మంగళవారం, ఫిబ్రవరి 12, 2013

ఎదురరయని వేళ...

పరిక్షలు రాసేశాం..పాసవుతామని కూడా నమ్మకమే..కానీ అప్పుడే వచ్చిన రిజల్ట్స్ లో మన నెంబర్ కనిపించిన క్షణంలో కించిత్తన్నా ఉద్వేగం కలగకుండా ఉంటుందా? ప్రమోషన్ వచ్చింది అన్న గాలివార్త అందడానికీ, ఆర్డర్ కాగితం చేతికి రాడానికీ మధ్య ఉండే తేడా... ఇది కూడా అంతే కదూ.. ఊహించనివి జరగడం కొన్నిసార్లు బాగుంటుంది...కానీ, ఊహించినవి జరగడం ఇంకా బాగుంటుంది.. ఎప్పుడూ కీడుని మాత్రమే ఎంచే వాళ్లకి మాత్రం, ఈ విషయంలోమినహాయింపు ఇవ్వాల్సిందే.

ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. ఊహలు నిజమవ్వడమూ బాగుంటుంది. కానైతే ఊహలో ఉండే అందం, నిజంలో ఉంటుందా? అంటే... అది తీసుకునే వాళ్ళనీ తీసుకునే తీరునీ బట్టి ఉంటుంది. ఏదో ఒక పెద్ద చదువునో, ఉద్యోగాన్నో లక్ష్యంగా ఎంచుకుని, దాన్ని సాధించడానికి అహరహం శ్రమ పడే వాళ్ళు, ఆ శ్రమని యెంతగానో ఆస్వాదిస్తారు. లక్ష్యాన్ని చేరుకున్నాక కూడా, అదే ఆనందం ఉంటుందా అంటే, జవాబు చెప్పడం కష్టమే. కోరుకున్నది దొరికినప్పుడు తృప్తి కలుగుతుంది. కానీ చాలామందికి కొంతకాలం పోయాక అసంతృప్తి మొదలవుతుంది.

లక్ష్యాన్ని చేరుకున్నాక, విజయాన్ని పూర్తిగా ఆస్వాదించే వాళ్ళతోపాటు, "ఇకమీదట ఏమిటి?" అని ఆలోచించే వాళ్ళూ ఉంటారు. అంతేకాదు, ఒక వృత్తిలోనో, ఉద్యోగంలోనో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు (డాక్టర్లు, లాయర్లు మినహా) ఎదుగుతున్న తమ పిల్లలు అదే రంగంలోకి రావడాన్ని ఆహ్వానించరు. కెరీర్ పట్ల వాళ్ళలో పేరుకున్న అసంతృప్తిని ఇందుకు కారణంగా చెప్పొచ్చు. "ఇందులో గ్రోత్ ఉండదు అని నేనే వద్దన్నా..." అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది అందుకే. ప్రపంచీకరణ కారణంగా అవకాశాలు పెరగడాన్ని కూడా గమనించాలి ఇక్కడ.

ఓ తరహా జీవితానికి అలవాటు పడి, మార్పుని ఏమాత్రమూ ఆహ్వానించలేని వాళ్లతో పాటు, అనుక్షణం మార్పుని కోరుకునే వాళ్ళూ కనిపిస్తారు మన చుట్టూ. నిజానికి ఇలా కోరుకునే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. మార్పు అనివార్యమనీ, ఆహ్వానించక తప్పదనీ చాలా సంస్థలు తమ ఉద్యోగులకి బోధిస్తున్నాయి. ఇలా బోధించడం కూడా ఓ కార్పోరేట్ స్థాయి వ్యాపారంగా విస్తరించిందీ అంటే, 'మార్పుని ఆహ్వానించడం' అన్నది ఎంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో అర్ధమవుతుంది.

మార్పన్నది ఎప్పుడూ వచ్చి పడిపోతూ ఉంటే ఇక ఎదురు చూపులూ, ఎదురరయని వేళలూ ఉండేది ఎప్పుడు? జీవితాల్లో పెరిగిపోయిన వేగం, ఎదురు చూపుని తగ్గించి వేస్తోందా? ముందు చూపు పెరగడంతో, ఎదురుచూపు అనవసరం అనిపిస్తోందా? ఆలోచించే కొద్దీ ఎన్నో ప్రశ్నలు. కానీ ఒకటి, దేనికోసమైనా సరే... ఎదురు చూపు బాగుంటుంది. మరీ ముఖ్యంగా కావాల్సింది దొరికేసినప్పుడు, వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిపోయిన ఎదురుచూపు అందంగా కనిపిస్తుంది. అసలైతే, ఎదురు చూడడం వల్లే సాధించుకున్నది మరింత ప్రియమైనదిగా అనిపిస్తుంది కూడా.

"బ్రతుకంతా ఎదురు చూచు... పట్టున రానే రావు... ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు.." అని నాయిక చేత పాడించారు భావకవితా చక్రవర్తి దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆ నాయికే, "దారిపొడవునా తడిసిన పారిజాతములపై...నీ అడుగుల గురుతులే నిలచినా చాలును" అంటుంది. యెంత అందమైన ఎదురుచూపో కదా అసలు.. ఎంతగానో ఎదురుచూసినా, ఊహించని సమయంలో యిట్టె వచ్చే అట్టే వెళ్ళిపోతాడు అనడంతో పాటు, అతడు వచ్చి వెళ్ళిపోయినా, ఆ పాదముద్రలు చాలు అంటోంది ఆమె. ఎదురరయని వేళల్లో ఎదురయ్యే అనుభవాలు అనేకాలు కదూ మరి..

6 కామెంట్‌లు:

  1. ఎంత బావుందో టపా..
    నిజమే ఎదురుచూపుల మధురిమలు తగ్గిపోతున్నాయి..ముఖ్యంగా బంధాలలో ..

    రిప్లయితొలగించండి
  2. ఈ పోస్ట్, మీ బ్లాగ్, బ్లాగ్ పేరూ.. చాలా బావున్నాయండీ :)

    రిప్లయితొలగించండి
  3. ఎదురుచూపు ఫలించినందుకు సంతోషమే! కానీ ఎదురుచూసి, దక్కించుకున్నదాన్ని పదిలంగా దాచుకోవడం చాలా ముఖ్యం. సొంతమైపోయిందనే ధీమా నిర్లక్ష్యంగా మారిపోకుండా.. :)

    రిప్లయితొలగించండి

  4. "ఇకమీదట ఏమిటి?"

    ఇదే ప్రశ్న ఒక విధంగా మనిషిని నడిపిస్తుంది .. ఏడిపిస్తుంది కూడా.

    ఇక మీద ఏమీ లేని స్థితి చేరే వరకు ఈ ప్రశ్నకు జవాబు లేదు ..

    మీద ఏమీ లేనిది వెతుక్కోవడమే తత్వచింతనేమో ..

    ఏమిటో ..

    రిప్లయితొలగించండి
  5. @ధాత్రి: ధన్యవాదాలండీ...

    @ప్రియ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @చాణక్య: కోట్లకి విలువైన మాట చెప్పారు... ఎందరు పాటిస్తారో తెలియదు కానీ... .... ధన్యవాదాలు

    @వాసు: నిజమే కదండీ.. ...ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి