గురువారం, డిసెంబర్ 31, 2015

ఇంకో ఏడాది ...

వచ్చినంత తొందరగానూ వెళ్ళిపోతోంది రెండువేల పదిహేను. మనం పని తొందరలో ఉన్నప్పుడు కాలం పరిగెడుతున్నట్టూ, ఖాళీగా ఉన్నప్పుడు ఎంతకీ కదలనట్టుగానూ అనిపించడం మామూలే కదా. గత కొన్నేళ్లుగా నడకకి అలవాటు పడ్డానేమో, ఈ ఏడాది మళ్ళీ పరుగందుకోవాల్సి రావడంతో త్వరత్వరగా గడిచిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎప్పటిలాగే తీపినీ, చేదునీ కలగలిపి అందించి తనదోవన తను వెళ్ళిపోతోంది ఇంకో సంవత్సరం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గోదావరి మహాపుష్కరాలు, అమరావతి శంకుస్థాపన, ఆయుత చండీ యాగం.. ఇవన్నీ వెళ్ళిపోతున్న ఏడాది తాలూకు గుర్తులు. పుష్కర ప్రారంభ సంరంభంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన సామాన్యుల ఆత్మలకి శాంతి కలుగుగాక. అంత పెద్ద విషాదం జరిగినా ఎలాంటి విచారణా జరక్కపోవడం, ఎవరిమీదా ఎలాంటి చర్యలూ లేకపోవడం ఓ విచిత్రం.

ఇక, గోదావరి పుష్కరాలని నోరారా విమర్శించి, 'మేము స్నానం చేసేది లేదు' అని బల్లగుద్ది చెప్పిన వాళ్ళు సైతం ఆయుత చండీ యాగానికి హాజరై పట్టు శాలువాలు కప్పించుకోవడం మరో విచిత్రం. బహుశా స్థల, కాలాదుల ప్రభావం కాబోలు. యాగం చివర్రోజు జరిగిన అగ్నిప్రమాదం, ఫలితంగా రద్దైన రాష్ట్రపతి కార్యక్రమం వార్తల్లో ఎక్కడా కనిపించలేదు. జనమంతా ఎటూ లైవ్ లో చూశారు కాబట్టి, మళ్ళీ ప్రత్యేకం చెప్పక్కర్లేదనుకున్నారేమో.

ఏమైనప్పటికీ, పుష్కరాల విషయంలో వచ్చిన విమర్శలు, జరిగిన చర్చల్లో ఒకవంతు కూడా యాగాన్ని గురించి ఎక్కడా జగరలేదు. స్వయం ప్రకటిత హేతువాదులు సైతం నోరు విప్పలేదు ఎందుకనో. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి ప్రస్తుతానికింకా కలల్లోనే ఉంది. 'నేను సైతం' అంటూ దేశ ప్రధాని తెచ్చి ఇచ్చిన మట్టీ, నీరూ పునాదిరాయి వెయ్యడానికి ఉపయోగపడ్డాయి. నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కేవలం మట్టీ, నీళ్ళూ చాలవు కదా.

అధికార పార్టీకి శాసన సభలో తగినంత సంఖ్యా బలం ఉంటే చాలు, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనడానికి రెండు తెలుగు రాష్ట్రాలు మంచి ఉదాహరణలుగా నిలబడ్డాయి ఈ సంవత్సరం. రెండు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతిపక్షానికి తగినంత 'బలం' లేదన్నది నిజం. ఫలితమే, వోటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు రెండూ కూడా ఇట్టే తెరమరుగైపోయాయి. ప్రతిపక్ష సభ్యుల విషయంలో ఒకరిది 'ఆకర్ష' మార్గం, మరొకరిది బెదిరింపుల మార్గం. ప్రసార మాధ్యమాల పూర్తి మద్దతు బాగా కలిసొస్తోంది రెండు ప్రభుత్వాలకీ.

కేంద్ర ప్రభుత్వం 'అసహనం' గొడవల్లోనుంచి బయట పడింది. బీహార్ శాసనసభ ఫలితాల తర్వాత నేలవైపు చూడడం మొదలు పెట్టినట్టుగా అనిపిస్తోంది. 'స్వచ్చ భారత్' ఫలితంగా పరిశుభ్రత మాటెలా ఉన్నా అదనపు పన్ను భారాన్ని జనం మీద మోపే అవకాశం దక్కించుకుంది. 'అవసరం' ఉన్న రాష్ట్రాలతో ఉదారంగానూ, మిగిలిన వాటితో ఉదాసీనంగానూ వ్యవహరిస్తోంది ప్రస్తుతానికి. తుపాను తాకిడికి విలవిల్లాడిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కేంద్రం అందించిన సాయమే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ.

అటు కేంద్రం వల్లా, ఇటు రాష్ట్రాల వల్లా సామాన్యులకి కొత్త పన్నులు మినహా ఒనగూరిన ప్రయోజనాలు ఏవీ లెక్కకి రావడం లేదు. వాళ్ళ దోషం లేకుండా అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రులూ నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఆస్థాన ప్రవచనకారులు సెలవిస్తున్నట్టుగా ప్రజలకి సేవలు పొందే 'యోగం' ఉండాలి కదా. సదరు యోగాన్ని కొత్త సంవత్సరం తన వెంట తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

9 కామెంట్‌లు:


  1. నూతన సంవత్సర శుభాకాంక్షల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఎవర్నీ వదలకుండా అందరికీ వడ్డించేసారుగా ? నిజమే....అంగట్లో అన్నీ ఉన్నా... ప్రజలకి సేవలు పొందే యోగం ఉండాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  3. సారా చావులూ,కాల్ మనీ బోనస్ విషయాలు మరిచినట్టున్నారు (ఎన్నని గుర్తుపెట్టుకుంటారు మీరు మాత్రం,ఉత్తి మంచి విషయాలు రాస్తే పోలా మీడియా వాళ్ళల్లాగ మతి మరుపొచ్చిందని మర్చిపోవచ్చు హాయిగా)

    కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీకూ మీ కుటుంబసభ్యులందరికీ(అంటే వసుధైక కుటుంబానికన్నమాట)

    రిప్లయితొలగించండి
  4. పరుగు అలసట తెలియకుండా, కొత్త సంవత్సరం మీరు కోరుకున్న మజిలీకి చేరుకోవాలని ఆశిస్తూ... శుభాకాంక్షలు. :)

    రిప్లయితొలగించండి
  5. @ జిలేబి: ధన్యవాదాలండీ..
    @నీహారిక: నిజమేనండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. @శ్రీనివాస్ పప్పు: అలా అయితే, ఎర్రచందనం ఎన్ కౌంటర్ నుంచీ మొదలు పెట్టాలండీ.. ఏవో కొన్ని మెతుకులు పట్టుకునే ప్రయత్నం అంతే.. ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: ఓహ్..మరికొన్నాళ్ళు పరుగులు తప్పవండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. సల్మాన్ ఖాన్ ఔర్ పిచలా సాల్ కైసా నికల్ గయా, సమఝ్ మే నహీ ఆయా. అని మొన్న వాట్సప్‌లో ఎవరో మెసేజ్ పెట్టారు. ఇందులో జయలలితని కూడ కలుపుకోవచ్చు.
    నాకు కూడ గత సంవత్సరం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. బహుశా ఇది రొటీన్ జీవితానికి పరాకాష్ట అనుకుంటా! రెండు మూడు సంవత్సరాలలో ఈ రొటీన్ నుండి బయటపడాలనుకుంటున్నాను.

    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. పరుగులు తీసే హడావిడిలో మీకు పుస్తకాలు, సినిమాలు తోడుగా ఉండాలని, యీ ఏడాది చక్కటి కథానికలు మరో నాలుగు మాకు అందించగలరని ఆశిస్తూ మీకు మీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  9. @బోనగిరి: ఈ కొత్త ఏడాది మీరు రొటీన్ నుంచి బయట పడాలని కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు...
    @జ్యోతిర్మయి: చాలా చక్కటి విష్ అండీ!! సేం టు యు :) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి