మంగళవారం, ఫిబ్రవరి 05, 2013

కాశ్మీర పట్టమహిషి

కాశ్మీర రాజ్యాన్ని ప్రతాపాదిత్య చక్రవర్తి పాలిస్తున్న కాలం. రాజధాని కాశ్మీర నగరంలో పేరుమోసిన వజ్రాల వర్తకుడు నోణక శ్రేష్ఠి. చక్రవర్తికే అప్పు ఇవ్వగల కుబేరుడు ఆ వ్యాపారి. నోణకశ్రేష్ఠి భార్య నరేంద్ర ప్రభ. చామన ఛాయలో ఉండే ప్రభది చూడగానే ఆకర్షించే సౌందర్యం. పైగా ఆమె వీణా వాదంలోనూ, నృత్యంలోనూ దిట్ట. అతిధి మర్యాదలు ఎవరైనా సరే ఆమె దగ్గర నేర్చుకోవాల్సిందే. వ్యాపారం వినా మిగిలిన విషయాలు శ్రేష్ఠికి ఏమంత ఆసక్తి కలిగించవు. అయితే, భార్య సంగీత, నృత్య సాధనకి అతను అడ్డు చెప్పడు.

పెళ్లై ఏళ్ళు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో చింత మొదలవుతుంది శ్రేష్ఠిలో. "తమకి ఇంకా వయసు అయిపోలేదు కదా" అన్న ధోరణి ప్రభది. అయితే, రాను రానూ శ్రేష్ఠిలో అసంతృప్తి పెరగడం గమనించిన ప్రభ, తన దూరపు బంధువు కమలాలయని ఇచ్చి శ్రేష్ఠికి ద్వితీయ వివాహం దగ్గరుండి జరిపించింది. కమలాలయ కాపురానికి వచ్చినా, ప్రభమీద ఇష్టం తగ్గలేదు శ్రేష్ఠికి. కమలాలయ కూడా ప్రభకి విధేయంగానే ఉంటుంది కొంతకాలం. అయితే, రోజులు గడిచేకొద్దీ శ్రేష్ఠిని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

సరిగ్గా ఇదే సమయంలో, చక్రవర్తి ప్రతాపాదిత్యుడు నోణక శ్రేష్ఠి దగ్గర వజ్రాలు కొనాలని సంకల్పిస్తాడు. శ్రేష్ఠిని తన ఆస్థానానికి పిలిపించడానికి బదులు, తనే ఆ వ్యాపారి ఇంటికి బయలుదేరతాడు. చక్రవర్తే స్వయంగా తన ఇంటికి వస్తున్నాడని తెలిసిన శ్రేష్ఠి ఆనందానికి హద్దులు ఉండవు. పెరగబోయే తన పరపతీ, వ్యాపారం తల్చుకుని తనకి దశ తిరిగిందని సంబరపడతాడు. నరేంద్ర ప్రభ ఆధ్వర్యంలో అతిధి మర్యాదలు ఘనంగా జరుగుతాయి. వచ్చినవాడు చక్రవర్తి కదా మరి. చక్రవర్తి గౌరవార్ధం తన వీణ మీద కచేరీ చేస్తుంది ప్రభ. పరవశుడైన చక్రవర్తి ఆమెకో విలువైన హారాన్ని బహుమతిగా ఇస్తాడు.


అది మొదలు, శ్రేష్ఠి ఇంటికి చక్రవర్తి రాకపోకలు పెరుగుతాయి. చక్రవర్తే స్వయంగా విలువైన వజ్రాలు ఎన్నో కొనడంతో పాటు, ప్రభువు మనసెరిగిన రాజ బంధువులూ నోణక శ్రేష్ఠి దగ్గరే విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం మొదలు పెట్టడంతో, ఊహించిన కన్నా వేగంగా శ్రేష్ఠి వ్యాపారమూ, పరపతీ కూడా పెరుగుతాయి రాజధాని నగరంలో. చక్రవర్తి వచ్చిన ప్రతిసారీ, తనకి ఇష్టం ఉన్నా లేకున్నా కచేరీ ఇవ్వక తప్పదు నరేంద్ర ప్రభకి. చక్రవర్తి, ప్రభపై మనసు పడ్డాడని అనుమానిస్తుంది కమలాలయ. అయితే, పెదవి విప్పి భర్తతో చెప్పదు.

వ్యాపారాన్ని రెట్టింపు చేసుకునే ప్రణాళికలు రచించడంలో శ్రేష్ఠి తలమునకలై ఉండగా, ఉన్నట్టుండి చక్రవర్తి రాకపోకలు నిలిచిపోతాయి. వజ్రాల కొనుగోళ్ళు తగ్గుముఖం పట్టి, రానురానూ లేకుండా పోతాయి. ఏం జరిగిందో శ్రేష్ఠికి అర్ధం కాదు, కానీ ఇదేపరిస్థితి కొనసాగితే మాత్రం తను త్వరలోనే వ్యాపారం మూసేయాల్సి వస్తుందని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. చక్రవర్తి దర్శనానికి ప్రయత్నాలు చేసి భంగపడ్డ శ్రేష్ఠి, ప్రధానమంత్రి శివశర్మ ని కలిసి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. మంత్రి ద్వారా తెలిసిన కబురు విని నిశ్చేష్టుడు అవుతాడు శ్రేష్ఠి.

చక్రవర్తి, నరేంద్ర ప్రభతో పూర్తిగా ప్రేమలో మునిగిపోయి ఉన్నాడనీ, కానీ ధర్మం తప్పని వాడు అవ్వడం వల్ల, తనలో తను వేదన పడుతున్నాడనీ, ఆ కారణానికే శ్రేష్ఠిని పూర్తిగా దూరం పెట్టాలని భావించాడనీ, ప్రధానమంత్రి ద్వారా విన్న నోణక శ్రేష్ఠికి గొంతు తడారిపోతుంది. చివరికి తేరుకుని, రాత్రివేళ చక్రవర్తి తన భవంతికి వస్తూ పోతూ ఉండ వచ్చనీ, అలా కాని పక్షంలో నరేంద్ర ప్రభని తను అంతఃపురానికి రహస్యంగా పంపగలననీ మంత్రికి ప్రతిపాదించి, భంగ పడతాడు. నోణక శ్రేష్ఠి, ప్రభకి విడాకులు ఇచ్చి ఆమెని అంతఃపురానికి సమర్పించవచ్చుననీ, అది ధర్మబద్ధమనీ సూచిస్తాడు శివశర్మ.

చక్రవర్తికి తనమీద ఏర్పడిన ప్రేమ కారణంగా, నిశ్చలంగా సాగిపోతున్ననరేంద్ర ప్రభ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు పర్యవసానాలు ఏమిటన్నదే, పిలకా గణపతి శాస్త్రి నలభై ఆరేళ్ళ క్రితం రాసిన 'కాశ్మీర పట్టమహిషి' నవల. పిలకా వారి రచనల్లో 'విశాల నేత్రాలు' తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో నవల ఇదే. కల్హణ కాశ్మీర తరంగిణి ని ఆధారం చేసుకుని ఈ నవలతో పాటు, 'చైత్ర పూర్ణిమ' పేరిట శాస్త్రి గారు వెలువరించిన కాశ్మీర కథల సంకలాన్ని కలిపి ప్రచురించింది ఎమెస్కో. నవలతో పాటు, కథలు కూడా పాఠకులని కాశ్మీర వీధుల్లో తిప్పి తీసుకువచ్చేవే.(పేజీలు 288, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

  1. చదవాలి ఈ పుస్తకం. పరిచయం బాగుందండీ, ఎప్పటిలాగే :))

    రిప్లయితొలగించండి
  2. @హరిచందన: ధన్యవాదాలండీ...

    @నారాయణస్వామి: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  3. నరేంద్ర ప్రభ కథ మీద మీ విశ్లేషణ బాగుంది. ఈ స్త్రీ భర్త మీద ఎంత ప్రేమ , అభిమానం పెంచుకొని దగ్గరుండి వివాహం జరిపించింది కదా అనిపించింది. అటువంటి భార్యనే చక్రవర్తికి అర్పించడం లో నోణక శ్రేష్ఠి పాత్ర గుణం ఎంత కుత్సితమైనదో తెలుస్తుంది. ఎమెస్కో వారు ఈ మధ్య మంచి చారిత్రిక ప్రాధాన్యత ఉన్న రచనలనే ప్రచురిస్తున్నారు. పిలకా గణపతి శాస్త్రి గారి రచనలు తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి