గురువారం, ఏప్రిల్ 23, 2015

స్వర చక్రవర్తి

తెలుగు సినిమా పరిశ్రమలో అటు క్లాస్ పాటలనీ, ఇటు మాస్ గీతాలనీ ఏక కాలంలో రాసి ఒప్పించిన ప్రజ్ఞాశాలిగా వేటూరి పేరు ఎలా అయితే సుప్రసిద్ధమో, ఈ రెండు తరహా గీతాలకీ జనం మెచ్చే రీతిలో స్వరాలద్దిన సంగీత దర్శకుడు చక్రవర్తి పేరూ అంతే ప్రసిద్ధం. ముప్ఫయ్యేళ్ళ కెరీర్ లో 960 సినిమాలకి సంగీతం అందించడంతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని కళల్లోనూ తనదైన ముద్రవేసిన చక్రవర్తిని గురించి, కొత్తగా ఆరంభమైన సినీ వెబ్ పత్రిక Thinking Donkey లో నేనురాసిన నాలుగు మాటలూ ఇక్కడ...

***

చిరంజీవి కథానాయకుడిగా ముప్ఫై రెండేళ్ళ క్రితం విడుదలై సంచనలం సృష్టించిన సినిమా 'ఖైదీ.' ఈ సినిమా విజయంలో పాటలకీ భాగం ఉంది. 'ఖైదీ' సినిమా అనగానే మొదట గుర్తొచ్చే పాట 'రగులుతోంది మొగలిపొద,' రెండోది 'గోరింట పూసింది.. గోరింక కూసింది..' సినిమా పరిభాషలో చెప్పాలంటే మొదటిది మాస్ గీతం, రెండోది క్లాస్ పాట. సినిమాలాగే ఈ రెండు పాటలూ సూపర్ హిట్. వయోభేదం లేకుండా సంగీత ప్రియుల చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఈ రెండు పాటలనీ స్వరపరిచిన సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరరచనలో వైవిధ్యాన్ని గురించి చెప్పాలంటే ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదేమో.

పోటీకి మారుపేరైన సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముప్ఫయ్యేళ్ళ కాలంలో 960 సినిమాలకి సంగీతం అందించడం అన్నది ఆషామాషీ విషయం కాదు. సినీ సంగీతం మీద సంపూర్ణ అవగాహనతో పాటు, కాలానుగుణంగా ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులని గమనించుకుని, అందుకు తగ్గట్టుగా తమని తాము మలచుకోగలిగే నిత్య కృషీవలురకు మాత్రమే సాధ్యపడుతుందిది. నిర్మాతలు, దర్శకులు, హీరోలకి తగ్గట్టుగా, ప్రేక్షకులు మెచ్చేలా సంగీతం అందించి, సుదీర్ఘ కాలంపాటు తమదైన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న సంగీత దర్శకుల జాబితాలో చక్రవర్తికీ స్థానం ఉంది.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1938వ సంవత్సరంలో జన్మించిన కొమ్మినేని అప్పారావు తన ముప్ఫై మూడో ఏట 'చక్రవర్తి' గా మారారు. 1971 లో విడుదలైన 'మూగప్రేమ' సంగీత దర్శకుడిగా చక్రవర్తి మొదటి సినిమా. పి. సుశీల, ఎల్లార్ ఈశ్వరి కలిసి పాడిన 'నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే..' చక్రవర్తి రికార్డు చేసిన మొదటి పాట. పక్కా మాస్ పాట ఇది! తనకెంతో ఇష్టమైన 'మాయా మాళవ గౌళ' రాగంలో స్వరపరిచారీ పాటని. సినిమా పరిశ్రమ అంటేనే సెంటిమెంట్లకి పుట్టిల్లు. సంపూర్ణ రాగంలో ఉన్న పాట స్వరపరచడంతో కెరీర్ మొదలు పెడితే, కెరీర్ కూడా సంపూర్ణమవుతుందన్నది పరిశ్రమలో ఓ నమ్మకం. చక్రవర్తి విషయంలో ఈ నమ్మకం నిజమయ్యింది. అంతేకాదు, ఇదే సినిమాలో క్లాస్ టచ్ తో సాగే 'ఈ సంజెలో.. కెంజాయలో' పాట కూడా అంతగానూ శ్రోతలకి చేరువయ్యింది. 

అతి తక్కువ కాలంలోనే చక్రవర్తి బిజీ సంగీత దర్శకుడిగా మారడమే కాదు, మాస్ పాటలకి కేరాఫ్ అడ్రస్ గానూ మారిపోయారు. మరీముఖ్యంగా ఎన్టీఆర్-కె.రాఘవేంద్ర రావు-చక్రవర్తి లది హిట్ కాంబినేషన్. 'వేటగాడు,' 'యమగోల,' 'కొండవీటి సింహం,' 'జస్టిస్ చౌదరి,' 'డ్రైవర్ రాముడు' లాంటి సినిమాలకోసం చక్రవర్తి స్వరపరిచిన పాటలు నాటి కుర్రకారుచేత థియేటర్లలో చిందులేయించాయి. 'ఆకుచాటు పిందె తడిసే..' 'చిలకకొట్టుడు కొడితే..' 'బంగినపల్లి మావిడిపండు..' 'ఇది ఒకటో నెంబరు బస్సు..' 'మావిళ్ళ తోట కాడ పండిస్తే..' లాంటి పాటలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. అలాగని కేవలం మాస్ పాటలకి మాత్రమే పరిమితమయిపోలేదు చక్రవర్తి. ఇవే సినిమాల్లోని 'ఇది పువ్వులు పూయని తోట..' 'ఆడవె అందాల సురభామిని..' 'వానొచ్చె వరదొచ్చె...' 'నీ తొలిచూపులోనే...' 'ఏమని వర్ణించనూ..' చక్రవర్తి బహుముఖీన స్వర ప్రతిభకి తార్కాణాలు.

అక్కినేని-దాసరి-చక్రవర్తి కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమాభిషేకం' పాటలు మ్యూజిక్ రికార్డులని తిరగరశాయి. ఈ సినిమాలో ప్రతి పాటా హిట్టే. ఓ పక్క కమర్షియల్ దర్శకులతో పని చేస్తూనే, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శారద' సినిమాకి కలకాలం నిలిచిపోయే పాటలు చేశారు చక్రవర్తి. 'రేపల్లె వేచెనూ.. వేణువు వేచెనూ..' పాటని ఒకసారి విని, మర్చిపోవడం ఎవరితరం? ఇదే సినిమా కోసం 'అటో ఇటో తేలిపోవాలి..' అనే తమాషా పాటని స్వయంగా పాడారు కూడా. శోభన్ బాబుకి 'కుశలమా.. నీకు కుశలమేనా..' (బలిపీఠం) లాంటి క్లాస్ పాటల్నీ, 'ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా...' (దేవత) లాంటి ఎవర్ గ్రీన్ మాస్ పాటల్నీ అందించారు.

సాధారణంగా వేరే భాషలో విజయవంతమైన సినిమాని తెలుగులో పునర్మిస్తున్నప్పుడు అవే ట్యూన్స్ ని కొద్దిపాటి మార్పు చేర్పులతో ఉంచేయమని దర్శకనిర్మాతలు కోరడం పరిపాటి. చాలామంది సంగీత దర్శకులు ఈ కోర్కెని మన్నిస్తూ ఉంటారు కూడా. కానీ, ఇలా చేయడానికి ససేమిరా ఒప్పుకోని (బహుశా ఏకైక) సంగీత దర్శకుడు చక్రవర్తి. హిందీ మ్యూసికల్ హిట్ 'ప్యాసా' తెలుగుసేత 'మల్లెపువ్వు' కి చక్రవర్తి సంగీతం అందించారు. తెలుగు సినిమాకోసం 'ప్యాసా' లో ఏ ఒక్క బాణీ నీ ఉపయోగించకుండా 'చిన్నమాట.. ఒక చిన్న మాట...' 'నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా..' లాంటి నిలిచిపోయే పాటలు చేశారు. ఇతర సంగీత దర్శకుల బాణీలని ఉపయోగించుకోడానికి బద్ధ వ్యతిరేకి చక్రవర్తి.

సంగీత దర్శకుడిగా చక్రవర్తి చేసిన ప్రయోగాలకి లెక్కలేదు. 'జ్యోతి' సినిమాలో 'సిరిమల్లె పువ్వల్లె నవ్వు..' పాట ఆసాంతమూ గాయని జానకి నవ్వులు మాత్రమే వినిపిస్తాయి, అనేక శ్రుతుల్లో. విడిగా చదివితే 'వ్యాసమా?' అనిపించే 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో..' పాటని ఆవేశ భరిత గీతంగా మార్చారు 'ప్రతిఘటన' సినిమాకోసం. చక్రవర్తి ట్యూన్ చేసిన గీతాలని ఇప్పటి తరం సినిమాల్లో రి-మిక్స్ చేస్తున్నారు. అవి ఆదరణ పొందుతున్నాయికూడా. జూనియర్ ఎన్టీఆర్ 'అల్లరి రాముడు' కోసం 'రెండువేల రెండువరకు..' ('ఆకుచాటు పిందె తడిసే') మొదలు రవితేజ 'వీరా' లో 'మావిళ్ళతోట కాడ' రీమిక్స్ వరకూ జాబితా వేస్తే చాలా పాటలే లెక్క తేలతాయి.

చక్రవర్తి కేవలం సంగీతదర్శకుడు, గాయకుడు మాత్రమే కాదు. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు, రచయిత కూడా. రజనీకాంత్, కమల్ హాసన్ లకి డబ్బింగ్ చెప్పారు. 'సింహాద్రి' పేరుతో తెలుగులోకి అనువదింపబడ్డ మమ్ముట్టి-రంభల మళయాళ డబ్బింగ్ సినిమాకి తెలుగులో మాటలు రాశారు. నటుడిగా 'గోపాలరావు గారి అమ్మాయి,' 'పక్కింటి అమ్మాయి,' 'తేనెటీగ,' 'నిన్నే ప్రేమిస్తా,' 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాల్లోనూ, 'కలిసుందాం రా' టీవీ సీరియల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు ధరించారు. వెంకటేష్, సౌందర్య నటించిన 'రాజా' సినిమాలో కథని మలుపు తిప్పే కీలకమైన పాత్రలో నటించారు చక్రవర్తి. సినీ సంగీత దర్శకుడు చక్రవర్తిగా నిజజీవిత పాత్రలోనే కనిపించారీ సినిమాలో.

రాజన్-నాగేంద్ర ల దగ్గర సినీ సంగీతంలో మెళకువలు నేర్చుకున్న చక్రవర్తి దగ్గర కీరవాణి, రాజ్-కోటి, వందేమాతరం శ్రీనివాస్, మాధవపెద్ది సురేష్, వాసూరావులు శిష్యరికం చేశారు. చక్రవర్తి కుమారుడు 'శ్రీ' కొన్ని సినిమాలకి గుర్తుండిపోయే సంగీతాన్ని అందించారు. తెలుగు సినిమా సంగీతం మీద తనదైన సంతకం చేసిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న తన 64వ ఏట కన్నుమూశారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో చక్రవర్తి ఓ అధ్యాయం అనడం అతిశయోక్తి కాదు. 

2 కామెంట్‌లు: