పెళ్లింట్లో సందడికి లోటేం ఉంటుంది కనుక.. చుట్టాలతో పక్కాలతో కిసకిసలాడుతూ పచ్చి తాటాకు పందిళ్ళూ, మామిడాకు తోరణాలు, పసుపు కుంకాలు, మల్లి పూలూ, గంధం, ఐరేని కుండల సొంపు, పిల్లల పరుగులు, పెద్దల చిరునవ్వులు, వరసైన వాళ్ళ సరసాలు - పెళ్లి నిండుతనమంతా పందిరి పలవరిస్తోంది. కానీ, పెళ్ళికూతురు అలివేలు మాత్రం ఆ పగలంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది. ఆమెకి తోడుగా ఆకాశం కూడా. అకాలపు వానకి పెళ్ళికి వేసిన ప్రహరీ బచ్చళ్ళు తుడుచుకు పోయాయి.
అయితే, అలివేలు ఏడుపుకీ కురుస్తున్న అకాల వర్షానికీ ఏమాత్రం సంబంధం లేదు. అసలు అలివేలు మనసు ఆ పెళ్లి పందిట్లో లేనే లేదు. ఆమె మనసంతా సత్యం చుట్టూ తిరుగుతోంది. తన ఊరి వాడే.. వరసైన వాడే.. ప్రాణ స్నేహితురాలు జానకికి స్వయానా అన్న. కంచంలో పాలు పోసి, అంచున వెన్న పెట్టి పెంచింది సత్యాన్ని వాళ్ళమ్మ సీతమ్మగారు. అంత గారాబంగా పెరిగాడు కనుకే, మేష్టారితో పేచీ వచ్చిన వెంటనే చదువు మానేశాడు. వ్యవసాయంలోకి దిగాడు.
సత్యం పద్ధతులు ఊళ్ళో వాళ్లకి అస్సలు నచ్చలేదు. అలివేలు తండ్రి రమణయ్య గారికైతే బొత్తిగా మింగుడు పడలేదు. సత్యం పనివాళ్ళ తరపున మాట్లాడతాడు, పాడి పశువుల యెడల దయతో మసలుకుంటాడు. అలివేలు, సత్యం మధ్యన చిన్ననాటి స్నేహం వాళ్ళతో పాటే పెరిగి పెద్దదయ్యి, వాళ్ళకే తెలియకుండా 'ప్రేమ'గా రూపాంతరం చెందింది. ఉన్నట్టుండి ఒకరోజు "కలిగిన వాళ్ళ కోసం వెతుకుతున్నాడంట గా మీ అయ్య? నిజమేనా?" అని అలివేలుని అడిగాడు సత్యం. "ఉన్న ఆస్తి చాలదూ మీకు?" అని కూడా అడిగాడు. అలివేలు కళ్ళనీళ్ళు చెప్పాయి జవాబుని.
ఉన్నట్టుండి సత్యానికి జమీందారు రంగారావు గారితో స్నేహం కుదిరింది. అది కూడా చాలా చిత్రంగా. ఆయన పక్కా కాంగ్రెస్ వాది. గాంధీ గారి శిష్యుడు. రంగారావు గారి ప్రభావంతో సత్యం కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధ పడ్డాడు. ఒకనాడు, ఆకుమళ్ళ రోజుల్లో, అలివేలూ, జానకీ కోడిగట్ల మీద కాళ్ళ గోరింటాకు కడుక్కుంటూ ఉండగా వచ్చాడు సత్యం. "మీ అయ్య గుణం నాకు నచ్చలేదు. కుమ్మరి ఆవం లో ఇత్తడి కుండ పుట్టినట్టూ నువ్వు పుట్టుకొచ్చావు ఆ పుణ్య శాలికి. అంతేగాని అతనికి డబ్బే దేవుడు. ఏమైనా సరే, అతనిని నేనుగాని, నా వాళ్ళు గాని వెళ్లి బ్రతిమాలతారన్న మాట బ్రహ్మ కల" ...అనేసి ఊరుకోలేదు..
"తీరా మేమడిగాక లేదూ కూడదని అతనంటే - నేనసలు ఉగ్గబట్టలేని మనిషిని. శ్రుతి మించుకొస్తుంది," అని ముక్తాయించాడు. మండుటెండల్లో లేగని వెతుక్కుని రాబోయి ఎండదెబ్బ తిన్నాడు సత్యం. అలివేలుకి దూరపు వేలు విడిచిన మేనరికం సంబంధం చూశారు. పెళ్లి పనులు జరుగుతున్నాయి. "సీతమ్మగారి కనిష్టుడి మాట నమ్మకం లేదంట మ్మా, గుణం కూడా పుట్టు కొచ్చిందంట!" ఈ మాటలు చెవిన పడంగానే అలివేలుకి కళ్ళు చీకట్లు కమ్మినాయి. యజ్ఞ పశువులా పెళ్లి సరంజాలన్నీ అనుభవిస్తోంది.
తర్వాత ఏం జరిగింది? ఈ ప్రశ్నకి సమాధానమే నిడుమోలు కళ్యాణ సుందరీ జగన్నాథ్ రాసిన 'చిఱు చెమటలు, చందనం' కథ!! డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం నాటి పల్లెటూరి వాతావరణం లోకి పాఠకులని అలవోకగా చేయిపట్టి తీసుకు పోగల కథన కౌశలం కళ్యాణ సుందరి సొత్తు. ఆమె కథా సంకలనం 'అలరాస పుట్టిళ్ళు' సంకలనం లో ఉందీ కథ. చదువుతున్నంతసేపూ కథా స్థలం చిరపరిచితం గా అనిపించినా, కథ పూరయ్యాక కూడా ఆ పాత్రలు వెంటాడినా అది కేవలం రచయిత్రి ప్రతిభకి ఓ చిన్న తార్కాణం మాత్రమే. 'మాడంత మబ్బు' లాంటి మంచి కథలెన్నో ఉన్న ఈ సంకలనం, చాలా ఏళ్ళ తర్వాత 'పాలపిట్ట' ప్రచురణలు ద్వారా మళ్ళీ అచ్చులోకి వచ్చింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి