదట్లో పెద్ద రావిచెట్టు ఉంటుందట..
అచ్చం 'ఆనందోబ్రహ్మ' నవల్లోలా..." శ్రీకర్ గాడి మాటలు గుర్తొచ్చాయి.
నాకు
తాతగారెలాగో, వాడికి యండమూరి అలాగ. ఆయన నవలల పేర్లు, వాటిలో పాత్రలు
ఎప్పుడూ వాడి నాలుక చివరనే ఉంటాయి. ఏం చేస్తున్నాడో పెళ్ళికొడుకు? నా ఈ
ప్రయాణాన్ని గురించి పూర్తిగా తెలిసింది వాడొక్కడికే. బయలుదేరే వరకూ నన్ను
తరుముతూనే ఉన్నాడు.
మేఘనకి కూడా "ఓ ఫ్రెండ్ ని కలిసి వచ్చేస్తాను," అని
మాత్రమే చెప్పి బయల్దేరాను. తనూ నాతో వస్తానంటుందేమో అని అనుమానించాడు
వాడు. ఒకవేళ అన్నా, తను చక్రం అడ్డేస్తానని ముందే చెప్పాడు. పాట
పూర్తవ్వడంతోనే ఆడియో రిమోట్ లో షఫుల్ ఆప్షన్ మీదకి వెళ్ళింది ఎడమచేతి
బొటన వేలు. వినబోయే పాటని ముందే ఊహించేస్తే, ఆ పాటని ఎంజాయ్ చెయ్యలేం.
"జ జ
జ జాజ జాబిల్లీ..." మళ్ళీ తాతగారు! "నింగి నించి తొంగిచూసి.. నచ్చగానే
నిచ్చెనేసి.. జర్రుమంటు జారింది..." ఎంత రసికుడివయ్యా మహానుభావా అసలు!! పాట
వినడంకోసం కారు మరికొంచం స్లో చేశాను.. ఎలాంటి ట్రాఫిక్కూ లేదు రోడ్డు
మీద. సైకిళ్ళ వాళ్ళు కూడా కారుని దాటుకుని వెళ్ళిపోతున్నారు. ఏం పర్లేదు..
ఇంకా టైం ఉంది.
"ఆయన ఆహితాగ్ని.. అనుష్ఠానం పూర్తయ్యే వరకూ ఇంట్లో నుంచి
బయటికి రారు. ఆయన్ని కలిసి, పని పూర్తి చేసుకునే రా.. ఇక్కడ నీ భోజనానికి
నేను గేరంటీ.." కారు తాళాలిస్తూ శ్రీకర్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
పక్క సీట్లో రెండు క్యారీ బ్యాగుల్లో పళ్ళు, స్వీట్లు.. ఆయనకోసం.
"రాఘవేంద్ర రావుకిస్తే ఓ పాట తీసేస్తాడు.." అనుండేవాడు శ్రీకర్ చూస్తే.
రెండు బ్యాగులతో పాటు ఓ తెల్ల కవర్, అందులో మడత పెట్టిన అరఠావు
కాగితాలు.. ఆయనకి చూపించాల్సిందేనా?
దూరంగా రావిచెట్టు కనిపించడంతో రోడ్డు
పక్కన కారాపాను. షఫుల్ సంగతి మర్చిపోయాను కదా.. "పిక్క పైకి చీరకట్టి
వస్తవా వస్తవా?" నాగార్జున గొంతుతో అడుగుతున్నారు బాలూ. అడిగిస్తున్నది
తాతగారే. హీరో, సింగర్, డైరెక్టర్.. వీళ్ళెవరితోనూ నాకు సంబంధం లేదు. తాతగారి
పాట అవునా కాదా అన్నదే ప్రశ్న. ఇది ఇవాల్టిది కాదు.
ఇంటర్లో ఉండగా కొత్త
హీరోయిన్ బాగుందని ఎవరో చెప్పడంతో మా ఫ్రెండ్స్ అందరం సినిమాకి బయల్దేరాం.
హీరోయినే కాదు, సినిమా కూడా బాగుంది. ఇంటర్వల్ తర్వాత ఓ పాట.. మరీ ముఖ్యంగా
అందులో ఓ మాట.. "గసగసాల కౌగిలింత.. గుసగుసల్లె మారుతావు..." ఎక్కడో
గుచ్చుకుంది. ఎక్కడో కాదు, గుచ్చుకోవాల్సినచోటే గుచ్చుకుంది. పదహారేళ్ళ
వయసులో హార్మోన్లు వాటి పని అవి చెయ్యకుండా ఉంటాయా?
ఆ ఒక్క పాటనీ రోజంతా
విన్న రోజులెన్నో. ఆ తర్వాత, ఆ పాట ఎలా పుట్టి ఉంటుందన్న ఆలోచన.. జవాబు
వెతుకుతూ ఉండగా దొరికారా రచయిత. గూగుల్ ఇచ్చిన పాటల లిస్టు చూస్తే కళ్ళు
తిరిగాయి. పాటలు వింటూ వింటూ ఉండగా ఆయన నాకు తాతగారైపోయారు.
నాకు దగ్గరి
బంధువులెవరూ లేరు. అమ్మ, నాన్న, వాళ్ళ స్నేహితులు, చాలా తక్కువ మంది దూరపు
బంధువులు అంతే. అమ్మకీ, నాన్నకీ నేనొక్కడినే. శ్రీకర్ నాకు అన్నో, తమ్ముడో
అయితే ఎంత బాగుండేదో అని ఎన్ని సార్లు అనుకున్నానో లెక్కేలేదు. ఇప్పుడు
మాత్రం ఏం? అన్నదమ్ముడి కంటే ఎక్కువే వాడు.
వింటున్న పాట పూర్తవ్వడంతోనే,
గోదారి గట్టున నడవాలనిపించి ఆడియో ఆపి కారు దిగాను. చల్లగాలి ఒక్కసారిగా
ఒళ్ళంతా తడమడంతో నా రెండు చేతులూ ఫేంట్ జేబుల్లోకి వెళ్ళిపోయాయి
అప్రయత్నంగా. జుట్టు చెదిరి మొహం మీద పడుతోంది. ఓ పక్క నిశ్చల గోదారి,
రెండో పక్క కొబ్బరి చెట్ల అడివి. ఆ అడివి మధ్యలో అక్కడొకటి ఇక్కడొకటిగా
చిన్న చిన్న ఊళ్లు.
నాకు తెలియకుండానే అడుగులు గోదారి వైపు పడుతున్నాయి.
రోడ్డున వెళ్ళే వాళ్ళు తిరిగి చూడడం తెలుస్తోంది. ఆరడుగులకి ఓ అంగుళం
తక్కువ హైటు, తగ్గ బిల్ట్ అవ్వడం వల్ల వయసుకి మించే కనిపిస్తాన్నేను.
"ఎంతైనా హైబ్రిడ్ మొక్కల బలమే వేరబ్బా.." అంటూ ఉంటాడు శ్రీకర్. వాడు కాక నా
ఫ్రెండ్స్ ఎవరూ ఆ మాటనే సాహసం చేయరు.
అమ్మా, నాన్నా ప్రేమించి పెళ్లి
చేసుకున్నారు. కులం మొదలు, నమ్మకాల వరకూ చాలా విషయాల్లో వాళ్ళిద్దరిదీ చెరో
దారి. అమ్మకి దైవభక్తి అపారం. నాన్నది పూర్తి నాస్తికత్వం. అయితేనేం,
ఇంటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళిద్దరిదీ ఒకటే మాట. ఇద్దరూ ఒకే
అభిప్రాయానికి వస్తారో, ఒకరి మాటని రెండో వాళ్ళు మనస్పూర్తిగా గౌరవిస్తారో
అర్ధంకాదు నాకు.
టీచర్ ట్రైనింగ్ లో మొదటిసారి కలిశారట వాళ్ళిద్దరూ.
ఉద్యోగాలొచ్చాక పెళ్లిచేసుకున్నారు. మిగిలిన టీచర్లందరూ వాళ్ళ పిల్లల్ని
కాన్వెంట్లలో చదివిస్తుంటే, నన్ను మాత్రం వాళ్ళు పని చేస్తున్న స్కూల్లోనే
చేర్చారు. నేను ఇంజినీరింగ్ చేస్తే బాగుండునన్నది వాళ్ళిద్దరి కోరికా..
నిర్ణయం మాత్రం నాకే వదిలేశారు.
అంతే కాదు, నాకు కేంపస్ ప్లేస్మెంట్ రాగానే
"నాలుగేళ్ళలో నీకు పెళ్లి. పిల్లని నువ్వు చూసుకున్నా సరే.. మమ్మల్ని
చూడమన్నా సరే," అని ఒకే మాటగా చెప్పారు.
పెళ్లి లాంటి ముఖ్యమైన విషయంలో
నాకన్నా వాళ్ళే బాగా నిర్ణయం తీసుకోగలరు అనిపించింది. ట్రైనింగ్ పూర్తి
చేసి ఆన్సైట్ కి వెళ్తూ ఆమాటే చెప్పి ఫ్లైట్ ఎక్కాను. నేను తిరిగి వస్తూనే
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మేఘనతో దైవ సాక్షిగానూ, రిజిస్ట్రార్
సాక్షిగానూ నా పెళ్లి జరిపించేశారు. అటుపై నేనూ మేఘనా - తాతగారి భాషలో -
"కౌగిలిపర్వం కొత్తగ రాయడం" మొదలుపెట్టాం. ఇదంతా మూడేళ్ళ క్రితం మాట.
అమ్మా
నాన్నా అన్ని విషయాల్లోనూ ఒకే మాటగా ఎలా ఉంటారో ఇప్పటికీ ఆశ్చర్యమే.
వేసవి సెలవుల్లో ఏటా తిరుపతి వెళ్ళడం చిన్నప్పటి నుంచీ అలవాటు. అటునుంచటే
చెన్నయో, బెంగుళూరో ఓ నాలుగు రోజులు టూర్. చుట్టాలెవరూ లేరన్న లోటు నాకు
తెలియకూడదనేమో.
తిరుపతి దర్శనం పూర్తి చేసుకుని బయటికి రాగానే, అమ్మ
ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని విమాన గోపురానికి దణ్ణం
పెట్టుకుంటే, నాన్నేమో "పుల్లారెడ్డి, స్వగృహ.. ఎవరికీ కూడా ఇంత బాగా
కుదరదురా ఈ లడ్డూ.. ఎవరు చేస్తారో కానీ.." అంటారు. ఇద్దరూ కూడా వాళ్ళ
భక్తినో, నాస్తికత్వాన్నో నాకు మప్పే ప్రయత్నం చేయలేదు. నాపాటికి నన్ను
వదిలేశారు, నమ్మకాల విషయంలో.
నీళ్ళని చీల్చుకుంటూ పడవొకటి గట్టువైపుకి
వస్తోంది. అవడానికి శీతాకాలపు మధ్యాహ్నమే అయినా వెన్నెల రాత్రిలా ఉంది
వాతావరణం. "అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే.. గట్టుమీన రెల్లుపువ్వా
బిట్టులికి పడుతుంటే..." ఇలాంటి దృశ్యాలెన్నో చూసే రాసి ఉంటారు తాతగారు.
ఆయన కబుర్లు శ్రీకర్ కి తప్ప ఇంకెవరికీ చెప్పను.
నేను మొదలెట్టిన కాసేపటికి
వాడు ఏ 'గోధూళి వేళ' వర్ణనో లేకపోతే 'ఫోన్ లో రేవంత్ గొంతు వింటే రమ్యకి
గుప్పెడు సన్నజాజులు గుండెల మీదనుంచి జారుతున్న అనుభూతి కలగడం' గురించో
అందుకుంటాడు. మిగిలిన ఫ్రెండ్స్ ఎవరన్నా విన్నా, వాళ్లకి మేం ఏ భాషలో
మాట్లాడుకుంటున్నామో అర్ధం కాదు. "మీరు మాట్లాడుకుంటున్నది తెలుగేనా?" అని
అడిగిన వాళ్ళు లేకపోలేదు.
సైకిలు మీద వెళ్తున్న ఓ మనిషి, ప్రత్యేకం సైకిల్
దిగి, కారునీ నన్నూ మార్చి చూస్తూ "ఆయ్.. ఎందాకెల్లాలండీ?" అని
పలకరించాడు. "అగ్రహారం.. సోమయాజి గారింటికి.." రెండో ప్రశ్నకి ఆస్కారం
లేకుండా జవాబిచ్చేశాను.
"ఆ సెట్టు పక్కన కంకర్రోడ్డున్నాది సూడండి..
తిన్నగెల్లిపోతే సివాలయవొత్తాది.. పక్కనేనండారిల్లు.. ఆయ్" అంటూ
సైకిలెక్కేశాడు. ఇక్కడే ఉంటే ఇంకా ఎవరెవరు వస్తారో అనిపించి కారెక్కేశాను.
ఐదు నిమిషాల కన్నా ముందే గమ్యం చేరింది కారు. ఎవరూ చెప్పక్కర్లేకుండానే
అది సోమయాజి గారి ఇల్లని తెలిసిపోయింది.
శ్రీకర్ చూస్తే "వ్యాసపీఠంలా ఉందీ
ఊరు" అని ముచ్చట పడతాడు. "అంటే ఏంటి?" అని అడగక్కర్లేకుండానే నవల రిఫరెన్స్
ఇచ్చేస్తాడు.
"పూజలో ఉన్నారు.. వచ్చేస్తారు కూర్చోండి," కుర్చీ చూపించి
లోపలికి వెళ్ళాడో కుర్రాడు. మరు క్షణం మంచినీళ్ళ చెంబుతో తిరిగొచ్చాడు.
ఆవేల్టి పేపర్ నా ముందు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు.
నేను పేపరు
చూస్తూ ఆలోచిస్తున్నాను. రావడం అయితే వచ్చేశాను కానీ, ఇప్పుడెలా? శ్రీకర్
కూడా పక్కనుంటే బాగుండునని బాగా అనిపిస్తోంది. దృష్టి పేపర్ మీదకి పోవడం
లేదు.
నేను ఆలోచనల్లో ఉండగానే విభూది వాసనలు వెంట తెచ్చుకుని వచ్చారాయన.
లేచి నిలబడ్డాను. ఎనభయ్యేళ్ల వయసుంటుంది. బక్క పల్చని మనిషి. ముగ్గుబుట్ట
తల, గుబురు గడ్డం. శక్తివంతమైన కళ్ళు. ఈయన్ని ఒక్కసారే చూసిన వాళ్ళకైనా,
ఎప్పుడైనా తల్చుకుంటే మొదట గుర్తొచ్చేవి కళ్ళే.
ఎర్రరంగు పట్టు పంచె
కట్టుకున్నారు. పైన ఆచ్చాదనల్లా రెండు వరుసల రుద్రాక్షలే. ఒళ్ళంతా విభూది
పట్టీలు పెట్టుకున్నారు. నుదుట విభూది మధ్యలో ఎర్రని కుంకుమ బొట్టు,
పరమశివుడి మూడో కన్నులా. అన్నిటికన్నా ఆశ్చర్యం, ఆవయసులో కూడా కళ్ళజోడు
లేకపోవడం.
పళ్ళూ, స్వీట్లు ఆయన ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టాను. కవర్ మాత్రం నా
చేతిలోనే ఉంది. నా ఒంట్లో ప్రవహిస్తున్న అమ్మ-నాన్న రక్తాల మధ్య యుద్ధం
జరుగుతున్నట్టుంది. నన్ను కూర్చోమని సైగచేశారాయన.
"ఎలా జరిగింది బాబూ
ప్రయాణం?" క్షణం పట్టింది ప్రశ్న అర్ధం కాడానికి. నా పరిచయం అడగలేదు మరి.
"బాగా జరిగిందండీ.. రోడ్డు చాలా బాగుంది.." నవ్వారు చిన్నగా. "బ్రిటిష్
వాడు రైలు మార్గం వేసినట్టు, వీళ్ళు రోడ్లు వేస్తున్నారు.. లాభాపేక్ష
ఉండకుండా ఉంటుందా.. చవురు తీసి పట్టుకెడుతున్నారు కదూ.." ఏమీ మాట్లాడలేదు
నేను. నా పది వేళ్ళ మధ్యా కవరు నలుగుతోంది.
"ఏవీ అనుకోకు బాబూ.. చిన్న
వాళ్ళని ఏకవచనంతో సంభోదించడమే అలవాటు.. ఆ కాలం వాణ్ణి మరి.."
పర్లేదన్నట్టుగా తలూపి, నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఎలా మొదలుపెట్టాలో
అర్ధం కావడం లేదు. చాలా ప్రైవేటు విషయాన్ని, అత్యంత కొత్త మనిషితో
పంచుకోవడం..అనుకున్నంత సులువు కాదు.
ఆయన నావైపే చూస్తున్నారు పరీక్షగా.
కాసేపటికి, "తెలుగు అర్ధమవుతుంది కదూ?" అడిగారు.
"అవుతుందండీ.." వెంటనే
చెప్పాను.
"ఆహార నిద్రా భయ మైథునాల్లో ఒకటి నీకు దూరమయ్యింది.."
ఉలికిపాటుని దాచుకున్నాను, అతి కష్టం మీద.
నిదానంగా నన్ను చూసి "స్పష్టంగా
చెప్పాలంటే చివరిదే.. కదూ?" ఈసారి మాత్రం నేనేమీ దాచుకోలేదు.. దాచుకోలేక
పోయాను..
"అ..అవునండీ.." అన్నాను కొంచం అస్పష్టంగా.. చర్మం కింద చమటలు
పడుతున్న అనుభూతి. నా గుండెల్లో వణుకు స్పష్టంగా తెలుస్తోంది నాకు.
ఆయన
మౌనం అత్యంత దుర్భరంగా ఉంది, ఉన్నట్టుండి నేను కూర్చున్న కుర్చీకి ముళ్ళు
మొలిచినట్టుగా. ఇంతలో ఆయనకి లోపలినుంచి పిలుపొచ్చింది.
"ఇప్పుడే వస్తాను
బాబూ..." అంటూ వెళ్ళారు.
క్షణమొక యుగంగా గడవడం అంటే ఏమిటో ఆ క్షణంలో
అనుభవంలోకి వచ్చింది.
(ఇంకా ఉంది)