శుక్రవారం, సెప్టెంబర్ 07, 2012

శ్రద్ధాంజలి

సుమన్ బాబూ,

నీ కోసం మొదలు పెట్టిన సిరీస్ ని ఈ టపాతో ముగిస్తానని అనుకోలేదయ్యా.. నీ అనారోగ్యం సంగతి తెలిసి బాధ పడినా, తలచుకుంటే దేనినైనా సాధించ గల మీ నాన్నగారి తాహతు గురించి తెలిశాక, నువ్వు వైద్యం చేయించుకుని, కళకళలాడుతూ మీ టీవీ తెరమీద కనిపిస్తావనే ఆశ పడ్డాను. నీకు తెలుసా? నువ్వు లేవనే వార్తని మీ పత్రిక కన్నా ముందే, భూగోళానికి అవతలిపక్క ఉన్న నా స్నేహితులు చెప్పారు. కనీసం ముఖ పరిచయం లేని వాళ్ళనీ, నన్నూ కలిపిన వాటిలో నువ్వూ ఉన్నావన్న సంగతి జ్ఞాపకం వచ్చి, కలుక్కుమనిపించింది.

మీ పేపర్లో నువ్వు రాసిన నవలలు కొనుక్కోమని వచ్చే ప్రకటనల ద్వారా నువ్వు మొదట పరిచయం నాకు. తర్వాత, మీరో టీవీ చానల్ పెట్టడం, కాల క్రమేణా దానికి అన్నీ నువ్వే కావడం మా కళ్ళ ముందే జరిగిపోయింది. మొదట్లో మీ చానల్లో వచ్చే ప్రతి కార్యక్రమాన్నీ విడిచి పెట్టకుండా చూశాను. పరిమితంగా కార్యక్రమాలు చూపించే దూరదర్శన్, జెమినిల తర్వాత రోజులో ఎక్కువ భాగం కార్యక్రమాలు, ఎక్కువగా సినిమా ఆధారిత కార్యక్రమాలని ప్రసారం చేసేది మీ చానల్.

అయితే సుమన్ బాబూ, నిన్ను కొంచం పరికించి చూసింది మాత్రం 'అంతరంగాలు' టైం లోనే. అప్పుడే కదూ, ఆ 'సీరియల్ సృష్టికర్త' వైన నీతో ప్రత్యేక ఇంటర్యూలు వచ్చిందీ. 'గుండెకీ సవ్వడెందుకో...' పాటని అరకు లో చిత్రీకరిస్తే 'ఆహా' అనుకున్నాను. రాన్రానూ నీ సీరియళ్ళు ఒకే మూసలో పోసినట్టు ఉండడం మొదలయ్యింది. 'అనుబంధం' 'అందం' 'కళంకిత' తరవాత నేను సీరియస్ గా చూసింది లేదనే చెప్పాలి. అయినప్పటికీ, ఆయా సీరియళ్ళ ప్రత్యేక ఎపిసోడ్లలో నువ్వు కనిపిస్తే మాత్రం మిస్సవ్వ లేదనుకో.

ఉన్నట్టుండి ఓ అలజడి సృష్టించావు. 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' అన్నావు. నువ్వే కృష్ణుడివి అన్నావు. ఒంటికి నీలం రంగూ, తలపై కిరీటం, నెమలిపించం, ధగద్ధగాయమైన దుస్తులూ, ఆభరణాలూ.. మీ పేపర్లో స్టిల్స్ చూసి, ఆ టెలి ఫిలిం చూసి తీరాల్సిందే అనుకున్నాను. చూశాను. నా స్నేహితుల్లో కొందరు మీ నాన్నగారికి వీరాభిమానులయ్యా. "అందరూ పిల్లలకి ఆడుకోడానికి బొమ్మలు కొని పెడితే, ఫలానా ఆయన ఏకంగా ఓ టీవీ చానల్నే కొడుక్కి ఇచ్చేశారు" అని నిష్టూరాలు ఆడారు.

ఎవరెన్ని అనుకోనీ, నువ్వు నాకు నచ్చావు. నిజం చెబుతున్నాను. నీ టాలెంట్ మీద నీకున్న నమ్మకం నాబోటి వాడికి ఎప్పుడూ ఆశ్చర్యమే. ఏ పనన్నా మొదలు పెట్టే ముందు, 'ఇది నేను చెయ్యగలనా?' అని ఆలోచనలో పడి, వెనకడుగు వేసే వాళ్లకి నువ్వో స్ఫూర్తి. ఇదే మాట నా మిత్రులతో అంటే కొందరు ఒప్పుకున్నారు, మరి కొందరు వాదించారు. నీమీద నీకున్న నమ్మకమే నీ చేత సినిమాలూ, టెలి ఫిల్ములూ తీయించింది. ఇప్పుడు కలికంలో కూడా కనిపించని తెలుగు పంచ కట్టునీ, పట్టు పరికిణీలనీ బుల్లి తెరకి ఎక్కించావు. నీకు చేతైనంతగా హాస్యానికి పెద్ద పీట వేశావు.

ఇంటిగుట్టుని నీ ప్రత్యర్ధి పత్రికలో బయట పెట్టిన్నాడు మాత్రం బాధ కలిగిందయ్యా. అప్పటి నీ ఇంటర్యూలో కూడా నిన్ను నువ్వు ఒక కళాకారుడి గానే చూసుకున్నావు. నీ తండ్రిని పెట్టుబడి దారుగా మాత్రమే చూశావు. 'కళ' పట్ల నీ కమిట్మెంట్ అర్ధమయినట్టే అనిపించింది. నీ ఆసక్తులని మీ ఇంట్లో వాళ్ళు కొంచం ముందుగానే గుర్తించి ఉంటే, పరిస్థితి మరోవిధంగా ఉండేదేమో అనుకున్నాను. ఎవరేమన్నా అనుకోనీ, నువ్వు అనుకున్నది చేయకుండా వెనక్కి తగ్గలేదు. నీ పేరు చెప్పుకుని అనేకమంది కడుపు నింపుకున్నారు.

నా మిత్రులు కొందరు నిన్ను కోప్పడే వాళ్ళు. మీ నాన్నగారి పేరు పాడు చేస్తున్నావని. ఎందుకో తెలియదు, ఎన్ని జరిగినా నీ మీద నాకెప్పుడూ కోపం రాలేదు. చాలా స్వచ్చంగా అనిపించేవాడివి నువ్వు. నీ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో, నువ్వు తీసిన సీరియళ్ళు, సినిమాలు, టెలి ఫిల్ములు చూసిన వాడిగా ఓ అంచనాకు రాగలను కదా. ఇప్పుడు నువ్వు లేవనే వార్త. నమ్మలేకపోయాను.. కానీ నమ్మక తప్పని నిజం. సుమన్ బాబూ, నీమీద నీకున్న విశ్వాసానికీ, అనుకున్నది చేసి తీరిన నీ పట్టుదలకీ మరోమారు జోహారు..

50 వ్యాఖ్యలు:

రాజ్ కుమార్ చెప్పారు...

తను సీరియస్ గానే చేసినా, మనం కామెడీగానే చూసినా,
తను అనుకున్నది చేసి చూపించాడండీ.

తన మీద కామెడీ చేసి, లోకువ కట్టేసి వ్యంగ్య రివ్యూలు రాసిన నాకు ఈ బ్లాగ్ లోకం లో గుర్తింపు ఇచ్చింది, ఇంత మంది స్నేహితులని ఇచ్చిందీ అతనే.

సుమన్ బాబు ఆత్మకి శాంతి కలుగుగాక.

Ravi Kumar Neti చెప్పారు...

ఇప్పుడే ఈనాడు లో చదివి .. మీరు ఏమైనా రాసారేమో చూద్దాం అని ఓపెన్ చేశాను మురళి గారు ..
చాల ఫాస్ట్ గా ఉన్నారు .. :)

sai krishna alapati చెప్పారు...

ఎంతో మంది గొప్ప వాళ్ళ పిల్లల కంటే సుమన్ చాల మంచి వాడె . తను కళల మీద పడ్డాడు ఎవరికీ ఐన సహాయం చేసాడు తప్పితే ఎవరిని చెడ గొట్టాడు అన్న మాట లేదు . ఎంతో ఆస్థి ఉన్న మనిషి నిమిత్త మాత్రుడు అన్న దానికి ఒక ఉదాహరణ . ఈ వయసులు లో రామోజీ రావు గారికి కలిగిన పెద్ద కష్టం . సుమన్ ఆత్మ కి శాంతి కలగాలి అని కోరుకొంటూ .

Anjaas చెప్పారు...

I expected this post from you. I am great fan of ramoji sir. May his soul rest in peace.

Ramani Rachapudi చెప్పారు...

ఇతని గురించి జోక్స్ వేసినప్పుడు నవ్వుకునేదాన్ని కనీసం అలా నవ్వించడానికి కూడా సుమన్ లేరు అంటే బాధ అనిపిస్తోంది.. RIP

అజ్ఞాత చెప్పారు...

హుమ్మ్...ఇప్పుడే తెలిసిందండీ. నా బ్లాగు ముఖంగా సుమన్ కి సారీ చెప్పుకున్నాను.
ప్రియమైన శత్రువు లా మన మనసుల్ని దోచుకున్నాడు సుమన్.

రాజి చెప్పారు...

"చాలా స్వచ్చంగా అనిపించేవాడివి నువ్వు"
సుమన్ గురించి మీరు చెప్పింది నిజమేనండీ..

టీవీలో ఈ వార్త చూడగానే ముందు మీ బ్లాగే గుర్తొచ్చింది నాకు..

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఎంత నవ్వుకున్నా..సుమన్ లోని అమాయకత్వం నాకు నచ్చేది. చిన్న పిల్లవాడి మనస్తత్వంలా అనిపించేది. అమాయకత్వంతో పాటు ఆత్మ విశ్వాసం..తను చేసే పని మీద తనకి నమ్మకం..పట్టుదల...ఓ మంచి వ్యక్తి అనిపించేవాడు. తను మనందరికి ఏదో ఒకరకంగా అహ్లాదాన్నే కలిగించాడు. తన కళల ద్వారా మరో నలుగురికి బ్రతుకు తెరువు కలిపించాడు తప్ప ఎవరికీ హాని చెయ్యలేదు. RIP Suman!

Sandeep చెప్పారు...

తను అన్నీ మొండిగా, మూర్ఖత్వంతో చేస్తున్నాడు అనుకునేవాడిని. పాపం పట్టుదలతో, తన జీవితం ముగిసేలోపల చేద్దామనుకున్నాడు అని ఇప్పుడు అర్థమైంది. ఈనాడు (channel లోనే కాదు, "ఈ రోజుల్లో" కూడా) TV లో తెలుగుదనం ఇంకా బ్రతికుంది అంటే దానికి సుమన్ చేసిన ప్రయత్నం ఎంతో ఉంది. నేనూ సుమన్ ని అప్పుడప్పుడు వెటకారం చేసాను కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఆ పత్రిక interview కి నాకూ చాలా బాధ కలిగింది. సుమన్ మీద కోపం వచ్చింది కానీ...దానికి, పరాయి వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని కేవలం వ్యాపారలబ్ధి కోసం ప్రచురించిన విలువల్లేని పత్రికనే ఎక్కువగా నిందించాలి.

Sujata చెప్పారు...

నాకూ వార్త తెలిసిన వెంటనే చాలా బాధ కలిగింది. రాన్రానూ సుమన్ మనల్ని వొదలకుండా కళాపోషణ చేసి మనల్ని చంపేస్తున్నాడంటూ మనమెన్ని జోకులేసుకున్నా, ఈ రోగు ఓ మాట గుర్తొచ్చింది. ఆయన ఏవన్నా చెయ్యనీ, 'నీట్' (gentlemanly) గా పని చేసాడు. పాప్యులారిటీ కోసం, అడ్డ తోవలు తొక్కలేదు.

నివాళులు.

buddha murali చెప్పారు...

సాధారణంగా సంపన్నుల పిల్లలకు తెలుగు భాష , సంస్కృతి , నటన పట్ల ఆసక్తి ఉండదు . ఇతర వ్యవహారాలు ఎక్కువ కానీ దీనికి భిన్నంగా సుమన్ కు కళల పట్ల చాలా ఆసక్తి . తండ్రి నాస్తికుడు , గురువు నాస్తికుడు అతనికి దైవ భక్తి ఎక్కువ విచిత్రమే . అతని ఆత్మ శాంతించాలని కోరుకుందాం

జాహ్నవి చెప్పారు...

రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి తండ్రి అయినా...మిగిలిన వారిలా ఎప్పుడూ ప్రజల సొమ్ము స్వాహా చేయలేదు. ఎంతో కొంత హాస్యాన్ని మనకి అందించాడు. తెలుగుదనాన్ని చూపించాడు.
ఏంటో అతను మరణించాడని తెలిశాక చాల భాధగా ఉంది.
సుమన్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

Sunita Manne చెప్పారు...

జీవితమంటే ఇంతేనేమో....డబ్బుతో సాధించలేనిది ఏదీ అంటే బ్రతుకే....ఒకవేళ అది సాధ్యమే ఐతే మనం ఇంకో సుమన్ సినిమా రివ్యూ పంచుకుని నవ్వుకునేవాళ్ళం ఏమో:(((

ఆ.సౌమ్య చెప్పారు...

చాలా బాధగా ఉంది నిజంగా...మనసులో ఏమూలో గుండె మెలిపెడుతోంది....అతన్ని చూసి నవ్విన నవ్వులు, చేసిన కామెంట్లు గుర్తొచ్చి కాబోలు.

ఈటీవీ సుమన్ బాబు ఆత్మ శాంతించుగాక. 45 అంటే చాలా చిన్న వయసు. అంత చిన్న వయసులో ఎన్ని సాధించాడో! కొండవీటి నరసకవి దగ్గర శిష్యరికం చేసాడట. డి.వి నరసరాజు గారి దగ్గరా స్క్రీన్ ప్లే నేర్చుకున్నాట్ట. కార్టూనిస్ట్ శ్రీధర దగ్గర మెళుకువలు నేర్చుకున్నాట్ట. ఎన్ని విద్యలు, ఎన్ని కళలు!! ఎవరేమనుకున్నా మనసుకు నచ్చినట్టు జీవించాడు.

మనిషి మనస్తత్వం ఎంత విచిత్రమైనదో కదా!! ఉన్ననాళ్ళు జోకులు వేసుకున్నాం. పోయాక చాలా బాధపడుతున్నాం...హేవిటో!!

సుమన్ బాబు కి అస్సలు టేలంట్ అంటూ లేకపోలేదు. అతని సీరియళ్ళు ఒక మూసలో పడిపోయాక, నటన మొదలెట్టాక అతని మీద జోకులు మొదలయ్యాయిగానీ అంతరంగాలు, స్నేహ, అందం ఈ సీరియల్స్ వచ్చేటప్పుడు అన్ని రంగాల్లోనూ అతని పేరు చూసి అబ్బురపడేదాన్ని. అబ్బ ఎంత టేలెంట్ మనిషికి! అనిపించేది.

నాకు నచ్చే అంశం అతని బొమ్మలు. చాలా బాగా వేస్తాడు. మంచి ఆర్టిస్టు. అలాగే అతని పాటలు. మొదట్లో చాలా బాగుందేవి. "అంతరంగాలు, అనంత మానస చదరంగాలు, అంతే యెరగని ఆలోచన సాగరాలు". ఈ వాక్యాలు చూసి భలే రాసాడే అనుకునేదాన్ని చాలాసార్లు.

సీరియల్స్ అన్నీ ఎంత దిగజారిపోయినా ఈటీవీ సీరియల్స్ మాత్రం తమిళ వాసన లేకుండా తెలుగులా అనిపిస్తాయి ఇప్పటికీ.

ఆ.సౌమ్య చెప్పారు...

వింతేమిటంటే అతను బతికున్నప్పుడు ఈ విషయాలు ఒక్కసారి కూడా స్ఫురణకి రాలేదు...మాన నైజం ఇంతేగాబోలు! మనిషి మెదడు ని అర్థం చేసుకోవడం మనిషి తరం కూడా కాదు కాబోలు!

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

తమిళ సీరియళ్ళు తెలుగులోకి అనువదింపబడి రాజ్యమేలుతున్న రోజుల్లో అచ్చమైన తెలుగు సీరియళ్ళు తీసి తనకూ , తన సీరియల్లకూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఎందరినో ప్రోత్సహించి, ఎందరికో జీవనోపాధి కలిపించిన అతడు అభినందనీయుడు. సుమన్ ఆత్మకు శాంతి చేకూరుగాక!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

"సుమన్ బాబూ, నీమీద నీకున్న విశ్వాసానికీ, అనుకున్నది చేసి తీరిన నీ పట్టుదలకీ మరోమారు జోహారు.."

డిట్టో..
హడావిడిగా ఇన్నిపాత్రలు ఇన్నిసినిమాలు చేస్తున్నాడు ఎవిటీతనికి ఇంత తొందరా అని నవ్వుకున్నందుకు సారీ సుమన్..

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మనిషి పోయిన తర్వాతే ఆయన చేసే మంచి పనులు గుర్తుకొస్తాయి.నటుడిగా ప్రజలనిబ్బంది పెట్టినా తద్వారా ఎంతో మంది కళాకారులకు బ్రతుకునిచ్చాడు.తెలుగు భాషాభిమానిగా, తెలుగుతల్లి ఆరాధకుడుగా,ఈనాడుగ్రూప్ మీడియాలో వీలైనంత ఎక్కువ తెలుగుపదాలూ, వీలైనంత తక్కువగా విదేశీ పదాలూ ఉపయోగించడానికి ఆయనిచ్చిన స్పూర్తి,ఎంతోమంది కళాకారులకూ, రచయితలకూ ఆశ్రయమిచ్చిన ఆయన మంచితనం,ముత్యాల్లాంటి చేతి రాత,చక్కటి చిత్రకారుడుగా ఇవేమీ మనకు ఆయన బ్రతికున్నప్పుడు గుర్తుకు రాకపోవడం నిజంగా చాలా బాధాకరం.ఇంతటి జబ్బును పెట్టుకుని కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ సీరియల్లు తీస్తూ అవిశ్రాంతంగా పనిచేయడం కూడా నిజంగా గొప్పే.
సుమన్ గారి ఆత్మకు భగవంతుడు సద్గతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను.

పరిమళం చెప్పారు...

ఉదయంనుండి etv2లో ఆయన పార్ధివదేహాన్నిచూస్తున్నా జీర్ణించుకోలేకపోతున్నానండీ....
ఆయన ఆత్మస్థైర్యానికి జోహార్....
ఆయన హాస్యం వెనుక విషాదవీచిక గురించి తెలియక అపహాస్యం చేసినందుకు సిగ్గుపడుతూ....ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నాను.

Lasya Ramakrishna చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Padmarpita చెప్పారు...

సుమన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను.

Mauli చెప్పారు...

మీ టపాలు చూసాకే కాబోలు , యు ట్యూబ్ లో అతని సీరియల్ ఎపిసోడ్స్ చూసాను. ఈ కాలంలో చూపించడం మానేసిన సంస్కృతీ, అనుబంధాలు పై అతను చక్కని శ్రద్ద చూపడం ఆసక్తి కలిగించింది. వాటివల్ల లాభాలు రాకపోవచ్చు, లేదా చూసే వాళ్ళు యెగతాళి చెయ్యొచ్చు. అందుకని తను నమ్మిన విలువలు వదులుకోలేదు. అతను తీసికొనే నటీ నటులు కుడా బుల్లితెరపై అవకాశాలు పెద్దగా లేని వాళ్ళే ! మళ్ళీ చుస్తే మీకు కూడా నచ్చుతాయి :)

నిషిగంధ చెప్పారు...

Really sad :(((

నేను పట్టుమని టివి ముందు కూర్చుని చూసిన ఒకే ఒక్క తెలుగు సీరియల్, అంతరంగాలు... చాలా నచ్చింది కూడా!
ఇక ఆయన గురించి మీరు చెప్పిన ప్రతి వాక్యంతో ఏకీభవిస్తాను!

సుమన్ బాబు ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను...

vinod చెప్పారు...

Chala manchi blog and comments...RIP suman..

Sridhar d చెప్పారు...

మురళిగారు నాకు మీరు పరిచయం అయినది కూడా 'సుమన్' ద్వారానే..
సుమన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

http://pootarekulu.blogspot.in/2011/06/blog-post_06.html

చాతకం చెప్పారు...

RIP Suman. We all miss you. Condolences to the family.

అజ్ఞాత చెప్పారు...

సుమన్ మరణించారన్న విషయం తెలియగానే మీ బ్లాగే గుర్తొచ్చిందండీ. ఎక్కువగా నవ్వితే కన్నీళ్లు వస్తాయంటారు. చివరికలాగే అయ్యింది సుమన్ విషయం.
సుమన్ కుటుంబానికి భగవంతుడు శాంతిని, ఆయనకు మరుజన్మలో సద్గతిని కలిగించాలని కోరుతుంటున్నాను.

Vasu చెప్పారు...

vaarta vinagaaane. mundu meere gurtochchaaru..

సుమన్ బాబు ఆత్మకి శాంతి కలుగుగాక.

Ramoji rao gariki aayana kutumbaaniki ee samayam lo devudu dhairyam ivvalani korukovadam tappa emi cheyalemu.

జయ చెప్పారు...

సుమన్ చిత్రలేఖనం మాత్రం నేను మరిచిపోలేనండి. ఎక్కడన్నా ఆయన చిత్రాలు దొరికితే బాగుండు అనుకునే దాన్ని. వారి ఆత్మ శాంతించాలని, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

Godavari చెప్పారు...

Masturu,
Unbelievable , after reading the news immediately I opened your blog.I came to know more about Suman through your blog.May his Soul rest in Peace.

gopal chowdary చెప్పారు...

RIP SUMAN.

Raj kumar garu should start now on JAGAN.....

SKY చెప్పారు...

ఆరోగ్యం క్షీణించిన దశలో కూడా సుమన్ బాబు ఫిల్మ్ సిటీ లో తన కారులోంచి లొకేషన్లనూ.. ప్రకృతిని పరికించడం.. నాకు మిగిలిన గుర్తు.
ఆ అందమైన దృశ్యం వెలుగులో.. నిన్నటి చీకటిజాడల్ని జారవిడుచుకునే ప్రయత్నం లో నేను.
మేము ఆరాధించే దార్శనికునికి, మా కుటుంబ పెద్దకు పుత్రశోకం. దిగమింగడం కూడా .. ఆయన్ని చూసే.. నేర్వాలి.

Mahesh Telkar చెప్పారు...

నమ్మరు కాని, నేనేది చెప్పలనుకున్ననో ఆల్రెడీ చాలామంది ఇక్కడ చెప్పేసారు ... అదే, ఆ వార్త వినగానే మీరే గుర్తొచ్చారు .. ఏమి రాసుంటారు అని తెలుసుకోవాలనుకున్న ... అనుకున్న దాని కన్నా చాల చక్కగా రాసారు !

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సుమన్ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియ చేసుకుంటున్నాను.

SNKR చెప్పారు...

:) సుమన్ గారికి ఇంతమంది అభిమానులు వున్నాత్రని వూహించలేదు. అభిమానుల ఈ సందడి, ఆనదంగా వుంది. :)

Mauli చెప్పారు...

సుమన్ సీరియల్స్ పై బోలెడన్ని సరదా రచనలు చూసినపుడు ...ఒక చిన్న సందేహం. అతని టార్గెట్ ప్రేక్షకులు పూర్తిగా వేరు, ఆ రివ్యూలు ఏ విధం గాను అతని పనితనాన్ని మెరుగుపరుచుకోడానికి పని చెయ్యవు.

అజ్ఞాత చెప్పారు...

ఒకటి మాత్రం నిజం. డబ్బు మనిషిని ప్రభావితం చేయజాలదు అని నిరూపించిన ఏకైక వ్యక్తిత్వం సుమన్ ది. ఆగర్భ కుబేరుడైన సుమన్ కి మధ్యతరగతి బాధలూ, పేదవాళ్ళ అగచాట్లూ కూడా బాగా తెలుసు. ఈ అవగాహన మూలాన అతను రాజకీయ నాయకుడై ఉంటే బాగా రాణించేవాడనిపిస్తుంది. వేంకటేశ్వరస్వామి మీద వెయ్యి కీర్తనలు రచించిన సుమన్ స్థానం పూర్వ వాగ్గేయకారుల లాగానే తెలుగుసాహిత్యంలో శాశ్వతం. ఈనాడు వ్యాపార సామ్రాజ్యం కంటే సుమన్ సాహిత్య సామ్రాజ్యం సుస్థిరమైనది.

అజ్ఞాత చెప్పారు...

సుమన్ కళాశాలలో నాకంటే ఒక సంవత్సరం సీనియరు. అతను రామోజీ కొడుకని తెలుసు కానీ వ్యక్తిగత పరిచయం లేదు. అప్పట్లో ఆయన అంత రెగ్యులర్ స్టూడెంటు కాదు. ఆ రోజుల్లో అందఱు కాలేజి కుఱ్ఱాళ్ళ మాదిరే ఉండేవాడు. ఆ కుఱ్ఱతనంలో కొన్ని పొఱపాట్లు కూడా చేశాడు. కానీ తరువాతి కాలంలో మానసికంగా చాలా ఎదిగినట్లు కనిపిస్తోంది. నేను చదువు ముగించుకొని గుంటూరు వెళ్ళిపోయాక నాకతని సంగతులు ఏమీ తెలీదు.

మురళి చెప్పారు...

@రాజ్ కుమార్: "తను అనుకున్నది చేసి చూపించాడు.." ..అవునండీ, నిజం... ధన్యవాదాలు.
@రవి కుమార్ నేతి: వార్త తెలిసిన వెంటనే ఏదన్నా రాయాలనిపించిందండీ.. చేతిలో ఉన్నది బ్లాగే కదా.. ధన్యవాదాలు.
@సాయికృష్ణ ఆలపాటి: నిజం చెప్పారు.. ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@Anjaas: Thank you
@రమణి రాచపూడి: అవునండీ.. ధన్యవాదాలు
@లలిత: ప్రియమైన వాడే కానీ, శత్రువు కాదేమోనండీ.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@రాజి: ధన్యవాదాలండీ..
@సిరిసిరిమువ్వ: ఎవరికీ హాని చేయలేదు.. నిజం చెప్పారు.. ధన్యవాదాలు.
@సందీప్: వెటకారం అని ఎందుకండీ అనుకోడం.. ఆ కళారూపాల మీద మీ అభిప్రాయం అంతే.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@సుజాత: అవునండీ.. ధన్యవాదాలు
@బుద్ధా మురళి: నాక్కూడా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అండీ తన దైవభక్తి.. ధన్యవాదాలు..
@జాహ్నవి: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@సునీత : డబ్బుతో 'అన్నీ' దొరకవు కదండీ.. ..ధన్యవాదాలు..
@సౌమ్య: టాలెంట్ ఉంది సౌమ్య గారూ.. కానీ దానిని ఉపయోగించిన తీరే రాన్రానూ హాస్యానికి ముడిసరుకుగా మారిపోయింది.. అంతే.. ధన్యవాదాలు.
@నిరంతరమూ వసంతములే: అవునండీ.. నిజం.. ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: రిప్ సుమన్ అందామండీ.. ధన్యవాదాలు..
@చిలమకూరు విజయ మోహన్: అవునండీ.. ధన్యవాదాలు..
@పరిమళం: ధన్యవాదాలండీ...

మురళి చెప్పారు...

@లాస్య రామకృష్ణ: ధన్యవాదాలండీ..
@పద్మార్పిత: ధన్యవాదాలండీ..
@మౌళి: నచ్చడం వల్లే విడవకుండా చూశానండీ.. ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@నిషిగంధ: అంతరంగాలు సగం వరకూ నిజంగానే బాగుందండీ.. రాన్రానూ పలచబడిపోయింది.. అదే క్రమంలో తర్వాతి సీరియళ్ళు కూడా.. ..ధన్యవాదాలు.
@వినోద్: ధన్యవాదాలండీ..
@శ్రీధర్: అవునండీ.. ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@చాతకం: ధన్యవాదాలండీ..
@పక్కింటబ్బాయి: ప్చ్.. ధన్యవాదాలండీ..
@వాసు: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@జయ: దొరకచ్చండీ.. ధన్యవాదాలు..
@గోదావరి: ధన్యవాదాలండీ..
@గోపాల్ చౌదరీ: ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@SKY: ధన్యవాదాలండీ..
@Mahesh Telkar: ధన్యవాదాలండీ..

@బులుసు సుబ్రహ్మణ్యం: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@SNKR: ఇంకా చాలా మంది అభిమానులు ఉన్నారండీ.. ధన్యవాదాలు.
@ఎల్బీఎస్ తాడేపల్లి: ఇప్పటి రాజకీయాల్లో కష్టం అండీ.. తనదైన ముద్ర వేసిన మాట మాత్రం నిజం.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి