బుధవారం, నవంబర్ 25, 2015

కోనసీమ రైలు

మా కోనసీమ నేల మీద సైకిళ్ళు, మోటారు సైకిళ్ళ మొదలు, లారీలు, కార్లు, బస్సుల వరకూ అనేక రకాల వాహనాలు తిరుగాడతాయి. మా గాలిలో హెలికాప్టర్లు, అప్పుడప్పుడూ దారితప్పిన విమానాలూ విహరిస్తూ ఉంటాయి. అక్కడ కలికానిక్కూడా కనిపించందల్లా రైలుబండి ఒక్కటే. కూ అని కూత పెట్టుకుంటూ వచ్చే రైలు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు మా కోనసీమ ప్రజ. ఏళ్ళ తరబడి మమ్మల్ని ఊరిస్తూ దూరం నుంచే వెళ్లిపోతోందే తప్ప, కోనసీమ ముఖద్వారం దాటి లోపలి రావడం లేదు రైలుబండి.

చిన్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణం అంటే సరదాగానే ఉన్నా, కిక్కిరిసిన బస్సులు, మెటాడోర్లు చూసి చిరాకొచ్చేసేది. బహు చిన్నప్పుడే రైల్లో భాగ్యనగర యాత్ర చేసొచ్చేనేమో, 'మన దగ్గరా రైలుంటే బాగుండు కదా' అనిపించేసేది. ఏదన్నా అనిపిస్తే వెంటనే చెప్పేది తాతయ్యతోనే కదా. ఆ అలవాటు చొప్పున ఈ మాటా ఆయన చెవిన వేశాను. "మనది బురద నేలరా. రైలు చాలా బరువుగా ఉంటుంది కదా.. పట్టాలున్నా, ఆ బరువుకి నేలలో కూరుకుపోతుంది," అనేయడంతో రైలాశని నిరాశ చేసేసుకున్నాను. తాతయ్య చెప్పింది నిజం కాదని తెలిసేనాటికి, రైలు రావడం అంత సులభం కాదన్న తత్త్వం బోధపడింది.

నాతో సహా, మా కోనసీమ ప్రజలందరిలోనూ రైలు కోరికని చమురు పోసి ఒత్తి వేసి వెలిగించిన వాడు గంటి మోహన చంద్ర బాలయోగి. చిన్న పదవులతో రాజకీయ జీవితం మొదలు పెట్టి, ఏకంగా లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎదిగిన బాలయోగి, పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకుండా కోనసీమ రైలు ప్రాజెక్టు కలని నిజం చేసే ప్రయత్నాలు ఆరంభించాడు. ముందుగా కాకినాడ-కోటిపల్లి మధ్య రైలు మార్గం వేయించి, అటుపై కోటిపల్లి-నరసాపురం రైల్వే లైనుకి నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చేత శంకుస్థాపన చేయించేశాడు.

రాబోయే రైలుబండికి స్వగతం పలకడానికి మేమందరం సిద్ధపడుతూ ఉండగా ఆశనిపాతం లాంటి కబురు. బోల్డంత భవిష్యత్తు ఉన్న బాలయోగిని అకాల మరణం పలకరించింది, అది కూడా అత్యంత అనూహ్యంగా. (ఈ సంఘటన గురించి ఇప్పటికీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి, కోనసీమలో). కేంద్రంలో పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రైల్వే లైను కథ మళ్ళీ మొదటికొచ్చింది. నాటినుంచీ అడపా దడపా రైల్వే లైను డిమాండు తెరమీదకి వచ్చి వెడుతూనే ఉంది. అంతేకాదు, 'కోనసీమకి రైలు మార్గాన్ని సాధిస్తా' అని ప్రజలకి వాగ్దానం చేయని నాయకుడు లేడు. ప్రాజెక్టు కోసం నడుం కట్టిన పుణ్యాత్ముడూ లేడు.


శిలాఫలకం వెలిసిన పదమూడేళ్ళకి ఇదిగో ఇప్పుడు మళ్ళీ రైల్వే లైను ఉద్యమం ఊపందుకుంటోంది. ఇన్నాళ్ళుగా పోరాడుతున్న వాళ్లకి తోడుగా యువతరం కదిలొచ్చింది. కోనసీమ యువ రైల్వే సాధన సమితి పేరుతో దేశ విదేశాల్లో ఉన్న కోనసీమ వాళ్ళందరినీ ఫేస్బుక్, వాట్సాప్ ల ద్వారా ఏకతాటి మీదకి తెస్తోంది. పిల్లలూ, పెద్దలూ కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ యాక్షన్ కమిటీ నవంబర్ 27 నుంచి నాలుగు రోజుల పాటు రైల్వే లైను కోసం ఎంపిక చేసిన యాభై ఐదు కిలోమీటర్ల మార్గంలో పాదయాత్ర చేయబోతున్నారు. ఇది కేవలం ప్రారంభం అంటున్నారు మరి.

మాన్య మంత్రిణి మమతా బెనర్జీ శంకుస్థాపన చేసిన రోజున అంచనా వ్యయం ఆరువందల కోట్లు. అదీనాటికి పెరిగి పెద్దదై పద్దెనిమిది వందల కోట్ల పైచిలుకుకి లెక్క తేలింది. 'ఈ ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము పెడితే తిరిగి వస్తుందా?' అని రైల్వే వారి సందేహమట. పోరాట కమిటీ వాళ్ళు ఆ లెక్కలూ తీశారు. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం లారీల ద్వారా రవాణా చేస్తున్న కొబ్బరి, అరటి, చేపలు, రొయ్యలు తదితరాలని రైలు రవాణాకి మళ్ళించడం అటు ఎగుమతి దారులకి ఇటు రైల్వే కి ఉభయ తారకంగా ఉంటుందిట.

కోనసీమ రైల్వే టూరిజం అని ఒకటి ప్రారంభిస్తే, దేశ విదేశాల్లో ఉన్న టూరిస్టులని ఆకర్షించవచ్చునట. దానా, దీనా ఐదేళ్ళలో ప్రాజక్టు వ్యయం వెనక్కి వచ్చేస్తుంది అంటున్నారు. కాలపరిమితి కొంచం అటూ ఇటూ అవ్వచ్చేమో కానీ, పెట్టిన సొమ్ము బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రశ్నే లేదు. రైల్వే బడ్జెట్ తయారీకి మూడు నెలలు ముందుగా మొదలవుతున్న ఈ ఉద్యమాన్ని దఫదఫాలుగా పెంచుకుంటూ వెళ్లి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సొమ్ము విడుదల చేయించే లక్ష్యంతో పనిచేస్తున్నారు కార్యకర్తలు.

అన్ని రాజకీయ పార్టీల మద్దతూ కూడగట్టి చేస్తున్న ఈ ఉద్యమం, ప్రభుత్వాన్ని ఏ మేరకి కదిలించగలదు అన్నది ప్రశ్న. నిధుల విషయంలో తొలినుంచీ ఆంధ్ర ప్రదేశ్ ని చిన్న చూపు చూస్తున్న కేంద్రం, బీహార్ ఫలితం చూశాకన్నా మనసు మార్చుకోక పోతుందా అని ఓ చిన్న ఆశయితే ఉంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులకి ఎటూ టూరిజం ఆరోప్రాణం కాబట్టి అందుకోసమైనా వారీ ప్రాజెక్టు విషయంలో కలగజేసుకోవచ్చు. మా రైలుబండి కల తీరనూ వచ్చు. పోరాటం శాంతియుతంగానూ, శక్తివంతంగానూ సాగాలనీ, విజయం సాధించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ...

5 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

ఔనండి, బాలయోగి గారు బతికి ఉంటే ఈ పాటికి కోనసీమలో రైళ్ళు తిరిగేవి. అన్నీ ఉన్న కోనసీమకి లోటు ఇదొక్కటే. ఏడాది క్రితం నా బ్లాగులో ఈ విషయంపై ఒక టపా వ్రాసాను.
https://bonagiri.wordpress.com/2015/01/10/%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B0%E0%B1%88%E0%B0%B2%E0%B1%8D/

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

రైల్వేస్ ప్రైవేటీకరణ చేసి కాంట్రాక్టర్లకి అప్పచెప్పే ఉద్దేశ్యం ఏమన్నా ఉంటే ఆలోచిస్తారు మాన్యులు,లేకపోతే కోనసీమ రైలుప్రయాణం పట్టాలు తప్ప రైళ్ళు కనపడని నిజంగానే ఉండిపోతుందేమో.

మురళి చెప్పారు...

@బోనగిరి: చదివానండీ.. మీరన్నది నిజం.. ఇప్పటికైనా వస్తుందేమో చూడాలి.. ధన్యవాదాలు..
@శ్రీనివాస్ పప్పు: అలా అయితే మరికొన్నాళ్ళు ఆగాల్సివస్తుందేమో అండీ.. రైల్వే ప్రైవేటీకరణ వెనువెంటనే జరిగే సూచనలేవీ కనిపించడంలేదు మరి.. ధన్యవాదాలు..

స్ఫురిత మైలవరపు చెప్పారు...

కాకినాడ స్టేషన్ నుంచి ఆ వొక పెట్టె రైలు బండి వెళ్ళడం చూసినప్పుడల్లా బాధేస్తుందండీ. ఇది మొదలు పెట్టినప్పుడు మేము రామచంద్రపురం లో వుండేవాళ్ళం. అక్కడ కూడా స్టేషన్ కట్టారు. చెయ్యెత్తితే ఆపి ఎక్కించుకుంటారట ఈ రైల్లో. వొక మనిషి మీద వొక పెద్ద ప్రోజెక్ట్ ఆధార పడడం ఎంత దురదృష్టకరమో కదా అనిపిస్తూ వుంటుంది.

మురళి చెప్పారు...

@స్ఫురిత మైలవరపు: "వొక మనిషి మీద వొక పెద్ద ప్రాజెక్టు ఆధారపడి ఉండడం..." ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం నిజమండీ.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి