గురువారం, నవంబర్ 19, 2015

వసంతగీతం

లింగయ్య పద్దెనిమిదేళ్ళ కుర్రాడు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి గట్టుమల్లు కి కళ్ళు కనిపించవు. అన్న రాయమల్లు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. వదిన గంగమ్మ తన ఈడుదే. అన్న లాగా, ఊళ్ళో మిగిలిన తన ఈడు కుర్రాళ్ళ లాగా పాలేరు పని చేయడం ఇష్టం లేదు లింగయ్యకి. అలాగని వేరే ఏం చెయ్యాలో తెలీదు. వయసొచ్చిన కొడుకు ఏపనీ చేయకుండా ఇంట్లో కూర్చోడం తల్లికి ఏమాత్రం నచ్చక, లింగయ్య ఎదురు పడినప్పుడల్లా తిట్లందుకోడం మొదలుపెట్టింది. వదిన ఎదురుగా తల్లి తనని తిట్టడం భరించలేని లింగయ్య ఇంట్లోనుంచి పారిపోయి అన్నల్లో చేరిపోయాడు. ఆ తర్వాత అతని కథా,  ఆ కుటుంబం కథా ఎన్ని మలుపులు తిరిగిందన్నదే పాతికేళ్ళ క్రితం ప్రచురితమైన 'వసంతగీతం' నవల.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో జరిగిన నక్సల్బరీ పోరాటాల్లో 'ఇంద్రవెల్లి' ఘటన ప్రత్యేకమైనది. పోడు భూములపై సాగు హక్కుని సాధించుకోడం కోసం వందలమంది గిరిజనులు 1981 ఏప్రిల్ 20 న సమావేశం కావడం, అనుమతి లేదన్న కారణాన్ని,  పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందన్న నెపాన్నీ చూపి పోలీసులు కాల్పులు జరపడం, అటుపై ఆదిలాబాద్ జిల్లాలో నక్సల్బరీ ఉద్యమం మరింతగా ఊపందుకోడమూ చరిత్ర. 'ఇంద్రవెల్లి ఘటన' జరిగిన మూడేళ్ళకి మొదలవుతుంది 'వసంతగీతం' నవలలో కథ. లింగయ్య దళంలో చేరే నాటికి దళం ఆదిలాబాద్ అడవుల్లో అడుగు పెట్టి ఐదేళ్ళు గడుస్తుంది. తొలినాళ్ళ ఇబ్బందుల్ని అధిగమించి గిరిజనంలోకి మరింతగా చొచ్చుకుపోయే ప్రయత్నాల్లో ఉంటుంది.

మరోపక్క, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ పై విజయవిహారం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చిన ఏకైక అంశం 'నక్సల్ అణచివేత.' అడివంచు పల్లెల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది పెంపు, ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు, నక్సలైట్ల తలలకి వెలలు నిర్ణయించడం మొదలు, ఏజెన్సీ గిరిజనులకోసం లెక్కలేనన్ని సంక్షేమ పధకాలు ప్రకటించడం వరకూ ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్న తరుణంలోనే, గిరిజనులతో మమేకమై వాళ్ళని హక్కులకోసం పోరాటానికి సన్నద్ధం చేసే కార్యక్రమంలో నిమగ్నమై పనిచేయడం మొదలు పెడతాయి నక్సల్ దళాలు.

వివిధ కాలాల్లో అడివి రూపురేఖలు, దళం సభ్యుల వ్యక్తిగత జీవితాలు, సమిష్టి జీవితం, లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, ఎన్కౌంటర్లలో పోరాట సహచరులని కోల్పోవడం లాంటి ఎదురు దెబ్బలు, అంతలోనే వాటినుంచి తేరుకుని పోరాటానికి పదును పెట్టడం.. వీటన్నింటీ దగ్గరనుంచీ చూస్తాడు 'కామ్రేడ్ గట్టయ్య' గా మారిన లింగయ్య. సోదరభావంతో కలిసి పనిచేసే దళం నుంచీ, మగవాళ్ళతో సమంగా కష్టపడే కామ్రేడ్ రాధక్క నుంచీ ఎంతో స్ఫూర్తి పొందుతాడు. అయితే,  ఊహించని విధంగా అతని కుటుంబానికి ఎదురైన ఆటుపోట్లు గట్టయ్యని తిరిగి లింగయ్య గా మారేలా చేస్తాయి. దళాన్ని విడిచి ఊరికి తిరిగి వెళ్ళిన లింగయ్య దళంలో అలవడిన కొత్త దృష్టితో తన పల్లెని పరిశీలించడం మొదలుపెడతాడు.


అడివిలో ఉంటూ గట్టయ్యగా తను చేసిన ఉద్యమం ఫలితం తన పల్లెమీద ఏమేరకి ఉన్నదన్నది అతను స్వయంగా తెలుసుకోగలుగుతాడు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పు పల్లె రాజకీయాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఆ ఊరి జమీందారు, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారడానికి సిద్ధ పడతాడు. గిరిజనులతో స్నేహం నటిస్తూనే,  పోలీసులని ఉపయోగించుకుని తనకి కావలసిన పనులు జరిపించుకునే కొత్త తరహా రాజకీయ చాణక్యానికి తెరతీస్తాడు. ఊళ్ళో జరిగిన ఓ కేసులో పోలీసుల చేతికి చిక్కిన లింగయ్యకి పోలీసుల పనితీరుని దగ్గరనుంచి చూసే అవకాశం వస్తుంది. తనకి తెలియకుండానే పోలీసుల పనితీరునీ, దళం పనితీరునీ బేరీజు వేసుకుంటాడు. దళం సభ్యుల మధ్య ఉన్న సోదరభావం పోలీసుల్లో లేకపోవడం అతని దృష్టిని దాటిపోదు. లింగయ్య తన జీవితాన్ని ఎక్కడ వెతుక్కున్నాడన్నది నవల ముగింపు.

'వసంతగీతం' నవల తొలి ముద్రణ 1990 ఆగస్టులో జరిగింది. రచయితపేరు పులి ఆనంద్ మోహన్. డిసెంబర్ 2013 లో జరిగిన మలిముద్రణ నాటికి రచయిత అల్లం రాజయ్య తన అసలు పేరుని ప్రకటించుకోగలిగారు, "ఆ నాటి పరిస్థితుల కారణంగా ఈ నవల మొదటి ముద్రణ పులి ఆనంద్ మోహన్ పేరుతో అచ్చయింది" అన్న వివరణతో సహా. ఎనభైల కన్నా తొంభైల్లో, అప్పటికన్నా ఇప్పుడు మరింతగానూ పరిస్థితులు మారాయి. అన్నిరంగాలలోనూ పెనుమార్పులు తోసుకు వచ్చాయి. అయితే, 'భూమి' సమస్య మాత్రం అలాగే ఉంది. నాటి సమస్య వ్యవసాయ భూముల  పంపిణీ అయితే, నేటి సమస్య పరిశ్రమల బారినుంచి భూముల రక్షణ. మరోపక్క, మావోయిష్టులు గా పేరుమార్చుకున్న నక్సలైట్ల గ్రూపుల్లో ఎన్నో చీలికలు వచ్చాయి.

మావోయిష్టుల షెల్టర్ జోన్ అయిన అడవుల విస్తీర్ణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తగ్గుతోంది. పోలీసు బలగం పెరిగింది. నాటితో పోలిస్తే, గిరిజనుల మద్దతు ఏమేరకు ఉన్నదన్నది ప్రశ్నార్ధకం. ఈ నేపధ్యంలో  'వసంతగీతం' చదవడం ఎన్నో ప్రశ్నలని మిగిల్చింది. వరవరరావు రాసిన నలభై పేజీల ముందుమాటలో కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరికినట్టే అనిపించింది. 'లింగయ్య మరెవరో కాదు రచయిత రాజయ్యే నేమో' అనిపించేంత సహజంగా ఉంది పాత్రచిత్రణ, అనేకానేక సన్నివేశాల కూర్పూ. "హెమండార్ఫ్ సంస్కరణలు బూటకమని నిరూపించాగలిగాం" అని ఓ సందర్భంలో ఓ దళ  సభ్యుడి చేత చెప్పించిన రచయిత, ఆ విషయాన్ని గురించి మరింత వివరంగా చెబుతారని నవల చివరికంటా ఎదురు చూసినా ఫలితం లేదు. (హెమండార్ఫ్ సంస్కరణల గురించి ఫణికుమార్ రాసిన 'గోదావరి గాథలు' పుస్తకంలో చదవొచ్చు).

ఒకే ఒక్క సన్నివేశంలో ఒక కేంద్రమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ (పీవీ నరసింహారావు-ఎన్టీఆర్) మినహా మిగిలిన కథంతా అడవులు, తండాలు, పోలీసు స్టేషన్లలోనే జరుగుతుంది. కొన్ని కొన్ని  సన్నివేశాలు కేవలం చదువుతున్నట్టు కాక, స్వయంగా చూస్తున్నట్టు అనిపించడం రచయిత ప్రతిభే. "ఆదిలాబాద్  జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవితం, పోరాట ఆచరణ, త్యాగాలు చిత్రించిన రాజకీయార్ధిక చారిత్రక నవల ఇది. రష్యా, చైనా విప్లవాల కాలంలో వెలువడిన యుద్ధ కాలపు నవలల వంటి ఒక ప్రామాణిక (క్లాసికల్) నవల ఇది" అంటారు వరవరరావు. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న రెండో పక్షమైన పోలీసుల నుంచి, అదికూడా కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుళ్ల నుంచి వారి అనుభవాలు రచనలుగా వస్తే బాగుండుననిపించింది. నాణేనికి రెండో వైపుని కూడా సంబంధీకులనుంచి వినడం అవసరం కదా. ('వసంతగీతం,' పర్ స్పెక్టివ్స్ ప్రచురణ, పేజీలు 420, వెల రూ. 250, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా లభ్యం).

4 కామెంట్‌లు:

  1. పోలీసులు పని చేసేది జీతం కోసం. వాళ్ళ మధ్య సోదర భావం ఎలా ఉంటుంది? ఒరిస్సాలో మావోయిస్త్‌లని అణచివెయ్యడానికి CRPFని ఉపయోగిస్తారు. సివిల్ పోలీసుల కంటే వాళ్ళకే జీతాలు ఎక్కువ.

    రిప్లయితొలగించండి
  2. అవును భభ్రవీణూ,సీపీఐ వాళ్ళ మద్యనా సీపీఎం మధ్యనా సోదరభావం రావట్లేదు,ఏం చేద్దాం?

    రిప్లయితొలగించండి
  3. @Marxist Hegelian: ధన్యవాదాలండీ..
    @హరిబాబు సూరనేని: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి