గురువారం, సెప్టెంబర్ 13, 2012

మిస్డ్ కాల్

చారులత-జగన్ ఒకరికొకరు చాలా చిత్రంగా పరిచయమయ్యారు. వాళ్ళిద్దరూ తలో పనిమీదా అరకు వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి ఘాట్ రోడ్డు పాడైపోడం, రైలు మినహా ఇతరత్రా ప్రయాణ మార్గాలు మూసుకుపోడంతో, ఇద్దరూ కలిసి ఓ రాత్రి అరకులోయలో గడపాల్సి వచ్చింది. వాల్తేరు పాసింజర్ మిస్సైన కాసేపటికే, తనను చూసిన పెళ్ళికొడుకు శ్రీరామ్ కి తను నచ్చాననీ, మరో రెండు రోజుల్లో విశాఖపట్నంలోనే తన పెళ్లనీ తెలుస్తుంది చారులతకి. పెళ్ళైన వారానికే శ్రీరామ్ తో కలిసి అమెరికా వెళ్లిపోవాలి. పెళ్ళి చూపుల్లోనే శ్రీరామ్ నచ్చాడు కాబట్టి, ఆ సంబంధం ఇష్టమే చారులతకి.

భద్రాచలం వెళ్ళాల్సిన జగన్ కూడా, రైలు మిస్సై అరకు ప్లాట్ఫాం మీద మిగిలిపోతాడు. అదిగో, అప్పుడు చారులత తారసపడుతుంది అతనికి. ఆ వెన్నెల రాత్రి ఆ ఇద్దరూ కలిసి అరకు అంతా కలియతిరుగుతారు. ఓ స్మశానానికి వెళ్లి మంగభాను సమాధి చూడడం మొదలు, ఓ చోట బోనులోనుంచి తప్పించుకున్న కుందేళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసి ఓడిపోయి, స్థానికంగా జరుగుతున్న ఓ జాతరలో రికార్డింగ్ డేన్స్ చూసి, ఆ పై అరకు ట్రైబల్ మ్యూజియం చూసి బయటికి వస్తారు ఇద్దరూ.

ఏ పని చేస్తున్నా శ్రీరామ్ ని తలచుకుంటూనే ఉంటుంది చారులత. అతనెంత మంచి వాడో, గొప్పవాడో కథలు కథలుగా చెబుతుంది జగన్ కి. కాబోయే భర్తని అంతగా ప్రేమిస్తున్న చారులత మీద గౌరవం కలుగుతుంది జగన్ కి. అనుకోకుండా, మైథునం లో మునిగి ఉన్న ఓ జంట ఈ ఇద్దరి కంటా పడుతుంది.జగన్ లో కలిగిన ఆవేశం, శ్రీరామ్ గుర్తు రావడంతో చప్పున చల్లారుతుంది. ఖాళీగా ఉన్న బస్టాండ్ ఆవరణలో, జగన్ మ్యూజిక్ స్టిక్ నుంచి వస్తూన్న లయకి అనుగుణంగా నాట్యం చేస్తున్న చారులత ఉన్నట్టుండి వైన్ తాగాలని ఉందన్న కోరికని బయట పెడుతుంది.


జగన్ మీద ఆసరికే అధికారం చలాయించడం మొదలుపెట్టిన చారులత, అతన్ని కోరివచ్చిన ఓ గిరిజన యువతిని కొట్టినంత పని చేస్తుంది. అతన్ని కోప్పడుతుంది. 'ఏమిటీ అధికారం?' అన్న అతని ప్రశ్నకి, జవాబు లేదు ఆమె దగ్గర. ఓ రెడ్ వైన్ బాటిల్ తీసుకుని చెరిసగం తాగిన జగన్, చారులతలకి చలి తెలుస్తుంది. ఒకే శాలువాలో ఇద్దరూ సద్దుకుంటారు. మత్తెక్కిన జగన్ 'నాగ మల్లివో, తీగ మల్లివో, నీవే రాజకుమారి..' పాట అందుకుంటాడు. ఏమిటేమిటో మాట్లాడతాడు. ఆ క్షణంలో శ్రీరామ్ గుర్తురాడు..అతనికే కాదు, ఆమెకి కూడా.

మరునాడు ఉదయం ఎవరి గమ్యం వాళ్ళు చేరుకుంటారు, కనీసం చిరునామాలు మార్చుకోకుండా. తొమ్మిదేళ్ళ తర్వాత అనుకోకుండా ఒకరికి ఒకరు మళ్ళీ తారసపడతారు, ఓ పుస్తక ప్రదర్శనలో. అమెరికాలో స్థిరపడిన జగన్, తెలుగు నవలా రచయితగా పేరు తెచ్చుకుంటాడు. అరకు నేపధ్యంగా, చారులత కథానాయికగా అతను రాసిన తొమ్మిది నవలలూ చాలా పాపులర్ అవుతాయి. పుస్తక ప్రదర్శన వేదిక మీద అతని తాజా నవల ఆవిష్కరణ జరిగాక, ప్రేక్షకుల్లో ఉన్న చారులతని గుర్తు పట్టి పలకరిస్తాడు. ఓ గంటలో ఫ్లైట్ అందుకోవాల్సిన జగన్, దగ్గరలో ఉన్న ఆమె ఇంటికి వెడతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే వంశీ రాసిన 'మిస్డ్ కాల్' కథ.

వెన్నెల రాత్రి అరకు అందాలని వంశీ వర్ణించిన తీరు, మరీ ముఖ్యంగా చారులత పాత్ర ఈ కథకి బలం. భాషా భేదం లేకుండా సినిమాలు చూసే మిత్రులొకరు ఈ కథ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. 'బిఫోర్ సన్రైజ్'  'బిఫోర్ సన్సెట్' అనే రెండు ఇంగ్లిష్ సినిమాల కథల్ని తీసుకుని, నేపధ్యాన్ని అరకుకు మార్చి వంశీ ఈ కథ రాసేశారని. హాలీవుడ్ సినిమాలు విడవకుండా చూసే మరో ఫ్రెండ్ ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయినప్పటికీ, నేటివిటీ కూర్పుని అభినందించాల్సిందే అనిపించింది నాకు. వంశీ 'ఆకుపచ్చని జ్ఞాపకం' సంకలనంలో ఉందీ కథ. (ఇలియాస్ ఇండియా ప్రచురణ, పేజీలు 360, వెల రూ. 350, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

11 కామెంట్‌లు:

  1. nenu vamsi gaari abhimaanini. mi post chadivaaka eppudeppudu ee katha ni chaduvuthaana anipistondi.
    Thanks for sharing.

    రిప్లయితొలగించండి
  2. నా దగ్గర ఒక ' ఆకుపచ్చ జ్ఞాపకం ' వుందండీ . అందుల ఈ కథలేదు.
    అరకు అందాలను వంశీ బాగా వర్ణిస్తాడు. కొండలు, చెట్లు, గాలి, రైల్వే ట్రాకు ....బావుంటాయి. కథ చదువుతున్నట్టుగా కాక అరకు ట్రిప్ వెళ్ళినట్టుగా అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. మంచి కథని పరిచయం చేశారు మురళి గారు. వంశీ ఓ దశలో ఈ కథని సినిమా గా తీయలనుకొన్నారు. శివాజీ హీరోగా. కుదరలేదు.

    రిప్లయితొలగించండి
  4. ఈ వంశీ అవే కథల్ని మరికొన్ని కథలతో కలిపి కొత్తకొత్త డిజైన్లతో కథాసంకలనాలని తెస్తూ చావగొడ్తున్నాడు అభిమానుల్ని. కొనాలేం.. మానాలేం.

    రిప్లయితొలగించండి
  5. మీరు బాగా ప్రొఫెషనల్ అయిపోయారు. ఇలాంటి నోరూరించే రివ్యూ లు రాయడంలో చెయ్యి తిరిగిన పెద్ద మనిషి మా 'నెమలికన్ను మురళి'.

    రిప్లయితొలగించండి
  6. @ఉష శ్రీ: ధన్యవాదాలు..
    @లవ్ అకౌంట్స్: బావుందండీ కథ... తప్పక చదవండి.. ధన్యవాదాలు..
    @లలిత: మీ దగ్గర ఉన్నది ఎమెస్కో వాళ్ళు వేసిన పాకెట్ సైజు కథా సంకలనం 'ఆనాటి వాన చినుకులు' అయి ఉంటుందండీ.. అందులో 'ఆకుపచ్చని జ్ఞాపకం' పేరుతొ ఓ కథ ఉంది.. ఇది కొత్త సంకలనం.. 'ఆనాటి వాన చినుకులు' సంకలనం లో కథలకి మరికొన్ని కథలని కలిపి బాపూ బొమ్మలతో రిలీజ్ చేశారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @చక్రవర్తి: అవునా!! కొత్త విషయం అండీ... తీస్తారేమో మరి.. 'వంతెన' కథ గురించి కూడా ఇలాగే వింటున్నా... 'అంజలి' హీరోయిన్ గా తీస్తారని.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: నాదీ అదే సమస్య అండీ... పైగా ఒక్కో పుస్తకం మామూలు బైండు, హార్డ్ బౌండ్.. నలుపు-తెలుపుల్లో, రంగుల్లో.. ఇలా రకరకాల కాంబోలు.. పైగా ఒక దాని తర్వాత మరొకటి వస్తాయి మార్కెట్లోకి.. ధన్యవాదాలు.
    @ది ట్రీ: చాలా ఆలస్యంగా, మీక్కూడా శుభాకాంక్షలండీ..

    రిప్లయితొలగించండి
  8. @లాస్య రామకృష్ణ: మీకు చాలా ఆలస్యంగా శుభాంక్షలు మరియు ధన్యవాదాలండీ...
    @హరీష్: అవునా!! 'లీప్ ఇయర్' సంగతి తెలియదండీ నాకు.. కనుక్కోవాలి.. ధన్యవాదాలు..
    @సుజాత: ముగింపు చెప్పనందుకేనా మీకు ఇంత ఖోపం వచ్చేసిందీ? :-) :-) ... ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి