శుక్రవారం, నవంబర్ 27, 2015

సైజ్ జీరో

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న సౌకర్యాలు, అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త ఆహార పదార్ధాలు.. వీటన్నింటి తాలూకు ఉమ్మడి ఫలితం అధికబరువు.. ఇంగ్లిష్ లో ఒబేసిటీ. బరువు తగ్గించే  సులువైన పరిష్కారాలెన్నో మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. వీటిని ఎంతవరకూ నమ్మడం? చాపకింద నీరులా త్వరత్వరగా విస్తరిస్తున్న ఈ సమస్యని ఇతివృత్తంగా తీసుకుని, చౌకబారు హాస్యాన్ని కాక సున్నితమైన భావోద్వేగాలని ఆలంబనగా చేసుకుని రూపుదిద్దిన సినిమా 'సైజ్ జీరో,' ..'సన్నజాజి నడుము' అన్నది ఉపశీర్షిక. ప్రధాన పాత్ర సౌందర్య అలియాస్ స్వీటీ ని అగ్రశ్రేణి కథానాయిక అనుష్క పోషించడం, కేవలం ఈ పాత్ర కోసమే బాగా బరువు పెరగడం వల్ల షూటింగ్ నాటినుంచీ ఆసక్తి పెంచిన సినిమా ఇవాళే విడుదలయ్యింది.

రాజరాజేశ్వరి (ఊర్వశి) గారాబుపట్టి స్వీటీ (అనుష్క). అందమైన స్వీటీ ఏ విషయాన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోదు. తల్లితోపాటు తమ్ముడు యాహూ (భారత్), తాతయ్య (గొల్లపూడి) ఆమె కుటుంబం. తండ్రి లేని లోటు లేకుండా పిల్లల్ని పెంచుతున్న రాజరాజేశ్వరికి స్వీటీ పెళ్లి ఓ సమస్యగా మారింది. ఓ ఎన్నారై ని తన అల్లుడిగా చేసుకోవాలని కలలుగనే రాజరాజేశ్వరి కల తీరడానికి ఉన్న ఏకైక అడ్డంకి స్వీటీ బరువు. పెళ్ళికొడుకులు తనని తిరస్కరిస్తున్నా బరువు తగ్గడాన్ని సీరియస్ గా తీసుకోదు స్వీటీ. అంతేకాదు, ఒకానొక ఎన్నారై పెళ్ళికొడుకు అభి (ఆర్య) ని తనే తిరస్కరించి, అటుపై అతనితో స్నేహం చేస్తుంది.

కొన్ని పరిస్థితుల కారణంగా బరువు తగ్గి తీరాలని బలంగా నిర్ణయించుకున్న స్వీటీ అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది, వాటి తాలూకు పరిణామాలు ఏమిటన్నదే కనిక కోవెలమూడి రాసిన 'సైజ్ జీరో' కథ. ఆమె భర్త ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకి దర్శకుడు. మామూలుగా మొదలై, ఒక్కో సీన్ కీ ఆసక్తిని పెంచుకుంటూ వెళ్లి, 'అప్పుడే ఇంటర్వల్ వచ్చేసిందా?' అనిపించిన దర్శకుడు, రెండోసగానికి వచ్చేసరికి కొంత తడబడ్డాడేమో అనిపించింది. చెప్పదలచుకున్న పాయింట్ మొత్తాన్ని రెండో సగం కోసం దాచేసుకోడం, చెప్పాలనుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో తడబాటు వల్ల ప్రధమార్ధం ముందు, ద్వితీయార్ధం తేలిపోయినట్టుగా అనిపించింది. మరికొంచం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది.


ఇది పూర్తిగా అనుష్క సినిమా. ఒక నటిగా తనకి దొరికిన పాత్రని ఆమె ఎంత అంకితభావంతో చేస్తుందో చెప్పే మరో ఉదాహరణ 'సైజ్ జీరో.' బరువు పెరగడం మాత్రమే కాదు, స్వీటీ పాత్రలోకి అక్షరాలా పరకాయ ప్రవేశం చేసేసింది అనుష్క. నిస్సందేహంగా ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. నాయికని లక్ష్యం దిశగా నడిపించే పాత్ర హీరోది. అయితే, ఈ హీరో పాత్రకి తనకంటూ ఓ లక్ష్యం లేనివిధంగా చిత్రించారు. మొదటి సగంలో స్వచ్చ భారత్ డాక్యుమెంటరీలు తీసే ఎన్నారై, రెండో సగానికి వచ్చేసరికి పూర్తిగా నాయికకి సహాయకుడిగా మారిపోయాడు. హీరో పాత్రని కూడా శక్తివంతంగా రాసుకుని ఉంటే, సినిమా మొత్తం ఒకే టెంపో తో నడిచి ఉండేదేమో.

అనుష్కతో పాటు ఊర్వశికీ, గొల్లపూడికీ మంచి పాత్రలు దొరికాయి. ఒక్క పాట మినహా కీరవాణి సంగీతంలో గుర్తుపెట్టుకోడానికి ఏమీలేదు. రి-రికార్డింగ్ కి మంచి అవకాశం ఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నా, కీరవాణి ఎందుకో స్పందించలేదు మరి. రెండు సన్నివేశాల్లో కనిపించిన బ్రహ్మానందం పాత్రని కథలో అంతర్భాగం చేయలేదు. పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి చెరో సీన్లోనూ కనిపించారు. ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ సినిమా ద్వితీయార్ధాన్ని ఆక్రమించేశాడు, తన మార్కు 'అతి' తో సహా. నాగార్జున, రానా, తమన్నా, రకుల్ ప్రీత్ లు అతిథి పాత్రల్లో తెరమీద మెరిశారు. నాగార్జున మినహా మిగిలిన వాళ్ళకి డైలాగులు లేవు. సోనాల్ చౌహాన్, అడవి శేష్ పాత్రల్లో స్పష్టత లోపించింది. కెమెరా పనితనం (నిరవ్ షా) కంటికింపుగా ఉంది. ఎడిటర్ (ప్రవీణ్ పూడి) ద్వితీయార్ధంలో తన కత్తెరకి పెద్దగా పని చెప్పలేదు. కిరణ్ సంభాషణల్లో అక్కడక్కడా మెరుపులున్నాయి.

వైవిధ్యం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న సినిమా నటీనటుల పుణ్యమా అని సిక్స్ ప్యాకులు, సైజ్ జీరోలు వాడుక భాషలో భాగమైపోయాయి కాబట్టి ఇంగ్లీష్ లో ఉన్న సినిమా టైటిల్ ఎంతమందికి అర్ధమవుతుంది అన్న ప్రశ్న రాదు. సెన్సార్ 'యు/ఏ' ఇవ్వాల్సినంత ఏముందో అర్ధం కాలేదు. మొత్తం మీద చూసినప్పుడు, ప్రధమార్ధం ఒక సినిమా, ద్వితీయార్ధం మరో సినిమాలాగా అనిపించింది. దీనికి తోడు, అనుష్క కూడా ఇంటర్వల్ తర్వాత ఉన్నట్టుండి కళ్ళజోడు తీసేసింది. 'సినిమాలో ఏమీ లేదా?' అంటే లేదని కాదు, ఓ గొప్ప సినిమా అవడానికి అవకాశం ఉండీ, మంచి ప్రయత్నం గానే మిగిలిపోయిందన్న అసంతృప్తి, అంతే. మేథావుల మాట ఎలా ఉన్నా, వైవిధ్య భరితమైన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది.

6 కామెంట్‌లు:

  1. et tu? :)

    Contact lens పెట్టుకోవడం చూపిస్తారండీ.

    రిప్లయితొలగించండి
  2. నెమలికన్ను సైజు జీరో -> కాంటాక్ట్ లెన్స్ కనిపించక పోయి ఉండవచ్చు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కొత్తావకాయ గారు కూడా పంచ్ లు వేస్తున్నారే ! Good...Good...
    అనుష్క సన్నగా అవుతుందా లేదా అని దిగులేస్తుందండీ, బరువు పెరగడం ఈజీనే కానీ తగ్గడం అంత సులువు కాదు కదా ?
    చీరలు, కళ్ళజోడు ఏదీ వదలడం లేదుగా ? మీ (నెమలి)కన్ను తో జాగ్రత్తగా ఉండాలి !

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: బ్రూటస్ అనేశారా అయితే :) ..లెన్స్ పాయింటు నేను మిస్సయ్యానండీ.. ధన్యవాదాలు
    @జిలేబి: అవునండీ.. అద్దాలు మార్చాల్సిన సమయం వచ్చిందని అర్ధమయ్యింది :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. @నాయుడు వెలమల: అనుష్క మాత్రం వంక పెట్టడానికి లేకుండా చేసిందండీ.. అవార్డులేమన్నా వస్తాయేమో చూడాలి.. ..ధన్యవాదాలు.
    @నీహారిక: పర్వాలేదండీ, సైకిలు తొక్కి తగ్గేస్తుంది.. నాగార్జునా వాళ్ళూ ప్రోత్సహిస్తారు.. సినిమాలో చూశాం కదా :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి