మంగళవారం, అక్టోబర్ 02, 2012

తెలుగు కథల్లో గాంధీ దర్శనం

కథా సాహిత్యం, మిగిలిన సాహిత్య ప్రక్రియలకన్నా భిన్నమైనది. కథల్లో కల్పన ఉంటుంది, కానీ కేవలం కల్పన మాత్రమే ఉండదు. వాస్తవానికి, కల్పన జోడిస్తే అది కథ అవుతుంది. తెలుగునాట నడుస్తున్న చరిత్రని రికార్డు చేయడంలో కథా సాహిత్యం పాత్ర తక్కువదేమీ కాదు. స్వాతంత్ర సంగ్రామం నేపధ్యంగా వచ్చిన కథలే ఇందుకు ఉదాహరణ. శాంతిని, అహింసనీ ఆయుధాలుగా మలుచుకుని స్వతంత్ర పోరాటాన్ని నడిపించిన మహాత్మా గాంధీని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక పాత్రగా చేసుకుని రచించిన కథల సంకలనమే 'తెలుగు కథల్లో గాంధీ దర్శనం.'

విశ్వనాథ సత్యనారాయణ మొదలు, దాదా హయత్ వరకూ మొత్తం పదకొండు మంది రచయితలు రాసిన పన్నెండు కథలని సంకలనంగా కూర్చిన వారు తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన 'దామల్ చెరువు' అయ్యోరు మధురాంతకం రాజారాం. 1986 లో రూపుదిద్దుకున్న ఈ సంకలనాన్ని, కృష్ణా జిల్లా అవనిగడ్డకి చెందిన 'గాంధీ క్షేత్రం' 2008 లో మార్కెట్లోకి తెచ్చింది, ఎమెస్కో సౌజన్యంతో. కొన్ని కథలు స్వతంత్ర సంగ్రామం నేపధ్యంతో వచ్చినవి కాగా, మరికొన్ని గాంధీ శతజయంతి (1969) సందర్భంగా వెలువడ్డవి. 

'జీవుడి ఇష్టము' ఈ సంపుటిలో మొదటి కథ. విశ్వనాథ వారి రచన. ఒక నియంతకూ, అతడు చెరబట్టిన ఓ వివాహిత స్త్రీకి మధ్య జరిగే కథ ఇది. నియంత ఆమెని బెదిరించినా, భయపెట్టినా, పదే పదే చెరిచినా తన భర్తని జ్ఞాపకం చేసుకోడం మానదు ఆమె. "మీకు తుపాకులున్నవి, కత్తులున్నవి, అతనికి ఏమీ లేవు. అయినా తన భార్యను, పిల్లలను రక్షించుకునేందుకు కర్ర పుచ్చుకొని నిలబడ్డాడు. రక్షించ లేనని తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నాదగ్గరకు రానీయలేదు" అంటుందామె.

కరుణకుమార రాసిన రెండు కథలు 'పోలయ్య' 'ఉన్నతోద్యాగాలు' చోటు సంపాదించుకున్నాయి ఈ సంకలనంలో. గతుకుల రోడ్డు మీద బండి ప్రయాణాన్ని పాఠకులకి అనుభవంలోకి తెచ్చే కథ 'పోలయ్య.' రచయిత ఈ కథకి ఇచ్చిన మెరుపు ముగింపు వెంటాడుతుంది చదువరులని.  'ఉన్నతోద్యాగాలు' కథ ముగింపు కించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పటివరకూ ఒక పంధా లో సాగిన కథ, ముగింపు కోసం మార్గాన్ని మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. గాంధీ శిష్యుడు, ఆధునిక భావాలు ఉన్నవాడూ అయిన నారాయనప్ప గారి చదువుకున్న భార్య సుశీల, ఆ ఊరికి కొత్తగా వచ్చిన బ్రిటిష్ పోలీసాఫీసర్ సులేమాన్ ల మధ్య మొలకెత్తిన ప్రణయం, చలం రాసిన 'సుశీల' కథ. 'మైదానం' ఛాయలు కనిపిస్తాయిందులో.


కొనకళ్ళ వేంకటరత్నం రాసిన 'చివరికి మిగిలిన రంగడు' వెంటాడే కథ. అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమం నేపధ్యంగా సాగిన రచన ఇది. ఎక్కడా ఆపకుండా చదివించే మరో కథ అడివి బాపిరాజు రాసిన 'వడగళ్ళు.' స్వతంత్ర పోరాటం నేపధ్యంగా వచ్చిన కథ ఇది. గాంధీజీ మరణాన్ని చిత్రించిన కథ అమరేంద్ర రాసిన 'సమర్పణ,' కాగా గాంధీజీ శతజయంతి నేపధ్యంగా వచ్చిన కథ కలువకొలను సదానంద రాసిన 'తాత దిగిపోయిన బండి.' స్వాతంత్రానంతరం పాలనా వ్యవస్థలో మొదలైన మార్పులని చిత్రించిన కథ ఇది. డాక్టర్ పి. కేశవరెడ్డి కథ 'ది రోడ్.' కేశవరెడ్డి నవలలు చదివిన వాళ్ళని ఏమాత్రమూ ఆశ్చర్య పరచని ముగింపుకి చేరిన కథ ఇది.

గాంధీ పేరుని వాడుకునే నాయకులమీద దాశరథి రంగాచార్య సంధించిన సెటైర్ 'మళ్ళీ మహాత్ముడు మన మధ్యకి వచ్చాడు.' రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో వాటిని ఉపయోగించుకోలేక పోయిన వాళ్ళ కథ 'అజ్ఞాతవాసం' మధురాంతకం రాజారాం రాసిన ఈ కథ రాయలసీమ మాండలీకంలో ఆయనదైన శైలిలో సాగుతుంది. దాదా హయత్ రాసిన 'ప్రదర్శన' ఈ సంపుటిలో చివరి కథ. గాంధీని తమ ప్రయోజనాల కోసం వాడుకునే పెట్టుబడిదారీ వర్గాల కథ ఇది..నగరం నడిబొడ్డున వెలిసిన గాంధీ పార్కు గుట్టు విప్పుతుంది.

"ఆవేశంలోనుండి పుట్టేది పద్యం. ఆలోచనలోనుండి పుట్టేది గద్యం. పద్యంలో కవి ఊహాలోకాలలో సంచరిస్తూ కొద్దిగానో, గొప్పగానో తన్మయత్వాన్ని భజించే అవకాశం ఉంది. గద్య ప్రక్రియల్లో అలాంటి స్వేచ్ఛ లేదు. అది వీలైనంతవరకూ వాస్తవికతను అంటిపెట్టుకోవలసి ఉంటుంది," సంకలనానికి ముందుమాట రాస్తూ మధురాంతకం రాజారాం ప్రకటించిన అభిప్రాయమిది. "కథానికల ద్వారా గాంధీ దర్శనం గావించుకోడానికి సల్పిన ఒక చిన్న ప్రయత్నం ఇది" అన్నారాయన.

"గాంధీజీ పాత్రగా ఉన్న రచనలను గుర్తించడం తేలిక. కానీ ఆయన ఆశయాలని ప్రతిఫలించే కథలని గుర్తించడం అంత తేలిక కాదు. సుప్రసిద్ధ కథానికా రచయిత మధురాంతకం రాజారాం గాంధీజీని దర్శనం చేయించే తెలుగు కథలని అద్భుతంగా సంకలనం చేశారు" అన్నారు ప్రకాశకులు. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతర కాలంలో దేశ పరిస్థితులని గురించి ఒక అవగాహన ఇచ్చే కథలివి. (పేజీలు 183, వెల రూ.80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 కామెంట్‌లు:

 1. చాలా రోజులైంది ఇటు వచ్చి
  'సుశీల' కథ చదివానండీ. మిగిలిన కథల కోసం తీసుకోవాలీ పుస్తకం

  రిప్లయితొలగించు
 2. ఒకే విషయం మీద వచ్చిన కథలు ఇలా సంకలనంగా వస్తే ఒక సమస్య ఉంది. మొత్తం చదువుకుంటూ వెళ్తోంటే మొనాటనీ వస్తుంది. అవెంత వైవిధ్యభరితమైన కథలైనా ఆ ఇబ్బంది తప్పదు. ఈ సమస్య నేను "తెలంగాణా సాయుధ పోరాట కథలు" చదివినప్పుడు ఎదుర్కొన్నాను. ఐనా ఒక్కొక్క కథగా అప్పుడప్పుడూ చదువుకుంటూంటే మాత్రం చాలా బావుంటుంది.

  రిప్లయితొలగించు
 3. MASTARU,

  NAMASTHE, I HOPE YOU ARE DOING GOOD. THESE DAYS YOU ARE HARDLY WRITING ANYTHING. I HOPE EVERYTHING IS ALRIGHT.

  రిప్లయితొలగించు
 4. @హరిచందన: మిగిలిన కథలు కూడా బాగున్నాయండీ.. ధన్యవాదాలు..
  @పక్కింటబ్బాయి: ఈ సంకలనాన్ని కొంచం మినహాయింపు గా చెప్పుకోవచ్చండీ... ఏక బిగిన చదివేయోచ్చు.. ధన్యవాదాలు..
  @గోదావరి: బావున్నానండీ... మళ్ళీ రాయడం మొదలు పెట్టేశాను కూడా :-) ... ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు