బంగారంతో భారతీయుల అనుబంధం ఈనాటిది కాదు. అనాదిగా భారతీయ సంస్కృతిలో బంగారం ఓ భాగం. ఇక్కడి స్త్రీపురుషులు ధరించినన్ని స్వర్ణాభరణాలని మరెక్కడా అలంకరణకి ఉపయోగించరనడంలో అతిశయోక్తి లేదు. కేవలం అలంకారంగా మాత్రమే కాదు, పసిడిని మదుపు గా చూడడమూ మనకి తాత ముత్తాలల కాలం నుంచీ ఉన్నదే. పిల్లలకివ్వడంకోసం వాళ్ళు దాచినవి భూమి, బంగారం. మరికొంచం స్పష్టంగా చెప్పాలంటే భూమి మగ పిల్లలకి, బంగారం ఆడపిల్లలకీను.
ఇంతగా మన జీవన విధానంతో పెనవేసుకుపోయిన బంగారమే ఇప్పుడు మన ఆర్ధిక వ్యవస్థకి సవాలు విసురుతోంది అంటున్నారు నిపుణులు. రాన్రానూ బంగారం కొనుగోళ్ళు శరవేగంతో పెరుగుతున్నాయి భారతదేశంలో. దేశీయంగా ఉత్పత్తి బహుతక్కువగా ఉన్న ఈ లోహాన్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఫలితంగా, పెద్దమొత్తంలో మన మారకద్రవ్యం బంగారం కింద ఖర్చైపోతోంది. దీని ప్రభావం, అత్యవసరమైన ఇతర దిగుమతులమీద పడక తప్పడం లేదు.
అధికారిక లెక్కలనే తీసుకుంటే, 2010-11 సంవత్సరంలో నలభై యూఎస్ బిలియన్ డాలర్లని బంగారం కొనుగోలు కోసం వెచ్చించాం మనం. తర్వాతి సంవత్సరానికి వచ్చేసరికి ఆ మొత్తం అరవై యూఎస్ బిలియన్ డాలర్లకి పెరిగింది, ఒక్కసారిగా. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అంచనాల ప్రకారం, 2015 సంవత్సరం నాటికి ఈ మొత్తం వంద యూఎస్ బిలియన్ డాలర్లు దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ ఇతర దేశంలో పోల్చినా, భారతదేశంలో బంగారానికి డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది.
ఈ డిమాండ్ కి కారణం కేవలం ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం మాత్రమేనా? అర్దికవేత్తలు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిణామం ఇది. దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో ఇదో 'వేలం వెర్రి.' పసిడికి పెరుగుతున్న డిమాండ్ ద్రవ్య లోటుకి దారి తీస్తోందన్నది, ప్రముఖ ఆర్ధికవేత్త సి. రంగరాజన్ పరిశీలన. ఇక, అసోచామ్ అయితే మరో అడుగు ముందుకు వేసి బంగారం మీద దిగుమతి సుంకాలు మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రజల కొనుగోలు శక్తి మొత్తం బంగారం మీదే కేంద్రీకృతం అయితే, మిగిలిన రంగాలు దెబ్బ తింటాయన్నది ఈ సంస్థ వాదన.
భారతీయ సమాజంలో మధ్యతరగతి కొనుగోలు శక్తి బాగా పెరగడం అన్నది గడిచిన పది-పదిహేనేళ్ళలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామం. నూతన ఆర్ధిక సంస్కరణలు, మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ బూం ఇందుకు బాగా దోహదం చేశాయి. పెట్టుబడి అనగానే మనకి మొదట గుర్తొచ్చేది బంగారమే. ఎందుకంటే, ఇది ఇవాళ కొత్తగా వచ్చినది కాదు, మన నరనరాల్లో జీర్ణించుకున్నది. 'తిరుగులేని పెట్టుబడి' అన్నది అందరి మాటానూ. అయితే, కేవలం ఈ ఒక్క కారణానికే మనం బంగారం కొంటున్నామా? దీనికి జవాబు 'కాదు' అనే వస్తుంది.
సంపాదనతో పాటు ప్రజల్లో అభద్రతా పెరిగింది, రేపటిరోజు గురించి చింత పెరిగింది. గడిచిన తరాలతో పోల్చుకుంటే, ఈ అభద్రత ప్రస్తుత తరంలో బాగా ఎక్కువ. కుప్ప కూలుతున్న ఆర్ధిక వ్యవస్థలు, ఫలితంగా దారుణంగా పడిపోతున్న షేర్ మార్కెట్లూ మన పెట్టుబడులకి సరైన ప్రత్యామ్నాయాన్ని చూపించలేక పోతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా, దాని ఫలితం మన షేర్ మార్కెట్ మీద పడుతుంది. ప్రపంచీకరణకి మరో పార్శ్వం ఇది. షేర్ మార్కెట్ ప్రభావం బ్యాంకుల వడ్డీరేట్ల మీద పడుతుంది. ఎలా చూసినా, నగదు, డాక్యుమెంట్ల రూపంలో ఉన్న మన పెట్టుబడి మీద ఏదోరకంగా ప్రభావం ఉండి తీరుతుంది.
ఈ నేపధ్యంలో, 'బంగారం కోసం ఎగబడుతున్నారు' అంటూ భారతీయులని ఆడిపోసుకోవడం ఎంతవరకూ సబబు? ప్రత్యామ్నాయాలు లేని రోజులనుంచీ బంగారాన్ని నమ్ముతూ వచ్చారు మన ప్రజ. ఇప్పటికీ, బంగారానికి దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే ధోరణి సాగిస్తున్నారు. ఒకవేళ, దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోకుండా బంగారం వెంట పడడం ప్రజల తప్పే అయితే, ఆ తప్పులో బంగారానికి ప్రత్యామ్నాయం చూపించలేని ప్రభుత్వానికీ వాటా ఉంటుంది. దేశ ఆర్ధిక పరిస్థితుల దృష్టిలో చూసినప్పుడు, ఈ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టడం తక్షణావసరం.
nice article
రిప్లయితొలగించండిఆసక్తికరమైన వ్యాసం మురళి గారు.
రిప్లయితొలగించండిఇప్పటికీ సామాన్యమైన మదుపరికీ బంగారం అనగానే భద్రత అనిపిస్తుంది. అలా కచ్చితంగా పెట్టుబడిని వేగంగా రెట్టింపు చేసేదీ, రిస్కు తక్కువ ఉన్నదీ ఐన మరో మదుపుమార్గం చూపించమనండీ. ఈ పేరుగొప్ప ఆర్థికవేత్తల్ని.
రిప్లయితొలగించండి@స్వాతి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వేణు శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@పక్కింటబ్బాయి: ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే అనిపిస్తుందండీ.. ముఖ్యంగా, ఈ అంతర్జాతీయ మార్కెట్ నేపధ్యంలో.. ..ధన్యవాదాలు..
prathyamnyamamga bangaam meedha pettubadini e-gold laanti sadhanaallo pettavachu
రిప్లయితొలగించండి