సోమవారం, ఏప్రిల్ 20, 2015

ఇల్లలకగానే ...

తెలుగు సాహిత్యంలో స్త్రీవాద కథకుల పేర్లు తలుచుకోగానే మొదటి వరుసలో గుర్తొచ్చే పేరు పి. సత్యవతి. నలభయ్యేళ్ళుగా కథలు రాస్తున్న ఈ రచయిత్రి తాజా కథల్లో ఆకర్షించే అంశం 'సంయమనం.' దృక్కోణం స్త్రీవాదమే అయినప్పటికీ, కథాంశం ఎంపిక మొదలు, పాత్రల చిత్రణ, సంభాషణల వరకూ ఒక సంయమనం కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఇరవయ్యేళ్ళ క్రితం సత్యవతి విడుదల చేసిన తన మొదటి కథా సంకలనం 'ఇల్లలకగానే ...' లో ఈ సంయమనం కొంచం అటూ ఇటూ అయ్యిందేమో అనిపించింది, సంకలనాన్ని పూర్తి చేసి పక్కన పెట్టగానే.

సంకలనంలో మొత్తం పదిహేను కథలున్నాయి. ఇవన్నీ 1989-95 మధ్య కాలంలో రాసినవి, ప్రచురితమయినవీను. ఏ కొందరు స్త్రీలో కెరీర్లో సాధించిన విజయాల్ని మొత్తం స్త్రీజాతి విజయాలుగా చిత్రీకరించరాదనీ, మెజారిటీ మహిళలు నిత్యం అనేకానేక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారనీ తను రాసిన ముందుమాట తో పాటు, ఒకట్రెండు కథల్లోనూ చెప్పారు సత్యవతి. ఇందుకు తగ్గట్టుగానే ఈ కథల్లో ప్రధాన స్త్రీ పాత్రలన్నీ ఇంటా, బయటా ఎదురయ్యే సమస్యల్లో తలమునకలయ్యేవే. భర్త, పిల్లలు, అత్తమామలకి అన్నీ అమర్చి పెడుతూనే వారినుంచి సమస్యలు ఎదుర్కొనే వారు, స్త్రీ అయిన కారణంలో పని ప్రదేశంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళూ కనిపిస్తారీ కథల్లో.

సంపుటిలో తొలికథ 'ఆకాశంబున నుండి,' బీనాదేవి రాసిన 'పుణ్యభూమీ కళ్ళుతెరు' నవలని జ్ఞాపకం చేసింది. తన అందం కారణంగా ఇంటా, బయటా ఎన్నో సమస్యలు ఎదుర్కోడమే కాక, కుటుంబ జీవితం నుంచి బయటికి నెట్టబడిన పేదింటమ్మాయి 'సూరీడు' కథ ఇది. అందం లేకపోయినా, పేదింటి నుంచి పెద్దింటికి కోడలిగా వెళ్ళిన గోమతి కథ 'గోవు.' తనకి ఎంతో ఇష్టమైన విరిబోణి వర్ణాన్ని వీణ మీద శృతి చేసుకోడానికి సమయం దొరకని ఇల్లాలు శారద కథ 'తాయిలం' కాగా, ఇంటి చాకిరీకి జీవితాన్ని అంకితం చేసి ఆ క్రమంలో తన పేరునే మర్చిపోయిన గృహిణి కథ - సంపుటికి శీర్షిక - 'ఇల్లలకగానే ...' ఉద్యోగినుల సమస్యలని చిత్రించిన మరో రెండో కథలు 'చీమ,' 'దేవుడు.'


పేదింటి కథలు 'ఇందిర' 'వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు.' తల్లిపాత్రలలో సామ్యం కనిపిస్తుంది ఈ రెండు కథల్లోనూ. పేదరికం కారణంగా ఇందిర తండ్రి ఆ అమ్మాయిని దూరం ఊరికి పనికి పంపిస్తే, వెంకటేశ్వర్లుని అతని తల్లి కేవలం తన రెక్కల కష్టంతో గొప్పవాడిని చేస్తుంది. 'ముసుగు,' 'భద్రత,''దేవుడు,' 'గాంధారి రాగం' కథలు భద్ర జీవితాలు గడిపే మహిళల కథలు. వాళ్ళ భర్తల మంచితనం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలు ఆ మహిళలకి అవగతమయ్యే సందర్భాలే ఈ కథలు. పిల్లలిద్దరూ జీవితాల్లో స్థిరపడిన తరువాత, తన భర్తతో కలిసి ఉండలేక, ఉండే అవసరమూలేక తన జీవితానికి సంబంధించిన ముఖ్య నిర్ణయం తీసుకున్న అరుంధతి కథ 'అరుణసంధ్య.'

మిగిలిన పదమూడు కథలకన్నా కొంత భిన్నంగా ఉన్న రెండు కథలు 'పెళ్లి ప్రయాణం,' 'బదిలీ.' వీటిలో, 'పెళ్లి ప్రయాణం' పెద్ద కథ. మూడు తరాల ఆడవాళ్ళ జేవితాలని చిత్రించిన కథ. ఓ పెళ్ళిలో కలుసుకున్న అక్కచెల్లెళ్ళు తమ జీవితాలని, తమ ముందుతరం, తర్వాతి తరం జీవితాలనీ తరచి చూసుకున్న కథ. గృహ రాజకీయాలు, గ్రామీణ జీవితంలో వచ్చిన మార్పులు లాంటి ఎన్నో అంశాలని స్పృశిస్తూ సాగిన కథ ఇది. చివరి కథ 'బదిలీ' ఆత్మాభిమానం మెండుగా ఉన్న రజని కథ. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినప్పుడు, బదిలీలు తప్పనప్పుడు, భర్త కెరీర్ కే ప్రాధాన్యత ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తుంది రజని.

మొత్తం పదిహేను కథల్లోనూ ఉన్న ఒక సామ్యం 'చెడ్డ భర్త' పాత్రలు. ఓ మంచి భర్త పాత్ర కలికానిక్కూడా కనిపించలేదు. ఈ భర్తలు పేదవాళ్ళు అయితే సంపాదన అంతా తాగేసి, భార్యని కొట్టేవాళ్ళు. మధ్యతరగతి అయితే భార్య మీద ప్రేమ నటిస్తూ ఆమె సంపాదననీ, శ్రమనీ దోచుకుంటూ, సమయం వచ్చినప్పుడు నిజరూపం బయట పెట్టేవాళ్ళు, ఉన్నత తరగతి వాళ్ళయితే భార్యని 'అదుపు'లో పెట్టుకుని ఆమె తన అభిరుచుల్ని కూడా మర్చిపోయేలా చేసేవాళ్ళూను. 'బదిలీ' కథలో రాఘవరావు పాత్ర కొంచం భిన్నంగా ఉంది అనుకునేలోగానే అతగాడు భార్య రజని మీద నింద మోపేశాడు. 'మొగుళ్ళందరూ ఒక్కటే' అనే బ్రాండింగ్ చేసేశారు రచయిత్రి. (పేజీలు  144, వెల రూ. 40).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి